స్మార్ట్ ఫోన్లకు కాలం చెల్లనుంది!
స్టాక్హోమ్: నిత్యవసర వస్తువుగా మారిపోయిన స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయట. స్మార్ట్ యూజర్స్ త్వరలోనే వాటికి గుడ్ బై చెబుతారట. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే, స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలా అని దిగులు అక్కర్లేదు.. ఎందుకంటే, వాటి స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆ నూతన టెక్నాలజీయే ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). మరో ఐదు సంవత్సరాల తర్వాత స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ను వాడుతారని ఎరిక్సన్ సంస్థ తమ సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. ఫోన్, టాబ్లెట్ లాంటి పరికరాలు వాడకుండానే మనకు కావలసిన వారితో ఇంటరాక్షన్ అయ్యే వీలుందని సర్వే నిర్వహించిన మరిన్ని సంస్థలు ఏఐ టెక్నాలజీపై ఆశాభావం వ్యక్తంచేశాయి.
స్వీడన్ సహా 39 దేశాలలో సుమారు లక్ష మందిని సంప్రదించినట్లు రీసెర్చర్స్ తెలిపారు. 2021 నుంచి ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సర్వే ద్వారా అంచనా వేస్తున్నారు. డ్రైవింగ్, కుకింగ్, ఇతర ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు ఫోన్లు వాడకం ఇబ్బందికరం. కానీ, నూతన టెక్నాలజీ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే మరింత సులువుగా మన బంధువులు, ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందని అధ్యయనం చేపట్టిన బృందం పేర్కొంది.