చిన్న పెట్టుబడి.. పెద్ద నిధిగా మారాలంటే? | High returns in smallcap companies, Risk is a priority | Sakshi
Sakshi News home page

చిన్న పెట్టుబడి.. పెద్ద నిధిగా మారాలంటే?

Published Mon, Jun 26 2023 4:05 AM | Last Updated on Mon, Jun 26 2023 7:07 PM

High returns in smallcap companies, Risk is a priority - Sakshi

వివేక్, బలరామ్‌ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ, ఈక్విటీ పెట్టుబడుల విషయానికొచ్చే సరికి ఇద్దరిదీ చెరోదారి. 2002లో ఇద్దరూ ఓ చెరో నాలుగైదు స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో రూ. 50 వేల చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. 2023 జనవరి నాటికి వివేక్‌ ఇన్వెస్ట్‌ చేసిన ఐదు కంపెనీల్లో రెండు మలీ్టబ్యాగర్లు అయ్యాయి. రెండు నష్టాలను ఇవ్వగా, ఒక్కటి మంచి రాబడులను ఇచి్చంది. మొత్తంగా అతడి రూ. 50వేల పెట్టుబడి 20 ఏళ్లలో రూ.18 లక్షలు అయింది.

బలరామ్‌ నాలుగు కంపెనీల్లో మొత్తంగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. కానీ, 2023 జనవరిలో అతడి మొత్తం పెట్టుబడి రాబడితో కలసి రూ.6 లక్షలుగా మారింది. ఇద్దరి రాబడుల్లో అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే? వారు ఎంపిక చేసుకున్న కంపెనీల వల్లే. ఇక్కడ బలరామ్‌తో పోలిస్తే వివేక్‌ అంత భారీ రాబడులు పోగేసుకోవడం వెనుక అతడు నేర్చుకుని, తెలుసుకుని, తగినంత అధ్యయనం తర్వాత పెట్టుబడి పెట్టడం వల్లేనని చెప్పుకోవాలి. అందుకే స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడి ఓ కళగా నిపుణులు చెబుతారు. అన్నీ తెలుసుకుని, అవగాహనతోనే ఇన్వెస్ట్‌ చేయాలని సూచిస్తుంటారు.


స్మాల్‌క్యాప్‌ కంపెనీలు అంటే చాలా చౌకగా లభిస్తున్నాయనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది సరికాదు. రూ.16,472 కోట్ల మార్కెట్‌ విలువ వరకు ఇప్పుడు స్మాల్‌క్యాప్‌ కంపెనీలుగానే పరిగణిస్తున్నారు. లోగడ రూ.8,579 కోట్ల మార్కెట్‌ విలువ వరకు ఇలా పరిగణించేవారు. స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో చాలా వరకు దశాబ్దాలుగా అదే స్థాయిలో ఉండిపోతాయి. కేవలం కొన్ని మాత్రం ఆయా రంగాల్లో లీడర్లుగా, పెద్ద స్థాయి కంపెనీలుగా అవతరిస్తాయి. వ్యాపారంలో వృద్ధి లేక అక్కడే ఉండిపోయే కంపెనీలు కూడా బోలెడు.

కంపెనీ యాజమాన్యంలో సత్తా లేకపోవచ్చు. లేదా ఆ కంపెనీ చేస్తున్న వ్యాపారానికి పరిమిత అవకాశాలు ఉండొచ్చు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, మూలధన నిధుల నిర్వహణ మెరుగ్గా లేకపోవచ్చు. సాధారణంగా స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువ ఇలాంటివే కనిపిస్తుంటాయి. కానీ, కొన్ని మార్కెట్‌ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా తక్కువ వేల్యూషన్ల వద్ద లభిస్తుంటాయి. లేదంటే అప్పటి వ్యాపార స్థాయి ఆధారంగా చిన్న కంపెనీలుగా ఉండి ఉండొచ్చు. ఇలాంటి నాణ్యమైన కొన్ని ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మల్టీబ్యాగర్‌ రాబడులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది.  

ఇన్వెస్టర్లలో ఒక ధోరణి కనిపిస్తుంది. స్టాక్‌ ధర రూ.100 లోపు లేదా రూ.10–50 లోపు ఉంటే చౌక అని భావిస్తుంటారు. రేటు తక్కువలో ఉంటే ఎక్కువ స్టాక్స్‌ వస్తాయని, వేగంగా రెండు మూడు రెట్లు పెరుగుతాయనే అపోహ ఉంటుంది. స్మాల్‌క్యాప్‌ కంపెనీయే అయినా ఒక్కో షేరు రూ.5,000 ఉండొచ్చు. మరో కంపెనీ షేరు ధర రూ.10 ఉండొచ్చు. షేరు ధర కంపెనీ ఆర్థిక మూలాలనే ప్రతిఫలిస్తుందన్నది మర్చిపోవద్దు. షేరు ధర తక్కువ, ఎక్కువలో ఉండడం అన్నది చౌక, ఖరీదైన దానికి నిదర్శనం కాదు. ఉదాహరణకు.. ‘ఏ’ అనే కంపెనీ మూలధనం రూ.10కోట్లు. షేరు ముఖ విలువ రూ.10 అప్పుడు కోటి షేర్లు ఉంటాయి.

‘బీ’ అనే కంపెనీ మూలధనం కూడా రూ.10 కోట్లు. కానీ షేరు ముఖ విలువ ఒక్కరూపాయే. కనుక 10 కోట్ల షేర్లు ఉంటాయని తెలుసుకోవాలి. కేవలం పీఈ (ప్రైస్‌ టు ఎరి్నంగ్స్‌ రేషియో/ఆర్జనకు షేరు ఎన్ని రెట్లు ఉంది) చూసి, తక్కువలో ఉందని కొనుగోలు చేయడం కూడా అన్ని సందర్భాల్లో సరైన ఫలితం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. స్మాల్‌క్యాప్‌ అనేది పెద్ద ప్రపంచం. టాప్‌ 250 కాకుండా మార్కెట్లో ఉన్న మిగిలినవన్నీ కూడా స్మాల్‌క్యాప్‌ విభాగంలోకే వస్తాయి. అన్ని వందలు, వేల కంపెనీల నుంచి మాణిక్యాలను (చెత్త నుంచి మణి) వెలికితీయాలంటే లోతైన పరిశోధ న అవసరం.
 
మెరుగైన అవకాశాలు
రూ.16,472 కోట్ల వరకు స్మాల్‌క్యాప్‌ కంపెనీల కిందకే వస్తున్నాయి కనుక ఈ విభాగంలో ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. నిర్వచనం మార్చడం వల్ల స్మాల్‌క్యాప్‌ పప్రంచం ఇప్పుడు మరింత విస్తృతం అయింది. మన మార్కెట్‌ విస్తృతి పెరిగింది. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా, మరి కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించొచ్చు.

కనుక దీర్ఘదృష్టితో ఆలోచించి, ఇప్పుడు స్మాల్‌క్యాప్‌ ప్రపంచంలో కొంచెం పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకున్నా.. అవి జెయింట్‌ క్యాప్‌ కంపెనీలుగా మారే అవకాశాలు లేకపోలేదు. 2012 జనవరి 10 నుంచి 2022 జనవరి 10 వరకు గణాంకాలను పరిశీలించి చూస్తే.. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 సూచీ నుంచి మూడు కంపెనీలు లార్జ్‌క్యాప్‌ కంపెనీలుగా అవతరించాయి. అవి చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్‌. ఇక స్మాల్‌క్యాప్‌ నుంచి మరో 21 కంపెనీలు మిడ్‌క్యాప్‌ కంపెనీలుగా అవతరించాయి. 72 కంపెనీలు అదే స్థాయిలో ఉంటే, 64 కంపెనీలు మైక్రోక్యాప్‌ (మరీ చిన్నవి)గా కరిగిపోయాయి.  

ఎంపిక ఎలా..?
‘‘చిన్న కంపెనీలు అధిక వృద్ధి సామర్థ్యాలతో ఉంటాయి. దాదాపు ఇవి అనలిస్టుల సెల్‌ కాల్‌ పరిధిలో ఉండవు. కనుక స్మాల్‌ క్యాప్‌ కంపెనీలను అధ్యయనం చేసేందుకు ప్రాథమిక పరిశోధన అవసరం. అన్ని మార్కెట్‌ సైకిల్స్‌లోనూ ఇవి అధిక రాబడులను ఇవ్వగలవు’’ అని ఓపీసీ అస్సెట్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అజయ్‌ బగ్గా పేర్కొన్నారు. ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ అంబరీశ్‌ బలిగ అభిప్రాయంలో.. ‘‘స్మాల్‌క్యాప్‌ స్టాక్‌ ఎంపికకు ఏ ఒక్క విధానం అంటూ లేదు. కాకపోతే నేను అనుసరించే మార్గదర్శకాలు ఏమిటంటే.. ఎంపిక చేసుకోబోయే స్టాక్‌ మంచి పనితీరు చూపిస్తున్న రంగానికి చెందినదై ఉండాలి.

