హార్ట్ ఫుల్ సిటీ
ఆర్ట్ గ్యాలరీ అంటే సంపన్నులు ఉండే బంజారాహిల్స్, మాదాపూర్ గుర్తుకొస్తాయి. ఏ కళాకారులు గీసినా చిత్రాలు ఇక్కడే ఎగ్జిబిట్ అవుతాయన్న ఆలోచన సిటీవాసుల్లో ఉంది. వీఐపీలే కాదు సామాన్యులు కూడా ఈ చిత్రాలను ఆరాధిస్తుండటంతో సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి. మాదాపూర్, బంజారాహిల్స్‌కు వెళ్లే పని లేకుండానే ఆర్ట్ లవర్స్‌కు చూడచక్కనైన పెయింటింగ్స్ చూసి తరించే భాగ్యాన్ని కల్పిస్తున్నాయి.
తన అంతరాలలో రూపుదిద్దుకున్న ఊహా చిత్రాన్ని కాన్వాస్‌పై అందమైన బొమ్మగా రూపుదిద్దడం ఒక్క చిత్రకారునికే సాధ్యం. ఆ చిత్రకారుల సృజనకు వేదిక అవుతున్నాయి ఆర్ట్ గ్యాలరీలు. పెయింటింగ్స్‌పై సిటీవాసుల్లో పెరుగుతున్న క్రేజీని, సామాన్యులకు కూడా ఈ కళలపై అవగాహన కలిగించేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లోనూ ఆర్‌ట గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి. ఏడాది క్రితం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, ఇటీవల సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోనూ అద్వైత ఆర్ట్ గ్యాలరీ ప్రారంభమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న ఆర్ట్ లవర్స్‌ను గ్యాలరీ వరకు తీసుకొస్తున్నాయి. ఇవేకాకుండా ప్రతిభ కలిగిన పేదింటి కళాకారులకు కూడా తమ పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. యంగ్ ఆర్టిస్ట్‌ల కోసం వర్క్‌షాప్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఆర్టిస్ట్‌లతో ఆర్ట్ పాఠాలు బోధిస్తున్నాయి. మరికొందరు చిత్రకారులైతే ఏకంగా తమ ఇంటినే ఆర్ట్ గ్యాలరీగా మలచి పెయింటింగ్‌లను ఎగ్జిబిట్ చేస్తున్నారు.
సందడే సందడి...
నగరంలోని అన్ని ఆర్ట్ గ్యాలరీల వద్ద అభిమానుల సందడి నెలకొంటుంది. ఎప్పుడు ఎక్కడ చిత్రప్రదర్శన జరిగినా సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శని, ఆదివారాల్లో పిల్లాపాపలతో కలిసి పేరెంట్స్ రావడం కనబడుతోంది. చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలను చూసేందుకు బారులు తీరుతున్నారు. తమ మనసును కట్టిపడేసిన చిత్రరాజాలను డబ్బులు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. వాటర్ కలర్, చార్‌కోల్ డ్రాయింగ్స్, పెన్ డ్రాయింగ్, ప్రింట్ మేకింగ్, కల్చర్, న్యూరల్స్, ఆయిల్ పెయింటింగ్స్‌కు మంచి డిమాండ్ ఉందని ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు అంటున్నారు. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్ట్ ప్రేమికులు పెయింటింగ్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని
చెబుతున్నారు. - వీఎస్
స్పందన బాగుంటుంది
నేను రిటైర్డ్ హెడ్‌మాస్టర్‌ని. ఉత్తమ టీచింగ్ జాతీయ అవార్డును కూడా అందుకున్నా. ఆర్ట్ అంటే నాకు ప్రాణం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని పెయింటింగ్ రూపంలో తెలుపుతుంటా. మూడేళ్ల క్రితం బోరబండలోని నా ఇంట్లోనే ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. ప్రతి ఏటా మూడు వరకు ఆర్ట్ షోలు చేస్తుంటా. సిటీవాసుల నుంచి స్పందన బాగానే ఉంది. నచ్చిన వారు పెయింటింగ్ కొనుగోలు చేస్తుంటారు. - యాసాల బాలయ్య, నిర్వాహకుడు, యాసాల ఆర్ట్ గ్యాలరీ
కళకు లైఫ్ ఇవ్వాలి..
అసమాన ప్రతిభతో వివిధ అంశాలను ఎంచుకొని ఆర్టిస్ట్‌లు పెయింటింగ్స్ వేస్తుంటారు. ఇటువంటి పెయింటింగ్స్‌కు ప్రాణం పోస్తున్నాయి ఆర్ట్ గ్యాలరీలు. ఆర్ట్ లవర్స్‌కు అనుగుణంగా సిటీలో గ్యాలరీలు పెరగడం శుభపరిణామం. ఇవి యువ చిత్రకారులకు ప్రోత్సాహాన్ని అందించినప్పుడే.. కళకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది.
-బాలభక్తరాజు, ప్రముఖ చిత్రకారుడు
అందరూ వస్తున్నారు
ఏడాది క్రితం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాం. ఇప్పటివరకు సుమారు 15 వరకు ఆర్ట్ షోలు నిర్వహించాం. సీనియర్లతో పాటు ప్రతిభ కలిగిన యువ చిత్రకారుల పెయింటింగ్స్ ప్రదర్శనకు అవకాశమిస్తున్నాం. పేద, మధ్య, సంపన్న తరగతులకు చెందిన వారందరూ పెయింటింగ్స్ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇది ఆర్ట్‌కు శుభపరిణామం.
- విజయారావు, నిర్వాహకుడు, ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