ఆరంభంతోనే ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రిలయన్స్ టెలికం కంపెనీ జియో... లాభాల జోరును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ బేస్‌ను కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ వెళ్తోంది జియో. 2018 క్యూ1లో జియో తన యూజర్ బేస్‌ను 186.6 మిలియన్లకు పెంచుకున్నట్టు శుక్రవారం వెల్లడించిన ఫలితాల్లో పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 26.5 మిలియన్ల యూజర్లను జియో తన సొంతం చేసుకున్నట్టు తెలిపింది. క్వార్టర్ ఫలితాల సందర్భంగానే జియో తన ఆర్పూను(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్), డేటా వాడకాన్ని కూడా వెల్లడించింది. నెలలో ఒక్కో కస్టమర్ సగటున 9.7జీబీ డేటాను వాడుతున్నట్టు జియో తెలిపింది. అంటే మొత్తంగా 2018 క్యూ1లో 506 కోట్ల జీబీ డేటాను సబ్‌స్క్రైబర్లు వాడినట్టు తెలిపింది.
అదేవిధంగా వాయిస్ కాల్స్ పరంగా కూడా ఈ కాలంలో 37,218 కోట్ల నిమిషాల కాలింగ్ ట్రాఫిక్ నమోదైనట్టు తెలిపింది. అంటే ప్రతి జియో 4జీ సబ్‌స్క్రైబర్ నెలకు 716 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను, సగటున 13.8 గంటల వీడియోలను వీక్షించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా జియో యూజర్‌బేస్ భారీగా పెరగడం కంపెనీకి ఎంతో సహకరిస్తున్నట్టు తెలిపింది. ఆర్పూ కూడా జనవరి-మార్చి కాలంలో రూ.137.1గా నమోదైందని, అయితే ఇది గత మూడు నెలల కాలంతో పోలిస్తే తక్కువేనని రిలయన్స్ వెల్లడించింది. జియో ప్రధాన ప్రత్యర్థి ఎయిర్‌టెల్ ఆర్పూ కూడా ఈ సారి పడిపోయిన సంగతి తెలిసిందే. 2018 మార్చి కాలంలో ట్రాయ్‌కి చెందిన మైస్పీడ్ అనాలటిక్స్ యాప్ ద్వారా నిర్వహించిన టెస్ట్‌లో తమది గత 15 నెలల కాలంలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్‌గా పేరు గడించినట్టు జియో పేర్కొంది. అంతేకాక కాల్ డ్రాప్ రేటు కూడా అత్యంత తక్కువగానే నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment