‘ఆర్టిస్ట్‌గా అన్నీ కుమారి ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు ఒక ముక్కలో జవాబు చెప్పాలంటే... ‘మాథ్స్, ఆర్ట్‌ను మిళితం చేసి సరికొత్త ఆర్ట్‌ను సృష్టించింది’ జీవితం కూడా గణితంలాంటిదే. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొన్ని ఎంతకీ కావు... ఈ సారాంశం కుమారి చిత్రాల్లో ప్రతిఫలిస్తుంది...
మనం పుట్టి పెరిగిన వాతావరణం ఆలోచనల్లో, ఆచరణలో, చివరికి ఆర్ట్‌లో కూడా ప్రభావం చూపుతుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం అన్నీ కుమారి ఆర్ట్. గణితం, సంగీతం, క్రాఫ్ట్‌ల గురించి విలువైన చర్చలు జరిగే ఇంట్లో పెరిగింది కుమారి. చిన్నటిప్పటి నుంచి తనకు లెక్కలు అంటే ఇష్టం. లెక్కలంటే భయపడే పిల్లలకు భిన్నంగా అన్నీ కుమారి గంటల తరబడి లెక్కలు చేస్తూ కూర్చునేది. అంకెలు, సంఖ్యలు తన ప్రియ నేస్తాలుగా మారాయి.
‘ఆర్ట్‌కు లెక్కలకు దోస్తు కుదరదు’ అంటారు. అయితే అన్నీకి లెక్కలు అంటే ఎంత ఇష్టమో, ఆర్ట్ అంటే కూడా అంతే ఇష్టం. అయితే ఆర్ట్ స్కూల్‌లో మాత్రం అంకెలు నచ్చినంతగా చిత్రాలు నచ్చలేదు. తనకు కావాల్సినదేదో ఆ చిత్రాల్లో లోపించినట్లుగా అనిపించేది. ఆ సమయంలో రకరకాల ప్రయోగాల గురించి ఆలోచించేది. విజువల్ వకాబులరీ సృష్టించాలనే ఆలోచన అలా వచ్చిందే.
ఆర్ట్ స్కూల్ తరువాత...
బొమ్మలు గీస్తూ కూర్చోలేదు. తనలోని శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయాణాన్ని సాధనంగా ఎంచుకుంది. జార్ఖండ్‌లోని హజరీబాగ్‌కు వెళ్లి సోరాయి మ్యూరల్ ఆర్ట్ సంప్రదాయాన్ని, తమిళనాడు వెళ్లి కోలమ్ ఫ్లోర్ డ్రాయింగ్ సంప్రదాయాన్ని అధ్యయనం చేసింది. ఆ కళలో చుక్కలు, గీతలు, వంకలు చూస్తుంటే రకరకాల గణిత సూత్రాలు కంటిముందుకు వచ్చేవి. దీనికితోడు ప్రాచీన భారతీయ ఆలయాలలోని ఆర్కిటెక్చర్‌లో గణితం ఒక భాగమై ఉందనే విషయాన్ని అర్థం చేసుకుంది. ప్రకృతి ప్రపంచానికి, గణిత సూత్రాలకు మధ్య ఉండే అంతర్లీన సంబంధం కుమారిని ఆకట్టుకుంది.
సైన్స్‌కు ఉండే శక్తి అది సృష్టించే వస్తువుల్లో కనబడుతుంది. ఇక ఆర్ట్‌కు ఉండే శక్తి మానవ ఉద్వేగాలను, అనుభవాలను ప్రతిఫలించే వేదికలో కనబడుతుంది. ముఖ్య అంశం ఏమిటంటే గణితానికి సంబంధించిన సంక్లిష్ఠతను సరళీకరించి జనాలలోకి తీసుకువెళ్లే శక్తి ఆర్ట్‌కు ఉంది. అందుకే ఈ రెండు బలమైన మాధ్యమాలను ఒకేచోటుకి తీసుకురావాలనుకుంది.
తను సృష్టించే ఆర్ట్ ఎలా ఉండాలంటే...
మన సంస్కృతీ, సంప్రదాయాలలోకి తిరిగి ప్రయాణించేలా, మన కళలను పండగలా సెలబ్రేట్ చేసుకునేలా, మన మూలాలతో ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అనే లక్ష్యంతో బయలుదేరింది. ఆ లక్ష్యసాధనలో విజయం సాధించి ఆర్టిస్ట్‌గా తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. తాజాగా అన్నీ కుమారి ఆర్ట్ ఎగ్జిబిషన్ ముంబైలోని తావో ఆర్ట్ గ్యాలరీలో జరుగుతోంది.
(చదవండి: ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!)
Comments
Please login to add a commentAdd a comment