
కళామూర్తులు
కంటికి కనిపించే కళారూపాల వెనుక కనిపించని ప్రోత్సాహం వారిది. సహజత్వం నిండిన కళను ప్రపంచానికి పరిచయం చేసేది ఈ కళామూర్తులే.
కంటికి కనిపించే కళారూపాల వెనుక కనిపించని ప్రోత్సాహం వారిది. సహజత్వం నిండిన కళను ప్రపంచానికి పరిచయం చేసేది ఈ కళామూర్తులే. కళారవి కుంచె నుంచి ఉదయించిన చిత్రరాజం వేయి పొద్దులు నిలిచి ఉండాలంటే క్యూరేటర్ పాత్రే కీలకం. ఆర్ట్.. గ్యాలరీ.. క్యూరేటర్.. ఈ మూడు కలిస్తేనే షో! చిత్రకారుడి సృజనకు థీమ్ అండ్ ఫేమ్‌ని ఫ్రేమ్ చేసేది ఈ క్యూరేటర్సే! దక్కన్ కళాజగతిలోని చిత్రరేఖలను కలుపుతూ హైదరాబాద్ కాన్వాస్‌ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు నగరంలోని లేడీ క్యూరేటర్లు!
సృష్టి.. కళాకృతి.. అలంకృత.. ఏ ఆర్ట్ గ్యాలరీలోనైనా మనసుకు హత్తుకునే చిత్రరాజాలు కొలువుదీరాయంటే దాని వెనుక లేడీ క్యూరేటర్ పాత్ర ఉంటుంది. సిటీలో ఉన్న చాలా ఆర్ట్ గ్యాలరీలకు ఓనర్లు క్యూరేటర్లే! రమా నంబియార్, రేఖా లహోటి, ప్రశాంతి గోయల్, అథియా అమ్‌జద్.. గ్యాలరీ ఓనర్లుగా ఉంటూనే.. క్యూరేటర్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కేవలం క్యూరేటర్లుగా రాణిస్తున్న మహిళామణులు ఎందరో ఉన్నారు. ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో షోస్‌ను క్యూరేట్ చేసే కోలి ముఖర్జీ, ప్రముఖ ఆర్టిస్ట్, ఆర్ట్ రైటర్, బరోడా ఆర్ట్స్ కాలేజ్ ఫ్యాకల్టీ బాలమణి మొదలు ఇంకెందరో ఆర్ట్ క్రిటిక్స్ కూడా క్యూరేటర్స్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ, ముంబై స్థాయిలో వీళ్లు ఇక్కడ కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
సృజనకు అనుసృజన
కేవలం గ్యాలరీలో షోస్ నిర్వహించడమే కాదు.. కళాకారుడిలో దాగి ఉన్న సృజనకు అనుసృజన చేయడంలో క్యూరేటర్ల పాత్ర కీలకం. మేల్ క్యూరేటర్స్‌తో పోల్చుకుంటే మహిళల పనితనంలో భావుకత స్పష్టంగా కనిపిస్తుంది. క్యూరేటర్స్ రెండురకాలు.. థీమ్ చెప్పి ఆర్ట్ వేయించే వాళ్లు, ఆర్ట్‌ను బట్టి థీమ్ సెట్ చేసి ఎగ్జిబిషన్ నిర్వహించే వాళ్లు! ఈ కళకు ఈ ఇద్దరూ అవసరమే. కావాల్సిందల్లా సామాజిక స్పృహ, సున్నిత త్వాన్ని మరింత సన్నిహితంగా చూపించాలనే తపన.. ఇవి ఉన్నంత కాలం ఈ కళ విరాజిల్లుతూనే ఉంటుంది.
కళాత్మక వేదిక..
ఆర్ట్ అనేది లగ్జరీ ఇండస్ట్రీ. క్యూరేటర్స్‌లో మహిళల సంఖ్య ఎక్కువే. సెన్సిబిలిటీస్‌తో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. ఒడిదుడుకులు ప్రతిచోటా ఉంటాయి. అయినా ఈ రంగంలో మహిళలు సక్సెస్ అయ్యారనే చెబుతాను. సెన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్, అవుట్‌రీచ్.. ఈ మూడూ ఇందులో కలగలిపి ఉంటాయి. ఇక క్యూరేషన్ అనేది కళాత్మక విన్యాసానికి, విశ్లేషణకు లింక్ వంటింది. ఇవి కనిపించ కపోతే ఆర్ట్ షోలకు ప్రయోజనం ఉండదు. క్యూరేషన్‌కి బాధ్యతతో పాటు ఆర్ట్‌పై అవగాహన ఉండాలి.
- బాలమణి, క్యూరేటర్,
ఆర్టిస్టోరియన్, క్రిటిక్
సిటీ ఆర్ట్ హబ్ కానుంది
పన్నెండేళ్ల నుంచి నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. క్యూరేషన్ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆర్ట్‌కి సంబంధించి లోతైన అవగాహన తప్పనిసరి. స్వేచ్ఛ ఉన్న కళాకారుల్లో సృజనాత్మకతకు కొదవుండదు. ఎటొచ్చీ మార్కెటింగే ఇబ్బంది. క్యూరే టింగ్‌లో ముంబై, ఢిల్లీలతో మనం సమానంగా ఉన్నా.. మార్కెటింగ్‌లో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ఈ అవేర్‌నెస్ కూడా పెరిగింది. త్వరలోనే ఆర్ట్ సేల్‌కి హైదరాబాద్ మంచి హబ్‌గా మారొచ్చు. ఈ మధ్య చాలామంది ఇంటీరియర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ చైతన్యం ఎంత ఎక్కువైతే ఈ కళకు మంచి రోజులొస్తాయి.
- ప్రశాంతి గోయల్, అలంకృత ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అండ్ క్యూరేటర్
త్రీ సిస్టర్స్.. మేడ్ వండర్
శాంతి కసవరాజు.. మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ క్యూసీ, శిల్ప కసవరాజు.. ఐటీ హెచ్‌ఆర్ కన్సల్టెంట్, శ్యామా నదింపల్లి.. సాధారణ గృహిణి.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లది రక్తసంబంధమే అయినా.. వీరి అనుబంధాన్ని కన్నులపండువగా మార్చింది మాత్రం కళాభిరుచే. శ్యామా వివాహానంతరం సింగపూర్‌లో సెటిల్ అయ్యింది. సరదాగా గీసే బొమ్మలు.. ఆమెలోని సృజనాత్మకతకు ప్రతిరూపాలయ్యాయి. చెల్లెలిలోని సహజ కళాకారిణిని గుర్తించిన ఆ అక్కలిద్దరూ.. ఆ కళా రూపాలను ప్రపంచానికి చాటాలని నిశ్చయించుకున్నారు. అందుకే వాళ్లిద్దరూ క్యూరేటర్లుగా మారారు. తమ చెల్లెలి సృజనాత్మకతకు అందమైన కాన్వాస్ ఏర్పాటు చేశారు. శ్యామా ఇన్‌స్పిరేషన్‌తో పది నెలల కిందట ఇన్స్‌పైర్జ్ అనే పేరుతో ఓ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించారు.
ఆర్టిస్టుగా తనపై తనకు నమ్మకం లేని శ్యామా లాంటి ఎందరో సహజ కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పని చేస్తోంది. అందులో భాగంగా ఎన్నో ఎక్స్‌పోలను నిర్వహిస్తోంది. ఇటీవల మారియట్ హోటల్‌లో అనేక మంది కళాకారుల చిత్రాలతో ఫ్యూజన్ పేరిట ఓ ఎగ్జిబిషన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు ఈ త్రీ సిస్టర్స్. ఇతర మెట్రో నగరాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ షోలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. కళ ఒకరిది, ప్లానింగ్ ఒకరిది, ప్రమోషన్ బాధ్యత ఇంకొకరిది.. ఇలా తమకున్న సహజ నైపుణ్యాలే పెట్టుబడిగా ఈ ముగ్గురు వేసిన ముందడుగు ఎందరికో ఇన్స్‌పిరేషన్.
- సరస్వతి రమ/ ఓ మధు