మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోన్ల హవా.. | multi-camera first priority on smartphone users | Sakshi
Sakshi News home page

మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోన్ల హవా..

Published Thu, Aug 1 2019 5:03 AM | Last Updated on Thu, Aug 1 2019 5:03 AM

 multi-camera first priority on smartphone users - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్‌.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్‌ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్‌–అప్, మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్‌ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్‌ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్‌మనిపించనున్నాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్‌ తయారీ దిగ్గజం జాయిస్‌ సీఈవో మైఖేల్‌ కాష్‌కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

మారుతున్న కంపెనీల ధోరణి..
స్మార్ట్‌ఫోన్ల డిజైన్, ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. స్క్రీన్‌కు ఆనుకుని చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్‌తో కూడిన బెజెల్‌ తగ్గుతూ వచ్చింది. బెజెల్‌ లెస్‌ మోడళ్ల రాకతో డిస్‌ప్లే సైజు పెరిగింది. ర్యామ్‌ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్‌ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ పవర్‌ 5,000 ఎంఏహెచ్‌ దాటింది. 4కే (యూహెచ్‌డీ) స్క్రీన్, డెకాకోర్‌ ప్రాసెసర్, వైర్‌లెస్‌ చార్జింగ్‌ మోడళ్లూ వచ్చి చేరాయి. ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని ‘బిగ్‌ సి’ మొబైల్స్‌ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు.  కంపెనీలు పోటీపడీ మరీ లెన్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. అధిక మెగా పిక్సెల్‌తోపాటు మల్టిపుల్‌ కెమెరాల రాక అధికమైంది అని వివరించారు. మల్టిపుల్‌ లెన్స్‌ కెమెరాలు, లార్జ్‌ సైజ్‌ ఇమేజ్‌ సెన్సార్ల అమ్మకాల జోరుతో జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.14,490 కోట్ల నిర్వహణ లాభాలను ఆర్జించింది. ఈ మొత్తం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4%అధికంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.  

మల్టీ కెమెరాలకే మొగ్గు..
ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో మల్టీ కెమెరాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బెజెల్‌ లేకుండా పూర్తి డిస్‌ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్‌–అప్‌ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్, ఆప్టికల్‌ జూమ్, ఫాస్ట్‌ ఆటో ఫోకస్, వైడ్‌ యాంగిల్‌ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అందమైన ఫొటోలను పోస్ట్‌ చేసేందుకు కస్టమర్లు పాప్‌–అప్‌తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలున్న ఫోన్లు కోరుకుంటున్నారు.

పాప్‌–అప్‌ కెమెరా మోడల్‌ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తోంది’ అని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్‌ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్‌తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్‌ పాప్‌–అప్‌ కెమెరాతో  సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షావొమీ, రియల్‌మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement