రాజకీయ రచయిత | George orwell is a Political writer | Sakshi
Sakshi News home page

రాజకీయ రచయిత

Published Sun, Jun 22 2014 4:11 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

రాజకీయ రచయిత - Sakshi

రాజకీయ రచయిత

జూన్ 25న రచయిత జార్జ్ ఆర్వెల్ జయంతి
సత్వం: అసలు కళకూ, రాజకీయాలకూ సంబంధం లేదనడం కూడా రాజకీయమేనంటాడు ఆర్వెల్. అయితే, ఆ రాజకీయ రాతల్ని కూడా కళాత్మకస్థాయికి చేర్చాలనేది ఆయన సంకల్పం.

 
 చాలా చిన్నవయసునుంచే, బహుశా ఐదారేళ్లప్పటినుంచే, పెద్దయ్యాక ఎప్పటికైనా తనకు రచయిత కావాలని ఉండేదట జార్జ్ ఆర్వెల్‌కు! ‘ప్రపంచాన్ని ఏదో ఒక దిశకు నడిపించాలన్న బలీయమైన కాంక్షేదో రచయితను కలం పట్టేలా చేస్తుంది’. అలాగే, రాయడమంటే, ‘బిగ్గరగా ఏడ్చి, పెద్దవాళ్లను తనవైపు తిప్పుకునే చిన్నపిల్లల మారాంలాంటిది కూడా!’ ఇంకా ఆర్వెల్ ఉద్దేశంలోనే రాయడమంటే... ఒక వేదన. తనను తాను పూర్తి నిర్వీర్యుణ్ని చేసుకునే ప్రక్రియ. ఒక భయంకర జబ్బుతో చేసే పోరాటం. లోపల ఒక దయ్యంలాంటిదేదో కూర్చున్నవాడే రచనావ్యాసంగం జోలికి వెళ్తాడు. ఇంత నొప్పి ఉందికాబట్టే, యౌవనంలోకి వచ్చేసరికి తనలోని రచయిత కావాలన్న ఆలోచనను విదిల్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడాయన. కానీ అది సాధ్యపడలేదు. పైగా అది తన స్వాభావిక ప్రవృత్తికే విరుద్ధంగా తోచింది. దాంతో రాయడానికి పూనుకోవడమే సరైందన్న నిశ్చయానికి వచ్చేశాడు.
 
 బ్రిటిష్ వారి పాలనలో ఉన్న భారతదేశంలో ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్‌గా జన్మించాడు ఆర్వెల్. తన రచనలతో తల్లిదండ్రులకు చీకాకుగా మారకూడదన్న ఉద్దేశంతో కలంపేరు ‘జార్జ్ ఆర్వెల్’ను ఎంచుకున్నాడు. ఉద్యోగరీత్యా కొంతకాలం బర్మాలో పనిచేశాడు. అనివార్యంగా, సామ్రాజ్యవాదపు పరికరంగా ఉన్నాడు. స్థానికులమీద తెల్లదొరలకుండే అర్థంలేని ఆధిపత్య కాంక్షనీ, పాలించాలనే ఆరాటమే తప్ప అర్థం చేసుకోలేని బలహీనతనీ దగ్గరగా గమనించాడు. మతమార్పిడి కోసం ఎవరైనా స్థానికుల వేషధారణను అనుసరించినా అదీ కపట నాటకంగానే కనబడేదాయనకు. స్థానికులకూ తనకూ భేదం లేదని చాటే ప్రయత్నంలో ఒక్కోసారి వెర్రి తెల్లవాడిగా మిగిలిపోయే పరిస్థితి కూడా తెచ్చుకున్నాడు.
 
 ఆయన పేదల్ని దగ్గరగా చూశాడు. స్వయంగా పేదరికాన్ని అనుభవించాడు. అందుకే పేదరికం గురించి... నిపుణులకన్నా పేదరికంలో మగ్గుతున్న తనలాంటి సామాన్యులు మరింత నైపుణ్యంతో కూడిన సలహాలు ఇవ్వగలరన్నాడు. ‘అందరూ సమానమే; కానీ కొందరు ఎక్కువ సమానం’. పశువుల మీద మనిషి చలాయించినట్టుగానే, పేదల మీద ధనికులు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఆ అన్యాయాన్ని సహించకూడదు! అయితే, అధికార దాహం గల మనుషుల వల్ల ఏ పోరాటమైనా కేవలం ‘నేతల మార్పిడి’కి మాత్రమే పరిమితమవుతుందని ఆయనకు తెలుసు.
 
 బ్రిటన్ సామ్రాజ్యవాదం కన్నా నాజీ జర్మనీ దుర్మార్గమైంది; అలాగే జర్మనీతో పోలిస్తే తక్కువ ప్రమాదకారి కాబట్టి, రష్యాకు మద్దతిస్తానన్నాడు. అదే సమయంలో, తనను తాను ప్రజాస్వామిక సామ్యవాదిగా  ప్రకటించుకున్నాడు. జీవితకాలం నిరంకుశత్వంపై నిబద్ధతతో పోరాడాడు. రష్యాను పూర్తి ఏకాధిపత్య పాలనా క్షేత్రంగా మార్చిన స్టాలిన్‌ను పూర్తిస్థాయిలో తిరస్కరించాడు.
 
 ఆయుధాల చరిత్రే చాలావరకు నాగరికత చరిత్ర, అన్నాడు ఆర్వెల్. క్షణంలో ప్రపంచాన్ని బుగ్గి చేసే అణుబాంబును వ్యతిరేకించాడు. శాంతికాని శాంతిని తెచ్చే ఆయుధమేటను నిరసించాడు. ఆర్వెల్ రచనలన్నీ రాజకీయకోణంలో రాసినవే. అసలు కళకూ, రాజకీయాలకూ సంబంధం లేదనడం కూడా రాజకీయమేనంటాడు. అయితే, ఆ రాజకీయ రాతల్ని కూడా కళాత్మకస్థాయికి చేర్చాలనేది ఆయన సంకల్పం. అలా దగ్గర చేయగలిగినందువల్లే, ఆయన పుట్టించిన పదబంధాలు, ‘కోల్డ్ వార్’, ‘బిగ్ బ్రదర్’ లాంటివి సాహిత్యంలోంచి రాజకీయపరిభాషలోకీ  ప్రవేశించగలిగాయి.
 ఆర్వెల్‌కు చక్కగా కాచిన టీ అంటే ఇష్టం. ఘాటైన పొగాకుతో స్వయంగా తానే చుట్టుకునే సిగరెట్లంటే ఇష్టం. జంతువుల్ని పెంచుకోవడమన్నా ఇష్టం. అలాగే, ప్రకృతి! ‘వసంతాగమనాన్ని ప్రేమించలేనివాడు, కార్మిక సంక్షేమ ఉటోపియాలో మాత్రం ఎందుకు సంతోషంగా ఉంటాడు!’
 
 భార్య చనిపోయాక, స్త్రీ ఆదరణలేక ఒంటరితనంలో మగ్గాడు. పాత స్నేహితులతో రిజర్వుడుగా ఉండటం, పూర్తి కొత్తవారితో అరమరికలు లేకుండా మాట్లాడటం ఆయన చిత్రమైన ప్రవర్తన! వ్యక్తిగత అవసరాలను చాలా పరిమితం చేసుకుని, దుస్తుల విషయంలో స్వయం క్రమశిక్షణ పాటించి, ‘మనకాలపు సన్యాసి’ అనిపించుకున్నాడు.
 
 ‘యానిమల్ ఫామ్’, ‘1984’ లాంటి రచనలతో అమితమైన కీర్తిని గడించిన ఆర్వెల్- క్షయవ్యాధితో 46 ఏళ్లకే తనువు చాలించాడు. నిజానికి ఆర్వెల్ రూపం మీద ఎవరికీ ఫిర్యాదు లేకపోయినా, తనను తాను ఆయన ఎప్పుడూ అందగాడిగా  భావించుకోలేదు. అది కొంత మథనాన్నే మిగిల్చిందాయనకు. అయితే, ఆయన సృష్టించిన వచనపు అందాన్ని మాత్రం చివరకు ఆయన కూడా వేలెత్తి చూపలేడు!
 - ఆర్.ఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement