Eco Gift
-
ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!
కవితకేదీ కాదు అనర్హం అన్న చందాన మెటల్, ప్లాస్టిక్, పాత గాడ్జెట్స్ ఏదైనా ఆయన చేతిలో పెట్టారంటే అందమైన శిల్పంగా మారాల్సిందే. అరవైఏళ్ల వయసులో చిన్నప్పటి హాబీని కెరీర్‌గా మలుచుకున్నాడు విశ్వనాథ్ మల్లాబ్డి దావంగిరె. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్‌గా మార్చి అబ్బురపరుస్తున్నాడు ఈ పెద్దాయన. బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి డీఎమ్ శంభు ప్రముఖ శిల్పి ఇంకా పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని శంభు కలలు కనేవారు. చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను సరికొత్తగా మార్చడమంటే విశ్వనాథ్‌కు ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూరై్తన తరువాత తరువాత మీడియాలోకంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా చేరాడు. అలా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్ ఒక్కోమెట్టు ఎదుగుతూ విప్రోలో చేరాడు. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయం, వారాంతాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకోఆర్ట్గా ఎలా మార్చాలని పరిశోధిస్తుండేవాడు. రకరకాల ప్రయోగాల తరువాత.. గాడ్జెట్స్ వ్యర్థాలను ఉపయోగించి చిన్నచిన్న జంతువులు తయారు చేశాడు. అవి ముద్దుగా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో తన ఇకో ఆర్ట్‌ను పెంచుకుంటూ పోయాడు. ఫ్యాషన్ జ్యూవెలరీ నుంచి అందమైన శిల్పాలు, రోబోలదాకా అన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నాడు. ఏరికోరి ఎంచుకుని... ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ప్రాణాంతకంగా మారాయని తెలుసుకుని ఇకో ఆర్ట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఈ వ్యర్థాలను కొనుక్కునేవాడు. అన్నింటిని గంపగుత్తగా కొనకుండా కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్టాప్స్, డేటా కార్డులు, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెట్–టాప్బాక్స్లు, ల్యాండ్‌లైన్, కార్డ్‌లెస్ ఫోన్లు, గ్లూకో మీటర్లను ఏరికోరి ఎంచుకుని తీసుకునేవాడు. వీటిలో కూడా రాగి, బంగారం, రంగురంగుల వైర్లు, కీబోర్డులను ప్రత్యేకంగా సేకరించి రకరకాల బొమ్మల రూపకల్పనకు ఉపయోగిస్తున్నాడు. ఆరు అడుగుల అమ్మాయి రూపంతో విగ్రహం, ప్రముఖ వ్యాపారవేత్త అజీం ప్రేమ్‌జీ ఫోటో, ఇకో జ్యూవెలరీ, కీబోర్డు కామధేనువు వంటి బొమ్మలు ఐదు వందలకు పైగానే తయారు చేశాడు. హాబీని కెరీర్‌గా... విశ్వనాథ్ తయారు చేసిన బొమ్మలు ఆకర్షణీయంగా అందంగా ఆకట్టుకుంటుండడంతో విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయిన విశ్వనాథ్.. తొలినాళ్లల్లో హాబీగా ఉన్న ఇకోఆర్ట్ను పూర్తి సమయం కేటాయిస్తూ ఇకోఆర్ట్ వస్తువులు విక్రయిస్తూ సరికొత్త కెరీర్‌ను సృష్టించుకున్నాడు. ఇకోఆర్ట్ వస్తువులు కొనే కస్టమర్లు ఢిల్లీలోనేగాక, యూరప్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో ఇకో ఆర్ట్ కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. దేశంలోనేగాక విదేశాల్లో తన ఇకో ఆర్ట్‌ను ప్రదర్శిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు. వందల కేజీలపైనే... కీబోర్డు కీల నుంచి గోడగడియారంలో భాగాల వరకు అన్నీ సేకరించి ఇకో ఆర్ట్ రూపొందిస్తోన్న విశ్వనాథ్ ఇప్పటిదాకా రెండువందల కేజీల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్స్‌గా మార్చాడు. అయితే ఈ ఇకో ఆర్ట్ అంత సులభం కాదని విశ్వనాథ్ చెబుతున్నాడు. ‘‘ఈ – వ్యర్థాల నుంచి ఆర్ట్ కావాల్సిన భాగాలను సేకరించి వాటికి ఆకారం, రంగు వేసి తుదిమెరుగులు దిద్దడానికి చాలా సమయం పడుతుంది. జ్యూవెలరీ తయారు చేయడానికి రెండు మూడు నిమిషాలు పడితే, శిల్పాలు తయారు చేయడానికి వారాలు, నెలలు పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇటు కస్టమర్ల మనసు దోచుకోవడంతోపాటూ, పర్యావరణానికి హానీ కలగకుండా ఈ ఇకోఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది. ముందు ముందు మరిన్ని కళారూపాలు తీసుకురానున్నాను’’అని విశ్వనాథ్ చెబుతున్నాడు. (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
నా గిఫ్ట్ ప్రత్యేకంగా...
పుట్టిన రోజు జేజేలకు, పెళ్లి వేడుకలో ఆశీస్సులకు బహుమతులుగా బొకేలే దర్శనమిస్తున్నాయి. రంగురంగుల పూలతో రంగరించిన బొకేలు రెండ్రోజులకంటే ఉండవు. అపురూపమైన ఆ సందర్భంలో ఓ మొక్క నాటితే అది పచ్చగా ఉండి.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లుప్తంగా ఎకో గిఫ్ట్స్ సారాంశం ఇది. ‘నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం. పదేళ్లుగా మా బంధువులకు, స్నేహితులకు మొక్కలనే బహుమతులుగా అందజేస్తున్నాను. ఇందులో కూడా ఓ ప్రత్యేకత ఉంది. సందర్భాన్ని బట్టి ఫలానా మొక్కయితే బాగుంటుందని ఎంపిక చేసుకుంటాను. దాన్ని అందమైన కుండీలో పెట్టి, కుండీపై వేడుకకు సూటయ్యే డిజైన్, మెసేజ్ రాసిస్తాను. దాంతో వేడుకలో నా గిఫ్ట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది’ అని చెప్పారు కల్యాణి. హితకారిణి.. రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం బారి నుంచి తప్పించుకోవాలంటే మొక్కలు పెంచడం తప్ప మరో దారి లేదు. కాస్త పోకడ మార్చిన ఈ తరం మనుషులు మొక్కల పెంపకాన్ని కాస్త సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఎకో గిఫ్ట్స్ కాన్సెప్ట్ అరుదైన కానుకలు అందించే కల్పతరువులా మారింది. పూల మొక్కలు, మానులుగా మారే మొక్కలు, బోన్సాయి మొక్కలు ఇలా మన అభిరుచికి తగ్గ బహుమతులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎకో గిఫ్ట్స్ వచ్చే కస్టమర్లు ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేసే ప్లాంట్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పే డాక్టర్లు.. ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్టిఫిషియల్ అందాలను కొలువుదీర్చడం బాధాకరం. వాటి స్థానంలో నిజమైన మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీల్లో తరచూ ఏవో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ఉద్యోగులకు మొక్కలు బహుమతిగా ఇవ్వాలని చెబుతున్నాం. మా ప్రయత్నాన్ని మెచ్చి కొన్ని కంపెనీలు మొక్కల కోసం మమ్మల్ని సంప్రదించాయి. ఆయా కంపెనీల బ్రాండ్లు కనిపించే విధంగా కుండీలను తీర్చిదిద్ది.. మొక్కలతో అందజేయడం వారికి ఎంతో నచ్చింది’ అని సంతోషంగా చెప్పారు కల్యాణి. సమయం.. సందర్భం.. కంపెనీ లాంచ్‌లకు ఒక రకమైన మొక్కలు, పుట్టిన రోజుకి ఒకరకమైన మొక్కలు, పెళ్లికి మరో రకం, షష్టిపూర్తి, గోల్డెన్ జూబ్లీ వంటి పెద్దల వేడుకలకు ఎకో గిఫ్ట్స్ సెంటర్‌కి వెళితే ఏ సందర్భానికి ఏ మొక్కని బహుమతిగా ఇవ్వాలి..? ఎలాంటి మొక్క శుభసూచకం..? కుండీలపై ఎలాంటి మెసేజ్‌లు రాయాలి, ఎన్ని రకాల శుభాకాంక్షలు చెప్పొచ్చు.. వంటి విషయాలపై అవగాహన కలుగుతుంది. ‘పిల్లలకయితే పూల మొక్కలు, పెద్దవాళ్లకైతే గాలినిచ్చే మొక్కలు.. ఇలా చాలా రకాలుంటాయి. చాలావరకూ మా దగ్గరికి డబ్బున్న వారే వస్తున్నారు. వారి టేస్ట్‌కి తగ్గట్టుగా ముందుగా ఆర్డర్ ఇచ్చి రెడీ చేయించుకుంటున్నారు. కంప్యూటర్ టేబుల్ దగ్గర పెట్టుకోడానికా? గుమ్మం దగ్గర వేలాడదీసుకోవడానికా? వంటింటి వరండాలోనా? ఇలా ఆ మొక్కను పెట్టే ప్లేస్ దగ్గర నుంచి దాన్ని మెయింటేన్ చేసే తీరు అన్ని డీటైల్స్ చెబుతాం’ అని వివరించారు కల్యాణి. రెండు వందల నుంచి... ఈ ఎకో గిఫ్ట్స్ షాపు దగ్గరికెళ్లి గిఫ్ట్ తెచ్చుకోవాలంటే జేబులో రూ.200 ఉంటే చాలంటున్నారు కల్యాణి. మీరిచ్చే బహుమతి పచ్చగా కళకళలాడటం కన్నా గొప్ప విషయం ఏముందంటారు. నిజమే.. ఆ మొక్క పూసిన నాలుగు పూలు, ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యం లేని గాలి.. ఇవన్నీ రెండు వందలకే వస్తున్నాయంటే అంతకన్నా ఏం కావాలి? మరో విషయం ఈ ఎకో గిఫ్ట్స్‌లో రూ.25 వేల విలువ చేసే మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే స్పెషల్ ఆర్డర్‌పై రూ.30 వేల విలువ చేసే బహుమతిని తయారు చేసి ఇచ్చారు కల్యాణి. మొక్కే కదా అని తీసి పారేయడానికి లేదు.. మీరిచ్చే ఈ బహుమతితో మీ దర్పాన్ని కూడా ప్రదర్శించుకోవచ్చు. వీటితో పాటు... ఎకో గిఫ్ట్స్‌లో మొక్కలే కాకుండా బహుమతులుగా మరిన్ని ఆసక్తికరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈమూ కోళ్లు పెట్టే గుడ్లపై పెయింటింగ్ వేసి బహుమతులుగా తీర్చిదిద్దుతున్నారు. దీపాల వెలుగులు పంచే ప్రమిదలకు పెయింటింగ్స్ వేసి అమ్ముతున్నారు. పర్యావరణ హితం కోరుతూ అందమైన బహుమతులను అందుబాటులోకి తెచ్చిన ‘ఎకో గిఫ్ట్స్’కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పచ్చగా నిలిచే ఈ బహుమతులను పెంచే వారి సంఖ్య మరింత పెరగాలని కోరుకుందాం.