కవితకేదీ కాదు అనర్హం అన్న చందాన మెటల్, ప్లాస్టిక్, పాత గాడ్జెట్స్ ఏదైనా ఆయన చేతిలో పెట్టారంటే అందమైన శిల్పంగా మారాల్సిందే. అరవైఏళ్ల వయసులో చిన్నప్పటి హాబీని కెరీర్‌గా మలుచుకున్నాడు విశ్వనాథ్ మల్లాబ్డి దావంగిరె. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్‌గా మార్చి అబ్బురపరుస్తున్నాడు ఈ పెద్దాయన.
బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి డీఎమ్ శంభు ప్రముఖ శిల్పి ఇంకా పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని శంభు కలలు కనేవారు. చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను సరికొత్తగా మార్చడమంటే విశ్వనాథ్‌కు ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూరై్తన తరువాత తరువాత మీడియాలోకంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా చేరాడు.
అలా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్ ఒక్కోమెట్టు ఎదుగుతూ విప్రోలో చేరాడు. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయం, వారాంతాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకోఆర్ట్‌గా ఎలా మార్చాలని పరిశోధిస్తుండేవాడు. రకరకాల ప్రయోగాల తరువాత.. గాడ్జెట్స్ వ్యర్థాలను ఉపయోగించి చిన్నచిన్న జంతువులు తయారు చేశాడు. అవి ముద్దుగా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో తన ఇకో ఆర్ట్‌ను పెంచుకుంటూ పోయాడు. ఫ్యాషన్ జ్యూవెలరీ నుంచి అందమైన శిల్పాలు, రోబోలదాకా అన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నాడు.
ఏరికోరి ఎంచుకుని...
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ప్రాణాంతకంగా మారాయని తెలుసుకుని ఇకో ఆర్ట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఈ వ్యర్థాలను కొనుక్కునేవాడు. అన్నింటిని గంపగుత్తగా కొనకుండా కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్‌టాప్స్, డేటా కార్డులు, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెట్–టాప్‌బాక్స్‌లు, ల్యాండ్‌లైన్, కార్డ్‌లెస్ ఫోన్‌లు, గ్లూకో మీటర్లను ఏరికోరి ఎంచుకుని తీసుకునేవాడు. వీటిలో కూడా రాగి, బంగారం, రంగురంగుల వైర్లు, కీబోర్డులను ప్రత్యేకంగా సేకరించి రకరకాల బొమ్మల రూపకల్పనకు ఉపయోగిస్తున్నాడు. ఆరు అడుగుల అమ్మాయి రూపంతో విగ్రహం, ప్రముఖ వ్యాపారవేత్త అజీం ప్రేమ్‌జీ ఫోటో, ఇకో జ్యూవెలరీ, కీబోర్డు కామధేనువు వంటి బొమ్మలు ఐదు వందలకు పైగానే తయారు చేశాడు.
హాబీని కెరీర్‌గా...
విశ్వనాథ్ తయారు చేసిన బొమ్మలు ఆకర్షణీయంగా అందంగా ఆకట్టుకుంటుండడంతో విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయిన విశ్వనాథ్.. తొలినాళ్లల్లో హాబీగా ఉన్న ఇకోఆర్ట్‌ను పూర్తి సమయం కేటాయిస్తూ ఇకోఆర్ట్ వస్తువులు విక్రయిస్తూ సరికొత్త కెరీర్‌ను సృష్టించుకున్నాడు. ఇకోఆర్ట్ వస్తువులు కొనే కస్టమర్లు ఢిల్లీలోనేగాక, యూరప్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో ఇకో ఆర్ట్ కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. దేశంలోనేగాక విదేశాల్లో తన ఇకో ఆర్ట్‌ను ప్రదర్శిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు.
వందల కేజీలపైనే...
కీబోర్డు కీల నుంచి గోడగడియారంలో భాగాల వరకు అన్నీ సేకరించి ఇకో ఆర్ట్ రూపొందిస్తోన్న విశ్వనాథ్ ఇప్పటిదాకా రెండువందల కేజీల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్స్‌గా మార్చాడు. అయితే ఈ ఇకో ఆర్ట్ అంత సులభం కాదని విశ్వనాథ్ చెబుతున్నాడు. ‘‘ఈ – వ్యర్థాల నుంచి ఆర్ట్ కావాల్సిన భాగాలను సేకరించి వాటికి ఆకారం, రంగు వేసి తుదిమెరుగులు దిద్దడానికి చాలా సమయం పడుతుంది.
జ్యూవెలరీ తయారు చేయడానికి రెండు మూడు నిమిషాలు పడితే, శిల్పాలు తయారు చేయడానికి వారాలు, నెలలు పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇటు కస్టమర్ల మనసు దోచుకోవడంతోపాటూ, పర్యావరణానికి హానీ కలగకుండా ఈ ఇకోఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది. ముందు ముందు మరిన్ని కళారూపాలు తీసుకురానున్నాను’’అని విశ్వనాథ్ చెబుతున్నాడు.
(చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..)
Comments
Please login to add a commentAdd a comment