
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా డేటా వినియోగం 2025 నాటికల్లా నెలకు 25 జీబీ స్థాయికి చేరనుంది. చౌక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, వీడియోల వీక్షణలో మారుతున్న అలవాట్లు ఇందుకు కారణం కానున్నాయి. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 గణాంకాల ప్రకారం భారతీయులు నెలకు సగటున 12 జీబీ డేటా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇది అత్యధికం కావడం గమనార్హం.
దేశీయంగా 2025 నాటికి కొత్తగా 41 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎడిటర్ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. అప్పటికి భారత్‌లో 18 శాతం మంది 5జీ నెట్‌వర్క్‌ను, 64 శాతం మంది 4జీ నెట్‌వర్క్, మిగతా వారు 2జీ/3జీ నెట్‌వర్క్ వినియోగిస్తుంటారని వివరించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2020 ఆఖరు నాటికి 5జీ యూజర్ల సంఖ్య 19 కోట్లుగా ఉండొచ్చని, 2025 ఆఖరు నాటికి ఇది 280 కోట్లకు చేరే అవకాశం ఉందని ఎరిక్సన్ అంచనా వేస్తోంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో 4జీ ప్రధాన మొబైల్ యాక్సెస్ టెక్నాలజీగా ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment