నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ | Nakashi Art: The Dying Art Form From Telangana Now Struggle | Sakshi
Sakshi News home page

నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ

Published Mon, Feb 22 2021 5:43 PM | Last Updated on Wed, Feb 24 2021 5:07 PM

Nakashi Art: The Dying Art Form From Telangana Now Struggle - Sakshi

సాక్షి, సిద్దిపేట: కళ కలకాలం నిలవాలి.. కాలగర్భంలో కలిసిపోకూడదనే మూడు కుటుంబాల సంకల్పంతో 450 ఏళ్ల నేపథ్యం కలిగిన నకాశీ చిత్రకళను సజీవంగా ఉంచుతోంది. భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ ఉన్న ఈ అపురూప నకాశీ చిత్రకళే టీవీ, సినిమా మాధ్యమాల్లేని ఆ రోజుల్లో ప్రజలకు వినోదాన్ని, విద్యను, కాలక్షేపాన్ని అందించేది. రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన కుల పురాణాలు, జానపదాలు, చంద్రహాసుడు, గొల్ల కేతమ్మ, ఎల్లమ్మ, కాటమరాజు తదితర సబ్బండ వర్ణాల అనుబంధ కథలను చెప్పేందుకు కాకిపడగలు, సాధనాశూరులు వంటి ఉపకులాలు ఉండేవి.

వీరు బొమ్మలపటాన్ని ప్రదర్శిస్తూ, అందులోని బొమ్మలకు అనుగుణంగా కథను చెప్పేవారు. ఈ పటంపై కథలకనుగుణమైన బొమ్మలను చిత్రించేవారే నకాశీలు. తెలంగాణలోని వేములవాడ, చేర్యాల ప్రాంతాల్లో 300 వరకు కుటుంబాలు ఈ చిత్రకళపైనే ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం దీనికి ఆధ్యుడైన ధనాలకోట వెంకటరామయ్య కుటుంబంలోని నాలుగో తరం.. హైదరాబాద్‌లోనూ, గణేశ్, మల్లేశం కుటుంబాలు చేర్యాలలోనూ అంతర్థాన దశలో ఉన్న ఈ కళకు ఊపిరిలూదుతున్నాయి. ఈ చిత్రకళకు చేర్యాల పుట్టినిల్లైనందున వీటిని చేర్యాల పెయింటింగ్స్‌గానూ వ్యవహరిస్తారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 1625 నాటి తొలి నకాశీ పటం ఉందని అంటారు.

నకాశీ.. ప్రకృతి చిత్రం 
ఖద్దరు లేదా చేనేత ముతక గుడ్డ ఈ చిత్రకళకు కాన్వాస్‌. ఇది గజం వెడల్పు.. కథలోని ఘట్టాలను బట్టి 40 – 50 గజాల పొడవు ఉంటుంది. గుడ్డకు తొలుత వివిధ చెట్ల నుంచి సేకరించిన జిగురు పదార్థాలు, గంజి, చెక్కపొట్టు, సుద్ద పొడి, చింతగింజల పిండిని కలిపి పట్టిస్తారు. ఆరాక గుడ్డ దళసరిగా మారి బొమ్మలు గీయడానికి అనువుగా మారుతుంది. ఆకులు, పువ్వులు, బెరడు, పసర్లు, రంగురాళ్లు, గింజలు, గవ్వలు తదితర మిశ్రమాల నుంచి కావాల్సిన రంగులను రాబట్టి బొమ్మలకు అద్దుతారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రంగులనే వాడుతున్నారు.

మేక, ఉడుత తోకల నుంచి సేకరించిన వెంట్రుకలతో బ్రష్‌లు తయారుచేస్తారు. వీటితోనే ఇతిహాసాలు, పురాణాల్లోని వివిధ పాత్రధారుల బొమ్మలకు రూపాన్నిస్తారు. కథలు చెప్పడం ద్వారా పొట్టపోసుకునే కాకిపడగల వారు దగ్గరుండి తమకు కావాల్సిన బొమ్మలను నకాశీల చేత గీయించుకునే వారు. ఈ రూపేణా వచ్చే ఆదాయమే నకాశీల జీవనాధారం. కథకులు తాము చెప్పబోయే కథకు సంబంధించిన చిత్రపటాన్ని గుండ్రంగా చుట్టి.. కథను చెబుతూ తాము చెప్పే సన్నివేశానికి సంబంధించిన దృశ్యం వచ్చేలా దానిని తిప్పుతుంటారు. అందువల్లే దీన్ని స్క్రోల్‌ పెయింటింగ్‌ అంటారు. ఈ బొమ్మలకద్దే రంగులు ప్రకాశవంతంగా ఉండి కళ్లలో నిలిచిపోతాయి.

అదంతా గత వైభవమే..
అప్పట్లో కథను బట్టి ఒక్కో చిత్రపటం తయారీకి నకాశీలు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకునేవారు. ఆదరణ బాగున్న రోజుల్లో ఈ మొత్తం పది వేల రూపాయల వరకూ ఉండేది. ప్రస్తుతం పటం చిత్రించడానికి గజానికి రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పుడు స్క్రోల్‌ పెయింటింగ్‌కు ఆదరణ తగ్గిపోవడంతో మాస్క్‌ల తయారీపై దృష్టిపెట్టారు. రాజు, రైతు, గ్రామీణ మహిళలు, కుల–మత ఆచారాలు, గ్రామ దేవతలు, జంతువులు, సంప్రదాయాలను ప్రతిబింబించే ముఖచిత్రాలను తీర్చిదిద్దుతూ ఆన్‌లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జనంలోకి తీసుకెళ్లే యత్నం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నకాశీ చిత్రాలతో ఫేస్‌మాస్క్‌లనూ తయారుచేశారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మొబైల్‌ ఫోన్‌ కవర్లు, బ్యాగులు, టీషర్టులు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, పెన్నులు, కీచైన్లు, టీ, కాఫీ కప్పులు, కరోనా ఫేస్‌ మాస్కులు, టిష్యూ పేపర్లకు ఉపయోగించే డబ్బాలపై నకాశీ చిత్రాలను చిత్రిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చెన్నై, కోల్‌కతాతో పాటు విదేశాల నుంచి అడపాదడపా ఆర్డర్లు వస్తున్నాయని కళాకారులు చెబుతున్నారు. టూరిజం శాఖ స్టాల్స్‌లో నకాశీ వస్తువులను ఉంచుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పట్టణాల్లోని స్టార్‌ హోటళ్లలో, మీటింగ్‌ హాళ్లలో అలంకరణ కోసం నకాశీ వాల్‌ పెయింటింగ్‌లను గీయించుకుంటున్నారు. కాగా, తెలంగాణ వారసత్వ సంపదైన నకాశీ కళను పరిరక్షించే లక్ష్యంతో చేర్యాలలో 2018లో నకాశీ కళా క్షేత్రాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక మహిళలకు నెలకు రూ.7,500 స్టైఫండ్‌నిస్తూ రెండు నెలల శిక్షణనిస్తున్నారు. 

నాడు..
కాకతీయుల చివరి కాలంలో, నవాబుల హయాంలో నకాశీ చిత్రకళ రాచ మర్యాదలందుకుంది. పురాణ గాథలు, తెలంగాణ ప్రజల జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే నకాశీ స్క్రోల్‌ పెయింటింగ్స్‌ను రాజమహళ్లలో అలంకరణగా పెట్టుకునేవారు. తాము తయారుచేసే రాజులు, రాక్షసులు, జంతువుల వంటి ముఖాలతో కూడిన మాస్క్‌లను కాకతీయ రాజులు, నవాబులు ఉత్సవాలప్పుడు సైనికుల చేత ధరింపచేసి.. ఆనందించేవారని నకాశీలు చెబుతారు. 

నేడు..
నకాశీ చిత్రం రూపుమార్చుకుంది. హోటళ్లు, ఇళ్లలో వాల్‌పెయింట్‌గా వేలాడుతోంది. స్క్రోల్‌ పెయింటింగ్‌ కనుమరుగైపోగా, జంతువులు, మనుషుల ఆకృతుల్లోని ముఖమాస్కులు వంటివి మాత్రం అరకొర ఆదరణ పొందుతున్నాయి. జన బాహుళ్యంలోకి తమ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు.. కోవిడ్‌ నివారణకు వాడే ఫేస్‌మాస్క్‌పైనా నకాశీ బొమ్మల్ని తళుక్కుమనిపిస్తున్నారు చిత్రకారులు. అయినా అంతంత ఆదరణతో ఈ కళ మిణుకుమిణుకుమంటోంది.

ఖ్యాతి ఖండాంతరాలు దాటినా..
మా ఇంటి పక్కనుండే ధనాలకోట చంద్రయ్య గారి వద్ద ఈ కళ నేర్చుకున్నాను. నకాశీ చిత్రాల ఖ్యాతిని మేం ఖండాంతరాలు దాటించినా.. పేదరికంతో ఇంటి గడప దాటలేకపోతున్నాం. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా చిత్రాలు గీస్తున్నా.. ఆదరణ అంతం తగానే ఉంది.  ప్రభుత్వం కళాకారులకు ఆర్థికసాయంచేస్తే నకాశీ కళ మరింత ఖ్యాతిని సాధిస్తుంది. 
– మల్లేశం, నకాశీ చిత్రకారుడు, చేర్యాల

కళపై మక్కువతో..
మాది సిద్దిపేట జిల్లా చేర్యాల. పైనార్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. నకాశీ కళపై ఉన్న మక్కువతో మా కుటుంబాలన్నీ దీని మీదే ఆధారపడ్డాయి. హైదరాబాద్‌ కేంద్రంగా మేం వేసిన చిత్రాలు, మాస్క్‌లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఈ రంగంలో చేస్తున్న కృషిని గుర్తించి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అవార్డు కూడా అందచేశారు.
– ధనాలకోట సాయికిరణ్, నకాశీ చిత్రకారుడు, హైదరాబాద్‌

చెప్పడానికేం లేదు..
చేర్యాలలో ఇరుకుదార్ల రోడ్డులోని ఓ మట్టి గోడల ఇంట్లో గణేశ్‌ దంపతులు తదేకదీక్షతో బొమ్మలకు రంగులద్దుతూ కనిపించారు. తన చేతిలోని నకాశీ బొమ్మకు రంగులద్దుతూనే.. ‘స్క్రోల్‌ పెయింటింగ్‌కు ఇప్పుడు ఆదరణ లేదు. అందుకే మాస్కులు, వాల్‌పెయింట్లు, కీ చెయిన్లు వంటి రూపాల్లోకి నకాశీ కళను మళ్లించాం. ఆన్‌లైన్‌లోనూ అమ్మకానికి ఉంచుతున్నాం. గత ఆగస్టులో దేబస్మిత అనే ఎన్‌ఆర్‌ఐ రూ.15వేలకు పల్లెపడుచు పెయింటింగ్‌ కొన్నారు. నెల క్రితం అమెరికాలో ఉంటున్న హనుమంతరావు రామాయణ బొమ్మల కోసం రూ.30 వేలకు ఆర్డర్‌ ఇచ్చారు. అంతకుమించి చెప్పడానికేమీ లేదు’ అని గణేశ్‌ వాపోయాడు. కాచిగూడ, లాలాగూడ రైల్వేస్టేషన్‌ ప్రాంగణాలలో కనిపించే స్క్రోల్‌ పెయింటింగ్స్‌ గణేశ్‌ చిత్రించినవే. 

చదవండి:
వావ్‌.. సిద్దిపేట!

విద్యార్ధులు వల విసరడం కూడా నేర్చుకోవాలి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement