
కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఎంపీటీసీలను ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోకి ఆడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో భాగంగా కుప్పంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును భరత్ ఎండగట్టారు.
‘పోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. మా ఎంపీటీసీలు వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలను బెదిరించారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఏం జరుగుతుందో అందరూ చూశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు మాపై దాడి కూడా చేయాలని కుట్ర చేశారు. ఈ ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. కోరం లేకుండా ఎంపీపీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని భరత్ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య వాదులు ఒకసారి కుప్పం వైపు చూడండి
ప్రజాస్వామ్య వాదులుగా చెప్పుకుంటున్న వారు ఒకసారి కుప్పం వైపు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు\ చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. ‘కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారు. కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారు. టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు గోవిందప్ప.
ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు
ఈ తరహా ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. జరగలేదన్నారు రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి,. ‘ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలు అందరినీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మాపై కేసులు పెడతాం అని బెదిరించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం’ అని రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి స్పష్టం చేశారు.