రూ.4,27,500 కోట్లు.. బూడిదపాలు..!! | 54 Million Tonnes Of E Waste Generated In 2019 | Sakshi
Sakshi News home page

ఈ- వేస్ట్‌పై యూఎన్‌ఎన్‌ అధ్యయనం

Published Mon, Oct 12 2020 8:20 PM | Last Updated on Mon, Oct 12 2020 9:01 PM

54 Million Tonnes Of E Waste Generated In 2019 - Sakshi

సాక్షి, అమరావతి: గతేడాది ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల(ఈ-వేస్ట్‌)ను కాల్చివేయడం వల్ల రూ.4,27,500 కోట్లు బూడిద పాలయ్యాయా? ప్రపంచంలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తి 2030లో 69.68 మిలియన్‌ టన్నులకు చేరుతుందా? ఈ-వేస్ట్‌ను పునర్వి నియోగం చేయకుంటే.. రూ.లక్షలాది కోట్లు బూడిదపాలు కావడమే కాదు.. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం(యూఎన్‌ఎన్‌) నివేదిక. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యుత్‌ బల్బులు, ట్యూబ్‌లైట్ల నుంచి కంప్యూటర్‌ల వరకూ భారీగా ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగిస్తున్నారు. కాలం చెల్లించిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను వ్యర్థాల రూపంలో పడేస్తున్నారు. ఈ ఈ-వేస్ట్‌పై యూఎన్‌ఎన్‌ అధ్యయనం చేసింది.

ఆ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ..

  • ప్రపంచంలో 2014లో 42.35 మిలియన్‌ టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తయింది. 2019 నాటికి ఈ-వేస్ట్‌ ఉత్పత్తి 53.6 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. అంటే.. ఐదేళ్లలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తి 21% పెరిగింది. ఈ లెక్కన 2030 నాటికి ఈ-వేస్ట్‌ ఉత్పత్తి 38% పెరిగి 69.68 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.
     
  • 2019లో ఆసియా దేశాలు అత్యధికంగా 24.9 మిలియన్‌ టన్నుల ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. ఇందులో చైనా మొదటి,  భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి. అమెరికా ఖండపు దేశాలు 13.1 మిలియన్‌ టన్నులు, ఐరోపా దేశాలు 12 మిలియన్‌ టన్నుల ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి.
     
  • ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో.. అత్యంత విషపూరితమైన పాదరసం వంటి పదార్థాలతోపాటు బంగారం, వెండి, రాగి వంటి లోహాలను వినియోగిస్తారు.
     
  • ఈ-వేస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల వాటిలోని విషపూరితమైన పదార్థాలు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.
     
  • 2019లో ఉత్పత్తయిన 53.6 మిలియన్‌ టన్నుల ఈ-వేస్ట్‌లో 18% అంటే 9.65 మిలియన్‌ టన్నులను మాత్రమే రీ-సైక్లింగ్‌ చేసి పునర్వినియోగంలోకి తెచ్చారు. మిగిలిన వాటిని కాల్చివేశారు. దీని వల్ల ఆ వ్యర్థాల్లోని బంగారం, వెండి, రాగి వంటి 57 బిలియన్‌ డాలర్ల విలువైన లోహాలు బూడిదయ్యాయి.
     
  • ఈ-వేస్ట్‌ను రీ-సైక్లింగ్‌ చేసి తిరిగి వినియోగించుకునేలా జాతీయ ఈ-వేస్ట్‌ విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలోభారత్‌తోపాటు 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్‌ విధానాన్ని రూపొందించుకున్నాయి. కానీ.. కేవలం 18% మాత్రమే ఈ-సైక్లింగ్‌ చేస్తున్నాయి.
     
  • దేశంలో ఈ-వేస్ట్‌ను రీ-సైక్లింగ్‌ చేసే కేంద్రాలు 315 ఉన్నాయి. వాటిలో ఏడాదికి కేవలం 800 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయవచ్చు. కానీ.. దేశంలో ఏడాదికి ఏడు మిలియన్‌ టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తవుతుండటం గమనార్హం.
     
  • ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించకపోతే భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రూ.లక్షలాది కోట్ల విలువైన ప్రజాధనం వృథా అవుతుంది. పర్యావరణానికి విఘాతం కలిగించడంతోపాటు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement