ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. రిలయన్స్ జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ అంబానీ చెప్పారు.
‘ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా 2జీ/3జీ నుంచి 4జీకి మారడం జరగలేదు. 2020 నాటికల్లా భారత్ పూర్తి స్థాయిలో 4జీ దేశంగా ఎదుగుతుంది. అప్పటికల్లా అన్ని ఫోన్లలోనూ 4జీ, ప్రతీ కస్టమర్‌కి 4జీ కనెక్టివిటీ ఉంటుంది. 5జీ టెక్నాలజీ సన్నద్ధతలో మిగతా దేశాలన్నింటికన్నా ముందు ఉంటుందని ధీమాగా చెప్పగలను‘ అని ఆయన పేర్కొన్నారు.
2016లో చౌక డేటా చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా అల్ట్రా–హై స్పీడ్ ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఫిక్స్‌డ్, మొబైల్ ఇంటర్నెట్ మధ్య హద్దులు చెరిపేసేలా జియోగిగాఫైబర్ సర్వీసులు ఉంటాయని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్.. ప్రపంచం ఆశ్చర్యపోయేంత వేగంగా టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు.
నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం..
విస్తృత కనెక్టివిటీ, అత్యంత చౌకైన ఇంటర్నెట్‌తో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించగలదని ఆయన పేర్కొన్నారు. 15 కోట్ల మంది భారతీయ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద 50 కోట్ల పైచిలుకు జనాభాకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు, పాఠశాలలు.. కళాశాలల్లో 20 కోట్ల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనకు ఈ విప్లవం దోహదపడగలదన్నారు. డేటా వినియోగంలో చాలా జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముకేశ్ అంబానీ హెచ్చరించారు.
‘నయా ప్రపంచంలో డేటా అన్నది చాలా ముఖ్యమైన వనరు అని గుర్తుపెట్టుకోవాలి. దేశీయంగా భారీ స్థాయిలో డేటా ఉత్పత్తి అవుతుంటుంది. తగు భద్రతా ప్రమాణాలతో ఈ సుసంపన్న వనరును దేశం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ముఖ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్ వంటి అనేక విప్లవాత్మకమైన డిజిటల్ టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చే టెలికం పరిశ్రమ.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, అధిక వృద్ధికి దోహదపడగలదని ముకేశ్ చెప్పారు.
పొగాకు పరిశ్రమలా పన్నులు: ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ మిట్టల్
దేశ డిజిటల్ ఆకాంక్షల సాధనకు ఇతోధికంగా తోడ్పడుతున్న టెలికం రంగాన్ని పన్నుల భారం కుంగదీస్తోందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. పొగాకు పరిశ్రమలా టెలికం రంగంపై భారీ స్థాయిలో పన్నులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారత్‌లో మొబైల్ ఆపరేటర్లకి వచ్చే ప్రతి రూ. 100 ఆదాయంలో దాదాపు రూ. 37 ఏదో ఒక సుంకం చెల్లింపులకే పోతోంది. ఒకవైపేమో దేశం డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉండాలని ప్రధాని ఆకాంక్షిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు కావాలి.
మరోవైపేమో స్పెక్ట్రం ధరలు, లైసెన్సు ఫీజులు భారీ స్థాయిలో ఉంటాయి. దీనికి జీఎస్‌టీ కూడా తోడైంది. ఏకంగా 18 శాతం మేర ఉంటోంది. ఇలాంటి వైరుధ్యాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉంది‘ అని సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. దేశీ టెలికం మార్కెట్లో కన్సాలిడేషన్ అంత సులువుగా జరగలేదని మిట్టల్ పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో టెలికం కంపెనీలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు.
ఉద్యోగాల కోతలు, దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల రైటాఫ్ సహా.. అనేక కష్టాలను అధిగమిస్తే గానీ ఈ రంగంలో కన్సాలిడేషన్ సాధ్యపడలేదని పేర్కొన్నారు. గడిచిన 24 ఏళ్లుగా పలు టెక్నాలజీలను విజయవంతంగా అమలు చేసినట్లుగానే 5జీ టెక్నాలజీ అమలుకు కూడా టెలికం పరిశ్రమ సన్నద్ధమవుతోందని ఆయన తెలిపారు. అయితే, స్పెక్ట్రం ధరలు, చార్జీలు సముచితంగా ఉండాలని, అధిక పన్నుల భారాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని మిట్టల్ అభిప్రాయపడ్డారు.
5జీ టెక్నాలజీ కార్లు, డ్రోన్స్ ప్రదర్శన..
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) తొలి రోజున రిలయన్స్ జియో కొంగొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ముంబైలో ఉన్న కారును దాదాపు 1,388 కిలోమీటర్ల దూరంలోని న్యూఢిల్లీ నుంచి నడపగలిగే 5జీ టెక్నాలజీ మొదలుకుని ఫేస్ రికగ్నిషన్ సామర్ధ్యం గల డ్రోన్స్ దాకా వీటిలో ఉన్నాయి. స్వయం చాలిత కార్లను మరింత సురక్షితంగా మార్చేందుకు 5జీ నెట్‌వర్క్ ఉపయోగపడగలదని జియో వర్గాలు పేర్కొన్నాయి. 5జీ అంటే కేవలం 4జీ నెట్‌వర్క్ నుంచి అప్‌గ్రేడ్‌గా మాత్రమే కనిపించినప్పటికీ, ఇది చాలా శక్తిమంతమైన టెక్నాలజీ అని, సెల్యులార్ నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు తేగలదని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment