Smart phone users
-
రోడ్లపై ‘స్మార్ట్‌ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..!
అతి ఎప్పుడూ నష్టమే.. అవసరానికి వాడుకోవాల్సిన వస్తువుని కాలక్షేపానికి వాడుకోవడం మొదలెడితే వ్యసనం కాక మరేమవుతుంది..! అదే జరుగుతోందిప్పుడు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు దానికి బానిసలైపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాటు వారి భౌతిక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తోందనీ, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫోన్, ట్యాబ్‌లాంటి తెరల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలంటున్నారు. అన్నం తినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఆఖరికి పడుకున్నా చేతిలో ఫోను ఉండాల్సిందే. రోడ్డు మీద నడుస్తున్నా, కారు నడుపుతున్నా మరోపక్క ఫోనూ పనిచేయాల్సిందే. సవ్యసాచిలా రెండు పనులూ ఒకేసారి చేస్తున్నామనుకుంటున్నారు కానీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. తాజాగా రోడ్లపై ఫోన్ వినియోగిస్తున్నవారిని ‘జాంబీ’లుగా అభివర్ణిస్తూ బెంగళూరు పోలీసులు ఏకంగా హోర్డింగ్‌లు తయారుచేయించారు. ‘స్మార్ట్‌పోన్ జాంబీలున్నాయి జాగ్రత్త’ అని ఓ సైన్‌బోర్డ్‌లో రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. This signboard in BLR singlehandedly attacked our entire generation pic.twitter.com/iN2OsuGBE5 — Prakriti (@prakritea17) January 19, 2024 ఈ స్పష్టమైన హెచ్చరికతో ఉన్న సైన్బోర్డ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ ప్రభావం ప్రజలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలియజేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఫోన్లు డౌన్, హెడ్స్ అప్..' అని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే.. కొన్ని సర్వేల ప్రకారం.. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోను వాడుతున్న సగటు భారతీయుడు రోజుకు 70 సార్లు ఫోను తీసి చూస్తున్నాడట. అంటే గంటకు మూడుసార్లు. తీసిన ప్రతిసారీ మూడు నిమిషాలు చూసినా రోజుకి మూడున్నర గంటలపైనే. ఆన్లైన్లో అపరిచితులతో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు ప్రపంచ సగటు కన్నా 11 శాతం ఎక్కువ. పదిహేనేళ్లలోపు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం ప్రపంచ సరాసరి 76 శాతం కాగా, మనదేశంలో 83. సైబర్ బెదిరింపులూ దుర్భాషలపై తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచ సగటు 57 శాతం కాగా భారత సగటు 47. ఇంత తీవ్రమైన అంశాల్నీ పట్టించుకోని నిర్లక్ష్యం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. -
సంసారంలో ‘స్మార్ట్’ తిప్పలు.. టెన్షన్ పెడుతున్న రిపోర్టు!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్‌ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్‌తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్‌తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. రిపోర్టులోని ముఖ్యాంశాలు - అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. - స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. - తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. - స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది అంగీకారం. - అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం - ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. - భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. - లివింగ్‌రూమ్‌లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం - రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం - జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం - తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు - రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్‌టైమ్‌పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్‌ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ . -
జాగో.. ఫోన్ రిపేర్‌కు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
డిజిటల్ యుగంలో మోసాలకు కూడా టెక్నాలజీ తోడవుతోంది. ఏమరపాటు, నిర్లక్ష్యం, స్వీయతప్పిదాలు నిండా ముంచేస్తున్నాయి. చాలామంది ఫోన్ రిపేర్‌కు ఇచ్చే సమయంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వాటి వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. స్వీయ తప్పిదంతో తన అకౌంట్ నుంచి రూ. 2 లక్షలకు పైగా డబ్బును పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. సొంతంగా వ్యాపారం నడిపించుకునే ఓ వ్యక్తి(40).. తన స్మార్ట్‌ఫోన్‌కి సమస్య రావడంతో అక్టోబర్ 7వ తేదీన దగ్గర్లో ఉన్న రిపేర్‌కు ఇచ్చాడు. అయితే.. ఫోన్ రిపేర్ కావాలంటే.. సిమ్ కార్డు ఫోన్లోనే ఉండాలని, ఆ మరుసటిరోజు సాయంత్రం వచ్చి ఫోన్ తీసుకోమని సదరు వ్యక్తితో రిపేర్ షాపువాడు చెప్పాడు. గుడ్డిగా నమ్మిన ఆ మధ్యవయస్కుడు.. సిమ్ కార్డు ఉంచేసి ఫోన్‌ను ఇచ్చేసి వెళ్లిపోయాడు. కానీ, నాలుగు రోజులైన ఆ రిపేర్ దుకాణం తెరుచుకోలేదు. ఐదవ రోజు షాపులో పని చేసే మరో కుర్రాడు రావడంతో.. అతన్ని నిలదీశాడు బాధితుడు. అయితే తమ ఓనర్ ఊరిలో లేడని.. ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని చెప్పాడు ఆ కుర్రాడు. అనుమానం వచ్చిన బాధితుడు.. బ్యాంక్ ఖాతాను పరిశీలించగా.. అకౌంట్ నుంచి రెండున్నర లక్షల రూపాయలు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు ఉంది. దీంతో ఆ స్టేట్మెంట్ కాపీతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ముంబై(మహారాష్ట్ర) సాకినాక ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని పంకజ్ కడమ్గా గుర్తించారు. చేయాల్సినవి ► ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చినప్పుడు సిమ్ కార్డును తప్పనిసరిగా తొలగించాలి. ► కీలక సమాచారం, గ్యాలరీ డేటా లేదంటే ఇంకేదైనా డేటా ఉంటే.. బ్యాకప్ చేసుకోవాలి. ► సెక్యూరిటీ లాక్స్ తొలగించాలి ► Factory Reset ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ► ఈరోజుల్లో ఇంటర్నల్ మొమరీతోనే ఫోన్లు వస్తున్నాయి. ఒకవేళ ఎక్స్టర్నల్ మొమరీ ఉంటే గనుక తొలగించాకే రిపేర్‌కు ఇవ్వాలి. ► ఒకవేళ మైనర్ రిపేర్లు అయితే గనుక.. మెయిల్స్, ఇతర సోషల్ మీడియా యాప్స్ లాగౌట్ కావాలి. ► ఫోన్‌కు ఆండ్రాయిడ్ పిన్ లేదంటే ప్యాటర్న్ లాక్‌లో ఉంచడం సేఫ్ ► IMEI ఐఎంఈఐ నెంబర్‌ను రాసి పెట్టుకోవాలి. ► యాప్స్‌కు సైతం లాక్‌లు వేయొచ్చు. ► యూపీఐ పేమెంట్లకు సంబంధించి యాప్‌లకు సెకండరీ పిన్ లేదంటే ప్యాటర్న్లాక్ ఉంచడం ఉత్తమం. ► స్మార్ట్ ఫోన్ వాడకం ఇబ్బందిగా అనిపించిన వాళ్లు.. లింక్డ్ సిమ్‌లను మామూలు ఫోన్లలో ఉపయోగించడం ఉత్తమం. ► గొప్పలకు పోయి స్మార్ట్ఫోన్లు వాడాలని యత్నిస్తే.. ఆపరేటింగ్ తెలీక ఆ తర్వాత తలలు పట్టుకోవాల్సి వస్తుంది. చేయకూడనివి ► ఫోన్లు రిపేర్‌కు ఇచ్చేప్పుడు సిమ్ల అవసరం అస్సలు ఉండదు. ఓటీపీ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్ కార్డుతో ఫోన్ ఎట్టిపరిస్థితుల్లో రిపేర్‌కు ఇవ్వొద్దు. ► సులువుగా పసిగట్టగలిగే పాస్‌వర్డ్‌లను పెట్టడం మంచిది కాదు. ► చాలామంది నిత్యం వాడేవే కదా అని.. అన్ని యాప్స్‌కు పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తుంటారు. కానీ, ఫోన్లో పాస్వర్డ్లు అలా సేవ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ► అన్నింటికి మించి ఫోన్లను బయటి వైఫైల సాయంతో కనెక్ట్ చేసి.. ఆర్థిక లావాదేవీలను నిర్వహించకూడదు. పైవన్నీ తెలిసినవే కదా.. చిన్న చిన్న కారణాలే కదా.. వీటితో ఏం జరుగుతుంది లే అనే నిర్లక్ష్యం ‘స్మార్ట్ ఫోన్ల’ విషయంలో అస్సలు పనికి కాదు. ఇక ఖరీదైన ఫోన్ల విషయంలో స్టోర్లకు వెళ్లి రిపేర్ చేయించుకోవడం ఉత్తమం. -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్‌గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్‌లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్‌కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్‌ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్‌పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్‌ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్‌ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్‌తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
వయసు 10.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు.. రోజుకు 4 గంటలు
న్యూఢిల్లీ: మైనర్లలో స్మార్ట్‌ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8శాతం మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3శాతం మందికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈ ఖాతాలను వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ పరిశోధనలో మొత్తం 5,811 మంది నుంచి స్పందనలు తీసుకున్నారు. 3,491 మంది పాళశాలపిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు తీసుకున్నారు. 6 రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. 8–18 ఏళ్ల వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉన్నాయని తేలింది. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.8శాతం మంది ఆన్లైన్ క్లాసుల కోసం వాడుతున్నారు. 40 శాతం మంది మెసెంజర్లు, 31 శాతం మంది మెటీరియల్స్, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్ కోసం వాడుతున్నారు. 52.9శాతం మంది చాటింగ్‌ను, 10.1శాతం మంది ఆన్లైన్లో నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. 15.80శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నారు. నిద్రపోయే ముందు ఫోన్లు వాడే వారు 76.20శాతం ఉండటం గమనార్హం. 23.80శాతం మంది పడుకోవడానికి బెడ్ ఎక్కాకా ఫోన్ వాడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్ వాడితే పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. -
నిదురపోరా.. తమ్ముడా..!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాల వాసులకు నిద్రలేమి శాపంగా పరిణమించింది. ల్యాప్‌టాప్.. ట్యాబ్.. స్మార్ట్‌ఫోన్..ఐపాడ్.. తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకప్పుడు నట్టింట్లో మాత్రమే ఉండేవి..ఇప్పుడు పడకసమయంలోనూ ఇవి బెడ్‌మీదకు చేరడంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. సెంచురీ మాట్రెసెస్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిటీజన్ల ’స్లీపింగ్ ట్రెండ్స్(నిద్ర అలవాట్లు)’పై జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మన నగరంలో సుమారు 54 శాతం మంది నిత్యం సుమారు 5–6 గంటల నిద్రకు సైతం దూరమౌతున్నట్లు తేలింది. చాలా మంది అర్ధరాత్రి పన్నెండు దాటినా..తమకు నచ్చిన షోలను టీవీల్లో వీక్షించడంతోపాటు..స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తున్న తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో 75 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో 73 శాతం మంది నిద్రసమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీ పడుతుండటం. బెంగళూరులో 50..పూణేలో 49 శాతం మందిదీ ఇదే వరసని ఈ సర్వే పేర్కొంది. 12 తరువాతేనిద్రలోకి.. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో సెంచురీ మాట్రెసెస్ ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్‌పై జరిపిన సర్వేలో సుమారు పదివేల మంది నుంచి ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్,సహా ..స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్,వాట్సప్,ట్విట్టర్,ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా ఐదు నగరాల్లో సరాసరిన 50 శాతం మంది రాత్రి సమయాలలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీపడుతూ..కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 12 గంటల తరవాతే నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారట. అధికంగా వీక్షిస్తే కళ్లకు అనర్థమే రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ...ఉదయం 5–6 గంటల మధ్యన నిద్రలేవాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు ఈ సర్వేలో తేలింది. ఇక అధిక పనిఒత్తిడి..ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజులపాటు పనిప్రదేశాలు..జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో తేలింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించడమే మేలు. గంటలతరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిల్లో ఉండే సూక్ష్మమైన నరాలు అధిక ఒత్తిడికిగురవుతాయి. దీంతో మెడ,మెదడు, నరాలపైనే దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉంటే మంచింది.– డాక్టర్ రవిశంకర్‌గౌడ్, సూపరింటెండెంట్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి వివిధ నగరాల్లో నిద్రలేమి శాతం ఇలా.. -
ఇ‘స్మార్ట్’ ఫోన్లున్నా బేసిక్ మోడళ్లే టాప్
సాక్షి, అమరావతి: రకరకాల ఆకర్షణలతో స్మార్ట్ ఫోన్లు వెల్లువలా వస్తున్నా దేశంలో మాత్రం ఫీచర్ ఫోన్లు (బేసిక్ మోడళ్లు) పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. టెక్నాలజీతో అవసరాలన్నీ తీరిపోయేలా స్మార్ట్ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే చాలామంది నమ్ముకుంటున్నారు. దేశంలో 80 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులుండగా 45 కోట్ల మంది ఫీచర్ ఫోన్లే వాడుతున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విశ్లేషణలో తేలింది. 35 కోట్ల మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. మళ్లీ మొదటికి! మూడేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే గత ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్ల వాడకందారులు సైతం మళ్లీ ఫీచర్ ఫోన్లు కొంటున్నట్లు గుర్తించారు. 2018, 19లో స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గింది. గతంలో స్మార్ట్ ఫోన్ల పట్ల ఆకర్షితులైన వారు కూడా ఫోన్లు మార్చుకునే సమయంలో ఫీచర్ ఫోన్ వైపు మళ్లినట్లు గుర్తించారు. ఎందుకంటే...? ఇంటర్నెట్పై అవగాహన లేకపోవడం, స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు వాడడం తెలియక చాలామంది ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కార్మికులు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ధరలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఫీచర్ ఫోన్లు వాడేవారిలో ఎక్కువ మంది రూ.వెయ్యి లోపు వాటినే కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ధర ఎక్కువగా ఉండటం, నిర్వహణ భారంగా మారడం కూడా వీటిపై విముఖతకు కారణం. 2019 చివరి నాటికి దేశంలో 81 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు ఐడీసీ లెక్క తేల్చింది. టెలికాం ఆర్థిక పరిశోధనా విభాగం మాత్రం ఇది 118 కోట్లు దాటినట్లు పేర్కొంటోంది. ఐడీసీ వినియోగదారుల (యూజర్లు) సంఖ్యను లెక్కిస్తుండగా కేంద్ర ప్రభుత్వ విభాగం కనెక్షన్లు లెక్కిస్తుండడం వల్ల వ్యత్యాసం నెలకొన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
స్మార్ట్ ఫోన్ వాడకంపై షాకింగ్ సర్వే..
లండన్ : నిత్యం స్మార్ట్‌ఫోన్‌ను విడిచిపెట్టకుండా ఉంటే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. ఫోన్లు, కంప్యూటర్ల తెరల నుంచి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే వయసు మీరిన లక్షణాలు ముందుగానే ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఎల్ఈడీ తరంగాలకు అధికంగా గురైతే మెదడు కణాజాలం దెబ్బతిన్నట్టు ఒరెగాన్ యూనివర్సిటీ తుమ్మెదలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. బ్లూ లైట్ నేరుగా మీ కళ్లలోకి పడనప్పటికీ దానికి ఎక్స్పోజ్ అయినంతనే వయసు మీరే ప్రక్రియను వేగవంతం చేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగు తుమ్మెదల జీవనకాలాన్ని గణనీయంగా తగ్గించినట్టు కనుగొన్నామని ప్రొఫెసర్ జాగ జిబెల్టవిజ్ తెలిపారు. మానవ కణజాలంతో పోలిఉన్నందునే ఈ కీటక జాతులపై ఎల్ఈడీ తరంగాల ప్రభావాన్ని పరిశీలించామని చెప్పారు. ఆరోగ్యకర మానవులకు, జంతుజాలానికి సహజ కాంతి కీలకమని, అది జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తూ మెదడు చురుకుదనం, హార్మోన్ ఉత్పత్తి, కణజాల పునరుద్ధరణను చక్కగా క్రమబద్ధీకరిస్తుందని అథ్యయన రచయితలు పేర్కొన్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా వదిలివేయడం సాధ్యం కాని పక్షంలో బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గించడం, రెటీనాను కాపాడుకోవడం కోసం సరైన లెన్స్‌లతో కూడిన గ్లాస్లు ధరించాలని సూచించారు. బ్లూ ఎమిషన్స్‌ను నిరోధించే స్మార్ట్ఫోన్లు ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను వాడాలని కోరారు. -
మల్టీ కెమెరా స్మార్ట్ఫోన్ల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్–అప్, మల్టీ కెమెరా స్మార్ట్ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్‌ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్‌మనిపించనున్నాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్ తయారీ దిగ్గజం జాయిస్ సీఈవో మైఖేల్ కాష్‌కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మారుతున్న కంపెనీల ధోరణి.. స్మార్ట్ఫోన్ల డిజైన్, ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. స్క్రీన్కు ఆనుకుని చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్‌తో కూడిన బెజెల్ తగ్గుతూ వచ్చింది. బెజెల్ లెస్ మోడళ్ల రాకతో డిస్ప్లే సైజు పెరిగింది. ర్యామ్ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ పవర్ 5,000 ఎంఏహెచ్ దాటింది. 4కే (యూహెచ్డీ) స్క్రీన్, డెకాకోర్ ప్రాసెసర్, వైర్లెస్ చార్జింగ్ మోడళ్లూ వచ్చి చేరాయి. ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని ‘బిగ్ సి’ మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు పోటీపడీ మరీ లెన్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. అధిక మెగా పిక్సెల్‌తోపాటు మల్టిపుల్ కెమెరాల రాక అధికమైంది అని వివరించారు. మల్టిపుల్ లెన్స్ కెమెరాలు, లార్జ్ సైజ్ ఇమేజ్ సెన్సార్ల అమ్మకాల జోరుతో జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ కార్పొరేషన్ జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.14,490 కోట్ల నిర్వహణ లాభాలను ఆర్జించింది. ఈ మొత్తం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4%అధికంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. మల్టీ కెమెరాలకే మొగ్గు.. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ రంగంలో మల్టీ కెమెరాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బెజెల్ లేకుండా పూర్తి డిస్ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్–అప్ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ జూమ్, ఫాస్ట్ ఆటో ఫోకస్, వైడ్ యాంగిల్ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌లలో అందమైన ఫొటోలను పోస్ట్ చేసేందుకు కస్టమర్లు పాప్–అప్‌తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలున్న ఫోన్లు కోరుకుంటున్నారు. పాప్–అప్ కెమెరా మోడల్ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తోంది’ అని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్‌తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్ పాప్–అప్ కెమెరాతో సామ్సంగ్ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షావొమీ, రియల్మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. -
అప్పుడు కూడా ఆన్లైన్లోనే..
సాక్షి,సిటీబ్యూరో: నగరవాసుల హాబీలు మారుతున్నాయి. ఒకప్పుడు శారీరక శ్రమతో పాటు వ్యాయామానికి సంబంధించిన ఆటలు హాబీలుగా ఉండేవి. వాటి తర్వాత ఫొటోగ్రఫీ, ఆర్ట్, గార్డెనింగ్, మ్యూజిక్ వినడం, బుక్ రీడింగ్ వంటి వ్యాపకాల్లో గడిపేవారు. కానీ స్మార్ట్‌ఫోన్.. అపరిమిత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక గ్రేటర్ సిటీజనుల్లో అధిక శాతం మంది హాబీలు మారిపోతున్నాయి. ప్రస్తుతం ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ‘సోషల్ మీడియా’లోనే విహరిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు గంటలకు పైగా అదే ప్రపంచంగా గడుపుతున్నారు. ఇలాంటి వారు మహానగరంలో 56 శాతానికి పైగా ఉన్నట్లు ‘మింట్ గౌ’ అనే సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. గ్రేటర్ సిటీలో ప్రధానంగా 18–21 ఏళ్ల మధ్య వయసు యువతలో 56.99 శాతం మంది తాము నాలుగు గంటలకు పైగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో జీవిస్తున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇక 22–29 మధ్య వయస్కులు 56.87 శాతం మంది.. 29–37 మధ్య వయస్సున్న వారు 54.56 శాతం, 38–53 ఏళ్ల మధ్యనున్న వారిలో 55.65 శాతం మంది సోషల్ మీడియానే తమ వ్యాపకంగా సెలవిచ్చారట. ఇటీవల ‘మింట్గౌ’ గ్రేటర్ వాసుల హాబీలపై ఆన్లైన్లో చేయగా దాదాపు ఐదు వేలమంది తమ అభిప్రాయాలను సిన సర్వే వివరాలను తాజాగా ప్రకటించింది. ఫిట్నెస్పైనా పెరిగిన శ్రద్ధ.. గ్రేటర్లో సోషల్ మీడియాలో మునిగితేలుతున్న యువత తమ బాడీ ఫిట్‌నెస్‌కు సైతం అధిక ప్రాధాన్యఇ ఇనిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎవరి తీరికను బట్టి వారు జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్, వాకింగ్, పవర్ యోగా, యోగా వంటి వ్యాపకాలకు కొంత సమయం వెచ్చిస్తున్నట్లు తేలింది. ఇక తమ మిత్ర బృందంతో గడిపేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారట. కొలువు చేస్తున్న వారు సైతం.. ఐటీ, బీపీఓ, కేపీఓ తదితర వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాలు చేసుకునే వారిలో సైతం అత్యధికులు సోషల్ మీడియాలోనే విహరిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఉద్యోగం చేస్తున్న వారిలో 54 శాతం మందికి.. చదువుకుంటున్న వారిలో 65 శాతం మందికి ఏదో వ్యాపకం ఉందట. అందులోనూ ఏకంగా 50 శాతం మంది ఇంటర్నెట్, సోషల్ మీడియాలే తమ హబీలని సెలవివ్వడం గమనార్హం. ఇతర హాబీలు అంతంతే.. తీరిక వేళల్లో వంటచేయడం, ఫోటోగ్రఫీ, సంగీత సాధన, గార్డెనింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వంటి వ్యాపకాలతో గడిపేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. వంట చేయడం హాబీ అని తెలిపిన పురుషులు 26.55 శాతం మంది ఉండడం విశేషం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టమని చెప్పిన పురుషులు 12.07 శాతం కాగా.. గార్డెనింగ్, సంగీత సాధన, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వంటి విషయాల్లో పురుషుల కంటే మహిళలే ముందున్నారు. -
నాలుగేళ్లలో... స్మార్ట్ఫోన్ల రెట్టింపు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ విప్లవంతో భారత మొబైల్ ఫోన్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లుండగా... 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్ డివైజెస్) ప్రస్తుత 160 కోట్ల నుంచి 220 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకుంటాయని సిస్కో నివేదించింది. ఇలా కనెక్ట్ అయిన డివైజెస్‌లో 15.5 శాతం వార్షిక వృద్ధితో స్మార్ట్ఫోన్లే 38 శాతం ఉంటాయట. ఈ స్థాయి ఉపకరణాలతో ప్రస్తుతం 2.4 గిగాబైట్లుగా ఉన్న సగటు డేటా వాడకం ఏకంగా 14 గిగాబైట్లకు దూసుకుపోతుందని సిస్కో ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ కౌల్ తెలియజేశారు జనాభాలో 60 శాతం.. గత 32 ఏళ్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ ఒక ఎత్తయితే.. భారత్‌లో 2022లో నమోదయ్యే ట్రాఫిక్ ఒక ఎత్తు కానుంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ ట్రాఫిక్ గంటకు 60 లక్షల డీవీడీలకు సమానం కానున్నదనేది సిస్కో అంచనా. 2017లో దేశంలో ఇంటర్నెట్ కస్టమర్లు 35.7 కోట్లు. జనాభాలో ఇది 27 శాతం. 2022 నాటికి నెట్ యూజర్లు 84 కోట్లకు చేరనున్నారు. అంటే ఆ సమయానికి జనాభాలో ఈ సంఖ్య 60 శాతం కానుంది. ‘‘ఇంటర్నెట్ వినియోగంలో స్మార్ట్ఫోన్లే ప్రధానపాత్ర పోషిస్తాయి’’ అని ‘బిగ్ సి’ మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇక నాలుగేళ్లలో స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం అయిదు రెట్లు పెరగనుంది.సోషల్ మీడియా, వీడియోల వీక్షణం, కమ్యూనికేషన్, బిజినెస్ అప్లికేషన్స్ దీనికి ప్రధాన కారణమని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ చెప్పారు. డేటా వాడకం, అంచనాలు పెరిగే కొద్దీ సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయన్నారు. అంచనాలకు అందని అంకెలు.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు డేటా వినియోగం నెలకు 3.5 జీబీ ఉంది. 2022 నాటికి ఇది ఏకంగా 17.5 జీబీకి చేరనుంది. నెట్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లో మొబైల్‌కు అనుసంధానమయ్యేవి 68 శాతం ఉంటాయట. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య ప్రస్తుత 2 కోట్ల నుంచి 4.85 కోట్లకు పెరగనుంది. పర్సనల్ కంప్యూటర్లు 4.3 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 4.25 కోట్లకు వచ్చి చేరనున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు 13.74 కోట్లున్నాయి. నాలుగేళ్లలో ఇవి 26.3 కోట్లకు వృద్ధి చెందనున్నాయి. 14 లక్షల యూనిట్లుగా ఉన్న 4కే టీవీల సంఖ్య 2.5 కోట్లకు ఎగుస్తుంది. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్ల మొగ్గే ఈ స్థాయి డిమాండ్‌కు కారణమని హోమ్ బ్రాండ్ టీవీల పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఇక 9.5 ఎంబీపీఎస్‌గా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 3.3 రెట్లు దూసుకుపోనుంది. గతేడాది మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియోల (బిజినెస్, కం జ్యూమర్ కలిపి) వాటా 58%. నాలుగేళ్లలో ఇది 77%కి తాకుతుందని సిస్కో వెల్లడించింది. అల్ట్రా హెచ్డీ వీడియో ట్రాఫిక్ ప్రస్తుతం 1%. 2022 నాటికి దీని వాటా 10.6%గా ఉండనుంది. -
దేవుడిని నేరుగా కలవాలనుకుంటున్నారా!?
‘కొందరికి దేవుడు కలలో కన్పిస్తాడు. మరికొందరికి ప్రతీచోటా ఆయన పిలుపే విన్పిస్తుంది. అయితే ఈ రెండు కాకుండా నేరుగా దేవుడిని చూడాలంటే మాత్రం డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆయనకి మెసేజ్ పెట్టేస్తే చాలు. ఇక డైరెక్ట్‌గా దైవదర్శనమే’ ఇదీ ప్రశాంతంగా ఉండాల్సిన పవిత్ర స్థలంలో కూడా స్మార్ట్ ఫోన్ల గోలతో, ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్న పౌరులపై ఓ పార్శీ ప్రబోధకుడి సెటైర్. అవును.. చవక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో ధనిక- పేద, చిన్నా- పెద్దా భేదాల్లేకుండా దాదాపు ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ కలిగి ఉండటం సాధారణమైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ చూసుకోవడం, చోటుతో సంబంధం లేకుండా ఫోన్‌ను వాడుతూ బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలా ప్రశాంతతో పాటు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి వారిని ఉద్దేశించి ఓ పార్శీ ప్రబోధకుడు ఫైర్ టెంపుల్ ముందు అంటించిన ప్రకటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ ప్రకటనలో ఏముందంటే... ‘మీరు ఈ ఫైర్ టెంపుల్(జొరాస్ట్రియన్ల ప్రార్థనా స్థలం)లోకి ప్రవేశించినట్లయితే ఆ దేవుడి మహిమలు వింటారు. లేదు ఆయన నుంచి పిలుపు వినాలని భావిస్తే అది మాత్రం మీ ఫోన్ ద్వారానే సాధ్యం. మీ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసినందుకు ధన్యవాదాలు. దేవుడితో మాట్లాడాలనుకుంటే ప్రశాంత వాతావరణం ఉన్న ఇలాంటి చోటుకి రండి. లేదు ఆయనను నేరుగా కలవాలని భావిస్తే మాత్రం.. డ్రైవింగ్ చేస్తున్న సమమయంలో ఆయనకు ఒక మెసేజ్ పెట్టండి ’ అంటూ ఫైర్ టెంపుల్ ముందు పార్శీ ప్రబోధకుడు ఓ కాగితం అంటించారు. కనీసం ఇది చూస్తేనైనా టెంపుల్‌లోకి ప్రవేశించే సమయంలో ఫోన్ ఆఫ్ చేస్తారని ఆయన భావన. అయితే ఈ ప్రకటన కేవలం ఏ ఒక్క మతస్థులకో పరిమితం కాదని.. డ్రైవింగ్‌లో ఫోన్ వాడే వారి ప్రతీ ఒక్కరికి వర్తిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పర్సనల్ కంటే పోర్న్ చాలా ముఖ్యం...
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో.. ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలా మట్టుకు స్టోరేజీ సమస్యతో సతమతమవుతున్నారంట. అలాంటి తరుణంలో ఏం చేయాలో తెలీక తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను ఫోన్ నుంచి తొలగించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు అశ్లీల డేటా జోలికి వెళ్లకపోవటం ఇక్కడ విశేషం. ప్రముఖ కంపెనీ సాన్‌డిస్క్ భారత దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మొత్తం లక్ష మందిపై ఈ సర్వేను చేపట్టింది. ఇందులో 29 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారానికొకసారి.. 62 శాతం మూడు నెలలకొకసారిగా తమ ఫోన్లోని మెమొరీని ఫ్రీ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తంలో 65 శాతం మంది మాత్రం అందుకోసం తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను తొలగించేస్తున్నట్లు వెల్లడించారు. వాటిని తొలగించాక చాలా బాధపడుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు. అయితే తమ ఫోన్లలోని పోర్న్.. అసభ్య ఫోటోలను జోలికి మాత్రం వాళ్లు వెళ్లట్లేదంట. వాటికి బదులు.. తమ వ్యక్తిగత సమాచారాన్నే త్యాగం చేసేందుకు మొక్కు చూపుతున్నారని సర్వేలో తేలింది. అయితే డేటాను తొలగించుకునే బదులు వాటిని స్టోర్ చేసుకునే మార్గాలు ఉన్నాయి కదా అని శాన్డిస్క్ డైరెక్టర్ ఖలీద్ వానీ వినియోగదారులకు సూచిస్తున్నారు. ‘ఆ సమయంలో కంగారుపడి మెమొరీని తొలగించేస్తున్నారే తప్ప.. వాటిని మరో డివైస్‌లోకి బదిలీ చేయాలన్న ఆలోచన వారికి తట్టడం లేదని’ ఆయన అంటున్నారు. ఇక సర్వేలో పాల్గొన్న వాళ్లలో 23-40 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా ఉండగా.. పోర్న్ ప్రస్తావన తెచ్చిన వాళ్లు 60 శాతం ఉండటం విశేషం. -
జియో సిమ్ కోసం కిలోమీటర్ల క్యూ!
టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అందుబాటులోకి వచ్చిన నెట్ వర్క్ సేవలు రిలయన్స్ జియో. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ విన్నా రిలయన్స్ జియో మాట వినిపిస్తోంది. కారణం.. రిలయన్స్ సంస్థ ప్రివ్యూ ఆఫర్ కింద డిసెంబర్ 31 వరకూ ఆఫర్ కింద ఉచిత్ సిమ్ తో పాటు అపరిమిత ఇంటర్ నెట్ డేటా, వాయిస్ కాల్స్ సదుపాయం కల్పించడం. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో స్టార్ట్ ఫోన్ యూజర్లకు జియో సిమ్ ఫీవర్ పట్టుకుంది. రిలయన్స్ జియో సిమ్ కోసం అప్లై చేసుకోవడానికి చాలా షాపుల ముందు దాదాపు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. దీంతో చాలా ప్రాంతాల్లో అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సిమ్‌లు అందుబాటులోకి వచ్చిన చాలా నగరాలు, పట్టణాలలో రిలయన్స్ డిజిటల్స్, సిమ్ విక్రయించే షాపుల ముందు కస్టమర్లు బారులు తీరుతున్నారు. జనవరి 1 నుంచి పరిస్థితి ఎలా ఉంటుందన్నది పక్కనబెడితే జియో మాత్రం ఇతర పోటీ కంపెనీలతో పాటు స్మార్ట్ ఫోన్ యూజర్లపైనా ప్రభావం చూపించిందన్నది వాస్తవం. -
స్మార్ట్‌గా తగ్గించుకోండి...
ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్కి ఎన్ని లైక్‌లు వచ్చాయో.? ట్విట్టర్లో ట్వీట్‌కి రెస్పాన్స్ ఏంటి.? వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్‌లు మిస్ అవుతున్నానా? ఏదో ఆత్రుత.. ఇంకేదో ఆరాటం.. దానివల్ల వచ్చేది, పోయేది పెద్దగా ఉన్నా లేకపోయినా అలవాటైపోతున్న దినచర్య. సిటీలో స్మార్ట్ ఫోన్ యూజర్లలో పెరుగుతున్న యాంగ్జయిటీని తక్కువగా అంచనా వేయలేం.. వేయకూడదు కూడా. ఇది మన ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని తెలియజేస్తోంది ఓ పరిశోధన. అంతేకాదు ఆ ఒత్తిడి తప్పులు చేసేందుకు కూడా కారణమవుతోందని హెచ్చరిస్తోంది. -ఓ మధు ఆఫీస్ మీటింగ్‌లో.. ఫ్యామిలీతో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ చేస్తున్నా.. డైనింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ కమోడ్ దాకా... దేని మీద కూర్చున్నా ధ్యాస మాత్రం మొబైల్ మోత మీదే. స్మార్ట్ ఫోన్స్, యాప్స్ లైఫ్‌ని ఎంత ఈజీ చేస్తున్నాయో.. అంతే బిజీగా మార్చేస్తున్నాయి. యాప్ వేసుకోవడమే ఆలస్యం నోటిఫికేషన్స్ షురూ. ఏ పనిలో ఉన్నా నోటిఫికేషన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట స్మార్ట్ ఫోన్ యూజర్లు. దీనిని ‘పింగ్’ అని అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. నోటిఫికేషన్ అటెండ్ చేసినా చేయకపోయినా ఈ పింగ్‌తోనే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోందని ఫ్లోరిడాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు నోటిఫికేషన్ రింగ్ వస్తేనే 3 రెట్లు ఎక్కువ తప్పులు చేసేస్తున్నారని ఈ పరిశోధనతో తేలింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పై పెరుగుతున్న ఆత్రుత తగ్గించుకోవడానికి పరిశోధకుల సూచనలు మీకోసం... * ప్రాధాన్యతల మేరకు నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకోవాలి. * వెంటనే సమాధానం తెలియజేయాల్సిన అవసరం లేని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫుడ్, ట్రావెల్ లాంటి యాప్స్‌ని మ్యూట్ చేసుకోవాలి. * నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ సమయాన్ని విధిగా పాటించడం అలవాటు చేసుకోవాలి. * మీరేంటో ప్రతీ నిమిషం ప్రపంచానికి తెలియజేయాల్సిన పని లేదు. విందూ, విహారాలకు వెళ్లినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్‌తో ఆ విశేషాలు పంచుకోండి. * మన నీడకంటే ఎక్కువగా మనతో ఉండే ఫోన్‌కి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వండి. ఈ బ్రేక్ ఫోన్ కన్నా మీకే ఎక్కువ అవసరం అని గుర్తించండి. వాకింగ్, గార్డెనింగ్ లాంటి పనుల్ని ఫోన్ లేకుండా చేసుకోండి. * ఫ్యామిలీతో గడిపే సమయంలో కూడా ఫోన్‌ని సెలైంట్‌లో పెట్టండి. వీలైతే ఆ కాసేపు దాని జోలికి వెళ్లకపోతే మీ కుటుంబానికి మీరు ఎంతో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన వారవుతారు. ప్రాథామ్యాలు తెలుసుకోవాలి... స్మార్ట్ఫోన్లు వచ్చాక ఫేస్బుక్, వాట్సప్‌కు చాలామంది అడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో అనర్థాలుంటాయి. లైక్స్ రాకపోతే ఫీలవడం, ఫ్రెండ్ గ్రూప్‌లో యాక్సెప్ట్ చేయకపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వీటి విషయంలో రియలైజ్ కావాలి. మనకు ఏది ముఖ్యమో.. ఏది అప్రధానమో అర్థం చేసుకోవాలి. టీనేజర్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనపడుతోంది. వాళ్ల చదువు, ఇతరత్రా లక్ష్యాల మీద ఫోకస్ పెంచి ఈ తరహా కమ్యూనికేషన్‌ని తగ్గించుకోవాలి. లేదంటే కెరీర్ పాడవుతుందని గుర్తించాలి. -డా.శేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్