పంజాబీ–కెనడియన్ అను చౌహాన్ ఇలస్ట్రేటర్, వీడియో గేమ్ ఆర్టిస్ట్. సాంస్కృతిక–సాహిత్య వైభవాన్ని కళలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది అను. ఆమె చిత్రాల్లో ఎన్నడూ చూడని మొక్కల నుంచి గ్లోబల్ ఫ్యాషన్ వరకు కనువిందు చేస్తాయి...
కెనడాలో పుట్టి పెరిగిన అను చౌహాన్‌కు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాలుగు సంవత్సరాల వయసులో స్క్రీన్‌పై కనిపిస్తున్న డిస్నీ కార్టూన్‌ను చూస్తూ బొమ్మ వేయడానికి ప్రయత్నించింది. హైస్కూల్ రోజులకు వచ్చేసరికి ఇలస్ట్రేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఆ సమయంలోనే ఇలస్ట్రేటర్ కావాలని బలంగా అనుకుంది. అను అభిరుచికి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు.
ఇంటరాక్టివ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ చేసి, యానిమేషన్ సబ్జెక్ట్ చదువుకున్న అను చౌహాన్ తనలోని సృజనాత్మకతను కాపాడుకోవడానికి నిత్యనూతనంగా ఆలోచించేది. చిత్రకళలో తనదైన శైలిని రూపొందించుకునే ప్రయత్నం చేసేది. చదువు పూర్తయిన తరువాత మొబైల్ గేమ్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది. అంతర్జాలంలో పోస్ట్ చేసిన ఆమె ఆర్ట్‌వర్క్స్‌కు మంచి స్పందన లభించేది. కొద్ది కాలంలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య వందలు దాటి వేలల్లోకి వచ్చింది.
‘నా ప్రతి చిత్రం ఒక కథ చెప్పాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా కథలోని పాత్రలు దక్షిణ ఆసియాకు చెందినవి. ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లు కాకుండా ఆ పాత్రలు మనకు సుపరిచితమైనవి అన్నట్లుగా ఉండాలి. బొమ్మల ద్వారా కూడా స్త్రీ సాధికారతకు సంబంధించిన విషయాలను ప్రచారం చేయవచ్చు’ అంటుంది అను. ప్రపంచంలో ఏ మూల ఏ కొత్త డిజైన్ వచ్చినా దాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంటుంది అను. 1960– 1970లలో వచ్చిన ఫ్యాషన్ అండ్ ఆర్ట్ వర్క్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం.
‘వీడియో గేమ్స్, డిస్నీ, బాలీవుడ్...ఇలా ఎన్నో అంశాలు నా ఆర్ట్‌పై ప్రభావం చూపాయి’ అంటున్న అను చౌహాన్ తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కూడా స్ఫూర్తి పొందుతుంది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లింగ్ బుక్ ‘అరు షా అండ్ ది ఎండ్ ఆఫ్ టైమ్’ గ్రాఫిక్ ఎడాప్షన్ కోసం వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. మహక్ జైన్ రాసిన ‘భరతనాట్యం ఇన్ బాలెట్ షూస్’ పుస్తకానికి అను చౌహాన్ వేసిన బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
పిల్లల కోసం అను రూపొందించిన ‘ఏ దుపట్టా ఈజ్’ ‘హెన్నా ఈజ్’ పుస్తకాలు సూపర్‌హిట్ అయ్యాయి. ‘క్రియేటిక్ వర్క్ ద్వారా జీవితాన్ని సంతోషంగా గడపాలనేది నా కోరిక. వెబ్‌కామిక్ చేయాలనేది నా కల. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో తెలియదు అనే ఎరుకతో చిత్రకళ ద్వారా ప్రతి క్షణం ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది అను.
Comments
Please login to add a commentAdd a comment