
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు దూసుకెళ్తున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.
లావాదేవీలు తక్కువేం కాదు..
2023–24లో యూపీఐ లావాదేవీల విలువ రూ.200 లక్షల కోట్లు దాటింది. లావాదేవీల సంఖ్య 13,100 కోట్ల పైచిలుకు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీల వాటా 62.35 శాతం. వ్యక్తుల మధ్య జరిగినవి 37.75 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య జరిగిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ చేసేవి ఏకంగా 86 శాతం నమోదయ్యాయి. ఇక మొత్తం రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 80 శాతానికి చేరిందని ఆర్థిక శాఖ ప్రకటించింది. 2025 జనవరి నాటికి 641 బ్యాంకులు, 80కిపైగా యాప్స్ యూపీఐ సేవలు అందించాయి.
అగ్రస్థానంలో ఫోన్‌పే
యూపీఐ విభాగంలో ఫోన్‌పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్‌పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్‌మెంట్ అద్దె ఎంతంటే..?
జనవరిలో ఇలా..
2025 జనవరిలో నమోదైన రూ.23,48,037 కోట్లలో వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు 73 శాతం. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగినవి 27 శాతం. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.2,000లకుపైగా విలువ చేసే లావాదేవీల వాటా 87 శాతం ఉంది. రూ.501–2,000 మధ్య 10%, రూ.500 లోపు 3% నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.2,000పైగా విలువ చేసే లావాదేవీలు 67 శాతం, రూ.501–2,000 మధ్య 17 శాతం, రూ.500 లోపు 16 శాతం ఉన్నాయి. ఇక లావాదేవీల సంఖ్య పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 62 శాతం, వ్యక్తుల మధ్య 38 శాతం నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వర్తకుల మధ్య రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 86 శాతం ఉంది. రూ.501–2,000 మధ్య 10 శాతం, రూ.2,000పైన 4 శాతం ఉన్నాయి.

Comments
Please login to add a commentAdd a comment