‘మీరు డిక్షనరీని చాలా చిన్నచూపు చూస్తారు. మీ రచనలు చదువుతుంటే డిక్షనరీ చూడాల్సిన అవసరం ఏర్పడదు. డిక్షనరీ మీద మీకెందుకంత విముఖత’ అని ఒకసారి సరదాగా శశి థరూర్ సుధామూర్తిని అడిగారు. శశి థరూర్ జటిలమైన ఇంగ్లిష్ పదాలు వాడి అందరి చేత డిక్షనరీ పట్టిస్తాడన్న సంగతి తెలిసిందే.
దానికి సుధామూర్తి జవాబు ఇస్తూ ‘భారతదేశంలో చాలామంది పది, ఇంటర్ చదువు చదివినవాళ్లు. అంతవరకే చదివిన ఆడవాళ్లు ఎప్పుడూ నా దృష్టిలో ఉంటారు. నా పుస్తకాలు చదివి వారు అర్థం కాలేదు అనుకోవడానికి వీల్లేకుండా సామాన్యమైన భాషలో నేను రాయడానికి ఇష్టపడతాను’ అన్నారు.
ఇన్ఫోసిస్ మూలస్తంభాలలో ఒకరైన సుధామూర్తి ఆ రంగంతోపాటు రచనారంగంలో కూడా కృషి చేసి అభిమానులను సంపాదించుకున్నారు. ఇంగ్లిష్‌లో దాదాపు పాతికపుస్తకాలు , కన్నడంలో పదిహేను పుస్తకాలు వెలువరించారామె. అవి ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తృతంగా అనువాదం అయ్యాయి. ఇప్పుడు తన 70వ జన్మదినం సందర్భంగా పిల్లలకు కానుకగా ఒక కథల పుస్తకం వెలువరించాలని నిర్ణయించారు. పెంగ్విన్ ప్రచురించనున్న ఈ పుస్తకం పేరు ‘గ్రాండ్‌పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’.
‘లాక్‌డౌన్ మొదలెట్టినప్పటి నుంచి నాకు ఒకటే ఆలోచన. నా చిన్నప్పుడు ఈ కరోనా వచ్చి ఉంటే నేను ఏం చేసి ఉండేదాన్ని... కచ్చితంగా బోర్ అయి ఉండేదాన్ని... తప్పకుండా మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్లి కథలు విని ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఇలాంటి సమయంలో పిల్లలు కథలు వినడానికే ఇష్టపడతారు. వారి కోసం కథలు రాస్తే బాగుంటుందని రాశాను’ అన్నారు సుధామూర్తి. లాక్‌డౌన్‌లో ఆమె పిల్లల కథలు రాయడం మొదలుపెట్టి మొత్తం 20 కథలు రాశారు.
అడవులు, సరోవరాలు, వింతలూ విడ్డూరాలు ఉండే ఈ కథలు అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెప్తూ ఉంటే ఎలా ఉంటాయో అలాంటి ధోరణిలో ఉంటాయి. ప్రతికూల కాలంలో కూడా ఇష్టమైన వ్యాపకంలో మునిగి ఉంటే అవి ఫలవంతమై సంతృప్తినిస్తాయి అనడానికి కూడా సుధామూర్తి ఒక ఉదాహరణ. లాక్‌డౌన్‌కు ముందు సుధామూర్తి ‘గ్రాండ్‌మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ తెచ్చారు. ఈ పుస్తకం దాని కొనసాగింపు అనుకోవచ్చు. వచ్చే నెలలో ఇది విడుదల కానుంది. పిల్లలకు ఒక అమ్మమ్మ కానుక అనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment