‘స్మార్ట్‌’ తెలంగాణ..  | Smart life grown in Telangana | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’ తెలంగాణ.. 

Published Fri, Dec 30 2022 2:15 AM | Last Updated on Fri, Dec 30 2022 2:16 AM

Smart life grown in Telangana - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి
వ్యవసాయంలో ఆధునికత పెరిగిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో సాగు దాదాపుగా కనుమరుగైపోతోంది. విత్తనాలు నాటాలన్నా యంత్రాలే..కోత కోయాలన్నా యంత్రాలే. ఇక మధ్యలో పంటలను ఆశించే తెగుళ్లను నిర్మూలించేందుకూ ఆధునిక స్ప్రే పరికరాలు వచ్చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి..కానీ ఏ పనికి ఏ పరికరం వాడాలి?, ఏ తెగులు సోకితే ఏ మందు వాడాలి?, పంటల ఎదుగుదల సరిగ్గా లేకుంటే ఏం చేయాలి?..ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు, పరిష్కారం దొరికినట్టేనని అంటున్నాడు కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం రామానుజరెడ్డి.

తనకున్న యాభై ఎకరాల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తూ చీడపీడలకు ‘స్మార్ట్‌ ఫోన్‌ వైద్యం’చేస్తున్నాడు. తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్లాంటిక్స్, అగ్రిసెంటర్, కిసాన్‌ తదితర యాప్‌ల సహాయంతో మొక్కలు ఎదగకపోయినా లేదా తెగులు కనిపించినా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే గంటల వ్యవధిలోనే తగు సలహాలు వచ్చేస్తున్నాయి.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా జేబులోంచి ఫోన్‌ తీసి గూగుల్‌లో శోధించడం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ–పేమెంట్లు కూడా పెరిగిపోవడం స్మార్ట్‌ ఫోన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తోంది.  

జోరుగా ఆన్‌లైన్‌ సర్వీసులు 
2022లో తెలంగాణలో టెలిడెన్సిటీతో పాటు డిజిటల్‌ లైఫ్‌ గణనీయంగా పెరిగిపోయింది. దేశ సగటుకు మించిన స్మార్ట్‌ సిటిజెన్‌ (స్మార్ట్‌ ఫోన్లు వినియోగించేవారు), డేటా వినియోగంతో పాటు ఆన్‌లైన్‌ సర్వీసులు, పేమెంట్లు జోరుగా సాగుతున్నా­యి. టెలిడెన్సిటీ (ఎంత మందికి ఎన్ని సిమ్‌లు)ని తీసుకుంటే 2022 ట్రాయ్‌ తాజా నివేదిక మేరకు తెలంగాణలో 100 మంది 110 సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డులున్నాయి. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో 4.22 కోట్ల సిమ్‌ కార్డులుండగా వీటిలో 1.80 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కేరళ 100 మందికి 123 సిమ్‌లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సెకండ్‌ ప్లేస్‌కు చేరింది. 

రాష్ట్రాల వారీగా ప్రతి 100 మందికి వాడుతున్న సిమ్‌ల వివరాలు  

ఈ పేమెంట్లలో టాప్‌ ఫైవ్‌లో హైదరాబాద్‌ 
కోవిడ్‌తో వేగం పుంజుకున్న ఈ పేమెంట్ల జోరు 2022లో కూడా కొనసాగింది. ఒకరి నుండి ఒకరికి, సంస్థల నుండి బ్యాంకులకు మనీ ట్రాన్స్‌ఫర్‌ మినహాయిస్తే.. వ్యక్తిగత లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ – 2022) తాజా నివేదిక వెల్లడించింది.

దేశంలో ఈ కామర్స్‌ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ, ముంబై అనంతరం హైదరాబాద్‌ నా­లు­గవ స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో జీహెచ్‌ఎంసీ మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్‌ జిల్లాలు వరసగా ఆ తర్వాతి స్థానా­ల్లో ఉన్నాయి. లావాదేవీల కోసం అత్యధికంగా ఫోన్‌పే (47.8%), గూగుల్‌పే (33.6%), పేటీ­ఎం (13.2%) లను ప్రజలు వినియోగిస్తున్నారు. 

నగదు వాడేదే లేదు..! 
ప్రపంచంలో 63 దేశాలు చుట్టివచ్చా. ఇండియాలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లా. విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి కరెన్సీ తీసుకుంటా. ఇండియాలో మాత్రం నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు. ఇక హైదరాబాద్‌లో అయితే అన్నీ ఆన్‌లైన్‌లోనే.  
– నీలిమారెడ్డి, మైక్రోసాఫ్ట్‌ 

స్మార్ట్‌ సిటిజెన్‌ సంఖ్య పెరుగుతోంది 
ప్రభుత్వ, ప్రైవేటు సేవలు చాలావరకు ఆన్‌లైన్‌లోకి రావటం వల్లే టెలిడెన్సిటీ పెరిగింది. దీంతో పాటు ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగి తెలంగాణలో స్మార్ట్‌ సిటిజెన్‌ సంఖ్య దేశ సగటు కంటే పెరుగుతూ వస్తోంది. అలాగే దేశంలో అత్యధిక డేటా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దీని ఫలితాలు అన్ని రంగాల్లోనూ రావటం మొదలయ్యాయి.  
– జయేశ్‌ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement