హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌బ్యాండ్.. ప్రపంచ దిశను మార్చేసిన సాంకేతిక ఆయుధం. ఈ ఆయుధం ఇప్పుడు భారత్‌లో డేటా వినియోగం, స్మార్ట్‌ఫోన్ల విషయంలో అనూహ్య పరిణామాలకు కారణమవుతోంది. ప్రపంచంలో అత్యధికంగా డేటాను వాడుతున్న దేశంగా భారత్‌ను నిలుపుతోంది.
దేశవ్యాప్తంగా నెలకు 2,360 పెటాబైట్స్ డేటాను వినియోగదార్లు ఖర్చు చేస్తున్నారట!!. అంటే ఈ డేటా 52.6 కోట్ల డీవీడీల నిడివితో సమానం. ఒక్కో కస్టమర్ సగటున రోజుకు 200 నిముషాలు స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారంటే... ఈ ఫోన్లు డేటాను ఎలా నడిపిస్తున్నాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. 2022 నాటికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతమున్న 39.2 కోట్ల నుంచి 123.6 కోట్లకు చేరుతుందని అంచనా.
సెకనుకు 4.8 మొబైల్ కనెక్షన్లు..
దేశంలో 2014లో 9.91 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లుండేవి. ఇందులో మొబైల్ 81.8 శాతం కాగా మిగిలింది ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్. 2017 వచ్చేసరికి మొత్తం కనెక్షన్లు 4.2 రెట్లు అధికమై 39.2 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో 95 శాతం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కాగా, 5 శాతం ఫిక్స్‌డ్ (వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్‌లో ఉన్నాయి. 2022 నాటికి మొత్తం కనెక్షన్ల సంఖ్య 123.6 కోట్లకు చేరుతుంది.
ఇందులో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ 9 శాతం ఉంటుందని బ్రాడ్‌బ్యాండ్– 2022 పేరుతో ఈవై, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి సెకనుకు 4.8 మొబైల్ కనెక్షన్లు జతకూడతాయని తెలిపింది. టెలికం రంగాన్ని 4జీ టెక్నాలజీయే ఎంతలా నడిపిస్తోందంటే... 2017లో అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లలో 90 శాతం 4జీ మోడళ్లే. ప్రస్తుతం భారత్‌లో కస్టమర్ల వద్ద 45 కోట్ల స్మార్ట్‌ఫోన్లున్నాయి.
సగటున 18 జీబీ..
డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నంబర్–1. చైనా, యూఎస్‌ఏ, జపాన్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 75 శాతం మంది ఆన్‌లైన్ వీడియోలను తమ మొబైల్ ఫోన్లలో వీక్షిస్తున్నారు. గత ఏడాది ఇక్కడి కస్టమర్లు 1.1 కోట్ల యాప్‌లు డౌన్‌లోడ్ చేశారు. డేటా టారిఫ్ ఏడాదిలో 97% తగ్గింది. మరోవైపు 2012తో పోలిస్తే సగటు స్మార్ట్‌ఫోన్ ధర 45 శాతం తగ్గి సుమారు రూ.7,500లకు రావడం కూడా బ్రాడ్‌బ్యాండ్ దూకుడుకు కారణం.
ఆన్‌లైన్ షాపర్స్ 2015తో పోలిస్తే 2.3 రెట్లు అధికమై 9 కోట్లకు చేరుకున్నారు. 48 కోట్ల ఆన్‌లైన్ క్యాబ్ రైడ్స్ నమోదయ్యాయి. సుమారు 21 కోట్ల ఆన్‌లైన్ టికెట్స్ బుక్ అయ్యాయి. మొబైల్ వాలెట్ లావాదేవీలు రూ.2,100 కోట్లు నమోదయ్యాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు ఇంటర్నెట్ నెల వాడకం అయిదేళ్లలో 5.1 రెట్లు పెరిగి 18 జీబీకి చేరనుందని ఈవై–సీఐఐ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment