నా గిఫ్ట్ ప్రత్యేకంగా... | special gifts for celebrations | Sakshi
Sakshi News home page

నా గిఫ్ట్ ప్రత్యేకంగా...

Published Mon, Dec 1 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

నా గిఫ్ట్ ప్రత్యేకంగా...

నా గిఫ్ట్ ప్రత్యేకంగా...

పుట్టిన రోజు జేజేలకు, పెళ్లి వేడుకలో ఆశీస్సులకు బహుమతులుగా బొకేలే దర్శనమిస్తున్నాయి. రంగురంగుల పూలతో రంగరించిన బొకేలు రెండ్రోజులకంటే ఉండవు. అపురూపమైన ఆ సందర్భంలో ఓ మొక్క నాటితే అది పచ్చగా ఉండి.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లుప్తంగా ఎకో గిఫ్ట్స్ సారాంశం ఇది. ‘నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం.

పదేళ్లుగా మా బంధువులకు, స్నేహితులకు మొక్కలనే బహుమతులుగా అందజేస్తున్నాను. ఇందులో కూడా ఓ ప్రత్యేకత ఉంది. సందర్భాన్ని బట్టి ఫలానా మొక్కయితే బాగుంటుందని ఎంపిక చేసుకుంటాను. దాన్ని అందమైన కుండీలో పెట్టి, కుండీపై వేడుకకు సూటయ్యే డిజైన్, మెసేజ్ రాసిస్తాను. దాంతో వేడుకలో నా గిఫ్ట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది’ అని చెప్పారు కల్యాణి.

హితకారిణి..
రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం బారి నుంచి తప్పించుకోవాలంటే మొక్కలు పెంచడం తప్ప మరో దారి లేదు. కాస్త పోకడ మార్చిన ఈ తరం మనుషులు మొక్కల పెంపకాన్ని కాస్త సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఎకో గిఫ్ట్స్ కాన్సెప్ట్ అరుదైన కానుకలు అందించే కల్పతరువులా మారింది. పూల మొక్కలు, మానులుగా మారే మొక్కలు, బోన్సాయి మొక్కలు ఇలా మన అభిరుచికి తగ్గ బహుమతులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎకో గిఫ్ట్స్ వచ్చే కస్టమర్లు ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేసే ప్లాంట్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పే డాక్టర్లు.. ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్టిఫిషియల్ అందాలను కొలువుదీర్చడం బాధాకరం. వాటి స్థానంలో నిజమైన మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీల్లో తరచూ ఏవో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ఉద్యోగులకు మొక్కలు బహుమతిగా ఇవ్వాలని చెబుతున్నాం. మా ప్రయత్నాన్ని మెచ్చి కొన్ని కంపెనీలు మొక్కల కోసం మమ్మల్ని సంప్రదించాయి. ఆయా కంపెనీల బ్రాండ్‌లు కనిపించే విధంగా కుండీలను తీర్చిదిద్ది.. మొక్కలతో అందజేయడం వారికి ఎంతో నచ్చింది’ అని సంతోషంగా చెప్పారు కల్యాణి.

సమయం.. సందర్భం..
కంపెనీ లాంచ్‌లకు ఒక రకమైన మొక్కలు, పుట్టిన రోజుకి ఒకరకమైన మొక్కలు, పెళ్లికి మరో రకం, షష్టిపూర్తి, గోల్డెన్ జూబ్లీ వంటి పెద్దల వేడుకలకు ఎకో గిఫ్ట్స్ సెంటర్‌కి వెళితే ఏ సందర్భానికి ఏ మొక్కని బహుమతిగా ఇవ్వాలి..? ఎలాంటి మొక్క శుభసూచకం..? కుండీలపై ఎలాంటి మెసేజ్‌లు రాయాలి, ఎన్ని రకాల శుభాకాంక్షలు చెప్పొచ్చు.. వంటి విషయాలపై అవగాహన కలుగుతుంది. ‘పిల్లలకయితే పూల మొక్కలు, పెద్దవాళ్లకైతే గాలినిచ్చే మొక్కలు.. ఇలా చాలా రకాలుంటాయి.

చాలావరకూ మా దగ్గరికి డబ్బున్న వారే వస్తున్నారు. వారి టేస్ట్‌కి తగ్గట్టుగా ముందుగా ఆర్డర్ ఇచ్చి రెడీ చేయించుకుంటున్నారు. కంప్యూటర్ టేబుల్ దగ్గర పెట్టుకోడానికా? గుమ్మం దగ్గర వేలాడదీసుకోవడానికా? వంటింటి వరండాలోనా? ఇలా ఆ మొక్కను పెట్టే ప్లేస్ దగ్గర నుంచి దాన్ని మెయింటేన్ చేసే తీరు అన్ని డీటైల్స్ చెబుతాం’ అని వివరించారు కల్యాణి.

రెండు వందల నుంచి...
ఈ ఎకో గిఫ్ట్స్ షాపు దగ్గరికెళ్లి గిఫ్ట్ తెచ్చుకోవాలంటే జేబులో రూ.200 ఉంటే చాలంటున్నారు కల్యాణి. మీరిచ్చే బహుమతి పచ్చగా కళకళలాడటం కన్నా గొప్ప విషయం ఏముందంటారు. నిజమే.. ఆ మొక్క పూసిన నాలుగు పూలు, ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యం లేని గాలి.. ఇవన్నీ రెండు వందలకే వస్తున్నాయంటే అంతకన్నా ఏం కావాలి? మరో విషయం ఈ ఎకో గిఫ్ట్స్‌లో రూ.25 వేల విలువ చేసే మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే స్పెషల్ ఆర్డర్‌పై రూ.30 వేల విలువ చేసే బహుమతిని తయారు చేసి ఇచ్చారు కల్యాణి. మొక్కే కదా అని తీసి పారేయడానికి లేదు.. మీరిచ్చే ఈ బహుమతితో మీ దర్పాన్ని కూడా ప్రదర్శించుకోవచ్చు.

వీటితో పాటు...
ఎకో గిఫ్ట్స్‌లో మొక్కలే కాకుండా బహుమతులుగా మరిన్ని ఆసక్తికరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈమూ కోళ్లు పెట్టే గుడ్లపై పెయింటింగ్ వేసి బహుమతులుగా తీర్చిదిద్దుతున్నారు. దీపాల వెలుగులు పంచే ప్రమిదలకు పెయింటింగ్స్ వేసి అమ్ముతున్నారు. పర్యావరణ హితం కోరుతూ అందమైన బహుమతులను అందుబాటులోకి తెచ్చిన ‘ఎకో గిఫ్ట్స్’కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పచ్చగా నిలిచే ఈ బహుమతులను పెంచే వారి సంఖ్య మరింత పెరగాలని కోరుకుందాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement