రేఖారెడ్డి
రంగురంగుల పూలు కంటికి హాయినిస్తాయి. పూల అమరిక మనసుకు సాంత్వననిస్తుంది. ఫ్లవర్‌వాజ్ ఇంటి ఆహ్లాదానికి చిరునామా. భూమి... స్వర్గం... మధ్యలో మనిషి... జీవిత తత్వానికి, జీవన సూత్రానికి ప్రతీక పువ్వు. ఈ తాత్వికతకు ప్రతిబింబం ఇకబెనా పూల అమరిక.
కళ... పాటలు పాడడం ఒక కళ. నాట్యం చేయడం ఒక కళ. చెట్టు మీద ఉండాల్సిన ఆకులు, పూలను... నేల మీదకు తెచ్చి రంగవల్లిక ఆవిష్కరించడం ఓ కళ... అలాగే కాన్వాస్ మీద ఆవిష్కరించడం మరో కళ. అదే పూలు, లతలను వస్త్రం మీద కుట్టడం ఓ కళ. తాజా పూలను కుండీలో అమర్చడమూ ఓ కళ. అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కూడా కొన్ని నియమాలున్నాయి.
ఈ కళను సాధన చేయడం ధ్యానంతో సమానం అంటారు ఇకబెనా కళాకారిణి రేఖారెడ్డి. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన పూల అలంకరణ విధానం. జీవితానికి అన్వయిస్తూ సూత్రబద్ధంగా చేసే అమరిక. జపాన్ కళకు భారతీయ సొగసులద్ది విదేశాల్లో భారతీయతకు రాయబారిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న రేఖారెడ్డి. ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి నేపథ్యాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్రకృతికి ఆహ్వానం
‘‘ఇది బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న కళ. బుద్ధుని ప్రతిమ ఎదురుగా ఒక పాత్రలో నీటిని పెట్టి అందులో కొన్ని పూలను సమర్పించడం నుంచి ఆ పూల అమరిక మరికొంత సూత్రబద్ధతను ఇముడ్చుకుంటూ ఎన్నో ఏళ్లకు ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్ అనే రూపం సంతరించుకుంది. పూలను చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాట.
అలా బౌద్ధ చైత్యాల నుంచి ఈ సంస్కృతి బౌద్ధావలంబకుల ఇళ్లలోకి వచ్చింది. ఈ పూల అలంకరణ ప్రకృతికి, మనిషి జీవితానికి మధ్య ఉండాల్సిన అనుబంధానికి ప్రతీక. ఒక త్రికోణాకారంలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపంగా ఉంటుందీ అమరిక. మనిషి జీవన చక్రం ఇమిడి ఉంటుంది. పై నుంచి కిందకు... ఒకటి విచ్చుకోవాల్సిన మొగ్గ, ఒకటి అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు పూలు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలన్నమాట. ఫ్లవర్ అరేంజ్‌మెంట్ ప్రాక్టీస్ ధ్యానం వంటిదే. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో గడిపితే ధ్యానం తర్వాత కలిగే ప్రశాంతత కలుగుతుంది. ఇక నాకు ఈ ఆర్ట్ మీద ఆసక్తి ఎలా కలిగింది... అంటే ఈ కళ మా ఇంట్లో నేను పుట్టకముందే విచ్చుకుంది.
ఆకట్టుకున్న జపాన్
మా నాన్న పిల్లల డాక్టర్. కెనడాకు వెళ్లే ప్రయాణంలో మధ్యలో నాలుగు రోజులు జపాన్‌లో ఉన్నారు. నాన్నతోపాటు అమ్మ కూడా వెళ్లిందప్పుడు. ఆమెకు స్వతహాగా ఇంటిని పూలతో అలంకరించడం ఇష్టం. ఫ్లవర్‌వాజ్‌లో తాజా పూలను అమర్చేది. జపాన్‌లో ఉన్న నాలుగు రోజుల్లో ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్ ఆమెను బాగా ఆకర్షించింది. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మీనా అనంతనారాయణ్ గారి దగ్గర కోర్సు చేసింది అమ్మ.
సిటీలో అనేక పోటీల్లో పాల్గొని ప్రైజ్‌లు తెచ్చుకునేది. ఇదంతా చూస్తూ పెరిగినా కూడా నాకు అప్పట్లో పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ అవగాహన మాత్రం ఉండేది. కాలేజ్ పోటీలప్పుడు ఫ్లవర్‌వేజ్‌లో తాజా పూలను చక్కగా అలంకరించి ప్రైజ్‌లు తెచ్చుకోవడం వరకే ఇంటరెస్ట్. నా కెరీర్ ప్లాన్స్ అన్నీ న్యూట్రిషన్‌లోనే ఉండేవి. ఎన్.జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ హోమ్‌సైన్స్‌లో న్యూట్రిషన్ చేశాను, యూనివర్సిటీ టాపర్‌ని.
పీహెచ్‌డీ చేసి ప్రపంచంలో అనేక దేశాల్లో పిల్లలు పోషకాహారలోపంతో బాధపడడానికి కారణాలను, నివారించడానికి చర్యల మీద పరిశోధనలు చేయాలనుకున్నాను. అలాంటిది హఠాత్తుగా నాన్న పోవడం, నాకు పెళ్లి చేసి తన బాధ్యత పూర్తి చేసుకోవాలని అమ్మ అనుకోవడం... నా న్యూట్రిషన్ కెరీర్ కల కలగానే ఉండిపోయింది. నా పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబంతో గృహిణిగా కొనసాగుతున్న సమయంలో కాలక్షేపం కోసం ఫ్లవర్ అరేంజ్‌మెంట్ మొదలుపెట్టాను.
ఒక్కో డౌట్ అమ్మను అడుగుతూ పూలను అమర్చేదాన్ని. అప్పుడు అమ్మ సూచన మేరకు ఆమె టీచర్ దగ్గరే నేను కూడా ఇకబెనా కోర్సు చేశాను. ఇది ముప్ఫైఐదేళ్ల నాటి సంగతి. ఇందులో ఇంట్రడక్టరీ నుంచి టీచింగ్ వరకు ఉన్న దశలన్నీ పూర్తిచేసి 1995 నుంచి ఇకబెనా టీచింగ్ మొదలు పెట్టాను. ఇన్నేళ్లలో వందలాది మందికి నేర్పించాను. నా స్టూడెంట్స్‌లో చాలామంది టీచర్లయ్యారు.
మా యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు నన్ను చూసి ఓసారి ‘గోల్డ్ మెడలిస్ట్‌వి. న్యూట్రిషన్ కోసం చాలా సర్వీస్ ఇస్తావని ఊహించాం. ఇలా పూల డెకరేషన్ చేసుకుంటున్నావా’ అని నొచ్చుకున్నారు. మనను నడిపించే ఓ శక్తి మన గమనాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతాను. ఇకబెనా కోసం పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇందులోనే ప్రయోగాలు చేస్తున్నాను. నేను విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయతకు ప్రాతినిధ్యం వహించినట్లే, కాబట్టి మన వస్త్రధారణనే పాటిస్తాను.
ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో భారతీయత ప్రతిబింబించేటట్లు మన పసుపు, కుంకుమను థీమ్ ప్రకారం చేరుస్తాను. ఈ ప్రయోగం నాకు గర్వంగా ఉంటోంది కూడా. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ అనే పుస్తకం ద్వారా జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేశాను. అలాగే ‘మిశ్రణం’ పుస్తకంలో మన ఆహారంలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్‌కి– జపాన్ పూల అలంకరణను మమేకం చేశాను. సంస్కృతుల సమ్మేళనంగా నేను చేసిన ఈ ప్రయోగాలే నన్ను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ ఎంపిక చేశాయనుకుంటున్నాను. ఈ పురస్కారాన్ని ఈ నెలలో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ తగా మసాయుకి అందిస్తారు’’ అని తన ఇకబెనా ప్రయాణాన్ని వివరించారు రేఖారెడ్డి.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి
సమాజ హితం కోసం పాఠాలు
ఇంట్లో నేనే చిన్నదాన్ని. అన్న, అక్క ఉన్నత విద్య కోసం హాస్టల్‌కెళ్లిపోయిన తరవాత నన్ను కూడా హాస్టల్‌కి పంపించడానికి అమ్మానాన్న ఇష్టపడలేదు. అలా ఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజ్‌లో సీటు వదులుకున్నాను. న్యూట్రిషన్‌లో పీహెచ్‌డీ సీటు వచ్చినా చేయలేకపోయాను. నేను హాబీగా మొదలు పెట్టిన ఇకబెనా కోసం విస్తృతంగా పని చేస్తున్నాను. మనదేశంలో దాదాపుగా పది రాష్ట్రాల్లో, పద్నాలుగు దేశాల్లో వర్క్‌షాప్‌లు, డెమోలలో పాల్గొన్నాను.
కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా నా విద్యార్థుల పరిధి ఖండాలు దాటింది. లిథువేనియా స్టూడెంట్స్‌కి కూడా నేర్పించాను. పిల్లల ఆరోగ్యం కోసం పని చేసే రుగుటె ఫౌండేషన్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కోసం ఇకబెనా పాఠాలు చెప్పాను. రష్యా– ఉక్రెయిన్ వార్ రిలీఫ్ ఫండ్ కోసం కూడా ఇకబెనా పాఠాలు చెప్పాను. ఈ జర్నీ నాకు సంతృప్తిగా ఉంది.
– రేఖారెడ్డి, ఇకబెనా ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment