సముద్రం నిత్యం ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఘోషకు భావకవులు రకరకాల అర్థాలు చెప్తుంటారు. కానీ సముద్రం లోపల ఏముంది? సముద్రం లోపల మరో ప్రపంచం ఉంది. పగడపు దీవులమయమైన ఆ అందమైన ప్రపంచాన్ని చందమామ కథల్లో చదివాం. మన ఊహల్లో అద్భుతమైన దృ«శ్యాన్ని ఊహించుకున్నాం. ఇప్పటికీ అదే ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహలో నుంచి వాస్తవంలోకి రమ్మని చెబుతున్నారు ఉమామణి. ఒకప్పుడు అందమైన పగడపు దీవులను చిత్రించిన ఆమె కుంచె ఇప్పుడు అంతరించిపోయిన పగడపు దీవులకు అద్దం పడుతోంది.
బొమ్మలేయని బాల్యం..
‘‘మాది తమిళనాడులోని దిండిగల్. నాకు బొమ్మలేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తూ కనిపించేదాన్ని. అది చూసి నానమ్మ ‘పిచ్చి బొమ్మల కోసం కాగితాలన్నీ వృథా చేస్తున్నావు. చక్కగా చదువుకోవచ్చు కదా’ అనేది. అలా ఆగిపోయిన నా చిత్రలేఖనం తిరిగి నలభై దాటిన తర్వాత మొదలైంది. ఈ మధ్యలో నాకు ఓ డాక్టర్‌తో పెళ్లి, వారి ఉద్యోగరీత్యా మాల్దీవులకు వెళ్లడం, ఓ కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి కాలేజ్ వయసు రావడం జరిగిపోయాయి.
ఇంతకాలం గృహిణిగా ఉన్న నాకు కొడుకు కాలేజ్‌కెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని చిన్నప్పుడు తీరని కోరిక కోసం కేటాయించాను. గులాబీల నుంచి టులిప్స్ వరకు రకరకాల పూలబొమ్మలు వేసిన తర్వాత నా చుట్టూ ఉన్న సముద్రం మీదకు దృష్టి మళ్లింది. పగడపు దీవులు నా చిత్రాల్లో ప్రధాన భూమిక అయ్యాయి. తొలి చిత్ర ప్రదర్శన మాల్దీవులలోని మెరైన్ సెంటర్‌లో పెట్టాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. వివాంత మాల్దీవ్స్ ప్రదర్శన సమయంలో ఒక భారతీయ మహిళ వేసిన ప్రశ్న నా దిశను మార్చింది.
‘సముద్ర గర్భం ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో స్వయంగా చూడకుండా బొమ్మలేయడం ఏమిటి’ అన్నదామె. ఆమె వ్యాఖ్య నాకు మొదట్లో అసమంజసంగా అనిపించింది. అనేక పరిశోధకుల డాక్యుమెంటరీలను చూసిన అనుభవంతోనే కదా చిత్రించాను. నేను స్వయంగా చూస్తే కొత్తగా కనిపించేది ఏముంటుంది... అని కూడా అనుకున్నాను. ఇంత సందిగ్ధం ఎందుకు... ఒకసారి సముద్రగర్భంలోకి వెళ్లి చూద్దాం అని కూడా అనుకున్నాను. అప్పుడు మా అబ్బాయి మా ΄ాతికేళ్ల వివాహ వార్షికోత్సవం బహుమతిగా నన్ను స్కూబా డైవింగ్ కోర్సులో చేర్చాడు.
డైవింగ్‌కంటే ముందు ఈత రావాలి కదా అని చెన్నైకి వచ్చి రెండు వారాల స్విమ్మింగ్ కోర్సులో చేరాను. తిరిగి మాల్దీవులకెళ్లి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తొలి రోజు అంతా అగమ్యంగా అనిపించింది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మానేద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. కోచ్ నా మాటలు పట్టించుకోలేదు. ప్రయత్నాన్ని కొనసాగించమని మాత్రం చె΄్పారు. నాకు నేను నెల రోజుల గడువు పెట్టుకున్నాను. ఆ నెలలో నావల్ల కాకపోతే మానేద్దామని నా ఆలోచన. ఆ నెల రోజుల్లో డైవింగ్‌కి అనుగుణంగా మానసికంగా ట్యూన్ అయిపోయాను.
సముద్రగర్భాన్ని చిత్రించాను..
సముద్రం అడుగున దృశ్యాలు నన్ను వేరేలోకంలోకి తీసుకెళ్లిపోయాయి. పగడపు చెట్లు నిండిన దిబ్బలు, రకరకాల చేపలు, ΄ాములు ఒక మాయా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచాన్ని కాన్వాస్ మీద చిత్రించడం మొదలుపెట్టాను. ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య మాటల్లో వర్ణించలేనంత వైవిధ్యత వచ్చేసింది. ఆ చిత్రాలన్నింటినీ మాల్దీవుల మెరైన్ సింపోజియమ్ 2016లో ప్రదర్శించాను. ఆ చిత్రాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌లా ఓషన్ రీసెర్చర్‌లు, అంతరించిపోతున్న పగడపు దిబ్బల పరిశోధకులకు ఉపయోగపడ్డాయి.
కొంతకాలం తర్వాత సముద్రగర్భంలోని సన్నివేశాలను కెమెరాలో బంధించాలనుకున్నాను. ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోవడంతో శబ్దరహితంగా పేలవంగా వచ్చింది ఫిల్మ్. అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీలు తీసే వారి దగ్గర మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. చాలామంది స్పందించలేదు. ఫిల్మ్ మేకర్ ప్రియా తువాస్సెరీ మాత్రం నాతో కలిసి ఫిల్మ్ తీయడానికి సిద్ధమయ్యారు.
చిత్రీకరణ కోసం 2018లో మనదేశంలోని రామేశ్వరం, రామనాథపురం, టూటికోరన్ తీరాల్లో డైవ్ చేశాను. ఆశ్చర్యంగా సముద్రం అడుగుకి వెళ్లే కొద్దీ పగడపు దిబ్బలు కాదు కదా జలచరాలు కూడా కనిపించలేదు. ΄్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బలుగా పేరుకుపోయి ఉన్నాయి. రసాయనాలు, పురుగుమందులు, ఎరువుల వ్యర్థాలను సముద్రపు నీటిలోకి వదలడంతో జలచరాలు అంతరించిపోయాయి. సునామీ విలయంలో పగడపు దీవులు అతలాకుతలం అయిపోయాయి. శిథిలమైన ఆనవాళ్లు తప్ప పగడపు చెట్ల సమూహాలు లేవు. చెట్లు చనిపోయిన దిబ్బలనే వీడియో, ఫొటోలు తీశాను.
మనిషి తన సౌకర్యం కోసం చేసే అరాచకానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతోందో తెలియచేస్తూ ఆ ఫొటోలతో ప్రదర్శన పెట్టాను. మా సొంతూరు తమిళనాడులోని దిండిగల్‌తో మొదలు పెట్టి అనేక స్కూళ్లు, కాలేజ్‌లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాను. సముద్రం ఘోషిస్తోంది. ఆ ఘోషను విందాం. ప్రకృతి సమతుల్యతను కా΄ాడుకుందాం. ఓషన్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మీద పరిశోధన చేసే వాళ్లకు నేను తీసిన ఫొటోలు, చిత్రలేఖనాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌లా ఉపయోగపడుతున్నాయి.
ఒక సాధారణ గృహిణిగా నేను 43 ఏళ్ల వయసులో కుంచె పట్టి పెయింటింగ్స్ మొదలుపెట్టాను. 49 ఏళ్లకు స్కూబా డైవింగ్ నేర్చుకుని సాగర సత్యాలను అన్వేషించాను. సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాననే సంతృప్తి కలుగుతోంది. మొత్తంగా నేను చెప్పేదేమిటంటే ‘వయసు ఒక అంకె మాత్రమే. మన ఆసక్తి మనల్ని చోదకశక్తిగా నడిపిస్తుంది’. అంటారు ఉమామణి.
ఇవి చదవండి: Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
Comments
Please login to add a commentAdd a comment