
మాయలో మొనగాడు
ఇంద్రజాలం.. అదో అద్భుతం! ప్రేక్షకులను సంభ్రమ సాగరంలో ముంచెత్తి, విభ్రమంలో ఓలలాడించి, ఊహాలోకాల్లో విహరింపజేసే వర్ణనాతీత విచిత్రం. అతి ప్రాచీన విన్యాసం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు.. ఓ చిత్రమైన భ్రాంతిని కలిగించి పరవశింపజేసే అనుభవం. ఏకకాలంలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే ఈ ఇంద్రజాలం మన భారతీయ కళల్లో అంతర్భాగం. నాటికీ, నేటికీ ఎన్నో మార్పులకు లోనయిన ఈ కళలో విశాఖ వాసులెందరో ప్రతిభ చూపుతూ ఉండడం విశేషం. వాళ్లలో ప్రతిభ చూపుతున్న సింహాచలం వాస్తవ్యుడు రవిశంకర్ నైపుణ్యం మరీ రసవత్తరం.
- 8,500 ప్రదర్శనలతో గుర్తింపు
- 15వ ఏట నుంచే మ్యాజిక్‌పై ఆసక్తి
- విలక్షణ ప్రదర్శనలతో విశ్వవ్యాప్త ఖ్యాతి
- సింహాచలం వాస్తవ్యుడు రవిశంకర్ ప్రతిభ
సింహాచలం(పెందుర్తి) : అబ్రకదబ్ర అంటూ ఆ యువకుడు చేసే అద్భుతాలు మనల్ని అప్రతిభుల్ని చేస్తాయి. క్షణమయినా చూపు తిప్పుకోనివ్వని భ్రాంతిలో తేలుస్తాయి. మెరుపులా కదిలే అతడి వేళ్లు అపూర్వ హస్త లాఘవంతో చిటికెలో ఎన్నో చిత్రాలు చేస్తాయి. అవి అతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టాయి. కేవలం స్వయంకృషి పెట్టుబడిగా, నిర్విరామ సాధనతో ఇంత ఖ్యాతిని సొంతం చేసుకున్నారు సింహాచలం ప్రాంతానికి చెందిన కలగొట్ల రవిశంకర్.
ఆసక్తే ఆలంబన
రవిశంకర్ అడవివరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1997లో టెన్త్ చదువుతున్నప్పుడు పాఠశాలలో మ్యాజిక్ షో జరిగింది. ఆ కార్యక్రమం అతడి జీవిత గమ్యాన్నే మార్చేసింది. మాజిక్‌లో ఎలాగైనా రాణించాలన్న పట్టుదల అప్పుడే కలిగింది. దాంతో పదో తరగతి పూర్తి కాగానే ఏడాది పాటు కోల్‌కతలోని కొంతమంది ఇంద్రజాలికుల దగ్గర, విజయనగరానికి చెందిన శ్యామ్, విశాఖకు చెందిన షరీఫ్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నారు. 1998 నుంచి సొంతంగా మ్యాజిక్‌షోలు ప్రారంభించారు.
విశ్వమంతా వేలాది ప్రదర్శనలు
1998 నుంచి ఇప్పటి వరకు 19 ఏళ్లలో రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా 8500 ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చారు. చెన్నైలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. విజయవాడ, భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఇంద్రజాల పోటీల్లో ప్రథమ బహుమతులు పొందారు. థాయ్‌లాండ్‌లో ఇప్పటి వరకు 10 ప్రదర్శనలు చేశారు. మెజీషియన్‌గా గుర్తింపు పొందుతున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నీషియన్‌గా రవిశంకర్‌కు ఉద్యోగం వచ్చినా ఆయన తన ప్రవృత్తికే ప్రాధాన్యమిచ్చారు.
థాయ్‌లాండ్‌లో మువ్వన్నెల రెపరెపలు
2016లో థాయ్‌లాండ్‌లో ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన థాయ్ ఇండియన్ ఫెస్టివల్‌లో మ్యాజిక్ షో చేసేందుకు రవిశంకర్‌కు ఆహ్వానం అందింది. అక్కడ ప్రదర్శనలో మన మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి రవిశంకర్ మన్ననలు పొందారు.
జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల్లో ఆకర్షణ
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పర్యటనల్లో స్టేజీలపై రవిశంకర్ దాదాపు 40 ప్రదర్శనలు ఇచ్చారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వద్దకు వెళ్లి వాళ్లను మ్యాజిక్ షో ద్వారా ఆనందపరచాలన్నది తన ఆలోచనని, అందుకు అనుమతి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ‘ఇంటర్ చదివిన 60 మంది నిరుద్యోగ యువతకు శిబిరం నిర్వహించి ఉచితంగా శిక్షణ ఇచ్చాను. ఉత్సాహం ఉన్న ఎవరికైనా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అన్నారు.
ఎన్నో ప్రత్యేకతలు
రవిశంకర్ క్లోజప్ మ్యాజిక్, స్టేజ్ మ్యాజిక్, గ్రాండ్ ఇల్యూషన్ మ్యాజిక్‌లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. డవ్ యాక్ట్ (గాల్లోంచి పావురాలను సృష్టించడం), ది గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ (ప్రాచీన ఇంద్రజాలికుల మాదిరిగా గాలిలో తాడు నిలపడాన్ని నూతన పద్ధతుల్లో ప్రదర్శించడం), లేడీ లివియేషన్ (అమ్మాయిని గాల్లో నిలబెట్టడం), జిగ్‌జాగ్ లేడీ (అమ్మాయిని మూడు భాగాలుగా చేయడం) వంటి ప్రదర్శనలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జపాన్‌లో ఉన్న ఫ్లాష్ యాక్ట్ ప్రదర్శనను రవిశంకర్ మన దేశానికి పరిచయం చేశారు. గిరిజనుల్లో మూఢనమ్మకాలు తొలగించడానికి కృషి చేశారు.