లేదా మంచి పనితీరు చూపించేందుకు అవకాశం ఉన్న రంగంలో పనిచేస్తూ ఉండాలి. ఆయా కంపెనీ ఏదైనా ఉప విభాగంలో లీడర్‌గా ఉందా అని చూస్తాను. లేదంటే లీడర్‌గా ఎదిగే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తాను. ఆయా రంగం వృద్ధికి మించి పనితీరు చూపిస్తూ ఉండాలి’’అని వివరించారు. ఇక స్మాల్‌క్యాప్‌ కంపెనీల విషయంలో లిక్విడిటీ (షేర్ల లభ్యత) కూడా కీలకమేనని అంబరీశ్‌ తెలిపారు. ‘‘బ్యాలన్స్‌ షీటులో రుణ భారం ఎక్కువగా ఉండకూడదు. రుణ భారం ఉంటే, భవిష్యత్తులో పెరిగే నగదు ప్రవాహాల పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడే ఈక్విటీ–రుణభారం నిష్పత్తి దిగొస్తుంది’’అని వివరించారు. లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే అది షేరు ధర పతనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాణ్యతపై దృష్టి కీలకం
‘‘స్మాల్‌క్యాప్‌ కంపెనీలు ఎప్పుడూ కూడా లిక్విడిటీ పరంగా సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటే ర్యాలీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, షేరు ధర వేగంగా పడిపోయే అవకాశాలు సైతం ఉంటాయి. స్మాల్‌క్యాప్‌ పరంగా ఉండే కీలకమైన అంశం ఇదే. అందుకే మార్కెట్లో వాటి ధరలు మానిప్యులేషన్‌కు లోనవుతుంటాయి’’అని కేఆర్‌ చోక్సే ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ దేవేన్‌ చోక్సే వివరించారు. ఇక యాజమాన్యం సమర్థత, నిజాయితీ తదితర అంశాలు కూడా ఈ విభాగంలో కీలకంగా పనిచేస్తాయని అంబరీష్‌ బలిగ వివరించారు.

యాజమాన్యం విషయంలో కనిపించని విషయాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని సూచించారు. షేరు ధర చౌకగా ఉందా లేక స్మాల్‌క్యాప్‌ అని కాకుండా, నాణ్యతకు సంబంధించిన అంశాలు చూడాలని నిపుణుల సూచన. యాజమాన్యానికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా? కంపెనీ భిన్నంగా ఏదైనా చేయగలదా? పోటీ తత్వం లేదా టైఅప్‌ల ద్వారా భిన్నంగా ప్రయతి్నంచగలదా? పరిమిత మూలధన నిధులతోనే వృద్ధి చెందగలదా? భారీ వృద్దికి అవకాశం ఉన్న రంగంలోనే పనిచేస్తుందా? అన్న అంశాలను చూడాలి.

ఎంపిక చేసుకునే కంపెనీకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు మధ్యలో తాత్కాలికంగా ఏవైనా ఆటుపోట్లతో దారి తప్పినా.. తిరిగి మళ్లీ గాడిలో పడి దూసుకుపోయే అవకాశాలుంటాయి.  యాజమాన్యం సామార్థ్యాలు, బలాలకు తోడు ఆ వ్యాపారం విస్తరణకు అవకాశం ఉందా? అప్పటికే ఆ కంపెనీలో ఇనిస్టిట్యూషన్స్‌ లేదా హెచ్‌ఎన్‌ఐలకు (బడా ఇన్వెస్టర్లు) వాటాలున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఆయా కంపెనీ కస్టమర్లు, వెండర్లు, పోటీ కంపెనీలను కలసి మాట్లాడడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అంబరీష్‌ బలిగ సూచించారు. పైగా అన్ని సానుకూలతలు ఉండి, కంపెనీని ఎంపిక చేసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు వేచి చూసే ఓపిక కూడా దండిగా ఉండాలన్నది మార్కెట్‌ పండితుల స్వీయ అనుభవం.

ఎవ్రీ డాగ్‌ హ్యాజ్‌ ఏ డే అన్న చందంగా ప్రతీ నాణ్యమైన కంపెనీకి అనుకూల తరుణం వచ్చే వరకు ఆగాల్సిందే. పైగా ఒక్కసారి పెట్టుబడి పెట్టి రిలాక్స్‌ అయ్యే ధోరణి స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు అస్సలే పనికిరాదు. ఎలాంటి సానుకూలతలు చూసి, సంబంధిత కంపెనీలో పెట్టుబడి పెట్టారో.. వాటిల్లో మార్పు లేనంత వరకు పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. తేడా వస్తే బయటకు వచ్చేందుకు సిద్ధంగానూ ఉండాలి. కంపెనీ వృద్ధి పథంలో సాగుతున్నంత కాలం ర్యాలీ చేస్తున్నప్పటికీ ఆ పెట్టుబడితో కొనసాగొచ్చు. అలాంటప్పుడే అవి మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌గా అవతరించగలవు. అలా మంచి పనితీరును క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న సమయంలో మరింత మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులకు ముందుకు వస్తారు. దీంతో విస్తృతి పెరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement