కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన | konaseema picture art exhibition | Sakshi
Sakshi News home page

కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన

Published Sat, Jan 21 2017 10:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన

కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన

నేడు 400 మంది చిత్రకారులకు పురస్కారాలు, సత్కారాలు
అమలాపురం టౌన్‌ (అమలాపురం) : కోనసీమ చిత్ర కళా పరిషత్‌ 27వ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు అమలాపురంలోని సత్య సాయి కల్యాణ మండపంలో శనివారం నుంచి మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చిత్ర కళల పండుగు జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మంది చిత్రకారులు గీసిన అపురూప చిత్రాలు ఇక్కడ ఒకే వేదికపై కొలువుదీరాయి. జిల్లా నలుమూలల నుంచి ఈ చిత్ర ప్రదర్శనలు చూసేందుకు కళాభిమానులు తరలివచ్చారు. ఈ ప్రదర్శనలను అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మెట్ల రమణబాబు ప్రారంభించారు. కోనసీమ చిత్ర కళా పరిషత్‌ వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. పరిషత్‌ జాతీయ స్థాయిలో పెద్దలు, పిల్లలకు నిర్వహించిన చిత్రకళా పోటీల్లో ప్రత్యేక నగదు అవార్డులు, బంగారు పతకాలకు ఎంపికైన చిత్రాలు ప్రదర్శనలో ఉంచడంతో చిత్ర కళాభిమానులకు కనువిందు చేశాయి. ప్రముఖ చిత్రకారుడు, సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్‌ కడలి సురేష్‌ కుంచె నుంచి జాలు వారిన రాయాయణంలోని పలు ఘట్టాలకు చెందిన దృశ్యాలు దాదాపు 15 ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. అవి కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నేడు 400 మంది చిత్రకారుల రాక
కోనసీమ చిత్ర కళాపరిషత్‌ జాతీయ చిత్ర కళా పోటీల్లో విజేతలైన 400 మంది చిత్రకారులు ఆదివారం ఉదయం అమలాపురంలోని చిత్ర కళా వేదిక అయిన సత్యసాయి కల్యాణ మండపానికి రానున్నారు. ఒక్కొక్క చిత్రకారుడికి పరిషత్‌ తరపున పురస్కారం ప్రదానం చేయటమే కాకుండా సాదరంగా సత్కరించనున్నారు. రూ.30 వేల నుంచి రూ.వెయ్యి వరకూ ప్రకటించిన దాదాపు 50 నగదు పురాస్కారాలు, 350 మంది బాల చిత్రకారులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.
పరిషత్‌ గౌరవ అధ్యక్షునిగా రాజప్ప, అధ్యక్షునిగా రమణబాబు
ఈ పరిషత్‌ అధ్యక్షునిగా మాజీ మంత్రి డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు వ్యవహరించే వారు. ఆయన మరణం తర్వాత ఆ పదవీ బాధ్యతలను మెట్ల తనయుడైన మెట్ల రమణబాబుకు అప్పగించారు. అలాగే పరిషత్‌ గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొత్తగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement