data usage
-
జియో సరికొత్త రికార్డ్.. అదేంటో తెలుసా?
డేటా వినియోగం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్‌గా రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. చైనా కంపెనీలను సైతం జియో వెనక్కు నెట్టి మొదటి స్థానం ఆక్రమించుకుంది.జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. మొత్తం డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీ దాటినట్లు తెలిసింది. ఇది గతేడాదికంటే కూడా 33 శాతం ఎక్కువని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం యూజర్లు ప్రతిరోజూ 1 జీబీ కంటే కూడా ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.5జీ డేటా ఉపయోగించే కస్టమర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లకు చేరింది. అర్హత కలిగిన కస్టమర్లు 4జీ ప్లాన్ రీఛార్జ్ మీద 5జీ డేటాను ఉపయోగించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 5జీ డేటా ఉపయోగించేవారు సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జియోకు 49 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.జియో డేటా ఉపయోగించే మొబైల్ యూజర్ల సంఖ్య మాత్రమే కాకుండా.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువమంది ఎయిర్‌ఫైబర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. -
‘స్మార్ట్’ తెలంగాణ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి వ్యవసాయంలో ఆధునికత పెరిగిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో సాగు దాదాపుగా కనుమరుగైపోతోంది. విత్తనాలు నాటాలన్నా యంత్రాలే..కోత కోయాలన్నా యంత్రాలే. ఇక మధ్యలో పంటలను ఆశించే తెగుళ్లను నిర్మూలించేందుకూ ఆధునిక స్ప్రే పరికరాలు వచ్చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి..కానీ ఏ పనికి ఏ పరికరం వాడాలి?, ఏ తెగులు సోకితే ఏ మందు వాడాలి?, పంటల ఎదుగుదల సరిగ్గా లేకుంటే ఏం చేయాలి?..ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, పరిష్కారం దొరికినట్టేనని అంటున్నాడు కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం రామానుజరెడ్డి. తనకున్న యాభై ఎకరాల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తూ చీడపీడలకు ‘స్మార్ట్ ఫోన్ వైద్యం’చేస్తున్నాడు. తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్లాంటిక్స్, అగ్రిసెంటర్, కిసాన్ తదితర యాప్‌ల సహాయంతో మొక్కలు ఎదగకపోయినా లేదా తెగులు కనిపించినా ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే గంటల వ్యవధిలోనే తగు సలహాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్‌లో శోధించడం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ–పేమెంట్లు కూడా పెరిగిపోవడం స్మార్ట్ ఫోన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తోంది. జోరుగా ఆన్లైన్ సర్వీసులు 2022లో తెలంగాణలో టెలిడెన్సిటీతో పాటు డిజిటల్ లైఫ్ గణనీయంగా పెరిగిపోయింది. దేశ సగటుకు మించిన స్మార్ట్ సిటిజెన్ (స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు), డేటా వినియోగంతో పాటు ఆన్లైన్ సర్వీసులు, పేమెంట్లు జోరుగా సాగుతున్నాయి. టెలిడెన్సిటీ (ఎంత మందికి ఎన్ని సిమ్‌లు)ని తీసుకుంటే 2022 ట్రాయ్ తాజా నివేదిక మేరకు తెలంగాణలో 100 మంది 110 సెల్‌ఫోన్ సిమ్కార్డులున్నాయి. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో 4.22 కోట్ల సిమ్ కార్డులుండగా వీటిలో 1.80 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కేరళ 100 మందికి 123 సిమ్‌లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సెకండ్ ప్లేస్‌కు చేరింది. రాష్ట్రాల వారీగా ప్రతి 100 మందికి వాడుతున్న సిమ్ల వివరాలు ఈ పేమెంట్లలో టాప్ ఫైవ్‌లో హైదరాబాద్ కోవిడ్‌తో వేగం పుంజుకున్న ఈ పేమెంట్ల జోరు 2022లో కూడా కొనసాగింది. ఒకరి నుండి ఒకరికి, సంస్థల నుండి బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ మినహాయిస్తే.. వ్యక్తిగత లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ – 2022) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఈ కామర్స్ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ, ముంబై అనంతరం హైదరాబాద్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లావాదేవీల కోసం అత్యధికంగా ఫోన్‌పే (47.8%), గూగుల్‌పే (33.6%), పేటీఎం (13.2%) లను ప్రజలు వినియోగిస్తున్నారు. నగదు వాడేదే లేదు..! ప్రపంచంలో 63 దేశాలు చుట్టివచ్చా. ఇండియాలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లా. విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి కరెన్సీ తీసుకుంటా. ఇండియాలో మాత్రం నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు. ఇక హైదరాబాద్‌లో అయితే అన్నీ ఆన్లైన్లోనే. – నీలిమారెడ్డి, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ సిటిజెన్ సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వ, ప్రైవేటు సేవలు చాలావరకు ఆన్‌లైన్‌లోకి రావటం వల్లే టెలిడెన్సిటీ పెరిగింది. దీంతో పాటు ఆన్లైన్ లావాదేవీలు పెరిగి తెలంగాణలో స్మార్ట్ సిటిజెన్ సంఖ్య దేశ సగటు కంటే పెరుగుతూ వస్తోంది. అలాగే దేశంలో అత్యధిక డేటా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దీని ఫలితాలు అన్ని రంగాల్లోనూ రావటం మొదలయ్యాయి. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ -
ఒక్క నిమిషమే కదా అనుకుంటే..? ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఒక్క నిమిషం.. ఇందులో ఏముంది. సింపుల్‌గా గడిచిపోతుంది. ఒక పాట వినాలన్నా, చూడాలన్నా నాలుగైదు నిమిషాలు పడుతుంది అంటారా? కానీ ఒక్క నిమిషంలో డిజిటల్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా.. ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఆన్లైన్ సేవల సంస్థ డొమో దీనిపై పరిశీలన జరిపి నివేదిక రూపొందించింది. మరి ఒక్క నిమిషంలో ఏమేం జరుగుతోందో చూద్దామా.. డేటా లెక్క.. నోరు తిరగనంత! ♦స్టాటిస్టా సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న జనాభా సంఖ్య 500 కోట్లు దాటింది. ♦మొత్తం భూమ్మీద ఉన్న జనాభాలో ఇది 62 శాతం ♦ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారిలో ఏకంగా 93 శాతం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ♦2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా సృష్టించిన, కాపీ చేసిన, వినియోగించిన డేటా లెక్కఎంతో తెలుసా.. ♦97 జెట్టాబైట్లు.. అంటే లక్ష కోట్ల జీబీ (గిగాబైట్లు) డేటా అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే 10,00,00,00, 00,000 జీబీలు. -
డేటాకు ‘మెటావర్స్’ దన్ను..
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థ క్రమంగా మెటావర్స్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది 20 రెట్లు వృద్ధి చెందనుంది. దేశీయంగా కూడా ఇదే ధోరణి కారణంగా.. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. క్రెడిట్ సూసీ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగించే మెటావర్స్ వల్ల యూజర్లు స్క్రీన్ చూడటంపై వెచ్చించే సమయం పెరగనుండటంతో.. డేటా వినియోగానికి గణనీయంగా ఊతం లభిస్తుందని పేర్కొంది. ‘ఇంటర్నెట్ వినియోగంలో 80 శాతం భాగం వీడియోలదే ఉంటోంది. ఇది వార్షికంగా 30 శాతం మేర వృద్ధి చెందుతోంది. మెటావర్స్‌ను ఒక మోస్తరుగా వినియోగించినా .. దీనివల్ల డేటా యూసేజీ, వచ్చే దశాబ్దకాలంలో ఏటా 37 శాతం చొప్పున వృద్ధి చెంది, ప్రస్తుత స్థాయి కన్నా 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక తెలిపింది. మెటావర్స్‌కి సంబంధించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీల వినియోగం భారీగా పెరగనుందని వివరించింది. బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకం.. మెటావర్స్ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకమని క్రెడిట్ సూసీ తెలిపింది. ప్రజలు రోజూ అత్యధిక సమయం మొబైల్‌ను వినియోగించే టాప్ దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇక్కడ తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో దీని విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉంది. ‘భారతీయ టెల్కోల ఆదాయాలపై మెటావర్స్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ .. మెటావర్స్ ప్రేరిత డేటా వినియోగం దన్నుతో ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో భారతి ఎయిర్టెల్ (ఆదాయాల్లో బ్రాడ్‌బ్యాండ్ వాటా 17 శాతం), జియో గణనీయంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాం‘ అని క్రెడిట్ సూసీ తెలిపింది. 6జీతో మరింత ఊతం .. మెటావర్స్ వ్యవస్థకు 5జీ టెలికం సర్వీసులు తోడ్పడనున్నప్పటికీ దీన్ని మరిన్ని అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చేందుకు 6జీ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మిగతా విభాగాలతో పోలిస్తే ఎక్కువగా గేమింగ్ సెగ్మెంట్లో మెటావర్స్ వినియోగం ఉండవచ్చని పేర్కొంది. దేశీయంగా గేమింగ్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్ఫోన్లు, 4జీ డేటా సర్వీసుల కారణంగా అధిక స్థాయిలో గేమింగ్.. మొబైల్ ఫోన్ల ద్వారానే ఉంటోందని వివరించింది. ‘స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల ఆన్లైన్ వినియోగానికి భారత యూజర్లు.. మొబైల్ ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్‌కు సంబంధించి మొబైల్ గేమింగ్ వాటా భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. -
అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను..
Mobile Data Usage And Data Saving Tips In Telugu: ఎన్నిసార్లు చెప్పా.. ఇంటర్నెట్ప్యాక్ కోసం ఎక్స్ట్రా రీఛార్జ్ అడగొద్దని? అంటూ అసహనంగా చెల్లిని మందలించాడు ప్రశాంత్. ‘ఏం చేయను అన్నయ్యా.. డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది. ఆ విషయం తెలియకుండానే మొబైల్ డేటా లిమిట్ దాటేసిందని అలర్ట్ వస్తోంది’ అంటూ ముఖం వేలాడేసుకుని సమాధానం ఇచ్చింది గిరిజ. ఇంతకీ మొబైల్ డేటా లిమిట్ ఆన్‌లో పెట్టుకున్నావా? అని ప్రశాంత్ అనడంతో బిక్క ముఖం వేసింది గిరిజ. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే కోట్ల మంది ఎదుర్కొనే సమస్య.. వేగంగా మొబైల్ డేటా అయిపోవడం. వైఫై కనెక్షన్ లేని ఇళ్లలో మొబైల్ డేటానే ఆధారం. ఓటీటీ, ఇతరత్రా సోషల్ యాప్‌లను ఉపయోగిస్తూ రోజూ వారీ డేటా ఎలా అయిపోతోందో కనీసం తెలియదు కూడా. ఫుల్ సిగ్నల్ ఉందని.. ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తోందని సంబరపడేవాళ్లు.. ఇంటర్నెట్ డేటా ఫటా ఫట్ అయిపోతుందని మాత్రం గుర్తించరు!. డేటా లిమిట్ మ్యాగ్జిమమ్ దాటి వెళ్లకుండా ఉండేదుకు పర్యవేక్షణ, పరిమితం చేయడం లాంటి మార్గాలు ఉంటాయని గుర్తిస్తే చాలు కదా!. ►మొబైల్ డేటా వాడకాన్ని మానిటరింగ్ చేయడం చాలా సులువు. ఏదైనా ఒక యాప్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకున్నప్పుడు.. యాప్ ఇన్ఫో app info అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే నేరుగా యాప్ సెట్టింగ్ పేజ్‌కి వెళ్తుంది. అక్కడ మొబైల్ డేటా&వైఫై ఆప్షన్ కనిపిస్తుంది. పైన బ్యాక్‌గ్రౌండ్-ఫోర్‌గ్రౌండ్‌లో ఆ యాప్ ఎంత డేటాను తీసుకుంటుందనే విషయం అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఆ యాప్ ఎక్కువ డేటాను లాగేస్తుందని అర్థమైతే.. వెంటనే అక్కడి ఆప్షన్స్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. ►ఇక ఫోన్ సెట్టింగ్స్ యాప్ Settings appలో డేటాసేవర్ Data Saver అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు వినియోగించుకుంటున్న డేటాను నియంత్రిస్తుంది. ►గూగుల్ ప్లే స్టోర్‌లో.. డేటా మేనేజ్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మానిటర్ చేసుకోవచ్చు. పైగా ఒకేసారి ఒక్కోయాప్ ఎంతెంత డేటా తీసుకుంటున్నాయో ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. గంట, రోజూ, వారాలు, నెలల తరబడి ఎంతెంత ఉపయోగిస్తున్నామో అక్కడ చూసుకోవచ్చు కూడా. ►కొన్ని ఫోన్లలో డేటా లిమిట్ ఆప్షన్ నేరుగా ఉంటుందన్నది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడ ఫలానా ఎంబీ నుంచి జీబీల్లో డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్లోగానీ, లేదంటే ఏదైనా ఓటీటీ యాప్‌లోగానీ సినిమా చూస్తూ ఉండిపోయినప్పుడు డేటా దానంతట అదే అయిపోతుంది. కానీ, లిమిట్ పెట్టుకోవడం వల్ల పరిధి దాటగానే అలర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ డేటాను నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా లిమిట్ Data limit అని టైప్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. మరికొన్ని ఫోన్లలో Data Warning ఫీచర్ కూడా ఉంటుంది. ►లైట్ వెర్షన్, అలర్ట్నేట్ వెర్షన్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా కూడా ఇంటర్నెట్ డేటాను తక్కువగా వాడొచ్చు. కానీ, వీటిలో చాలామట్టుకు సురక్షితమైనవి కానివే ఉంటాయి. కాబట్టి, ప్లేస్టోర్ నుంచి అథెంటిక్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు.. ఫేస్బుక్, ఇన్స్టలాంటి యాప్‌ల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండగానే.. డేటా అయిపోయినట్లు మెసేజ్ వస్తుంది. అవి ఎక్కుడ డేటాను లాగేస్తాయి కాబట్టి.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైట్ వెర్షన్ యాప్‌ల ఉపయోగించొచ్చు. మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు. చదవండి: ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా ఫోన్లో ఫ్రీ స్పేస్ పొందండి ఇలా.. -
ఆ విషయంలో ప్రపంచంలో మనమే టాప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ లేకుండా రోజు గడవడం కష్టమే. అంతలా ఈ ఉపకరణం జీవితంతో ముడిపడింది. భారత్‌లో సగటున ఒక్కో యూజర్ 4.48 గంటలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారట. ఈ స్థాయి వినియోగం ప్రపంచంలోనే అత్యధికమని నోకియా తెలిపింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం గతేడాది నాలుగు రెట్లు పెరిగింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 ప్రకారం.. మొబైల్లో సగటు 3జీ/4జీ డేటా వినియోగం నెలకు 2015లో 0.8 జీబీ నమోదైంది. ఇది అయిదేళ్లలో 17 రెట్లు అధికమై 2020లో 13.5 జీబీకి ఎగసింది. వార్షిక వృద్ధి రేటు 76 శాతముంది. డేటాలో 54 శాతం యూట్యూబ్, సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలకు, 46 శాతం ఫిట్నెస్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, ఈటైలింగ్కు వినియోగం అవుతోంది. 5జీ సేవల ప్రారంభానికి ఈ డేటా గణాంకాలు పునాదిగా ఉంటాయని నోకియా తన నివేదికలో వెల్లడించింది. 5జీ అందుబాటులోకి వస్తే డేటా గరిష్ట వేగం 1 జీబీకి చేరుతుందని అంచనా వేస్తోంది. మొబైల్ డేటాలో రెండవ స్థానం.. మొబైల్స్‌లో ఇంటర్నెట్ వాడకంలో ఫిన్లాండ్ తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. అయిదేళ్లలో 63 రెట్ల డేటా వృద్ధి జరిగింది. ఈ స్థాయి వినియోగంతో ఏ దేశమూ భారత్‌తో పోటీపడలేదని నోకియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్స్‌లో 2015 డిసెంబరులో భారత్‌లో 164 పెటాబైట్స్ డేటా వినియోగం అయింది. 2020 డిసెంబరుకు ఇది 10,000 పెటాబైట్స్ స్థాయికి వచ్చి చేరింది. ఒక పెటా బైట్ 10 లక్షల జీబీకి సమానం. ఇక మొత్తం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో.. ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 2019లో 15 శాతంలోపు ఉన్నాయి. 2025 నాటికి ఇది 48 శాతానికి చేరనుంది. 10 కోట్ల మంది 4జీ మొబైల్స్ ఉన్న కస్టమర్లు ఇప్పటికీ 2జీ లేదా 3జీ సేవలను వినియోగిస్తున్నారు. అధికంగా షార్ట్ వీడియోలే.. షార్ట్ వీడియోలను ప్రతి నెల సగటున 18 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వీక్షిస్తున్నారు. 2016తో పోలిస్తే ఈ సంఖ్య 9 రెట్లు పెరిగింది. ఒక నెలలో 110 బిలియన్ నిముషాలు ఈ షార్ట్ వీడియోలు చూసేందుకు గడిపారు. 2025 నాటికి ఇది నాలుగు రెట్లు అధికం కానుందని అంచనా. షార్ట్ వీడియోల కంటెంట్ అధికంగా ఉండడంతోపాటు యువత వీటివైపే మొగ్గు చూపుతున్నారు. 4జీ డేటా యూజర్లు 70.2 కోట్లున్నారు. డేటా ట్రాఫిక్ నాలుగేళ్లలో 60 రెట్లు పెరిగింది. ప్రపంచంలో ఇదే అధికం. డేటా ట్రాఫిక్‌లో 4జీ వాటా 99 శాతం, 3జీ ఒక శాతం ఉంది. దేశవ్యాప్తంగా 4జీ డివైస్‌లు 60.7 కోట్లు. మొత్తం మొబైల్స్‌లో 4జీ వాటా 77 శాతం. అలాగే 5జీ స్మార్ట్ఫోన్లు 20 లక్షలున్నాయి. 2.2 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) ఏటా 37 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం ఎఫ్టీటీహెచ్ ద్వారా 40 లక్షల గృహాలు, కార్యాలయాలు కనెక్ట్ అయ్యాయి. స్మార్ట్ డివైసెస్ విస్తృతం కావడంతో డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. -
నెలకు 25 జీబీ డేటా!!
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల ద్వారా డేటా వినియోగం 2025 నాటికల్లా నెలకు 25 జీబీ స్థాయికి చేరనుంది. చౌక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, వీడియోల వీక్షణలో మారుతున్న అలవాట్లు ఇందుకు కారణం కానున్నాయి. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 గణాంకాల ప్రకారం భారతీయులు నెలకు సగటున 12 జీబీ డేటా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇది అత్యధికం కావడం గమనార్హం. దేశీయంగా 2025 నాటికి కొత్తగా 41 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎడిటర్ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. అప్పటికి భారత్‌లో 18 శాతం మంది 5జీ నెట్‌వర్క్‌ను, 64 శాతం మంది 4జీ నెట్వర్క్, మిగతా వారు 2జీ/3జీ నెట్వర్క్ వినియోగిస్తుంటారని వివరించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2020 ఆఖరు నాటికి 5జీ యూజర్ల సంఖ్య 19 కోట్లుగా ఉండొచ్చని, 2025 ఆఖరు నాటికి ఇది 280 కోట్లకు చేరే అవకాశం ఉందని ఎరిక్సన్ అంచనా వేస్తోంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో 4జీ ప్రధాన మొబైల్ యాక్సెస్ టెక్నాలజీగా ఉంటుందని పేర్కొంది. -
డేటా వాడేస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వైర్లెస్ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్లెస్ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 66.48 కోట్లకు చేరారు. 2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా అధికమవుతోందని ట్రాయ్ అంటోంది. ‘4జీ/ఎల్టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్ నెట్వర్క్స్ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం ఇంటర్నెట్ వాడకాన్ని పెంచింది. మొబైల్ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్ టైమ్ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్ తెలిపింది. -
నాలుగేళ్లలో... స్మార్ట్ఫోన్ల రెట్టింపు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ విప్లవంతో భారత మొబైల్ ఫోన్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లుండగా... 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్ డివైజెస్) ప్రస్తుత 160 కోట్ల నుంచి 220 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకుంటాయని సిస్కో నివేదించింది. ఇలా కనెక్ట్ అయిన డివైజెస్‌లో 15.5 శాతం వార్షిక వృద్ధితో స్మార్ట్ఫోన్లే 38 శాతం ఉంటాయట. ఈ స్థాయి ఉపకరణాలతో ప్రస్తుతం 2.4 గిగాబైట్లుగా ఉన్న సగటు డేటా వాడకం ఏకంగా 14 గిగాబైట్లకు దూసుకుపోతుందని సిస్కో ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ కౌల్ తెలియజేశారు జనాభాలో 60 శాతం.. గత 32 ఏళ్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ ఒక ఎత్తయితే.. భారత్‌లో 2022లో నమోదయ్యే ట్రాఫిక్ ఒక ఎత్తు కానుంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ ట్రాఫిక్ గంటకు 60 లక్షల డీవీడీలకు సమానం కానున్నదనేది సిస్కో అంచనా. 2017లో దేశంలో ఇంటర్నెట్ కస్టమర్లు 35.7 కోట్లు. జనాభాలో ఇది 27 శాతం. 2022 నాటికి నెట్ యూజర్లు 84 కోట్లకు చేరనున్నారు. అంటే ఆ సమయానికి జనాభాలో ఈ సంఖ్య 60 శాతం కానుంది. ‘‘ఇంటర్నెట్ వినియోగంలో స్మార్ట్ఫోన్లే ప్రధానపాత్ర పోషిస్తాయి’’ అని ‘బిగ్ సి’ మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇక నాలుగేళ్లలో స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం అయిదు రెట్లు పెరగనుంది.సోషల్ మీడియా, వీడియోల వీక్షణం, కమ్యూనికేషన్, బిజినెస్ అప్లికేషన్స్ దీనికి ప్రధాన కారణమని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ చెప్పారు. డేటా వాడకం, అంచనాలు పెరిగే కొద్దీ సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయన్నారు. అంచనాలకు అందని అంకెలు.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు డేటా వినియోగం నెలకు 3.5 జీబీ ఉంది. 2022 నాటికి ఇది ఏకంగా 17.5 జీబీకి చేరనుంది. నెట్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లో మొబైల్‌కు అనుసంధానమయ్యేవి 68 శాతం ఉంటాయట. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య ప్రస్తుత 2 కోట్ల నుంచి 4.85 కోట్లకు పెరగనుంది. పర్సనల్ కంప్యూటర్లు 4.3 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 4.25 కోట్లకు వచ్చి చేరనున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు 13.74 కోట్లున్నాయి. నాలుగేళ్లలో ఇవి 26.3 కోట్లకు వృద్ధి చెందనున్నాయి. 14 లక్షల యూనిట్లుగా ఉన్న 4కే టీవీల సంఖ్య 2.5 కోట్లకు ఎగుస్తుంది. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్ల మొగ్గే ఈ స్థాయి డిమాండ్‌కు కారణమని హోమ్ బ్రాండ్ టీవీల పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఇక 9.5 ఎంబీపీఎస్‌గా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 3.3 రెట్లు దూసుకుపోనుంది. గతేడాది మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియోల (బిజినెస్, కం జ్యూమర్ కలిపి) వాటా 58%. నాలుగేళ్లలో ఇది 77%కి తాకుతుందని సిస్కో వెల్లడించింది. అల్ట్రా హెచ్డీ వీడియో ట్రాఫిక్ ప్రస్తుతం 1%. 2022 నాటికి దీని వాటా 10.6%గా ఉండనుంది. -
భారత్‌లో బ్రాడ్‌బాండ్ బాజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌బ్యాండ్.. ప్రపంచ దిశను మార్చేసిన సాంకేతిక ఆయుధం. ఈ ఆయుధం ఇప్పుడు భారత్‌లో డేటా వినియోగం, స్మార్ట్ఫోన్ల విషయంలో అనూహ్య పరిణామాలకు కారణమవుతోంది. ప్రపంచంలో అత్యధికంగా డేటాను వాడుతున్న దేశంగా భారత్‌ను నిలుపుతోంది. దేశవ్యాప్తంగా నెలకు 2,360 పెటాబైట్స్ డేటాను వినియోగదార్లు ఖర్చు చేస్తున్నారట!!. అంటే ఈ డేటా 52.6 కోట్ల డీవీడీల నిడివితో సమానం. ఒక్కో కస్టమర్ సగటున రోజుకు 200 నిముషాలు స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారంటే... ఈ ఫోన్లు డేటాను ఎలా నడిపిస్తున్నాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. 2022 నాటికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతమున్న 39.2 కోట్ల నుంచి 123.6 కోట్లకు చేరుతుందని అంచనా. సెకనుకు 4.8 మొబైల్ కనెక్షన్లు.. దేశంలో 2014లో 9.91 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లుండేవి. ఇందులో మొబైల్ 81.8 శాతం కాగా మిగిలింది ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్. 2017 వచ్చేసరికి మొత్తం కనెక్షన్లు 4.2 రెట్లు అధికమై 39.2 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో 95 శాతం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కాగా, 5 శాతం ఫిక్స్డ్ (వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్‌లో ఉన్నాయి. 2022 నాటికి మొత్తం కనెక్షన్ల సంఖ్య 123.6 కోట్లకు చేరుతుంది. ఇందులో ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ 9 శాతం ఉంటుందని బ్రాడ్‌బ్యాండ్– 2022 పేరుతో ఈవై, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి సెకనుకు 4.8 మొబైల్ కనెక్షన్లు జతకూడతాయని తెలిపింది. టెలికం రంగాన్ని 4జీ టెక్నాలజీయే ఎంతలా నడిపిస్తోందంటే... 2017లో అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో 90 శాతం 4జీ మోడళ్లే. ప్రస్తుతం భారత్‌లో కస్టమర్ల వద్ద 45 కోట్ల స్మార్ట్ఫోన్లున్నాయి. సగటున 18 జీబీ.. డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నంబర్–1. చైనా, యూఎస్ఏ, జపాన్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 75 శాతం మంది ఆన్లైన్ వీడియోలను తమ మొబైల్ ఫోన్లలో వీక్షిస్తున్నారు. గత ఏడాది ఇక్కడి కస్టమర్లు 1.1 కోట్ల యాప్‌లు డౌన్లోడ్ చేశారు. డేటా టారిఫ్ ఏడాదిలో 97% తగ్గింది. మరోవైపు 2012తో పోలిస్తే సగటు స్మార్ట్‌ఫోన్ ధర 45 శాతం తగ్గి సుమారు రూ.7,500లకు రావడం కూడా బ్రాడ్‌బ్యాండ్ దూకుడుకు కారణం. ఆన్లైన్ షాపర్స్ 2015తో పోలిస్తే 2.3 రెట్లు అధికమై 9 కోట్లకు చేరుకున్నారు. 48 కోట్ల ఆన్లైన్ క్యాబ్ రైడ్స్ నమోదయ్యాయి. సుమారు 21 కోట్ల ఆన్లైన్ టికెట్స్ బుక్ అయ్యాయి. మొబైల్ వాలెట్ లావాదేవీలు రూ.2,100 కోట్లు నమోదయ్యాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు ఇంటర్నెట్ నెల వాడకం అయిదేళ్లలో 5.1 రెట్లు పెరిగి 18 జీబీకి చేరనుందని ఈవై–సీఐఐ నివేదిక అంచనా వేసింది. -
జియో కస్టమర్లు వాడే డేటా ఎంతంటే..
ఆరంభంతోనే ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రిలయన్స్ టెలికం కంపెనీ జియో... లాభాల జోరును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ బేస్‌ను కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ వెళ్తోంది జియో. 2018 క్యూ1లో జియో తన యూజర్ బేస్‌ను 186.6 మిలియన్లకు పెంచుకున్నట్టు శుక్రవారం వెల్లడించిన ఫలితాల్లో పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 26.5 మిలియన్ల యూజర్లను జియో తన సొంతం చేసుకున్నట్టు తెలిపింది. క్వార్టర్ ఫలితాల సందర్భంగానే జియో తన ఆర్పూను(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్), డేటా వాడకాన్ని కూడా వెల్లడించింది. నెలలో ఒక్కో కస్టమర్ సగటున 9.7జీబీ డేటాను వాడుతున్నట్టు జియో తెలిపింది. అంటే మొత్తంగా 2018 క్యూ1లో 506 కోట్ల జీబీ డేటాను సబ్స్క్రైబర్లు వాడినట్టు తెలిపింది. అదేవిధంగా వాయిస్ కాల్స్ పరంగా కూడా ఈ కాలంలో 37,218 కోట్ల నిమిషాల కాలింగ్ ట్రాఫిక్ నమోదైనట్టు తెలిపింది. అంటే ప్రతి జియో 4జీ సబ్‌స్క్రైబర్ నెలకు 716 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను, సగటున 13.8 గంటల వీడియోలను వీక్షించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా జియో యూజర్‌బేస్ భారీగా పెరగడం కంపెనీకి ఎంతో సహకరిస్తున్నట్టు తెలిపింది. ఆర్పూ కూడా జనవరి-మార్చి కాలంలో రూ.137.1గా నమోదైందని, అయితే ఇది గత మూడు నెలల కాలంతో పోలిస్తే తక్కువేనని రిలయన్స్ వెల్లడించింది. జియో ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ ఆర్పూ కూడా ఈ సారి పడిపోయిన సంగతి తెలిసిందే. 2018 మార్చి కాలంలో ట్రాయ్‌కి చెందిన మైస్పీడ్ అనాలటిక్స్ యాప్ ద్వారా నిర్వహించిన టెస్ట్‌లో తమది గత 15 నెలల కాలంలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్‌గా పేరు గడించినట్టు జియో పేర్కొంది. అంతేకాక కాల్ డ్రాప్ రేటు కూడా అత్యంత తక్కువగానే నమోదైంది. -
డౌన్లోడ్ స్పీడ్.. మనం వెనకే!
ముంబై: భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. చౌక టారిఫ్‌ల వల్ల మొబైల్ వినియోగదారుల్లో డేటా వినియోగం భారీగా పెరిగింది.. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే మరొకవైపు చూస్తే.. మొబైల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో మన దేశం టాప్–10, టాప్–50, అఖరికి టాప్–100లో కూడా స్థానం దక్కించుకోలేదు. 109వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఫోన్లో సగటు డౌన్లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 9.01 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇది గతేడాది నవంబర్‌లో 8.80 ఎంబీపీఎస్. ఇక్కడ స్పీడ్ కొద్దిగా పెరిగినా కూడా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 109వ స్థానంలోనే ఉన్నాం. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సగటు డౌన్లోడ్ స్పీడ్ 62.07 ఎంబీపీఎస్. ఇక ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విషయంలో మాత్రం భారత్ ర్యాంక్ గతేడాది నవంబర్ నుంచి చూస్తే ఈ ఫిబ్రవరి చివరి నాటికి 76 నుంచి 67కు మెరుగుపడింది. ఇదే సమయంలో ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా 18.82 ఎంబీపీఎస్ నుంచి 20.72 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విభాగంలో సింగపూర్ టాప్‌లో ఉంది. ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ 161.53 ఎంబీపీఎస్‌గా రికార్డ్ అయ్యింది. కాగా మొబైల్ డేటా వినియోగంలో నెలకు 150 కోట్ల గిగాబైట్స్తో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ గత డిసెంబర్లో ప్రకటించారు. అమెరికా, చైనా రెండు దేశాల డేటా వినియోగం కన్నా ఇది ఎక్కవని పేర్కొన్నారు. -
డేటాపై ఈసి కీలక నిర్ణయం
సామాజిక మాధ్యమాల్లోని వినియోగదారుల సమాచారాన్ని ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోంది. ఫేస్బుక్ యూజర్ల డేటా లీకేజీ అంశం భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఉల్లంఘనలు జరగకుండా ఏయే చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంగళవారం ( ఈ నెల 27న) ఈసీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు సమావేశమవుతారు. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలతో కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించినట్టు, మనదేశంలోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), తదితర పార్టీలతో ఆ సంస్థ భారత భాగస్వామి కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఏ డేటా ఉల్లంఘనల నేపథ్యంలో ఫేస్‌బుక్‌తో ఈసీ కొనసాగిస్తున్న సంబంధాలను సైతం సమీక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీరావత్ పేర్కొన్నట్లు ఓ ఇంగ్లిష్ పత్రిక వెల్లడించింది. యువజన ఓటర్ల నమోదు ప్రోత్సాహానికి ఫేస్బుక్ సంస్థతో ఈసీ కలిసి పనిచేయడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ 2017 జూలైలో సామాజికమాధ్యమం వేదికగా భారతీయ వినియోగదారులకు 13 భాషల్లో ఈసీ విజ్ఞప్తులు పంపించింది. గతంలోనూ ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు మూడుపర్యాయాలు ఫేస్‌బుక్‌తో ఈసీ కలిసి పనిచేసింది. ఈ నేపథ్యంలో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రిటన్ బ్రెగ్జిట్ రిఫెరండం, ఇతర దేశాల్లోని ఎన్నికలను ప్రభావితం చేసిన విధంగా ఇక్కడి లోక్‌సభ ఎన్నికల్లో జరగకుండా ఉండేందుకు పరిరక్షణచర్యలు చేపట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఈసీ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చోటుచేసుకునే ఆయా పరిణామాలను తప్పుడు పద్ధతుల్లో పక్కదోవ పట్టించే ప్రయత్నాలు, శక్తులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు ఈసీ అధికార ఒకరు వెల్లడించారు. ఈ చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమాలు ఉపయోగించి ఓటర్లను అవాంచిత ప్రభావానికి గురిచేయకుండా, వీటి ప్రభావం ఓటింగ్ ప్రతికూలంగా పడకుండా ఉండేలా చూడాల్సి ఉందని చెప్పారు. ఎన్నికలు ప్రభావితమయ్యే ఏ అంశంపై అయినా ఈసీ దృష్టిపెడుతుందన్నారు. వచ్చే వారం జరగనున్న సమావేశంలో మాత్రం ప్రధానంగా డేటా దుర్వినియోగానికి సంబంధించిన సమస్యల తీవ్రతను విశ్లేషించి, వాటిని అరికట్టేందుకు ఏయే చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రచారాన్ని సీఏ సంస్థ నిర్వహించిందన్న బీజేపీ ఆరోపణలపై సైతం ఈసీ సోషల్ మీడియా సెల్ నివేదిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రకటన, ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ త్రోసిపుచ్చినా, గురువారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ వీటినే మళ్లీ సంధించారు. సీఏతో అంటకాగుతున్నది మీరంటే మీరంటూ బీజేపీ,కాంగ్రెస్ పరస్పర ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అతిక్రమించే అంశాల పర్యవేక్షణకు మీడియా విధానాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది ఆగస్టులో సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. ఆన్లైన్లో ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు కొన్ని ప్రజాసంబంధాల సంస్థలు చురుకుగా పనిచేస్తున్నట్టు ఈసీ దృష్టికి వచ్చిందని చెప్పారు. రోజురోజుకు మొబైల్–ఇంటర్నెట్ టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ప్రభావం కేఊడా పెరుగుతోందన్నారు. అందువల్ల సామాజికమాధ్యమాల్లోని ఆయా విషయాలు, అంశాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈసీ ఆ దిశలో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జియో వల్ల ప్రభుత్వానికి రాబడి లేదు
• వాణిజ్య రేడియో తరంగాలను ఉచిత సేవలకు వాడేస్తోంది • ఇబ్బడి ముబ్బడిగా డేటా వినియోగం • ఉచితంగా ఇవ్వటం వల్లే ఇదంతా జరుగుతోంది • సెల్యులర్ ఆపరేటర్ల తాజా ఆరోపణ న్యూఢిల్లీ: రిలయన్స్ జియోపై యుద్ధాన్ని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తీవ్రతరం చేసింది. ‘జియో సంస్థ బీటా టెస్ట్ పేరుతో వాణిజ్య సేవల కోసం కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తూ ఉచిత డేటా, వాయిస్ సేవలు అందిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడం లేదు’ అంటూ సీఓఏఐ ప్రధానమంత్రి కార్యాలయానికి సోమవారం మరో లేఖ రాసింది. బీటా టెస్ట్‌ల పేరుతో జియో వినియోగిస్తున్న డేటా... 15-20 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న మిగిలిన ఆపరేటర్ల ఉమ్మడి స్పెక్ట్రమ్ వినియోగంతో సమాన స్థాయిలో ఉందని లేఖలో వివరించింది. వాణిజ్య సేవల కోసం ఆదాయ పంపిణీ ప్రాతిపదికన కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తుండడంతో... వీటిపై ఎలాంటి ఆదాయం లేనందున ప్రభుత్వానికి ఎలాంటి వాటా రావడం లేదని పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 30 లక్షల మంది ఉద్దేశపూర్వకంగా ఉచిత డేటా, వాయిస్ సేవలను ఒకే ఆపరేటర్ నుంచి వినియోగిస్తున్నట్టు సీఓఏఐ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. పరీక్షల (టెస్ట్) పేరుతో అనధికారిక వాణిజ్య సేవలు అందిస్తుండడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ‘జియో సంస్థ లక్షల మంది టెస్ట్ యూజర్లకు ఇప్పటికీ అక్రమంగా ఉచిత నిమిషాలను సొంత నెట్వర్క్ పరిధిలోనే ఇచ్చుకోదలచుకుంటే అది వారికి సంబంధించిన అంశం. ఈ బూటకపు ట్రాఫిక్‌కు ఇతర ఆపరేటర్లు సైతం సబ్సిడీపై నెట్వర్క్ వనరులు కల్పించాలని ఆశించడం సరికాదు’ అని సీఓఏఐ స్పష్టం చేసింది. టారిఫ్ ప్లాన్ల సమాచారాన్ని ట్రాయ్‌కు సమర్పించకుండానే వాణిజ్య సేవలు ప్రారంభించడం, హ్యాండ్సెట్ విలువకు సమానమైన పలు రకాల బండిల్డ్ సేవలను (డేటా, టాక్‌టైమ్, ఎస్ఎంఎస్లు) ఉచితంగా అందించడం ద్వారా స్థూల ఆదాయ సర్దుబాటు రుసుం, ఇతర పన్నుల ఎగవేత వంటి పలు అంశాలు ప్రస్తుతం తెరమీదకు వచ్చాయని పేర్కొంది. కాగా, ప్రధాన టెలికం ఆపరేటర్లు జియో నుంచి వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్లకు తమ నెట్‌వర్క్‌లకు అనుసంధానాన్ని కల్పించేందుకు నిరాకరించడం ద్వారా లెసైన్స్ ఒప్పందాలను ఉల్లంఘించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో సైతం ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జియోకి మారిపోండిఉద్యోగులకు ఆర్ఐఎల్ సూచన ‘‘ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఇతర నెట్‌వర్క్‌ల మొబైల్ కనెక్షన్లను పక్కన పెట్టండి. వాటికి బదులుగా అధిక వేగంతో కూడిన రిలయన్స్ జియో 4జీ కనెక్షన్లకు తక్షణం మారిపోండి’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 40వేల మందికిపైగా ఉన్న తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు ఆర్ఐఎల్ హెచ్ఆర్ విభాగం తన ఉద్యోగులకు లేఖలు పంపింది. కార్పొరేట్ కనెక్షన్లను జియోకు మార్చుకుంటున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది. అయితే, జియో సేవలపై ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలతో కూడిన సీఓఏఐ ప్రభుత్వానికి అదే పనిగా ఫిర్యాదు చేస్తున్న తరుణంలో ఆర్ఐఎల్ నుంచి ఈ ఆదేశాలు వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆర్ఐఎల్ ఉద్యోగుల కోసం ఎయిర్టెల్, వొడాఫోన్ ఆపరేటర్లకు చెందిన సీయూజీ సేవలను వినియోగిస్తోంది.