‘మా వంటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు... మా బట్టలుతికేవాడు భారతీయుడు’... అని ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్‌బాబు చెప్పిన బ్రిటిష్ అధికారి డైలాగుకు ప్రేక్షకులు పదేపదే నవ్వుకున్నారు. ఎన్.టి.ఆర్ తర్వాత డైలాగును బాగా పలుకుతారన్న పేరు మోహన్‌బాబుకు ఉంది. కాని ఆ డైలాగును ఉద్వేగానికి, రౌద్రానికి, సెంటిమెంటుకు ఎంత బాగా ఉపయోగించగలరో కామెడీకి కూడా అంతే బాగా ఉపయోగించగలరు అని ఆయన అనేక సినిమాల ద్వారా ప్రేక్షకులకు నిరూపించారు.
‘దేవత’ సినిమాలో ‘కామెడీ విలన్’గా ఆయన పెద్ద పేరు సాధించారు. అందులో నిర్మలమ్మ జులాయి మనవడిగా నవ్వులు పూయించారు. ఊళ్లో అల్లరి పనులు చేసి ఊరి పెద్ద రావుగోపాలరావు చేతిలో తిట్లు తింటూ ఉంటారు. ఆయన ‘ఔ’ మేనరిజమ్ హిందీలో విలన్ శక్తికపూర్ అదే సినిమా రీమేక్ కోసం వాడి నేటికీ ఆ మేనరిజమ్‌తోనే గుర్తింపు పొందుతున్నాడు. ‘వారసుడొచ్చాడు’, ‘కొదమసింహం’, ‘శ్రీనివాస కల్యాణం’.. ఇలా చాలా సినిమాల్లో ఆయన కామెడీ విలన్‌గా ప్రేక్షకులను అలరించారు. కొదమసింహంలో రోజుల తరబడి స్నానం చేయని కౌబాయ్‌గా, తిండిపోతుగా ఆయన కేరెక్టర్ అందరినీ తెగ నవ్వించింది.
హీరో అయ్యాక ఈ కామెడీ అంశను ఆయన వదల్లేదు. ‘అల్లుడు గారు’ మోహన్‌బాబు కామిక్ టైమింగ్‌కు మంచి ఉదాహరణ. ‘నాది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం’ అంటూ రకరకాల మోసాలు చేస్తూ నవ్విస్తారాయన. చంద్రమోహన్‌ను ‘ఉలవల బస్తా’ అంటూ శోభనను పిచ్చిపిచ్చి తిట్లు తిడుతూ ఆయన ఇంటిల్లిపాదికీ నచ్చేశారు. ఇంత మంచివాడికి ఉరిశిక్ష ఏమిటని ప్రేక్షకులు చివరలో భోరున ఏడ్చారు కూడా.
దర్శకుడు రాఘవేంద్రరావు మోహన్‌బాబు కామెడీని బాగా ఉపయోగించుకున్నారు. ‘అల్లరి మొగుడు’లో ఇద్దరు భార్యల భర్తగా ఆయన చేత కామెడీ పండించారు. ‘అన్నమయ్య’ సినిమాలో ఆయన పాత్రను ఆహ్లాదానికి ఉపయోగించారు. ‘భంగభంగారి భంగ’ అని మేనరిజమ్ పెట్టారు. పరుచూరి బ్రదర్స్ ‘అసెంబ్లీ రౌడీ’లో ‘అరిస్తే చరుస్తా’ లాంటి డైలాగులు రాసి కామెడీ పండించారు. ఆ సినిమాలో విలన్ బాషా దగ్గరకు వెళ్లి మోహన్‌బాబు ఎగతాళి చేయడం కూడా బాగా నవ్వించింది.
దాసరి సినిమాలలో ‘దీపారాధన’, ‘అద్దాలమేడ’ సినిమాలలో మోహన్‌బాబు చాలా క్లాసిక్ కామెడీ చేస్తారు. ఆయనతో కలిసి కామెడీ చేసిన చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఇవివి సత్యనారాయణ మోహన్‌బాబుతో ‘అదిరింది అల్లుడు’, ‘వీడెవడండీ బాబూ’ సినిమాలు చేసి తన స్టయిల్‌లో నవ్విస్తే దర్శకుడు వంశీ ‘డిటెక్టివ్ నారద’గా మోహన్‌బాబును చూపించి నవ్వించారు. అందులో మల్లికార్జున రావుతో ‘అల్లావుద్దీన్’ అంటే అతను ‘ఎస్‌బాస్’ అనే మేనరిజం బాగుంటుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘తప్పు చేసి పప్పుకూడు’ కూడా కామెడీయే. అల్లరి నరేశ్‌తో ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశారు. మంచి కామెడీ చేసినవాడే మంచి నటుడు అంటారు పెద్దలు. ఆ విధంగా చూస్తే తాను గొప్ప నటుణ్ణి అని మోహన్‌బాబు అనిపించుకున్నారు. ఆయన మరిన్ని ఆహ్లాద పాత్రలు చేయాలని కోరుకుందాం.
చదవండి:
చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం' టీజర్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment