Indian mobile phone sector
-
దేశీ స్మార్ట్ఫోన్ల రీఎంట్రీ...
సాక్షి,హైదరాబాద్: దేశీయ స్మార్ట్ఫోన్ల రంగం మరోసారి వేడెక్కుతోంది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో సంచలనం సృష్టించిన భారతీయ బ్రాండ్లు చైనా కంపెనీల ధాటికి కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే మైక్రోమ్యాక్స్ తన ప్రణాళికను వెల్లడించింది. లావా, కార్బన్‌తోపాటు హైదరాబాద్ కంపెనీ సెల్కాన్ సైతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగి ప్రవేశించేందుకు ఉవ్విల్లూరుతోంది. అయితే లాక్డౌన్ తర్వాత మొబైల్స్ మార్కెట్ ఆగస్టు నుంచే పుంజుకుంది. పండుగల సీజన్ మొదలవడంతో అటు ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయాలు జోరు మీద ఉండడం దేశీయ బ్రాండ్లకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మారుతున్న మార్కెట్.. దశాబ్ద కాలంలో స్మార్ట్ఫోన్ల ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకున్నాయి. క్వాడ్ కెమెరాలు, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, అధిక ర్యామ్, ఇన్‌బిల్ట్ మెమరీ ఉన్న మోడళ్లను కస్టమర్లు కోరుతున్నారు. ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు భారతీయ బ్రాండ్లు ఎలాంటి ఫీచర్లను తీసుకొస్తాయన్నదే ఆసక్తిగా మారింది. 2011–12 ప్రాంతంలో భారత్‌లో 160కిపైగా బ్రాండ్లు మొబైల్స్ రంగంలో పోటీపడ్డాయి. శామ్సంగ్, సోనీ, నోకియా, ఎల్జీ, మోటరోలా, ప్యానాసోనిక్ వంటి బ్రాండ్ల హవా నడుస్తున్న కాలంలో ఒక్కసారిగా దేశీయ బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇక్కడి బ్రాండ్ల ధాటికి శామ్సంగ్ మినహా మిగిలినవి కనుమరుగయ్యాయి. అయితే 2014 నుంచి చైనా బ్రాండ్లు క్రమంగా తమ వాటాను పెంచుకుంటూ వస్తున్నాయి. దీంతో దేశీయ బ్రాండ్లు పోటీ నుంచి తప్పుకున్నాయి. తాజాగా ఈ కంపెనీలు తిరిగి పోటీకి సై అంటున్నాయి. (చదవండి: మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్) తక్కువ ధరల్లో.. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్.. భారతీయ బ్రాండ్లకు పునాదిగా నిలవనుంది. దేశీయ కంపెనీలు రూ.15,000లోపు ధరలో ఉండే ఫోన్లను భారత్‌తోపాటు విదేశాల్లో విక్రయించినా ప్రభుత్వం 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. విదేశీ కంపెనీలకైతే ఇది రూ.15,000 పైన ధరగల మోడళ్లకు వర్తింపజేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు సమాచారం. దేశీయ బ్రాండ్లు గతంలో ఎగుమతులను విజయవంతంగా చేశాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల అండతో తిరిగి విదేశీ మార్కెట్లకూ ఈ కంపెనీలు విస్తరించే అవకాశం లేకపోలేదు. భారతీయ బ్రాండ్లు రూ.3–7 వేల ధరల శ్రేణిలో సైతం స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. గతంలో మాదిరిగా ఇబ్బడిముబ్బడిగా కాకుండా పరిమిత మోడళ్లతోనే రంగ ప్రవేశం చేయనున్నాయి. మైక్రోమ్యాక్స్ తన ‘ఇన్’ బ్రాండ్‌లో రూ.7–20 వేల శ్రేణిలో పోటీపడతామని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తాము తిరిగి ప్రవేశిస్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు ధ్రువీకరించారు.(వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్) అత్యధిక అమ్మకాలు.. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 5 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడై జీవితకాల గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఈ మొత్తం అమ్మకాల్లో 76 శాతం వాటా చైనా కంపెనీలదేనని పరిశోధన సంస్థ కెనాలిస్ వెల్లడించింది. షావొమీ 26.1 శాతం, శామ్సంగ్ 20.4, వివో 17.6, రియల్మీ 17.4, ఒప్పో 12.1 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకున్నాయి. చైనా కంపెనీలకు పోటీగా అమెజాన్‌తో కలిసి శాంసంగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బెస్ట్ ప్రైస్‌లో ఎక్కువ ఫీచర్లతో ‘ఎం’ సిరీస్ ఫోన్లను తీసుకొచ్చి విజయవంతం అయింది. షావొమీ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సత్తా చాటుతోంది. వివో, ఒప్పో ఆఫ్‌లైన్‌లో చొచ్చుకుపోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆసరాగా రియల్మీ సక్సెస్ అయింది. ఇప్పుడు దేశీయ బ్రాండ్లు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనున్నాయో వేచి చూడాలి. కొత్త బ్రాండ్లకూ భారత్‌లో మార్కెట్ ఉందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. అధిక ఫీచర్లతో తక్కువ ధరలో మోడళ్లను అందించగలిగితే సక్సెస్ ఖాయమన్నారు. -
నాలుగేళ్లలో... స్మార్ట్ఫోన్ల రెట్టింపు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ విప్లవంతో భారత మొబైల్ ఫోన్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లుండగా... 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్ డివైజెస్) ప్రస్తుత 160 కోట్ల నుంచి 220 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకుంటాయని సిస్కో నివేదించింది. ఇలా కనెక్ట్ అయిన డివైజెస్‌లో 15.5 శాతం వార్షిక వృద్ధితో స్మార్ట్ఫోన్లే 38 శాతం ఉంటాయట. ఈ స్థాయి ఉపకరణాలతో ప్రస్తుతం 2.4 గిగాబైట్లుగా ఉన్న సగటు డేటా వాడకం ఏకంగా 14 గిగాబైట్లకు దూసుకుపోతుందని సిస్కో ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ కౌల్ తెలియజేశారు జనాభాలో 60 శాతం.. గత 32 ఏళ్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ ఒక ఎత్తయితే.. భారత్‌లో 2022లో నమోదయ్యే ట్రాఫిక్ ఒక ఎత్తు కానుంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ ట్రాఫిక్ గంటకు 60 లక్షల డీవీడీలకు సమానం కానున్నదనేది సిస్కో అంచనా. 2017లో దేశంలో ఇంటర్నెట్ కస్టమర్లు 35.7 కోట్లు. జనాభాలో ఇది 27 శాతం. 2022 నాటికి నెట్ యూజర్లు 84 కోట్లకు చేరనున్నారు. అంటే ఆ సమయానికి జనాభాలో ఈ సంఖ్య 60 శాతం కానుంది. ‘‘ఇంటర్నెట్ వినియోగంలో స్మార్ట్ఫోన్లే ప్రధానపాత్ర పోషిస్తాయి’’ అని ‘బిగ్ సి’ మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇక నాలుగేళ్లలో స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం అయిదు రెట్లు పెరగనుంది.సోషల్ మీడియా, వీడియోల వీక్షణం, కమ్యూనికేషన్, బిజినెస్ అప్లికేషన్స్ దీనికి ప్రధాన కారణమని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ చెప్పారు. డేటా వాడకం, అంచనాలు పెరిగే కొద్దీ సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయన్నారు. అంచనాలకు అందని అంకెలు.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు డేటా వినియోగం నెలకు 3.5 జీబీ ఉంది. 2022 నాటికి ఇది ఏకంగా 17.5 జీబీకి చేరనుంది. నెట్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లో మొబైల్‌కు అనుసంధానమయ్యేవి 68 శాతం ఉంటాయట. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య ప్రస్తుత 2 కోట్ల నుంచి 4.85 కోట్లకు పెరగనుంది. పర్సనల్ కంప్యూటర్లు 4.3 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 4.25 కోట్లకు వచ్చి చేరనున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు 13.74 కోట్లున్నాయి. నాలుగేళ్లలో ఇవి 26.3 కోట్లకు వృద్ధి చెందనున్నాయి. 14 లక్షల యూనిట్లుగా ఉన్న 4కే టీవీల సంఖ్య 2.5 కోట్లకు ఎగుస్తుంది. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్ల మొగ్గే ఈ స్థాయి డిమాండ్‌కు కారణమని హోమ్ బ్రాండ్ టీవీల పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఇక 9.5 ఎంబీపీఎస్‌గా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 3.3 రెట్లు దూసుకుపోనుంది. గతేడాది మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియోల (బిజినెస్, కం జ్యూమర్ కలిపి) వాటా 58%. నాలుగేళ్లలో ఇది 77%కి తాకుతుందని సిస్కో వెల్లడించింది. అల్ట్రా హెచ్డీ వీడియో ట్రాఫిక్ ప్రస్తుతం 1%. 2022 నాటికి దీని వాటా 10.6%గా ఉండనుంది. -
విండోస్ ‘దేశీ’ మొబైల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విండోస్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను అందించి భారత మొబైల్ ఫోన్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీలు.. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఆధారిత స్మార్ట్ఫోన్లపై దృష్టిపెట్టాయి. దిగ్గజ కంపెనీ నోకియాను సైతం ఆన్‌డ్రాయిడ్ మార్కెట్లోకి దింపిన భారతీయ బ్రాండ్లు కొత్త సంచలనాలకు రెడీ అవుతున్నాయి. కస్టమర్ల ముంగిటకు కొత్త కొత్త విండోస్ ఫోన్లు అదీ రూ.10 వేల లోపే తేబోతున్నాయి. తక్కువ ధరకే విండోస్ ఫోన్లు.. ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అందుకే మొత్తం స్మార్ట్ఫోన్లలో వీటి వాటా 78.9% ఉంది. విండోస్ ఓఎస్ లెసైన్సు రుసుమును మైక్రోసాఫ్ట్ గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయని కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ సాక్షికి చెప్పారు. అదే జరిగితే మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం ఖాయం. అంతేకాదు రూ.10 వేల లోపే విండోస్ ఫోన్లు లభించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రస్తుతం విండోస్ వాటా 3.9 శాతమే. 2018కల్లా ఇది 7 శాతానికి చేరుతుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. ఆన్‌డ్రాయిడ్ మార్కెట్ ప్రస్తుతమున్న 78.9 నుంచి 76 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఆపిల్ ఐఓఎస్ 14.9 నుంచి 14.4 శాతానికి తగ్గుతుందని వివరించింది. జోలో బ్రాండ్ ఇటీవలే విండోస్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించి ఈ విభాగంలోకి ప్రవేశించిన తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచింది. కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తేబోతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్‌లు కూడా కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నాయి. కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌తో చైనా కంపెనీ జియోనీ చేతులు కలిపింది. ఆన్‌డ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెండూ కలిగిన స్మార్ట్ఫోన్లను కార్బన్ మొబైల్స్ జూన్‌కల్లా ప్రవేశపెడుతోంది. రూ.6 వేలకే సెల్కాన్ విండోస్ ఫోన్లు.. తొలుత 4, 5 అంగుళాల్లో విండోస్ ఫోన్లను సెల్కాన్ తేనుంది. వీటిని రూ.6-7 వేలకే పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. మే నాటికి ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ఈ నెలలోనే మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు వివరించారు. ఆన్‌డ్రాయిడ్, విండోస్ డ్యూయల్ ఓఎస్ ఫోన్లు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మంచి ఫీచర్లతో మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.