‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్‌సిటీ జైపూర్‌లోని గంగోరి బజార్‌లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.
రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.
సర్వతో రుచులు
ఈ ప్యాలెస్‌ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్‌సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి.
అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్‌కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.
ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్‌ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్‌లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్‌లో సిటీ ప్యాలెస్ విజిట్‌ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment