కంప్యూటర్ వ్యర్థాలు
బ్యాంకాక్: ప్రపంచంలోని గొప్ప పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా విలసిల్లుతున్న థాయ్‌లాండ్ అందం మసైపోతోంది. మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల కుప్పగా ఆ దేశం మారుతోంది. పశ్చిమ దేశాలు, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్ తదితర దేశాల నుంచి భారీగా ఈ-వ్యర్థాలు వచ్చిపడుతుండటంతో కాలుష్యం కోరల్లో చిక్కుకునేందుకు థాయ్‌లాండ్ మరెంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది. ఇప్పటివరకూ ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చైనా తన పంథాను మార్చుకుంది.
తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడి చైనాను మరింత కాలుష్యమయంగా మార్చబోమంటూ అక్కడి ప్రభుత్వం జనవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతర దేశాల నుంచి ఈ-వ్యర్థాలతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం తమ దేశంలోకి అనుమతించేంది లేదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పోగవుతోన్న ఈ-వ్యర్థాల్లో దాదాపు 70 శాతం దిగుమతి చేసుకునే చైనా తన విధానాన్ని మార్చుకోవడంతో, ముందూవెనుక ఆలోచించకుండా థాయ్‌లాండ్ చైనా స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది.
అక్కడి పర్యావరణ చట్టాలు సైతం వ్యర్థాల రీ-సైక్లింగ్ వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతో గత ఆరు నెలల కాలంలో వెల్లువల వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాలతో థాయ్‌లాండ్ తన రూపు కోల్పోయే ప్రమాదంలో పడింది. ఆకాశాన్ని తాకే భవనాలు, తెల్లని రోడ్లు, ప్రకృతి వనరులు నల్లని కాలుష్యపు రంగును పులుముకునే దిశగా అడుగులు వేస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘చెత్త’ బరువుని తలకెత్తుకుంది..!
మొత్తం మీద చైనా దించుకున్న ‘చెత్త’ బరువును థాయ్‌లాండ్ తలకెత్తుకుని కష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఒక్క యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఏడాదికి 50 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగుపడతాయి. అలాంటిది అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి థాయ్‌లాండ్‌ను ముంచెత్తనున్న ఈ-వ్యర్థాల వరద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కాగా, చైనాలో రీ-సైక్లింగ్ వ్యాపారాలపై నిషేధం విధించడంతో థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియాల్లో 100 ఈ-వేస్ట్ రీ-సైక్లింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు ఓ చైనా పారిశ్రామికవేత్త ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ప్రింటర్లు, మానిటర్లు, మౌజ్‌లు, స్క్రీన్‌లు, జిరాక్స్ మెషీన్ వంటి కంప్యూటర్ వ్యర్థాలను రీసైకిల్ చేసే క్రమంలో థాయ్‌లాండ్ కాలుష్య కాసారంగా మారుతోందన్నది వాస్తవం.
అయినా ప్రపంచవ్యాప్తంగా పోగైన వ్యర్థాలను థాయ్‌లాండ్ నెత్తిన వేసుకోవడమేంటని విరచై సంగ్‌మెట అనే పోలీసు ఉన్నతాధికారి వాపోయారు. అక్రమంగా కొనసాగుతున్న 26 ఈ-వేస్ట్ రీ-సైక్లింగ్ ఫ్యాక్టరీలను ఇటీవల సీజ్ చేశామని ఆయన తెలిపారు. వ్యర్థాలను రీ-సైకిల్ చేసే క్రమంలో గాలిలో ప్రమాదకర వాయువులు చేరి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ప్రతిరోజు వస్తున్న దాదాపు 20 ఈ-వ్యర్థాల కంటెయినర్లను తిప్పి పంపిస్తున్నామని పోర్టు అధికారులు తెలిపారు. కాగా, వచ్చే నెలలో దేశంలోకి ఈ-వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల రవాణాను అడ్డుకొనేందుకు థాయ్ ప్రభుత్వం చట్టం తీసుకురానుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment