
కొంతమంది జీవనం కళకే అంకితమవుతుంది. కళ కోసమే జీవిస్తుంటారు. కొందరి కళలు అసలు వెలుగు చూడవు. కొందరు వినూత్నంగా తమ కళాభిరుచిని చాటుతుంటారు. వారిలో 45 ఏళ్ల బ్రిటన్ ఆర్టిస్ట్ బెకె స్టోన్‌ఫాక్స్ చేరుతుంది. పేపర్, దారాలతో చేసిన పోర్ట్రెయిట్‌లు చూసిన వెంటనే కాదు రోజంతా అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాంటి కళను సొంతంగా ఔపోసన పట్టింది స్టోన్ ఫాక్స్. ఇప్పటి వరకు మనం చూసిన చిత్తరువులు రోజులో ఎప్పుడూ ఒకే కాంతిలో దర్శనమిస్తుంటాయి. అయితే స్టోన్ ఫాక్స్ వేసిన పోర్ట్రెయిట్స్ మాత్రం పగటిపూట రంగులను మారుస్తాయి. త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రేరణ పొంది ఈ చిత్తరువులను రూపొందించడమే ఈ కళారూపాల ప్రత్యేకత. ఉదయం నుంచి పగటివేళకు సూర్యరశ్మి పెరుగుతున్నకొద్దీ ఈ పోర్ట్రయిట్ల రంగు పెరగడం లేదా తగ్గడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు మెరుస్తూ ఉంటుంది. సాయంకాలానికి కొన్నిసార్లు లేత రంగులు దర్శనమిస్తాయి.
లండన్‌కి చెందిన 45 ఏళ్ల బెకె స్టోన్‌ఫాక్స్ కాగితపు రంగు క్లిప్పింగ్‌లను ఉపయోగించి కేవలం ఆకారాలను తయారు చేయడంలో ప్రత్యేకత చూపుతుంది. ఈ ఆర్ట్‌కి చిన్న చిన్న కాగితపు ముక్కలను, సిల్క్, కాటన్ దారాలను ఉపయోగిస్తారు. చాలా కాలంగా ఈ ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పటికీ, ఐదేళ్ళుగా ఈమె ప్రతిభ ప్రపంచ దృష్టిలో పడింది. ఈమె కళాసేకరణలు కల్పిత మానవ పాత్రల నుండి కుక్క, పిల్లి, గొరిల్లా, గుర్రం మొదలైన వివిధ జీవుల వరకు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడబోతున్నట్లుగా కనిపిస్తాయి. స్టోన్‌ఫాక్స్ ఎవరి ముఖమైనా మొత్తం ఆకారాన్ని కాగితాన్ని ఉపయోగిస్తూ దారాలతో అల్లి తయారు చేస్తుంది. కళతో ప్రపంచంలో దేనినైనా సృష్టించవచ్చు అంటుంది స్టోన్‌ఫాక్స్. ఇప్పటివరకు పురుషులు, జంతువుల బొమ్మలను మాత్రమే తయారుచేసిన స్టోన్ ఇప్పుడు మహిళల మనోభావాలను ప్రతిఫలింపజేసే చిత్తరువులను విభిన్నంగా సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment