సాక్షి, హైదరాబాద్ : పొడవాటి ఆకులు.. వాటి చివరలు గులాబీ ఆకులకున్నట్టు ముళ్లతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.. వాటికీ పూలు పూస్తాయి, కానీ గులాబీలు కాదు, చిన్నచిన్న కాయలు, అవి పళ్లుగా మారిన దాఖలాలు... అదో విచిత్రంగా కనిపిస్తున్న చెట్టు. తెలుగు నేలపై విస్తారంగా కనిపించేవట.. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. ఒక్క మొక్క కూడా కానరావటం లేదు. అంతరించాయట. ఇలా ఇదొక్కటే కాదు, ఒకప్పుడు మనుగడ సాగించిన ఇలాంటి మొక్కలెన్నో ఇప్పుడు కనుమరుగయ్యాయి. ‘మన మొక్కలు’ఎందుకు మాయమయ్యాయో మన దగ్గర వివరాలు లేవు, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లేవు. కానీ స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బరోలో వాటి చిత్రాలున్నాయి. కొన్ని రకాల మొక్కలు తెలుగు నేలపై ఏ ప్రాంతంలో మనుగడ సాగించాయో కూడా వివరాలు వాటితోపాటు నిక్షిప్తమై ఉన్నాయట. ఇప్పుడు వాటిల్లో కొన్ని చిత్రాల రూపంలో హైదరాబాద్‌కు రాబోతున్నాయి.
ఏమా చిత్రాల కథ..?
‘బొటానికల్ ఆర్ట్’...మొక్కను చూసి ఉన్నది ఉన్నట్టుగా చిత్రించటం. ఎప్పటి నుంచో వస్తున్న కళ ఇది. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ, ఐరోపా దేశాల్లో ఇప్పటికీ కళకళలాడుతోంది. మన దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్న సమయంలో దీనికి ప్రాధాన్యం ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ కళాకారులతోపాటు కొందరు స్థానిక కళాకారులు కూడా బొటానికల్ డ్రాయింగ్స్‌లో ప్రతిభ చూపారు. ఈ ప్రాంతంలోని విశేష ప్రాధాన్యమున్న మొక్కల చిత్రాలను సిద్ధం చేశారు. అలా రూపుదిద్దుకున్న చిత్రాలు ఎన్నో ఎడిన్‌బరోలోని విశ్వవిఖ్యాత బొటానికల్ గార్డెన్ మ్యూజియంలో కొలువు దీరాయి. వాటిల్లో ‘తెలుగు మొక్కలు’కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ చిత్రాలతో నగరంలో ఓ ప్రదర్శన ఏర్పాటు కాబోతోంది. మార్చి 6 నుంచి 31 వరకు స్టేట్ మ్యూజియంలోని భగవాన్ మహావీర్ ఆడిటోరియంలో ఇది కొనసాగనుంది. హెరిటేజ్ తెలంగాణ, ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్, గోథె జంత్రమ్ సంయుక్తాధ్వర్యంలో ఇది ఏర్పాటు కాబోతోంది. ఫారెస్ట్స్ అండ్ గార్డెన్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఇది ఏర్పాటవుతోంది. ఆంగ్లేయుల పాలనకాలంలో రూపుదిద్దుకున్న దక్షిణ భారత దేశంలోని మొక్కల పెయింటింగ్స్‌ను ఇందులో ప్రదర్శిస్తారు.
కనుమరుగైనట్టు తేల్చినవి ఇవే...
గతంలో ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్ మ్యూజియం క్యూరేటర్‌గా పనిచేసిన హెన్రీ నోల్టే ఆ చిత్రాలకు సంబంధించి ఎన్నో వివరాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రాయింగ్స్ ఆధారంగా ఆ మొక్కలను ప్రత్యక్షంగా చూడాలని భావించి గతంలో ఆయన దక్షిణ భారత దేశంలో పర్యటించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రూపం)కు కూడా వచ్చారు. ఇక్కడ మొక్కలను పరిశోధిస్తుండగా, కొన్ని రకాలు అంతరించినట్టు గుర్తించారు. అసలు వాటి మనుగడే లేదని, ప్రస్తుతం అవి బొటానికల్ ఆర్ట్‌కే పరిమితమైనట్టు తేల్చారు. ఆ చిత్రాలను 19వ శతాబ్దంలో చిత్రించినందున, అప్పట్లో అవి మనుగడలో ఉన్నట్టు పేర్కొంటూ తన పరిశోధన వివరాలను పుస్తకంలో నిక్షిప్తం చేశారు. చెన్నై సమీపంలో ఉన్న ‘దక్షిణ్ చిత్ర’నిర్వాహకులు ఇటీవల ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో ఎడిన్‌బరో బొటానికల్ ఆర్ట్ కూడా భాగం కావటంతో సందర్శకులను ఆకట్టుకుంది. దీంతో హెరిటేజ్ తెలంగాణ నగరంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోథె జంత్రమ్, ఎడిన్‌బరో బొటానికల్ గార్డెన్ నిర్వాహకులతో సంప్రదించటంతో వారు అంగీకరించారు. గుర్తింపు పొందిన నేపాల్‌కు చెందిన నీరా జోషి ప్రధాన్, బెంగళూరుకు చెందిన నిరుప రావు, మీన సుబ్రమణియన్‌లు పాల్గొనబోతున్నట్టు హెరిటేజ్ తెలంగాణ డైరక్టర్ విశాలాచ్చి తెలిపారు.
ఎడిన్‌బరో చెప్పే మన మొక్కల కథ..!
Published Mon, Mar 4 2019 2:39 AM | Last Updated on Mon, Mar 4 2019 2:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment