ప్రతి మనిషికి ఏదోఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ముందుకెళ్తుంటారు చాలామంది. మినీషా భరద్వాజ్ మాత్రం భయంతో ఇంట్లో గదికే పరిమితమైపోయింది. మినీషాకు ఉన్న ‘అఘోరా ఫోబియా’తో... కొత్త వ్యక్తుల్ని కలిసినా, తెలియని ప్రాంతాలకు వెళ్ళినా తెగ భయపడిపోయేది. గుంపుగా ఉన్న జనాలను చూసి ‘‘అమ్మో అంతా నా వైపు చూస్తున్నారు’’ అని వణికి పోయేది. చిన్నప్పటి నుంచి ఈ భయంతో పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికీ వెళ్లనే లేదు. ఇక స్నేహితులు కూడా ఎవరు లేరు. జీవితాంతం ఇలానే ఉంటానేమో అనుకునే మినీషా..బొమ్మలు వేసే అలవాటు ద్వారా తన ఫోబియాను అధిగమించడమేగాక, ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బొమ్మలు వేస్తూ తన భయాన్ని ఎలా పోగొట్టుకుందో తన మాటల్లోనే.....
మాది గురుగావ్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా బాల్యమంతా డెహ్రాడూన్‌లో గడిచింది. చిన్నప్పటి నుంచి తెల్లని పేపర్ మీద పెన్సిల్‌తో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ఒక మ్యాగజీన్‌లో ఉన్న తెల్లటి పేపర్‌పై నటి రేఖ చిత్రాన్ని గీసాను. అప్పుడు మా అమ్మానాన్నలు నా టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయారు. పదోతరగతి వరకు పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. ప్రతి నోట్‌బుక్ చివరి పేజీలో నా పెయింటింగ్ ఒకటి కచ్చితంగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షపేపర్‌లో జవాబు తెలియని ప్రశ్నకు బాధపడుతోన్న అమ్మాయి చిత్రాన్ని గీసేదాన్ని. పదో తరగతిలో అంతర జిల్లా పోటీలలో పాల్గొని డెహ్రాడూన్ మొత్తంలోనే మొదటి బహుమతి అందుకున్నాను. అలా ఎక్కువ సమయం బొమ్మలు గీస్తూ ఉంటే అఘోరా ఫోబియా కూడా గుర్తు వచ్చేది కాదు.
ప్రత్యేకమైన కోర్సు చేయలేదు...
నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అమ్మావాళ్లు సీఏ చదివించారు. కానీ నా మనస్సంతా ఆర్ట్‌మీదే ఉండేది. చదువు పూర్తి అయినప్పటికీ కార్పోరేట్ ప్రపంచంలో కాలుపెట్టలేదు. 1995 లో పెళ్లి అయ్యింది. ఆయన ఉద్యోగం దుబాయ్‌లో కావడంతో అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకసారి ఖాళీ సమయం దొరకడంతో..పేపర్ మీద బొమ్మను గీసాను. బొమ్మ పూర్తయ్యే సమయానికి మా ఆయన, ఆయన స్నేహితుడు వచ్చారు. ఆ బొమ్మను చూసి.. ‘‘చాలా బావుంది. బొమ్మలు గీయడంలో మంచి ప్రతిభ ఉంది. ఎందుకు దాచుకుంటావు. బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యచ్చు కదా...’’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆర్ట్‌కు ప్రాణం పోస్తున్నాను.
చార్‌కోల్ పెన్సిల్స్‌తో..
ఆయన ప్రోత్సాహంతో స్కెచ్‌లు గీయడం మొదలు పెట్టాను. ఆయన ఒక ఆర్ట్‌గ్రూప్‌ను పరిచయం చేయడంతో అక్కడకు వెళ్లి స్కెచ్‌లు గీసేదాన్ని. కమ్యూనిటీకి వెళ్లిన రెండేళ్లలోనే ‘జి ఆర్ట్ కమ్యూనిటీ’ వాళ్లు నన్ను కలిసి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్‌కు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. మీరు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించండి’’అన్నారు. అది నాకు చాలా పెద్ద అవకాశం. కానీ ‘‘అందరూ రంగులతో స్కెచ్‌లు గీస్తున్నారు. నేను మాత్రం పెన్సిల్, చార్‌కోల్‌తో గీస్తాను. నేను నిలబడగలనా’’ అని నిర్వాహకులను అడిగాను.
అందుకు వాళ్లు ... నువ్వుతప్ప ఎవరూ చార్ కోల్ వాడడం లేదు. అందరికంటే భిన్నంగా నీ స్కెచెస్ ఆకర్షిస్తాయి అని చెప్పి ‘డేర్ టు డ్రీమ్’ ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేశారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రమంగా వాటర్ కలర్స్ కూడా వేయడం ప్రారంభించాను. చార్‌కోల్ పెయింటింగ్స్‌కు అనేక అవార్డులు అందుకున్నాను. రోలెక్స్ టవర్‌పై నేను వేసిన పెయింటింగ్‌ను ఇప్పటికీప్రదర్శిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ‘పీపుల్స్ ఛాయిస్ ఆవార్డు’ వచ్చింది. అబుదాబిలోని లువురే మ్యూజియంలో నా పెయింటింగ్స్ ఉన్నాయి.
ఏడు వేలమంది ముందు...
దుబాయ్ మాల్స్‌లో ఏడు వేలమంది ముందు చార్‌కోల్‌తో పెయింటింగ్ వేశాను. ఆ పెయింటింగ్ వెంటనే అమ్మడు పోయింది. ‘స్పెషల్ నీడ్ దుబాయ్ కేర్’ తో కలిసి చికిత్స పొందుతోన్న పిల్లలకోసం ‘లిటిల్ పికాసో’పేరిట పెయింటింగ్స్ వేసి వారికి సాయం చేశా. 2017లో గుర్‌గావ్ వచ్చేసి, ఇక్కడ పెయింటింగ్స్ నేర్పిస్తున్నాను. ఇండియా ఆర్ట్ కమ్యూనిటీ, ఇండియా స్పీకింగ్ ఆర్ట్ ఫౌండేషన్, వారి సాయంతో పెయింటింగ్ నేర్పిస్తున్నాను. దుబాయ్‌లో వేలమందికి నేర్పిన నేను, నా అనుభవాల ద్వారా నేర్చుకున్న ట్రిక్స్‌ను ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్నాను’’ అలా నా భయాన్ని అధిగమించడంతోపాటు నా విద్యను అందరికీ నేర్పించగలగడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది అని చెప్పింది మినీషా.
(చదవండి: లాయర్‌ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..)
Comments
Please login to add a commentAdd a comment