జియో వల్ల ప్రభుత్వానికి రాబడి లేదు
• వాణిజ్య రేడియో తరంగాలను ఉచిత సేవలకు వాడేస్తోంది
• ఇబ్బడి ముబ్బడిగా డేటా వినియోగం
• ఉచితంగా ఇవ్వటం వల్లే ఇదంతా జరుగుతోంది
• సెల్యులర్ ఆపరేటర్ల తాజా ఆరోపణ
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోపై యుద్ధాన్ని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తీవ్రతరం చేసింది. ‘జియో సంస్థ బీటా టెస్ట్ పేరుతో వాణిజ్య సేవల కోసం కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తూ ఉచిత డేటా, వాయిస్ సేవలు అందిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడం లేదు’ అంటూ సీఓఏఐ ప్రధానమంత్రి కార్యాలయానికి సోమవారం మరో లేఖ రాసింది. బీటా టెస్ట్‌ల పేరుతో జియో వినియోగిస్తున్న డేటా... 15-20 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న మిగిలిన ఆపరేటర్ల ఉమ్మడి స్పెక్ట్రమ్ వినియోగంతో సమాన స్థాయిలో ఉందని లేఖలో వివరించింది.
వాణిజ్య సేవల కోసం ఆదాయ పంపిణీ ప్రాతిపదికన కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తుండడంతో... వీటిపై ఎలాంటి ఆదాయం లేనందున ప్రభుత్వానికి ఎలాంటి వాటా రావడం లేదని పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 30 లక్షల మంది ఉద్దేశపూర్వకంగా ఉచిత డేటా, వాయిస్ సేవలను ఒకే ఆపరేటర్ నుంచి వినియోగిస్తున్నట్టు సీఓఏఐ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. పరీక్షల (టెస్ట్) పేరుతో అనధికారిక వాణిజ్య సేవలు అందిస్తుండడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
‘జియో సంస్థ లక్షల మంది టెస్ట్ యూజర్లకు ఇప్పటికీ అక్రమంగా ఉచిత నిమిషాలను సొంత నెట్‌వర్క్ పరిధిలోనే ఇచ్చుకోదలచుకుంటే అది వారికి సంబంధించిన అంశం. ఈ బూటకపు ట్రాఫిక్‌కు ఇతర ఆపరేటర్లు సైతం సబ్సిడీపై నెట్‌వర్క్ వనరులు కల్పించాలని ఆశించడం సరికాదు’ అని సీఓఏఐ స్పష్టం చేసింది. టారిఫ్ ప్లాన్ల సమాచారాన్ని ట్రాయ్‌కు సమర్పించకుండానే వాణిజ్య సేవలు ప్రారంభించడం, హ్యాండ్‌సెట్ విలువకు సమానమైన పలు రకాల బండిల్డ్ సేవలను (డేటా, టాక్‌టైమ్, ఎస్‌ఎంఎస్‌లు) ఉచితంగా అందించడం ద్వారా స్థూల ఆదాయ సర్దుబాటు రుసుం, ఇతర పన్నుల ఎగవేత వంటి పలు అంశాలు ప్రస్తుతం తెరమీదకు వచ్చాయని పేర్కొంది. కాగా, ప్రధాన టెలికం ఆపరేటర్లు జియో నుంచి వచ్చే కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు తమ నెట్‌వర్క్‌లకు అనుసంధానాన్ని కల్పించేందుకు నిరాకరించడం ద్వారా లెసైన్స్ ఒప్పందాలను ఉల్లంఘించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో సైతం ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
జియోకి మారిపోండిఉద్యోగులకు ఆర్‌ఐఎల్ సూచన
‘‘ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఇతర నెట్‌వర్క్‌ల మొబైల్ కనెక్షన్లను పక్కన పెట్టండి. వాటికి బదులుగా అధిక వేగంతో కూడిన రిలయన్స్ జియో 4జీ కనెక్షన్లకు తక్షణం మారిపోండి’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 40వేల మందికిపైగా ఉన్న తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు ఆర్‌ఐఎల్ హెచ్‌ఆర్ విభాగం తన ఉద్యోగులకు లేఖలు పంపింది. కార్పొరేట్ కనెక్షన్లను జియోకు మార్చుకుంటున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది.
అయితే, జియో సేవలపై ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలతో కూడిన సీఓఏఐ ప్రభుత్వానికి అదే పనిగా ఫిర్యాదు చేస్తున్న తరుణంలో ఆర్‌ఐఎల్ నుంచి ఈ ఆదేశాలు వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్ ఉద్యోగుల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఆపరేటర్లకు చెందిన సీయూజీ సేవలను వినియోగిస్తోంది.