హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ విప్లవంతో భారత మొబైల్ ఫోన్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లుండగా... 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్ డివైజెస్) ప్రస్తుత 160 కోట్ల నుంచి 220 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకుంటాయని సిస్కో నివేదించింది. ఇలా కనెక్ట్ అయిన డివైజెస్‌లో 15.5 శాతం వార్షిక వృద్ధితో స్మార్ట్‌ఫోన్లే 38 శాతం ఉంటాయట. ఈ స్థాయి ఉపకరణాలతో ప్రస్తుతం 2.4 గిగాబైట్లుగా ఉన్న సగటు డేటా వాడకం ఏకంగా 14 గిగాబైట్లకు దూసుకుపోతుందని సిస్కో ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ కౌల్ తెలియజేశారు
జనాభాలో 60 శాతం..
గత 32 ఏళ్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ ఒక ఎత్తయితే.. భారత్‌లో 2022లో నమోదయ్యే ట్రాఫిక్ ఒక ఎత్తు కానుంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ ట్రాఫిక్ గంటకు 60 లక్షల డీవీడీలకు సమానం కానున్నదనేది సిస్కో అంచనా. 2017లో దేశంలో ఇంటర్నెట్ కస్టమర్లు 35.7 కోట్లు. జనాభాలో ఇది 27 శాతం. 2022 నాటికి నెట్ యూజర్లు 84 కోట్లకు చేరనున్నారు. అంటే ఆ సమయానికి జనాభాలో ఈ సంఖ్య 60 శాతం కానుంది. ‘‘ఇంటర్నెట్ వినియోగంలో స్మార్ట్‌ఫోన్లే ప్రధానపాత్ర పోషిస్తాయి’’ అని ‘బిగ్ సి’ మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇక నాలుగేళ్లలో స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం అయిదు రెట్లు పెరగనుంది.సోషల్ మీడియా, వీడియోల వీక్షణం, కమ్యూనికేషన్, బిజినెస్ అప్లికేషన్స్ దీనికి ప్రధాన కారణమని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ చెప్పారు. డేటా వాడకం, అంచనాలు పెరిగే కొద్దీ సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయన్నారు.
అంచనాలకు అందని అంకెలు..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు డేటా వినియోగం నెలకు 3.5 జీబీ ఉంది. 2022 నాటికి ఇది ఏకంగా 17.5 జీబీకి చేరనుంది. నెట్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లో మొబైల్‌కు అనుసంధానమయ్యేవి 68 శాతం ఉంటాయట. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య ప్రస్తుత 2 కోట్ల నుంచి 4.85 కోట్లకు పెరగనుంది. పర్సనల్ కంప్యూటర్లు 4.3 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 4.25 కోట్లకు వచ్చి చేరనున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు 13.74 కోట్లున్నాయి. నాలుగేళ్లలో ఇవి 26.3 కోట్లకు వృద్ధి చెందనున్నాయి. 14 లక్షల యూనిట్లుగా ఉన్న 4కే టీవీల సంఖ్య 2.5 కోట్లకు ఎగుస్తుంది. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్ల మొగ్గే ఈ స్థాయి డిమాండ్‌కు కారణమని హోమ్ బ్రాండ్ టీవీల పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఇక 9.5 ఎంబీపీఎస్‌గా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 3.3 రెట్లు దూసుకుపోనుంది. గతేడాది మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియోల (బిజినెస్, కం జ్యూమర్ కలిపి) వాటా 58%. నాలుగేళ్లలో ఇది 77%కి తాకుతుందని సిస్కో వెల్లడించింది. అల్ట్రా హెచ్‌డీ వీడియో ట్రాఫిక్ ప్రస్తుతం 1%. 2022 నాటికి దీని వాటా 10.6%గా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment