E waste management
-
ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!
కవితకేదీ కాదు అనర్హం అన్న చందాన మెటల్, ప్లాస్టిక్, పాత గాడ్జెట్స్ ఏదైనా ఆయన చేతిలో పెట్టారంటే అందమైన శిల్పంగా మారాల్సిందే. అరవైఏళ్ల వయసులో చిన్నప్పటి హాబీని కెరీర్‌గా మలుచుకున్నాడు విశ్వనాథ్ మల్లాబ్డి దావంగిరె. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్‌గా మార్చి అబ్బురపరుస్తున్నాడు ఈ పెద్దాయన. బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి డీఎమ్ శంభు ప్రముఖ శిల్పి ఇంకా పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని శంభు కలలు కనేవారు. చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను సరికొత్తగా మార్చడమంటే విశ్వనాథ్‌కు ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూరై్తన తరువాత తరువాత మీడియాలోకంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా చేరాడు. అలా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్ ఒక్కోమెట్టు ఎదుగుతూ విప్రోలో చేరాడు. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయం, వారాంతాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకోఆర్ట్గా ఎలా మార్చాలని పరిశోధిస్తుండేవాడు. రకరకాల ప్రయోగాల తరువాత.. గాడ్జెట్స్ వ్యర్థాలను ఉపయోగించి చిన్నచిన్న జంతువులు తయారు చేశాడు. అవి ముద్దుగా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో తన ఇకో ఆర్ట్‌ను పెంచుకుంటూ పోయాడు. ఫ్యాషన్ జ్యూవెలరీ నుంచి అందమైన శిల్పాలు, రోబోలదాకా అన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నాడు. ఏరికోరి ఎంచుకుని... ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ప్రాణాంతకంగా మారాయని తెలుసుకుని ఇకో ఆర్ట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఈ వ్యర్థాలను కొనుక్కునేవాడు. అన్నింటిని గంపగుత్తగా కొనకుండా కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్టాప్స్, డేటా కార్డులు, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెట్–టాప్బాక్స్లు, ల్యాండ్‌లైన్, కార్డ్‌లెస్ ఫోన్లు, గ్లూకో మీటర్లను ఏరికోరి ఎంచుకుని తీసుకునేవాడు. వీటిలో కూడా రాగి, బంగారం, రంగురంగుల వైర్లు, కీబోర్డులను ప్రత్యేకంగా సేకరించి రకరకాల బొమ్మల రూపకల్పనకు ఉపయోగిస్తున్నాడు. ఆరు అడుగుల అమ్మాయి రూపంతో విగ్రహం, ప్రముఖ వ్యాపారవేత్త అజీం ప్రేమ్‌జీ ఫోటో, ఇకో జ్యూవెలరీ, కీబోర్డు కామధేనువు వంటి బొమ్మలు ఐదు వందలకు పైగానే తయారు చేశాడు. హాబీని కెరీర్‌గా... విశ్వనాథ్ తయారు చేసిన బొమ్మలు ఆకర్షణీయంగా అందంగా ఆకట్టుకుంటుండడంతో విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయిన విశ్వనాథ్.. తొలినాళ్లల్లో హాబీగా ఉన్న ఇకోఆర్ట్ను పూర్తి సమయం కేటాయిస్తూ ఇకోఆర్ట్ వస్తువులు విక్రయిస్తూ సరికొత్త కెరీర్‌ను సృష్టించుకున్నాడు. ఇకోఆర్ట్ వస్తువులు కొనే కస్టమర్లు ఢిల్లీలోనేగాక, యూరప్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో ఇకో ఆర్ట్ కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. దేశంలోనేగాక విదేశాల్లో తన ఇకో ఆర్ట్‌ను ప్రదర్శిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు. వందల కేజీలపైనే... కీబోర్డు కీల నుంచి గోడగడియారంలో భాగాల వరకు అన్నీ సేకరించి ఇకో ఆర్ట్ రూపొందిస్తోన్న విశ్వనాథ్ ఇప్పటిదాకా రెండువందల కేజీల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్స్‌గా మార్చాడు. అయితే ఈ ఇకో ఆర్ట్ అంత సులభం కాదని విశ్వనాథ్ చెబుతున్నాడు. ‘‘ఈ – వ్యర్థాల నుంచి ఆర్ట్ కావాల్సిన భాగాలను సేకరించి వాటికి ఆకారం, రంగు వేసి తుదిమెరుగులు దిద్దడానికి చాలా సమయం పడుతుంది. జ్యూవెలరీ తయారు చేయడానికి రెండు మూడు నిమిషాలు పడితే, శిల్పాలు తయారు చేయడానికి వారాలు, నెలలు పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇటు కస్టమర్ల మనసు దోచుకోవడంతోపాటూ, పర్యావరణానికి హానీ కలగకుండా ఈ ఇకోఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది. ముందు ముందు మరిన్ని కళారూపాలు తీసుకురానున్నాను’’అని విశ్వనాథ్ చెబుతున్నాడు. (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
పాడైపోయిన మొబైల్ ఫోన్లు,ల్యాప్‌ట్యాప్‌లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ భారత్‌లో తొలిసారిగా ‘మిషన్ ఈ–వేస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ–వేస్ట్‌ను సేకరించి, రీసైక్లింగ్ చేపడతారు. ఇందుకోసం కంపెనీ స్టోర్లలో బిన్స్‌ను ఏర్పాటు చేస్తామని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. పాడైన, వినియోగించని మొబైల్ ఫోన్లు, చార్జర్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను సెలెక్ట్ స్టోర్లకు తీసుకువస్తే చాలు. రూ.10,000 వరకు డిస్కౌంట్ కూపన్ అందుకోవచ్చు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఈ–వేస్ట్ నిర్వహణను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. మొత్తం పరిశ్రమకు మిషన్ ఈ–వేస్ట్ ప్రేరణగా నిలుస్తుందని సెలెక్ట్ ఈడీ మురళి రేతినేని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
ఈ–వ్యర్థాలతో అనర్థాలే! మూడో స్థానంలో భారత్.. సవాల్‌గా నిర్వహణ
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రానిక్ (ఈ)–వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. ఏటా టీవీలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల కొనుగోలు 35 శాతం పెరుగుతోంది. మరోవైపు పాత వస్తువుల రూపంలో 33 శాతం వ్యర్థాలుగా మారిపోతున్నాయి. 2021–22లో 17,86,396.65 టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3,93,007.26 టన్నులను ((22 శాతం) మాత్రమే సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ (పునర్వినియోగంలోకి తేవడం) చేశారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఈ–వ్యర్థాలు దేశంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ–వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇది రుతుపవనాల గమనాన్ని దెబ్బతీయడానికి దారితీస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్‌తోపాటు నికెల్, లెడ్, క్రోమియం, అల్యూమినియం వంటి విషతుల్యమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు చర్మ, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు ప్రాణాంతక క్యాన్సర్ల బారినపడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు.. ఈ–వ్యర్థాలను సేకరించడం, శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏటా 22 శాతం ఈ–వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ–వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి 2016లో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2029 నాటికి ఏటా 32.30 లక్షల టన్నుల వ్యర్థాలు.. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థాలను వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2028–29 నాటికి దేశంలో ఈ–వ్యర్థాలు ఏటా 32.30 లక్షల టన్నులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. 2021–22లో 17.86 లక్షల టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడడం గమనార్హం. ఈ–వ్యర్థాలను అత్యధికంగా వెలువరించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నాయి. ఈ–వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం, రీసైక్లింగ్ చేయడం కోసం 2016లో కేంద్రం చట్టం తెచ్చినా.. అమలులో అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. -
ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..!
భూతాపం సెగలకు అంతర్జాతీయ వేదికలు వేడెక్కుతున్నాయి. శిలాజ ఇంధనాలకు వీలైనంత తొందరగా తిలోదకలాచ్చేసి, శరవేగంగా ఎలక్ట్రిక్ శకాన్ని ప్రారంభించడానికి ప్రపంచ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. భూతాపం దూకుడును కట్టడి చేయడానికి కలసికట్టుగా నడుంబిగిస్తున్నామని బల్లలుగుద్ది మరీ బలంగా చెబుతున్నారు. ఇవన్నీ సరే, టీవీలూ మొబైల్ ఫోన్లూ ఇంటింటి వస్తువులుగా మారిన హైటెక్కుటమారాల యుగంలో రోజూ పోగుపడుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు– అదేనండీ– ఈ–చెత్త! దీనికి సరైన విరుగుడు ఎప్పటికి దొరుకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. భూతాపం పెరుగుదలలో ఈ–చెత్త ఇతోధిక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఎక్కడెక్కడ ఎంతెంతగా తయారవుతోందో, ఎక్కడెక్కడ ఎంతెంతగా పోగుపడుతోందో, ఇది పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ స్థాయిలో చేటు కలిగిస్తోందో ఆ కథా కమామిషూ తెలుసుకుందాం. తాజా అంచనాల ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పోగుపడిన ఈ–చెత్త 53.6 మిలియన్ టన్నులు. ఏడాదికేడాది ఈ–చెత్త కొండలా పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అంటే, ప్రపంచంలో ప్రతి మనిషి సగటున దాదాపు ఏడు కిలోల ఈ–చెత్త పోగు చేస్తున్నట్లు లెక్క! అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాని స్థితికి చేరుకున్నాక, ఇవి తుక్కు తుక్కుగా చెత్త చెత్తగా మిగులుతున్నాయి. ఈ–చెత్త విలువలేనిదేమీ కాదు, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.75 వేల కోట్లు) విలువ చేసే ప్లాటినమ్, బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఈ–చెత్తతో పాటే డంపింగ్ యార్డులకు చేరుతున్నాయి. మన భారత్ నుంచి ఏటా 3 మిలియన్ టన్నులకు పైగా ఈ–చెత్త పోగవుతోంది. ఎడాపెడా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడి పడేసే అభివృద్ధి చెందిన దేశాలు, తమ దేశాల్లో పోగుపడిన ఈ–చెత్తను పారబోయడానికి నిరుపేద దేశాలను డంపింగ్ యార్డుల్లా వాడుకుంటున్నాయి. మరో నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఏటా 33 శాతం మేరకు పెరుగుతుందని, ఈ పరిమాణం ఎనిమిది గ్రేట్ ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే ఎక్కువని ఐక్యరాజ్య సమితి ‘స్టెప్ ఇనీషియేటివ్’ (సాల్వింగ్ ఈ–వేస్ట్ ప్రాబ్లెమ్ ఇనీషియేటివ్) హెచ్చరిస్తోందంటే, ఈ–చెత్త సమస్య ప్రపంచానికి ఏ స్థాయిలో ముప్పుగా పరిణమిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త సమస్యగా పరిణమించిన ఈ–చెత్త సమస్య పరిష్కారం కోసమే ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం 2007లో ‘స్టెప్ ఇనీషియేటివ్’ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ట్యాబ్‌లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు తదితర వస్తువులు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలు ప్రతిఏటా పెద్దసంఖ్యలో తయారవుతున్నాయి. కొత్తగా ఎన్ని తయారవుతున్నాయో, అందుకు తగ్గట్లే పాతబడినవి, పనికిరాకుండా పోయినవి చెత్తగుట్టలకు చేరుకుంటున్నాయి. ఇళ్లలో పేరుకునే రోజువారీ తడిచెత్త, పొడిచెత్తలతో పోల్చి చూస్తే, ఈ–చెత్త పర్యావరణానికి మరింతగా హాని కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్లాటినమ్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు, సీసం, తగరం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, లిథియం, బేరియం వంటి ప్రమాదకరమైన భారలోహాలు కూడా ఉంటాయి. ఒక సాదాసీదా మొబైల్ లేదా లాప్టాప్ సర్క్యూట్బోర్డులో పదహారు వేర్వేరు లోహాలు ఉంటాయి. ఇవి నేలలోకి చేరుకుంటే, భూసారం క్షీణిస్తుంది. జలాశయాల్లోకి చేరుకుంటే, తాగునీటి కాలుష్యం తప్పదు. చివరకు సముద్రాల్లోకి చేరినా, సముద్రాల్లో జీవించే జలచరాల మనుగడకు ముప్పు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం ప్లాస్టిక్. చెత్తకుప్పల్లోకి చేరిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించేందుకు వీటిని ఇష్టానుసారం తగులబెడుతుండటం మామూలే. ఫలితంగా ఈ–చెత్త వల్ల వాయుకాలుష్యం కూడా ఏర్పడుతోంది. ‘సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎప్పటికప్పుడు అధునాతనమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా, కొనుగోలు చేసిన కొద్దికాలానికే మొబైల్ ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు వంటివి మూలపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల జీవితకాలం బొత్తిగా తక్కువవుతోంది. ఫలితంగా ఈ–చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది’ అని స్టెప్ ఇనీషియేటివ్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ర్యూడిగర్ క్వెహర్ చెబుతున్నారు. ‘ఈ–చెత్త వల్ల కలిగే అనర్థాలను కొన్నిదేశాలు మాత్రమే అర్థం చేసుకుని, చర్యలు ప్రారంభించాయి. చాలా దేశాల్లో ఏటా పోగుపడే ఈ–చెత్తపై కచ్చితమైన లెక్కలు సేకరించే పరిస్థితి కూడా లేదు’ అని యూరోపియన్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ దేశాల నుంచి ఏటా దాదాపు 1.3 మిలియన్ టన్నుల ఈ–చెత్త వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఓడల్లో తరలుతోందని కూడా ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ–చెత్తకు డంపింగ్ యార్డులుగా మారిన ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఏటా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు ఇరవై శాతానికి పైగా మరణాలు ఈ–చెత్త కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవేనని, ఇక దీని ఫలితంగా రకరకాల వ్యాధులకు లోనవుతున్న వారి సంఖ్య ఊహించుకోవాల్సిందేనని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ–చెత్తలో మనది మూడోస్థానం మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 మిలియన్ టన్నుల ఈ–చెత్త పేరుకోవచ్చని ‘స్టెప్ ఇనీషియేటివ్’ అంచనా. ఈ–చెత్త పరిమాణంలో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 10.1 టన్నులు, అమెరికాలో 6.9 మిలియన్ టన్నులు, భారత్‌లో 3.2 మిలియన్ టన్నులు ఈ–చెత్త పోగుపడినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ దేశంలో పోగుపడిన ఈ–చెత్తను తమ దేశంలోనే రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేయకుండా, నిరుపేద దేశాలకు తరలిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, నిరుపేద ఆఫ్రికా దేశమైన ఘనాలో అగ్రరాజ్యాలు పోగేస్తున్న ఈ–చెత్తపై 2018లో ‘వెల్కమ్ టు సోడోమ్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. విషపూరితమైన ఈ–చెత్తకుప్పల మధ్యే అక్కడి పిల్లలు కాలం గడుపుతున్న దృశ్యాలు కలచివేస్తాయి. ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యే కార్మికులు తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, ఛాతీనొప్పి, నీరసం, మగత, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతున్నారు. ఈ–చెత్త కుప్పల మధ్యే ఎక్కువకాలం గడిపేవారిలో డీఎన్ఏ సైతం దెబ్బతింటున్నట్లు వైద్యపరిశోధకులు గుర్తించారు. ఏటా పోగవుతున్న ఈ–చెత్తను రీసైక్లింగ్ కోసం సేకరించే శ్రద్ధ కూడా మన దేశంలో బొత్తిగా కొరవడుతోంది. ఈ ఏడాది విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, 2018–19లో పోగైన ఈ–చెత్తలో 3.5 శాతం, 2019–20లో 10 శాతం మాత్రమే రీసైక్లింగ్ కోసం సేకరించారు. మిగిలిన ఈ–చెత్తంతా పర్యావరణంలోకే చేరుతోంది. మన దేశంలో స్థానిక సంస్థలు ఈ–చెత్త సేకరణ జరుపుతున్న దాఖలాలు దాదాపు కనిపించవు. దేశవ్యాప్తంగా కేవలం 312 అధికారిక కేంద్రాలు మాత్రమే ఈ–చెత్త సేకరణ అరకొరగా జరుపుతున్నాయి. ఇవికాకుండా, ఢిల్లీలోని సీలమ్పూర్, ముంబైలోని ధారవి, మీరట్, మొరాదాబాద్ వంటి చోట్ల అనధికారిక ఈ–చెత్త రీసైక్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇలాంటి అనధికారిక ఈ–చెత్త సేకర్తలను స్థానికంగా ‘కబాడీవాలా’లుగా పిలుచుకుంటారు. ఎలాంటి శిక్షణ లేని కార్మికులు, కనీసమైన వసతులు, జాగ్రత్తలు సైతం లేని ఈ కర్మాగారాల్లో ఈ–చెత్త రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి ఒరిగే మేలు కంటే జరిగే కీడే ఎక్కువగా ఉంటోంది. సేకరించిన ఈ–చెత్తకు వీరు చేసే రీసైక్లింగ్ అంతా, పాడైన పరికరాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించడమే! ఈ పనికోసం వారు సైనైడ్ కలిసిన యాసిడ్లను వాడుతుంటారు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరితమైన పొగవల్ల ఆ కేంద్రాల్లో పనిచేసే కార్మికులతో పాటు చుట్టుపక్కల ప్రజలకు కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి ద్వారా వెలువడే నీరు కొంత వీధుల్లోకి, కొంత మురుగు కాలువల్లోకి, వాటి ద్వారా సమీపంలోని జలాశయాల్లోకి, నదుల్లోకి చేరుతుండటంతో నీటి కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! చట్టాలూ నిబంధనలూ ఉన్నా... మన దేశంలో కాలుష్య నివారణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1974లో జల చట్టం కింద కాలుష్య నియంత్రణ మండలిని జాతీయస్థాయి సంస్థగా ఏర్పాటు చేసింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటైన కాలానికి ఈ–చెత్త బెడద అంతగా ఉండేది కాదు. కంప్యూటర్ల శకం మొదలైన తర్వాత ఈ–చెత్త తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇది ప్రపంచ సమస్యగా మారిన నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ వేదికల్లో జరిగిన చర్చల్లో దీనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి వివిధ దేశాలు సిద్ధపడ్డాయి. ఇందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్’ను 2016లో రూపొందించగా, ఈ నిబంధనలు 2017 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఈ–చెత్త రీసైక్లింగ్ చేయాలి. ఈ నిబంధనలు అమలులోకి వచ్చినా, దేశంలో అనుమతి పొందిన రీసైక్లింగ్ కేంద్రాల కంటే, కనీస సౌకర్యాలు లేని అనధికారిక రీసైక్లింగ్ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా పేరుకుపోతున్న ఈ–చెత్తతో పోల్చి చూసుకుంటే, రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతున్నది చాలా తక్కువ. మిగిలినదంతా ఖాళీస్థలాల్లోకి, నదులు, సముద్రాల్లోకి చేరుతూ పర్యావరణానికీ, ప్రజల ఆరోగ్యానికీ భారీ స్థాయిలో చేటు కలిగిస్తోంది. ఇవీ ఆరోగ్య నష్టాలు ఈ–చెత్త పర్యావరణంలోకి చేరిన పరిసరాల్లో జీవించే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ–చెత్త కారణంగా గాలి, నీరు, నేల కాలుష్యానికి లోనవుతాయి. ఈ–చెత్త వల్ల ఏర్పడే కాలుష్యానికి బహిర్గతమైన వారిలో ఎదుగుదల లోపాలు, బుద్ధిమాంద్యం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, వంధ్యత్వం, హార్మోన్ల అసమతుల్యతలు, కిడ్నీ, లివర్, గుండె వంటి కీలక అవయవాల పనితీరు దెబ్బతినడం, డీఎన్ఏ మార్పులు, కండరాల బలహీనత, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు అకాల మరణాలకు కారణమవుతాయి. ప్రమాద ఘంటికలపై ప్రపంచం ఆందోళన భూతాపం పెరుగుదలపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టే లక్ష్యంతో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ దేశాల సమావేశాలను (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–సీఓపీ–26) నిర్వహించింది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన సమావేశంలో సైతం పెరుగుతున్న భూతాపం కారణంగా పర్యావరణంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే మోగుతున్న ఈ ప్రమాద ఘంటికలను పట్టించుకోకుంటే, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాయి. భూతాపాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రపంచ దేశాలు కూలంకషంగా చర్చలు సాగించి, పలు ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయి. 2030 నాటికి కనీసం 30 శాతం నేలను, నీటిని పరిరక్షించుకోవాలని, ఈ మేరకు నేలపైనా, నీటిలోనూ జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ గడువులోగా దేశాలన్నీ అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని, 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలకు కారణమయ్యే శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా నడుం బిగించుకోవాలని తీర్మానించుకున్నాయి. గ్లాస్గోలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పాశ్చాత్యదేశాల్లో ఒత్తిళ్లకు భారత్ తల ఒగ్గబోదని స్పష్టం చేస్తూనే, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను అరికట్టడానికి సత్వర చర్యలను ముమ్మరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని అరికట్టడంపైనే దృష్టిసారించారు. పర్యావరణానికి చేటు కలిగిస్తున్న ఈ–చెత్త అంశానికి సీఓపీ–26 అజెండాలో చోటివ్వకపోవడం శోచనీయం. పర్యావరణ మార్పులపై చేపట్టే అంతర్జాతీయ సమావేశాల్లో ఈ–చెత్త అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, భూతాపాన్ని తగ్గించే లక్ష్యాలను చేరుకోవడం దుస్సాధ్యం. ఈ–చెత్తలో చేరుతున్నవివే! ఈ–చెత్తలో చేరుతున్న వస్తువులను యూరోపియన్ యూనియన్ పది రకాలుగా విభజించింది. అవి: ►భారీ గృహపరికరాలు (ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటివి) ►చిన్న గృహపరికరాలు (ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు, డిజిటల్ వాచీలు వంటివి) ►ఐటీ–టెలికం పరికరాలు (లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు తదితరమైనవి) ►వినియోగదారుల వస్తువులు (డిజిటల్ కెమెరాలు, పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్ వంటివి) ►లైటింగ్ పరికరాలు (ట్యూబ్‌లైట్లు, ఎల్ఈడీ లైట్లు, వాటి హోల్డర్లు వంటివి) ►ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్ పనిముట్లు ►ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు ►వైద్య పరికరాలు (బీపీ యంత్రాలు, సుగర్ యంత్రాలు వంటివి) ►మానిటరింగ్ పరికరాలు (సీసీ కెమెరాలు వంటివి) ►ఆటోమేటిక్ డిస్పెన్సర్స్ (వెండింగ్ మెషిన్లు, వెయింగ్ మెషిన్లు తదితరమైనవి) కబాడీవాలాల కథ ‘కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇవ్వడం ఏమీ ఎరుగని పసిపిల్లవాడి చేతికి కత్తిని ఇవ్వడం ఒకటే! కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇస్తే తమకు తాము ప్రమాదంలో చిక్కుకోవడమే కాకుండా, ఇతరులనూ ప్రమాదంలోకి నెట్టేస్తారు’ అని గోవాకు చెందిన ఈ–చెత్త సేకరణ సంస్థ ‘గ్రూప్ టెన్ప్లస్’ వ్యవస్థాపకుడు ఆష్లే డెలానే వ్యాఖ్యానించారు. ‘గ్రూప్ టెన్ప్లస్’ ఈ–చెత్త సేకరణ కోసం ప్రారంభించిన లైసెన్స్డ్ సంస్థ. కబాడీవాలాలు నడిపే కేంద్రాల్లో ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను మాత్రమే వేరు చేసి, మిగిలిన వాటిని యథేచ్ఛగా పర్యావరణంలోకి వదిలేస్తుంటారని, దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని డెలానే చెబుతున్నారు. ఉదాహరణకు ట్యూబ్‌లైట్, సీఎఫ్ఎల్ బల్బులు, కాలంచెల్లిన బ్యాటరీలు వంటివాటిని మట్టిలో పడేస్తే, వాటిలోని పాదరసం, సీసం వంటి ప్రమాదకర భారలోహాలు మట్టిలోకి చేరి, వాటి ఫలితంగా ఆ ప్రదేశంలోని మట్టి ఎందుకూ పనికిరానంతగా నాశనమవుతుందని, అక్కడ భూసారం శాశ్వతంగా దెబ్బతింటుందని ఆయన వివరించారు. ఇష్టానుసారంగా ఈ–చెత్త వ్యవసాయ భూముల్లోకి చేరితే, భవిష్యత్తులో ప్రజల ఆహారభద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. 2009 నుంచి మొదలైన క్రిప్టోకరెన్సీ ఇంతింతై వటూడింతై అన్న చందంగా పలు క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతూనే ఉంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడు బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఆయా క్రిప్టోకరెన్నీలు పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను, జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కచ్చితంగా వాడాలి. కొన్ని రోజుల క్రితం క్రిప్టోకరెన్సీ మైనింగ్ కంప్యూటర్లలో వాడే గ్రాఫిక్స్ కార్డు ధరల్లో మార్పులు వచ్చేలా చేశాయి. అత్యంత బలమైన కంప్యూటర్లతో సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడంపై విస్తుపోయే విషయాలను ఒక నివేదిక వెల్లడించింది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! పొంచి ఉన్న పెనుముప్పు...! బిట్‌కాయిన్ ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఒక సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రనిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బిట్‌కాయిన్ మైనింగ్ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలు మాత్రమే. డచ్ సెంట్రల్ బ్యాంక్ ఎకనామిస్ట్, రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ మాట్లాడుతూ... ఐఫోన్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పోలీస్తే బిట్‌కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే ఎలక్ట్రినిక్ ఉద్గారాల సంఖ్య చాలా తక్కువ. బిట్‌కాయిన్ మైనింగ్ ద్వారా గడిచిన పన్నెండు నెలల్లో ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల మొత్తం 30,700 టన్నులు. ఈ మొత్తం నెదర్లాండ్స్ లాంటి దేశాల ఎలక్ట్రనిక్ వ్యర్థాలకు సమానమని తెలియజేశారు. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, స్టోరేజ్ విషయంలో క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేయడం కచ్చితం. దీంతో విపరీతంగా కంప్యూటర్ల వాడకం పెరగడంతో ఎలక్ట్రానిక్స్ ఉద్గారాలు అనులోమనుపాతంలో పెరుగుతాయని రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ ఉద్గారాలు వెలువడ్డాయి. చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! -
రూ.4,27,500 కోట్లు.. బూడిదపాలు..!!
సాక్షి, అమరావతి: గతేడాది ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్)ను కాల్చివేయడం వల్ల రూ.4,27,500 కోట్లు బూడిద పాలయ్యాయా? ప్రపంచంలో ఈ-వేస్ట్ ఉత్పత్తి 2030లో 69.68 మిలియన్ టన్నులకు చేరుతుందా? ఈ-వేస్ట్‌ను పునర్వి నియోగం చేయకుంటే.. రూ.లక్షలాది కోట్లు బూడిదపాలు కావడమే కాదు.. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం(యూఎన్ఎన్) నివేదిక. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యుత్ బల్బులు, ట్యూబ్లైట్ల నుంచి కంప్యూటర్ల వరకూ భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగిస్తున్నారు. కాలం చెల్లించిన ఎలక్ట్రానిక్ వస్తువులను వ్యర్థాల రూపంలో పడేస్తున్నారు. ఈ ఈ-వేస్ట్‌పై యూఎన్ఎన్ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ.. ప్రపంచంలో 2014లో 42.35 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తయింది. 2019 నాటికి ఈ-వేస్ట్ ఉత్పత్తి 53.6 మిలియన్ టన్నులకు చేరుకుంది. అంటే.. ఐదేళ్లలో ఈ-వేస్ట్ ఉత్పత్తి 21% పెరిగింది. ఈ లెక్కన 2030 నాటికి ఈ-వేస్ట్ ఉత్పత్తి 38% పెరిగి 69.68 మిలియన్ టన్నులకు చేరుతుంది. 2019లో ఆసియా దేశాలు అత్యధికంగా 24.9 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. ఇందులో చైనా మొదటి, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. అమెరికా ఖండపు దేశాలు 13.1 మిలియన్ టన్నులు, ఐరోపా దేశాలు 12 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో.. అత్యంత విషపూరితమైన పాదరసం వంటి పదార్థాలతోపాటు బంగారం, వెండి, రాగి వంటి లోహాలను వినియోగిస్తారు. ఈ-వేస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల వాటిలోని విషపూరితమైన పదార్థాలు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. 2019లో ఉత్పత్తయిన 53.6 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌లో 18% అంటే 9.65 మిలియన్ టన్నులను మాత్రమే రీ-సైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తెచ్చారు. మిగిలిన వాటిని కాల్చివేశారు. దీని వల్ల ఆ వ్యర్థాల్లోని బంగారం, వెండి, రాగి వంటి 57 బిలియన్ డాలర్ల విలువైన లోహాలు బూడిదయ్యాయి. ఈ-వేస్ట్‌ను రీ-సైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునేలా జాతీయ ఈ-వేస్ట్ విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలోభారత్‌తోపాటు 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్ విధానాన్ని రూపొందించుకున్నాయి. కానీ.. కేవలం 18% మాత్రమే ఈ-సైక్లింగ్ చేస్తున్నాయి. దేశంలో ఈ-వేస్ట్‌ను రీ-సైక్లింగ్ చేసే కేంద్రాలు 315 ఉన్నాయి. వాటిలో ఏడాదికి కేవలం 800 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయవచ్చు. కానీ.. దేశంలో ఏడాదికి ఏడు మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తవుతుండటం గమనార్హం. ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించకపోతే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రూ.లక్షలాది కోట్ల విలువైన ప్రజాధనం వృథా అవుతుంది. పర్యావరణానికి విఘాతం కలిగించడంతోపాటు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. -
ప్లాస్టిక్ చెత్తను పాతరేద్దాం..
‘ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదు.. తరచి చూచిన.. ప్లాస్టిక్ ఎందెందు వెదకినా అందందే గలదు’ ఇదీ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ పరిస్థితి. మనిషికి ప్రియమైన శత్రువుగా మారిపోయిన ఈ ప్లాస్టిక్‌ను వదిలించుకునేందుకు ఇప్పుడిప్పుడే సీరియస్‌గా ప్రయత్నాలు మొదలయ్యాయి. మన ప్రధాని మోదీ సైతం తన ‘మన్‌కీ బాత్’లో ప్లాస్టిక్ చెత్తను వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే మనం ఏం చేయొచ్చు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న మంచి పద్ధతులేంటి..? సగం ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ జర్మనీ, ఆస్ట్రియా, కొరియాతో పాటు బ్రిటన్‌లోని వేల్స్లో ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ అత్యంత సమర్థంగా జరుగుతోంది. వాడి పడేసిన ప్లాస్టిక్‌లో కనీసం సగం మొత్తాన్ని మళ్లీ వాడుకునేలా చేస్తున్నారు. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వ డంతో పాటు.. నిధులు, మౌలిక సదు పాయాలు కల్పించడం ఇం దుకు కారణం. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు సంబంధించి మున్సిపాలిటీలు, పంచాయతీలు సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడంతో పాటు అమలు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ–వేస్ట్ పనిపడతారు.. వాడేసిన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల చెత్తను వదిలించుకునే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తొలిదేశంగా కొలంబియా నిలిచింది. రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ విధానం నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బాధ్యతాయుతంగా వాడటంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించడం.. దిగుమతి చేసుకున్న లేదా దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను సక్రమంగా రీసైకిల్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం.. జాతీయ స్థాయిలో రీసైక్లింగ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం.. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చేస్తోంది. కొలంబియాలో ఏటా దాదాపు 2.5 లక్షల టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. చెత్త సేకరణకు ఆరోగ్య బీమా.. ఇండోనేసియాలో ప్లాస్టిక్ చెత్తను సేకరించే వారికి ‘గార్బేజ్ క్లినికల్ ఇన్సూరెన్స్’కింద ఆరోగ్య సేవలు అందుతాయి. గమాన్ అల్బిసెయిద్ నేతృత్వంలోని ‘ఇండోనేసియా మెడికా’అనే కంపెనీ ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 600 మంది ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రీసైకిల్ చేసేందుకు అనువైన పదార్థాలను సేకరించి తీసుకురావడం.. ప్రతిఫలంగా మలాంగ్, జకార్తాల్లోని మూడు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పొందడం ఈ పథకం ప్రత్యేకత. సింగపూర్ ఆదర్శం.. మొత్తం 40 లక్షల మంది జనాభా మాత్రమే ఉండే సింగపూర్.. చెత్త నిర్వహణ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న విషయం తెలి సిందే. మండించేందుకు అవకాశమున్న చెత్తను ఇంధన ఉత్పత్తికి వాడు కోవడం.. తడిచెత్తను క్రమపద్ధతిలో ల్యాండ్‌ఫిల్స్‌లో నింపి అక్కడ పచ్చదనాన్ని పెంచే ప్రయ త్నం చేయడం సింగపూర్ మోడల్లో చెప్పుకోదగ్గ విశేషాలు. భవన నిర్మాణ వ్యర్థాలను అత్యంత సమర్థంగా తగ్గించుకునే విషయంలో సింగపూర్ మిగిలిన దేశాల కంటే ఎంతో ముం దుంది. 2005 నాటికే ఈ చిన్న దేశం 94 శాతం భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేసేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. పాల ప్యాకెట్లలో వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఒడిశాలో ఇటీవలే పాల ఏటీఎంలు మొదలయ్యాయి. క్యాన్లు, పాత్రలు తీసుకెళ్లి ఈ ఏటీఎంల నుంచి పాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. చెత్త సేకరించే వారు తెచ్చే ప్లాస్టిక్‌కు బదులు భోజనం పెట్టే పథకం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ పట్టణంలో అమలవుతోంది. కిలో ప్లాస్టిక్ చెత్తకు ఒక పూట భోజనం అందిస్తున్నారు. అరకిలో చెత్తతో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి.. మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వెదురుబొంగులు వాడటం మొదలుపెట్టారు. బెంగళూరులోని 6 హోటళ్లలో ఆహారం పార్సిల్ చేసేందుకు ప్లాస్టిక్ వాడట్లేదు. వినియోగదారులే పాత్రలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేరళలోని కొంతమంది జాలర్లు వేట నుంచి తిరిగొచ్చేటప్పుడు చేపలతో పాటు సముద్రంలోని ప్లాస్టిక్ చెత్తను ఒడ్డుకు చేరుస్తున్నారు. తమిళనాడులో కొంతమంది ఔత్సాహికులు ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు బొప్పాయి ఆకు కాడలను స్ట్రాలుగా వాడటం మొదలుపెట్టారు. జొన్న చొప్పతో ప్లాస్టిక్‌ను తయారు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం కొత్త పద్ధతిని అభివృద్ధి చేస్తోంది. గొంగడి పురుగులు ప్లాస్టిక్ చెత్తను ఇష్టంగా తిని జీర్ణం చేసుకోగలవని పుణేలోని డాక్టర్ రాహుల్ మూడేళ్ల కిందటే గుర్తించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను కొన్ని రకాల గొంగడి పురుగులు తినేయడంతో పాటు వాటి విసర్జితాలు ఎరువుగానూ ఉపయోగపడతాయని గుర్తించారు. -
ఈ–వేస్ట్ విస్ఫోటనం!
సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతోన్న ఆధునిక ఐటీ–హార్డ్‌వేర్ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్, గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు గ్రేటర్ నగరాన్ని ఈ–వేస్ట్‌కు అడ్డాగా మారుస్తున్నాయి. మహానగరం పరిధిలో కంప్యూటర్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విరివిగా వినియోగిస్తున్న ఒక్కో ఇంటి నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ–వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నట్లు ఈపీటీఆర్ఐ సర్వే అంచనా వేసింది. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో దేశంలో ముంబై తొలిస్థానంలో నిలవగా ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. మన గ్రేటర్ నగరం ఈ మెట్రో నగరాల తర్వాత ఐదోస్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగు పడుతుండగా..మన మహానగరంలో ఏటా సుమారు 40 వేల టన్నుల ఈ–వేస్ట్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కాగా 2009లో నగరంలో కేవలం 3262 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలే ఉత్పన్నమయ్యేవి. కానీ ప్రస్తుతం నగరంలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నులు పోగవుతున్నాయి. ఇందులో సుమారు 75 శాతం వరకు గృహాల నుంచే వెలువడుతున్నట్లు తేలింది. మరో ఐదేళ్లలో నగరంలో ఈ–వ్యర్థాలు లక్ష టన్నుల మార్కును చేరుకుంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించే రీతిలో సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో ఇవి పర్యావరణంలో కలిసి అనర్థాలు తలెత్తుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రేటర్లో ఏటా 40 వేల టన్నుల ఈ–వ్యర్థాలు గ్రేటర్లో ఈ–వేస్ట్ వ్యర్థాలపై గచ్చిబౌలిలోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)గతంలో నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి. ఏటా టెలివిజన్స్, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏడాదికి 12 వేల టన్నుల వ్యర్ధాలు విడుదలవున్నట్లుగా తేలింది. ఇక టెలిఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, కూలర్లు...ఇలాంటి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వ్యర్థాలను కలుపుకుంటే ఏడాదికి మొత్తంగా సుమారు 28 వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ–వ్యర్థాలు లక్ష టన్నులకు చేరుకునే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి. పనిచేయని సేకరణ కేంద్రాలు..? ఈ–వ్యర్థాల శుద్ధికి ప్రపంచ బ్యాంకు సౌజన్యంతో మన దేశవ్యాప్తంగా క్లీన్ ఈ–ఇన్షియేటివ్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రేటర్ నగరంలో గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్, అట్టెరో ఎలక్ట్రానిక్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కూకట్పల్లి, ఖైరతాబాద్, హఫీజ్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పేరుకే ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాలను స్థాపించారు. అయితే ఈ కేంద్రాలకు ఎలా వ్యర్థాలను తరలించాలన్న అంశంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించే విషయంలో పీసీబీ విఫలమౌతోంది. ఈ కేంద్రాల పనితీరు సైతం ప్రశ్నార్థకమౌతోంది. ఈ–వేస్ట్‌ను పునఃశుద్ధి(రీసైక్లింగ్) చేయని కారణంగా తలెత్తే సమస్యలివీ.. ♦ క్యాథోడ్రేట్యూబ్లు:టీవీల్లో వినియోగించే ఈ ట్యూబుల్లో లెడ్, బేరియం ఇతర భారలోహాలు, నీటిని విషయంగా మార్చే సల్ఫర్ భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. ♦ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు: వీటిని వృథాగా పడవేయడంతో బ్రోమిన్, బెరీలియం, క్యాడ్మియం, మెర్క్యూరీ వంటి పదార్థాలు భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. అంతేకాదు వీటి తయారీలో విరివిగా వినియోగించే బంగారం, రాగి, వెండి, ప్లాటినం, పెల్లాడియం, జింక్, నికెల్, ఇనుము వంటి లోహాలను తిరిగి సంగ్రహించకుండా(రీసైకిల్ లేకుండా)వదిలివేయడంతో ఆయా సహజ వనరులపై వత్తిడి పెరుగుతోంది. ♦ ఈ–చిప్స్, బంగారు పూత విడిభాగాలు: హైడ్రోకార్భన్లు, భారలోహాలు జలాశయాల్లోకి చేరి అందులోని చేపలు, ఇతర వక్షఫ్లవకాలను నాశనం చేస్తున్నాయి. భూగర్భజలాలు సైతం విషతుల్యమౌతున్నాయి. ♦ ప్రింటర్లు, కీబోర్డులు: హైడ్రోకార్భన్లు, భారలోహాలు భూమి, నీరు, భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయి. ♦ కంప్యూటర్ వైర్లు: వీటిని మండించడం వల్ల పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్భన్లు పర్యావరణంలోకి వెలువడి భూమి,నీరు,గాలిని విషతుల్యంగా మారుస్తున్నాయి. ♦ కంప్యూటర్ విడిభాగాలు,రబ్బరు,ప్లాస్టిక్ వస్తువులు: పాలీ ఆరోమాటిక్ హైడ్రో కార్భన్లు వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ♦ టోనర్ కాట్రిడ్జులు: వీటిని దహనం చేయడం వల్ల పీల్చే గాలి కలుషితమౌతోంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ విడిభాగాలనుంచి వెలువడే ఉండే ముఖ్య మూలకాలు–వాటి వల్ల తలెత్తే సమస్యలివే.. క్యాథోడ్ రే ట్యూబ్‌లు: లెడ్: నాడీ, రక్తప్రసరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. ఎల్సీడీలు: మెర్క్యూరీ: మెదడు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కంప్యూటర్లు: కాపర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్,లెడ్, ఆర్సినిక్, క్యాడ్మియంలు: ఆమ్ల వర్షాలకు కారణమౌతాయి. పీల్చే గాలి విషతుల్యమౌతుంది. సెమీకండక్టర్లు: రసాయనాలు, మూలకాలు: శ్వాసక్రియ, రక్తప్రసరణ వ్యవస్థ, కాలేయం, వినాళ గ్రంథులు దెబ్బతింటాయి. -
‘ఇ - చెత్త’ నిజంగా బంగారమే.. కానీ
ఏటా కాలం తీరిన ఎలక్ట్రానిక్ పరికరాలను వందల టన్నుల్లో పడేస్తున్నాం. ఫలితంగా ఇ-వ్యర్థాలు గుట్టలా పేరుకుపోతున్నాయి. ఇలా నిరుపయోగంగా మారిన ఇ-వేస్ట్‌తో సంవత్సరానికి దాదాపు 4,500 ఈఫిల్ టవర్లను నిర్మించవచ్చట. అంతేనా ఇలా పోగుపడిన ఇ - వేస్ట్ బరువు ఏకంగా 1,25,000 బోయింగ్ 747 జంబో జెట్ల బరువుకు సమానమట. ఇవేవో గాలి కబుర్లు కావు. స్వయంగా దావోస్ వేదికగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఈ నివేదికను వెల్లడించారు. అవును మరి ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్.. ఇంట్లో టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు.. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు.. ఇవే కాక బయట మరో సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాలు. ఇవి లేకపోతే మనకు నిమిషం కూడా గడవని పరిస్థితి. ఉపయోగాలు లేవని కాదు.. అతి వాడకం. వెరసి రోజురోజుకు పెరిగిపోతున్న ఇ-వ్యర్థాలు. వీటిని పునరుపయోగించడం చాలా కష్టమైనదే కాక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇన్నాళ్లు గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందితే.. ఇప్పుడు ఇ-వ్యర్థాలు మరింత భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న వ్యర్థాల్లో ఇ-వేస్ట్ వాటా కేవలం 2 శాతం మాత్రమే. కానీ పర్యావరణానికి కలిగించే హానిలో వీటి వాటా మాత్రం ఏకంగా 70 శాతం అంటే ఇ-వేస్ట్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 21 నుంచి ఐదు రోజుల పాటు జరిగిన డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో ఈ ఇ-వ్యర్థాల గురించి చర్చించారు. పెరిగిపోతున్న ఇ-వేస్ట్‌ను తగ్గించేందుకు తీసుకునే చర్యలే కాక.. సులభంగా రీసైకిల్ చేసి రీయూజ్ చేసే మార్గాల గురించి పరిశోధనలు పెంచాలని నిర్ణయించారు. ఆ వివరాలు.. సాంకేతికతో పాటే పెరుగుతున్న వ్యర్థాలు.. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్ది.. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా పెరుగుతుంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.46 బిలియన్ల స్మార్ట్ఫోన్లు ఉంటే.. 2020నాటికి స్మార్ట్ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2.87 బిలియన్లకు చేరనుందట. ఇంతమందికి మొబైల్ ఫోన్ సౌకర్యాలు కల్పించాలంటే సెల్ టవర్ల సంఖ్య కూడా పెంచాలి. అంటే నెట్వర్కింగ్ పరికరాలను కూడా పెంచాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో ఇ-వేస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం వాడే ప్రతి ఎలక్ట్రాననిక్ పరికరం ఏదో ఒక రోజు నిరుపయోగంగా మారుతుంది. ఫలితం ప్రస్తుతం ఉన్న చెత్తను తగ్గించకపోగా.. మరికొంత పెంచుతున్నట్లే కదా. చెత్త ‘బంగార’మే.. చెత్త బంగారం ఏంటి అనుకోకండి. ఇ-వ్యర్థాలు నిజంగా బంగారు కొండలే. మనం వాడే స్మార్ట్ఫోన్ల తయారీలో చాలా తక్కువ మొత్తంలో బంగారం వాడతారనే విషయం తెలిసిందే. 100 టన్నుల బంగారు ధాతులో లభించే బంగారం కంటే.. 100 టన్నుల స్మార్ట్ఫోన్లలో లభించే బంగారం ఎక్కువ అంటే నమ్మగలరా?.. కానీ నమ్మక తప్పదు. వీటిలో బంగారం మాత్రమే కాక వెండి, రాగి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని సరిగా సేకరించే వీలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు 4,35,000 టన్నుల మొబైల్ ఫోన్లను చెత్త కుప్పలో పడేస్తున్నాం. రీసైకిల్‌తో మంచి ఆదాయం.. ఇ-వ్యర్థాలు నుంచి విలువైన లోహాలను వేరు చేయడం ఇప్పటికే పెద్ద బిజినెస్‌గా మారింది. ప్రతి ఏడాది ఇ వేస్ట్‌ను రీసైకిల్ చేయడం ద్వారా 62.5 బిలియన్ల సంపద లభిస్తుంది. ఈ మొత్తం కొన్ని దేశాల జీడీపీకి సమానం. అయితే ఇ వ్యర్థాల నుంచి లోహాలను వేరు చేయడం అంత తెలికైన పనేం కాదు. ఇందుకు ఎంతో ఖర్చుతో పాటు శ్రమ కూడా అవసరం. ఎందుకంటే వీటిల్లో బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలతో పాటు పాదరసం, లెడ్, కాడ్మియం వంటి హానికారక పదర్ధాలు కూడా ఉంటాయి. కాబట్టి రీసైకిలింగ్ అనేది సరైన పద్దతిలో.. సరైన సౌకర్యాల మధ్య జరగకపోతే.. పర్యావరణానికే కాక మనుషులకు కూడా హాని కల్గించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఎటువంటి అనుమతుల్లేకుండా ఈ ఇ-వేస్ట్‌ను ఎగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాక చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ వ్యర్థాలను రీసైకిల్ చేస్తున్నారు. కేవలం నైజిరియాలోనే దాదాపు లక్ష మంది ఈ ప్రమాదకర ఇ-వేస్ట్ రీసైకిలింగ్ యూనిట్లలో పని చేస్తున్నారు. అంటే వీరందరి బతకడం కోసం ప్రమాదంతో సావాసం చేస్తున్నారు. రీసైకిలింగ్లో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఇ-వ్యర్థాలను మండించడం వల్ల చాలా విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. ఫలితంగా పర్యావరణమే కాక అక్కడ ఉన్న కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివారణ మార్గాలు.. ఇ-వ్యర్థాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని, ఆరోగ్య సమస్యలను తగ్గించాలంటే ఒకటే మార్గం. సరైన రీతిలో వీటిని రీసైకిల్ చేయడం. ఇ-వేస్ట్‌ను తగ్గించాలంటే ముందుగా ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని సమూలంగా మార్చాలి. త్వరగా పాడయ్యే పరికరాల కన్నా ఎక్కువ కాలం మన్నే వస్తువులను తయారు చేయ్యాలి. అంతేకాక ఒక్కసారి వాటి లైఫ్ టైమ్ పూర్తయ్యాక వాటిని సులువుగా, భద్రంగా రీసైకిల్ చేసే విధంగా డిజైన్ చేయాలి. తయారిదారుడు, అమ్మకందారుడు ఇద్దరు ఈ ఇ వ్యర్థాలను తగ్గించే బాధ్యతను తీసుకోవాలి. అందుకే బై బ్యాక్ స్కీమ్‌లను తీసుకురావాలి. అస్సెట్ - ఓనర్షిప్ వ్యవస్థ నుంచి సర్వీస్ - సబ్‌స్ర్కిప్షన్ వ్యవస్థకు మార్చాలి. అంతేకాక పరికరాలను ఒక నిర్దిష్ట కాలానికి లీజ్కిచ్చే విధానాలను తీసుకురావాలి. వీటినే మళ్లీ రీసైకిల్ చేసి తిరిగి వాడుకునేందుకు వీలుగా మార్చాలి. -
చెత్తకుప్ప కానున్న థాయ్‌లాండ్
బ్యాంకాక్: ప్రపంచంలోని గొప్ప పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా విలసిల్లుతున్న థాయ్‌లాండ్ అందం మసైపోతోంది. మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల కుప్పగా ఆ దేశం మారుతోంది. పశ్చిమ దేశాలు, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ తదితర దేశాల నుంచి భారీగా ఈ-వ్యర్థాలు వచ్చిపడుతుండటంతో కాలుష్యం కోరల్లో చిక్కుకునేందుకు థాయ్‌లాండ్ మరెంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది. ఇప్పటివరకూ ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చైనా తన పంథాను మార్చుకుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడి చైనాను మరింత కాలుష్యమయంగా మార్చబోమంటూ అక్కడి ప్రభుత్వం జనవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతర దేశాల నుంచి ఈ-వ్యర్థాలతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం తమ దేశంలోకి అనుమతించేంది లేదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పోగవుతోన్న ఈ-వ్యర్థాల్లో దాదాపు 70 శాతం దిగుమతి చేసుకునే చైనా తన విధానాన్ని మార్చుకోవడంతో, ముందూవెనుక ఆలోచించకుండా థాయ్‌లాండ్ చైనా స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. అక్కడి పర్యావరణ చట్టాలు సైతం వ్యర్థాల రీ-సైక్లింగ్ వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతో గత ఆరు నెలల కాలంలో వెల్లువల వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాలతో థాయ్‌లాండ్ తన రూపు కోల్పోయే ప్రమాదంలో పడింది. ఆకాశాన్ని తాకే భవనాలు, తెల్లని రోడ్లు, ప్రకృతి వనరులు నల్లని కాలుష్యపు రంగును పులుముకునే దిశగా అడుగులు వేస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘చెత్త’ బరువుని తలకెత్తుకుంది..! మొత్తం మీద చైనా దించుకున్న ‘చెత్త’ బరువును థాయ్‌లాండ్ తలకెత్తుకుని కష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఒక్క యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఏడాదికి 50 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగుపడతాయి. అలాంటిది అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి థాయ్‌లాండ్‌ను ముంచెత్తనున్న ఈ-వ్యర్థాల వరద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కాగా, చైనాలో రీ-సైక్లింగ్ వ్యాపారాలపై నిషేధం విధించడంతో థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియాల్లో 100 ఈ-వేస్ట్ రీ-సైక్లింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు ఓ చైనా పారిశ్రామికవేత్త ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ప్రింటర్లు, మానిటర్లు, మౌజ్‌లు, స్క్రీన్లు, జిరాక్స్ మెషీన్ వంటి కంప్యూటర్ వ్యర్థాలను రీసైకిల్ చేసే క్రమంలో థాయ్‌లాండ్ కాలుష్య కాసారంగా మారుతోందన్నది వాస్తవం. అయినా ప్రపంచవ్యాప్తంగా పోగైన వ్యర్థాలను థాయ్‌లాండ్ నెత్తిన వేసుకోవడమేంటని విరచై సంగ్మెట అనే పోలీసు ఉన్నతాధికారి వాపోయారు. అక్రమంగా కొనసాగుతున్న 26 ఈ-వేస్ట్ రీ-సైక్లింగ్ ఫ్యాక్టరీలను ఇటీవల సీజ్ చేశామని ఆయన తెలిపారు. వ్యర్థాలను రీ-సైకిల్ చేసే క్రమంలో గాలిలో ప్రమాదకర వాయువులు చేరి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ప్రతిరోజు వస్తున్న దాదాపు 20 ఈ-వ్యర్థాల కంటెయినర్లను తిప్పి పంపిస్తున్నామని పోర్టు అధికారులు తెలిపారు. కాగా, వచ్చే నెలలో దేశంలోకి ఈ-వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల రవాణాను అడ్డుకొనేందుకు థాయ్ ప్రభుత్వం చట్టం తీసుకురానుందని అధికారులు వెల్లడించారు. -
ఈ- వ్యర్థాల నిర్వహణపై అవగాహన తప్పనిసరి
ఎఫ్ టాఫ్సీ ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ లుహారుకా హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ, అవసరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి అని ఎఫ్‌టాఫ్సీ ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ లుహారుకా చెప్పారు. బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ‘సస్టెయినబుల్ వేస్ట్ మేనేజ్మెంట్’ అంశంపై మాట్లాడుతూ... దేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, తయారీ సంఘాల అంచనాల ప్రకారం పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 25 శాతం చొప్పున పెరుగుతోందని చెప్పారు. ఇది ఇ-వ్యర్థాలు పెరగడానికి కూడా దోహదం చేస్తోందన్నారు. ‘‘ఎలక్ట్రానిక్ వేస్ట్‌లో బంగారం, రాగి, వెండి వంటి లోహాలుంటాయి. వీటిని వెలికి తీసి మళ్లీ ఉత్పత్తి చేయొచ్చు. చాలా కుటుం బాలకు ఈ-వేస్ట్‌ను ఏం చేయాలో తెలీక ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు. సరికొత్త పద్ధతులలో ఇ-వ్యర్థాల్ని శుభ్రపరిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు’’ అని చెప్పారాయన. కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు చంద్రశేఖర్, దేవులపల్లి కశ్యప్, శ్యామల, డాక్టర్ లక్ష్మీ మాట్లాడారు.