wireless data services
-
నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!
నెట్వర్క్ సేవల్లో అంతరాయం కలగడం సాధారణంగా దాదాపు అందరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కోసారి 24 గంటలైనా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. అయినా ప్లాన్ గడువులో ఎలాంటి మార్పులుండవు. సర్వీస్ ప్రొవైడర్లు ప్రతిపాదించిన రీచార్జ్ చెల్లించాల్సిందే. పోస్ట్‌పోయిడ్ కస్లమర్ల పరిస్థితి అంతే. ఇకపై ఏదైనా నెట్వర్క్ సమస్య తలెత్తితే అందుకు అనుగుణంగా బిల్లు చెల్లింపుల్లో రాయితీ పొందేలా టెలికాం ప్రాధికార సంస్థ(ట్రాయ్) నిబంధనలను తీసుకొచ్చింది.ట్రాయ్ విడుదల చేసిన క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం..టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో అందించే నెట్వర్క్ సేవల్లో 24 గంటల కంటే ఎక్కువసేపు అంతరాయం కలిగితే పరిహారం చెల్లించాలి. ఈమేరకు గతంలోని జరిమానాను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. దాంతోపాటు వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు ‘ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెస్ (వైర్‌లైన్స్ అండ్ వైర్లెస్), బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 2024’ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు ఆరునెలల తర్వాత అమల్లోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది.గతంలోని సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ సేవల నాణ్యత వంటి మూడు నిబంధనలను భర్తీ చేస్తూ కొత్తవాటిని ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం..పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించే సేవల్లో అంతరాయం ఏర్పడితే నెలవారీ బిల్లులో రాయితీ ఇవ్వాలి. ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ప్లాన్ వ్యాలిడిటీ గడువు పెంచాలి. అయితే ఏదైనా వాతావరణ విపత్తు వల్ల నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడితే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదలఫిక్స్డ్-లైన్ సర్వీస్ ప్రొవైడర్లు(కేబుల్ నెట్వర్క్) కూడా పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్ల సమస్యలను మూడు రోజులలోపు పరిష్కరించాలి. లేదంటే పరిహారం చెల్లించాలి. మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వెబ్సైట్లో వినియోగదారులకు సహాయపడే సేవల వారీగా (2G, 3G, 4G, 5G) జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను అందించాలని ట్రాయ్ పేర్కొంది. -
డేటా వాడేస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వైర్లెస్ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్లెస్ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 66.48 కోట్లకు చేరారు. 2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా అధికమవుతోందని ట్రాయ్ అంటోంది. ‘4జీ/ఎల్టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్ నెట్వర్క్స్ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం ఇంటర్నెట్ వాడకాన్ని పెంచింది. మొబైల్ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్ టైమ్ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్ తెలిపింది. -
వైర్లెస్ నెట్‌కు ఇక కనీస స్పీడ్!
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదార్లకు కనీస డేటా డౌన్లోడ్ స్పీడ్‌పై టెలికం కంపెనీల నుంచి త్వరలో స్పష్టమైన, కచ్చితమైన హామీ లభించనుంది. ఈ మేరకు త్వరలో టెల్కోలకు నింయత్రణ సంస్థ ట్రాయ్ మార్గదర్శకాలను జారీచేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో 2జీ లేదా 3జీ ఏ మొబైల్ సేవలకైనా ఇంటర్నెట్ద్వారా కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతనే వివరాలను టెల్కోలు తప్పనిసరిగా తమ కస్టమర్లకు వెల్లడించాల్సి ఉంటుంది. తమ మొబైల్స్‌లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాయ్ దీనిపై దృష్టిసారించింది. తాజాగా విడుదల చేసిన చర్చాపత్రంలో పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం టెల్కోలకు వైర్లెస్ డేటా సేవలకు సంబంధించి కనీస స్పీడ్‌ను అందించే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో కొన్ని కంపెనీలు సెకనుకు 7.2 మెగాబైట్స్(ఎంబీపీఎస్), మరికొన్ని 21 ఎంబీపీఎస్ అంటూ అధిక డేటా స్పీడ్ లతో కస్టమర్లకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. తీరా వాడకానికొస్తే డౌన్లోడింగ్ సమయంలో తగిన స్పీడ్ లేక యూజర్లు ఉసూరుమనాల్సిన పరిస్థితి నెలకొంది. హైస్పీడ్ 3జీ నెట్‌వర్క్‌లో కనీస డౌన్లోడ్ స్పీడ్ ప్రస్తుతం 399 కేబీపీఎస్ నుంచి 2.48 ఎంబీపీఎస్‌గా స్థాయిలో ఉంది. కాగా, 3జీ, సీడీఎంఏ(ఈవీడీఓ డాంగిల్) సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గా(95% కచ్చితత్వం) నిర్ణయించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అదేవిధంగా జీఎస్ఎం, సీడీఎంఏ 2జీ సేవలకు కనీస డౌన్లోడ్ స్పీడ్ 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా చేయాలనుకుంటోంది. అంతేకాదు ప్రతి టారిఫ్ ప్లాన్‌కు సంబంధించి కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను రీచార్జ్ వోచర్లు, వెబ్సైట్లు, యాడ్లలో కూడా కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చర్చాపత్రంపై అన్నివర్గాలు అభిప్రాయలు తెలిపేందుకు మే 5 వరకు గడువుఇచ్చింది.