Tele-Communications
-
మంచి అడుగే... మార్పులు అవసరం
టెలికాం నియంత్రణ వ్యవస్థల్లో సంస్కరణలు, లోపాల సవరణలు లక్ష్యంగా టెలికాం డిపార్ట్మెంట్ ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్, 2022’ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఆధునికీకరించే దిశగా వేసిన మేలి అడుగుగా దీన్ని అభివర్ణించవచ్చు. అయితే ఈ రంగం మిగిలిన ఏ రంగంతోనూ సంబంధం లేనట్టుగా ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం, ప్రాచుర్యం పొందుతున్న కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్ వంటి టెక్నాలజీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం టెలికమ్యూనికేషన్స్ రంగంపైనా పడే ప్రమాదం ఉంది. ముసాయిదా బిల్లులో ఈ అంశాల ప్రస్తావనే లేకపోవడం మనం గమనించాలి! టెలికమ్యూనికేషన్ రంగంలో ఆధునికమైన, భవిష్యత్తు అవసరాలు తీర్చే సామర్థ్యం ఉన్న చట్టపరమైన నిర్మాణాత్మక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ గత నెలలో ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ ముసాయిదా బిల్లు–2022’ ను రూపొందించి ఇప్పటికే ప్రజా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. అందుకోసం ప్రతిపాదిత బిల్లు సారాంశాన్ని దేశ పౌరులకు అందుబాటులో ఉంచింది. దీనివల్ల బిల్లులోని లోతుపాతులను పరిశీలించడానికీ, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికీ నిపుణులకు, సాధారణ వినియోగదారులకు సైతం అవకాశం లభించినట్లయింది. భారతదేశంలో సైబర్ భద్రతపై పూర్తిస్థాయి ప్రత్యేక చట్టం లేదు. అందువల్ల, టెలికాం రంగంలో సైబర్ భద్రత తాలూకు సమస్యలను పరిష్కరించడం మరింత అవసరం. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలోనూ ఈ సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఇంటర్నెట్, సైబర్ స్పేస్‌కు టెలికమ్యూనికేషన్ రంగం కీలకమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్, 2022’ ముసాయిదా బిల్లులో ఈ అంశాల ప్రస్తావనే లేకపోవడాన్ని మొదటగా మనం గమనించాలి! టెలికమ్యూనికేషన్ రంగం మిగిలిన ఏ రంగంతోనూ సంబంధం లేనట్టుగా ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం, ప్రాచుర్యం రెండూ పొందుతున్న కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆధారితాలు, బ్లాక్‌చెయిన్ వంటి టెక్నాలజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం టెలికమ్యూనికేషన్స్ రంగంపైనా పడే ప్రమాదం ఉంది. భారతదేశం ఒక అనుసంధానిత టెలికాం పర్యావరణ వ్యవస్థ వైపు కదులుతున్నప్పుడు, కృత్రిమ మేధపై ఆధారపడటం అన్నది పెరుగుతున్నప్పుడు ప్రతిపాదిత చట్టం కొత్త సాంకేతికతల ఆగమనానికి సంబంధించినదిగా ఉండేలా విస్తృతమైన భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి కదా. కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీలు టెలికమ్యూనికేషన్స్ రంగంపై చూపే ప్రభావాలు, కొత్త టెక్నాలజీల అవసరాన్ని గుర్తించేందుకు తగిన అంశాలు ఈ ముసాయిదా బిల్లులో లేవన్నది స్పష్టం. దేశంలో టెలికాం రంగం ఏకీకృతమయ్యే దిశగా వెళుతున్న, కృత్రిమ మేధపై ఆధారపడటమూ పెరిగిపోయిన ఈ దశలో టెలికామ్ ముసాయిదా బిల్లు దార్శినికంగానూ, విశాల దృక్పథంతోనూ ఉండి ఉంటే ఈ కొత్త టెక్నాలజీల వ్యాప్తికి మరింత ఉపయోగకరంగా ఉండేది. సమాచార వ్యవస్థకు కీలకమైన అంశమైన టెలికమ్యూనికేషన్స్ భారతీయ సైబర్ సార్వభౌమత్వంలోనూ ఎంతో ముఖ్యమైంది. అయితే ఈ రంగానికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లపై తరచూ దాడులు జరుగుతున్నాయి. అయినా మన సైబర్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తగిన న్యాయపరమైన సౌకర్యాలు లేవు. భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ముందుకు వెళ్లాలంటే ఈ ముసాయిదా బిల్లులో నిర్దిష్ట ప్రమాణాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. ముసాయిదా బిల్లులో టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన మౌలిక సదుపాయాల సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి ఏర్పాట్లూ లేవు. వీటిని కాపాడుకునేందుకు ఏ రకమైన చర్యలనూ ఈ ముసాయిదా చట్టంలో నిర్దేశించలేదు. సైబర్ సెక్యూరిటీ చట్టం లేనే లేని నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలిగితే, లేదా నెట్‌వర్క్‌లోకి చొరబాట్లు జరిగితే ఆయా సేవలందించే వారి బాధ్యత ఏమిటన్నది కూడా ఈ చట్టంలో స్పష్టం చేయలేదు. జాతీయ భద్రత, అందులో టెలికమ్యూనికేషన్స్ పాత్రలను పరిగణలోకి తీసుకున్నా ఈ అంశాలకు ప్రాధాన్యం లభించి ఉండాల్సింది. దీనినే ఇంకోలా చెప్పాలంటే... టెలికమ్యూనికేషన్, టెలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్, సేవల భద్రత, సంరక్షణల కోసం ఎటువంటి పరిమితులనూ నిర్దేశించలేదు. సైబర్ భద్రత ఉల్లంఘనల సందర్భంలో సర్వీస్ ప్రొవైడర్ల బాధ్యత ఏ మేరకు ఉంటుందో కూడా స్పష్టం చేయలేదు. జాతీయ భద్రతతో టెలికమ్యూనికేషన్ల సంబంధం అత్యంత కీలకమైనది. అయితే ఈ ముసాయిదా జాతీయ భద్రతను ఎలా రక్షించవచ్చనే దానిపై అరకొరగా మాత్రమే వివరణలు కనిపిస్తున్నాయి! ప్రతిపాదిత టెలికమ్యూనికేషన్స్ ముసాయిదాకు ప్రత్యేక హోదా ఇవ్వడం మరిన్ని చిక్కులకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ హోదా కారణంగా ఇతర చట్టాలన్నింటి కంటే ఇది ఉన్నతమైందిగా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ బిల్లు 2000లో తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్తోనూ వైరుద్ధ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ముసాయిదా బిల్లు కాస్తా చట్టంగా మారే లోపు ఈ రకమైన వైరుద్ధ్యాన్ని నివారించాల్సిన అవసరముంది. అంతేకాదు... ఈ ముసాయిదా చట్టంలో డ్యూ డిలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను సక్రమంగా నిర్వచించనూ లేదు. డూ నాట్ డిస్టర్బ్ రిజిస్టర్ నిర్వహణనే ఉదాహరణగా తీసుకుంటే ఇందులో వినియోదారుల రక్షణకు తగిన ఏర్పాట్లు లేవు. రిజిస్టర్‌ను సమర్థంగా అమలు చేసే విషయంలోనూ ప్రమాణాలు స్పష్టంగా లేవు. గతంలో ఉన్న ‘డూ నాట్ కాల్’ రిజిస్ట్రీ విఫలమైన నేపథ్యంలో తాజా చట్టంలోని లోటుపాట్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడుతోంది. టెలికాం ఎకోసిస్టమ్లోనూ వినియోగదారుల రక్షణకు సంబంధించిన అంశాలపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించదు. టెలికాం సేవలు పొందే క్రమంలో తమ గుర్తింపును రుజువు చేసుకునేందుకు తప్పుడు సమాచారం ఇవ్వకపోవడం వినియోగదారుల బాధ్యతేనని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగైతే ఐటీ చట్టం, ఐపీసీల కింద దీనిని నేరంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. అలాగే బిల్లును రూపొందించేటప్పుడు టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ లక్ష్యాలను ఎలా చేరుకోవడం అనేదానిపై మరికొంత స్పష్టంగా ఉండాల్సింది. ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్న నేరాలలో ఎక్కువ భాగం బెయిలు ఇవ్వదగినవే కనుక... కేసును వెనక్కు తీసుకునే నిర్ణయానుకూలతకు కాకుండా, నేర నిరోధానికి ప్రాధాన్యం ఇవ్వవలసింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలూ టెలికమ్యూనికేషన్ రంగం మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకుండా చూసేందుకు ఏం చేయాలన్నది కూడా ఈ ముసాయిదా బిల్లులో కనిపించడం లేదు. బిల్లులోని పలు నేరాలకు బెయిల్ లభిస్తుంది. అయితే ప్రతి నేరానికీ జరిమానాలు విధించడం ద్వారా ఈ చట్టం నేరాలు జరక్కుండా చూసే దిశగా కాకుండా జరిమానాలు వసూలు చేసే దిశగా ఉందని అనిపిస్తుంది. సెక్షన్ 38లో సివిల్ లయబిలిటీ ప్రస్తావన ఉన్నా... కేంద్రం ఈ విషయంలో ఏం చేయాలన్న విషయంలో స్పష్టత కరవైంది. ముసాయిదా బిల్లులో ఈ అంశాలకూ చోటు దక్కాలి. అంతేకాకుండా... పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లోని భాగస్వాములందరి ఆందోళనలను గుర్తిస్తూ తగిన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే ఈ కొత్త చట్టం సమర్థంగా మారగలదు. అప్పీళ్లకు సంబంధించి సెక్షన్ –10లో వివరాలు ఉన్నాయి. అయితే అప్పీలేట్ అథారిటీకి సంబంధించిన వివరాలు మాత్రం స్పష్టం చేయలేదు. అంతేకాకుండా... తమకు జరిగిన నష్టాలకు తగిన పరిహారాన్ని కోరే ప్రాథమిక హక్కును కూడా వినియోగదారులకు లేకుండా చేశారు. అంటే టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి వినియోగదారుల రక్షణ అన్న విషయానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్నమాట. ఇప్పుడున్న వినియోగదారుల చట్టాలతోనూ పెద్దగా ప్రయోజనం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. మొత్తమ్మీద చూస్తే... ఈ చట్టం సరైన దిశగా వేసిన ముందడుగనే చెప్పాలి. కానీ కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతాయి. తద్వారా మాత్రమే మనం సమర్థమైన చట్టాన్ని చేసే అవకాశం ఏర్పడుతుంది. పవన్ దుగ్గల్ వ్యాసకర్త సైబర్ న్యాయ నిపుణులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పాత వాసనల కొత్త చట్టం?
కాలంతో పాటు మార్పు సహజం. చట్టాలూ మారాల్సిందే. కానీ, టెలికామ్ శాఖ బుధవారం జారీ చేసిన ‘భారతీయ టెలికమ్యూనికేషన్ బిల్లు –2022’లో ప్రతిపాదించిన మార్పుల్లో ఉన్న మంచీచెడూ పెద్ద చర్చే రేపుతున్నాయి. ఆధునిక కాలపు ‘ఓవర్ ది టాప్’ (ఓటీటీ) కమ్యూనికేషన్ సేవలైన వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్‌లను కూడా ఇకపై టెలికామ్ సేవల పరిధిలోకే తేవాలనేది ఈ కొత్త బిల్లు కీలక ప్రతిపాదనల్లో ఒకటి. అలాగే, ‘టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) చట్టానికీ మార్పులను ప్రతిపాదించింది. వాటికి ఆమోదముద్ర పడితే, ఇన్నాళ్ళూ సిఫార్సు సంఘంగా టెలికామ్ రంగానికి కావలి కాస్తున్న ‘ట్రాయ్’ నిర్వీర్యమవుతుంది. కేంద్రానికి ఇలా మరిన్ని అధికారాలు కట్టబెడుతూ, పాత లైసెన్స్ రాజ్యానికి బాట వేస్తున్నారనేది ప్రధాన విమర్శ. స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం అందించే టెలికామ్ పరిశ్రమకు 3 ప్రత్యేక చట్టాలున్నాయి... ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం – 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ చట్టం – 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ ప్రొటెక్షన్) చట్టం – 1950. ఇంటర్నెట్ సహా ఆధునిక సాంకేతికతలెన్నో వచ్చిన వేళ ఈ మూడింటినీ ఏకీకృతం చేసి, వాటి స్థానంలో సమకాలీనమైన కొత్త చట్టం తీసుకురావాలని ప్రయత్నం. అందులో భాగంగా వేలంలో స్పెక్ట్రమ్ కేటాయింపు లాంటి వాటికి చట్టపరమైన అండనివ్వాలని చూశారు. వినియోగదారుల రక్షణపై అధికంగా దృష్టి పెట్టడమూ ప్రస్తుత పరిస్థితుల్లో అభినందనీయమే. అందులో భాగంగానే ఆన్లైన్ ఛాట్, ఓటీటీ సేవలను సైతం మిగిలిన చాలావాటితో కలిపి, టెలికామ్ సేవలనే విస్తృత విభాగంలోకి తేనున్నారు. ఒకప్పుడు బ్రాడ్‌క్యాస్ట్ టీవీని బ్రిటీష్ హయాంలో వైర్ టెలిగ్రఫీ ఒక్కటే ఉన్నప్పటి 1885 నాటి టెలిగ్రాఫ్ చట్టపరిధిలోకి తెచ్చారు. అలాగే, ఇప్పుడీ వర్గీకరణతో యూజర్లు భావ వినిమయానికి టెలికామ్ నెట్‌వర్క్‌లను వాడే ఈ యాప్‌లన్నీ కొత్త లైసెన్స్‌రాజ్ కిందకొస్తాయి. దీనివల్ల అతి నియంత్రణ తప్పదు. ఇప్పటి వరకు ఒక సర్వీస్ ప్రొవైడర్‌కు కొత్త లైసెన్స్ ఇవ్వాలంటే, టెలికామ్ శాఖ కచ్చితంగా ‘ట్రాయ్’ అభిప్రాయం తీసుకోవాలి. అది ‘ట్రాయ్’ చట్టంలోని నిబంధన. కానీ, కొత్త బిల్లుతో ఆ అవసరం ఉండదు. అలాగే, టెలికామ్ శాఖకు తగిన సిఫార్సు చేయడానికి అవసరమైన సమాచా రాన్నీ, పత్రాలనూ ప్రభుత్వాన్ని అడిగి తీసుకొనే అధికారం ఇప్పటి దాకా ‘ట్రాయ్’కి ఉంది. కొత్త బిల్లుతో అదీ కొండెక్కనుంది. ‘ట్రాయ్’ సిఫార్సులను అంగీకరించకున్నా, మార్పు కోరుకున్నా ఆ సిఫార్సులను టెలికామ్ శాఖ పునఃపరిశీలనకు పంపాలనేది ఇప్పుడున్న నిబంధన. కొత్త బిల్లు దానికీ చెల్లుచీటీ ఇవ్వనుంది. ఒక్కముక్కలో ‘ట్రాయ్’ని ఉత్సవ విగ్రహంలా కూర్చోబెడతారన్న మాట! అయితే, పరిశ్రమకు సంబంధించిన కొన్ని అంశాలకు ఈ కొత్త టెలికామ్ బిల్లు స్పష్టతనిచ్చింది. ఏదైనా టెలికామ్ సంస్థ దివాళా తీస్తే, దాని అధీనంలోని స్పెక్ట్రమ్ కేంద్రానికి చెందుతుందా, బ్యాంకులకు చెందుతుందా అనేది ప్రస్తుతం స్పష్టత లేదు. దివాళా తీస్తే, ఆ స్పెక్ట్రమ్ తిరిగి కేంద్రం చేతిలోకి రావాలని కొత్త బిల్లులో టెలికామ్ శాఖ ప్రతిపాదించింది. అసాధారణ పరిస్థితుల్లో లైసెన్స్ దార్ల అప్పుల్ని మాఫీ చేసేందుకూ, ఉపశమనం కల్పించేందుకూ కేంద్రానికి అధికారం కట్టబెట్టింది. మరోపక్క ఇప్పటి దాకా టెలికామ్ ఫండ్ ఆపరేటర్ల సవరించిన స్థూల ఆదాయంపై 5 శాతం యూనివర్సల్ సర్వీస్ లెవీ విధిస్తున్నారు. ఆ ‘యూనివర్సల్ సర్వీస్ నిర్బంధ నిధి’ని ఇకపై ‘టెలికమ్యూనికేషన్ అభివృద్ధి నిధి’ (టీడీఎఫ్)గా మార్చాలని ఆలోచన. టీడీఎఫ్‌తో అంతగా సేవలు లేని పట్టణ ప్రాంతాలను మెరుగుపరచాలనీ, పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేయాలనీ ప్రతిపాదన. నిజానికి, జాతీయ వనరులైన ఎయిర్‌వేవ్స్‌ను అపరిమితంగా పంచుకోవడం కుదరదు గనక భద్రతా కారణాల రీత్యా 1991 అనంతర కాలంలోనూ టెలికామ్ రంగం నియంత్రిత మార్కెట్టే. ఇప్పుడు కొత్తగా పుంజుకున్న ఆన్లైన్ మార్కెట్లను స్వేచ్ఛగా వదిలేద్దామంటే, జూమ్ సహా వివిధ యాప్‌లు పాటిస్తున్న కస్టమర్ల సమాచార సేకరణ దేశానికి చిక్కులు తేవచ్చు. ఈ అనివార్యతలతో కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, చాలాభాగం డిజిటల్ యాప్స్ ఐటీ నిబంధనల్ని పాటిస్తున్నాయి. నిరుడు కొత్త డిజిటల్ ఇండియా బిల్లు రూపొందిస్తూ, కొన్ని మార్గదర్శకాలనూ ఇచ్చారు. ఒకవేళ సమగ్ర చట్టపరిధి అవసరమనుకుంటే పరస్పర సంబంధమున్న ఐటీ, వ్యక్తిగత గోప్యత, టెలికామ్, డిజిటల్ సేవల ప్రతిపాదనలన్నీ సర్కారు ఒకేసారి జనం ముందుకు తేవాలి. అన్నిటినీ కలిపి పరిశీలించి, విశ్లేషించుకొనే వీలుంటుంది. ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్ ఫోనే ఇంటర్నెట్కు సింహద్వారం. టెలికామ్ లింకులే డిజిటల్ ఇండియా స్వప్నానికి రాచమార్గం. అందుకే, నిబంధనలు అస్పష్టంగా ఉంటే వర్తమాన పరిస్థితుల్లాగ గందరగోళం రేగుతుంది. అలాగని అతి కఠిన చట్టం చేస్తే, ఆర్థిక వ్యవస్థలోని సైబర్ విజృంభణ చిక్కుల్లో పడుతుంది. శాంతి భద్రతల పేరిట వివిధ యాప్‌లలోని ఛాట్లను అడ్డగించడానికీ, అవసరాన్ని బట్టి ఇంటర్నెట్ను నిలిపివేయడానికీ తాజా బిల్లు వీలు కల్పిస్తోంది. గోప్యత భద్రత, భావప్రకటన స్వేచ్ఛలపై తాజా రాజ్యాంగ పరిణామాల్ని కూడా విస్మరించి, 2022 నాటి చట్టాన్నీ 1885 చట్టం స్ఫూర్తితోనే రూపొందిస్తే కష్టం. ఏ చట్టమైనా అటు పరిశ్రమకూ, ఇటు యూజర్లకూ స్నేహశీలంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలు ప్రజలకు సాధికారత నివ్వాలి. ప్రతిపాదిత టెలికామ్ బిల్లులో మార్పుచేర్పులకు అదే దిక్సూచి కావాలి. -
5జీ టెక్నాలజీ రాక.. కొత్త విధానాల కోసం కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: 5జీ వంటి ఆధునిక టెక్నాలజీల రాక నేపథ్యంలో టెలికం చట్టాలను సరళతరం చేసేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనువుగా కొత్త విధానాలను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలికం శాఖ (డాట్) చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై సంబంధిత వర్గాలు ఆగస్టు 25 వరకూ తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి డాట్ అత్యధికంగా రూ. 50 కోట్ల మేర పెనాల్టీ విధించవచ్చు. అయితే, తాజా చర్చాపత్రం ప్రకారం శిక్షా నిబంధనలను ఉల్లంఘన పరిమాణాన్ని బట్టి మార్చేలా ప్రభుత్వం ప్రతిపాదించింది. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పరిధిని కేవలం గ్రామీణ టెలికం ప్రాజెక్టులకే కాకుండా పట్టణ ప్రాంతాలు, అలాగే పరిశోధన..అభివృద్ధి ప్రాజెక్టులు, శిక్షణా కర్యకలాపాలకు కూడా పెంచనుంది. మూతబడిన కంపెనీలు, దివాలా ప్రక్రియలో ఉన్న సంస్థలు తమ వద్ద ఉన్న స్పెక్ట్రంను వాపసు చేసేందుకు వెసులుబాటు కల్పించేలా తగు నిబంధనలు ఉండనున్నాయి. అలాగే కొత్త చట్టాలు సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలా సరళంగా, సులభతరంగా ఉండాలని చర్చాపత్రంలో ప్రతిపాదించారు. సంబంధిత వర్గాలపై ప్రతికూల ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను .. పాత తేదీల నుండి వర్తింపచేయరాదని చర్చాపత్రం పేర్కొంది.\ చదవండి: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
మారుమూల గ్రామాలకూ 4జీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మొబైల్ సిగ్నల్స్ రాని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలోని 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే దీని టెండర్లు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించనుండగా.. వాటిలో 1,218 గ్రామాలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గడ్‌లో 699, జార్ఖండ్‌లో 827, మహారాష్ట్రలో 610, ఒడిశాలో 3,933 గ్రామాల్లో తాజాగా మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో జి.మాడుగుల, ముంచంగిపుట్టు, నిమ్మలపాడు వంటి మండలాల్లోని గ్రామాలకు కొత్తగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 3 జిల్లాల్లో 1,218 ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందిస్తారు. ఇందుకోసం 771 టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది. ఒక్కో టవర్ ఎత్తు 40 మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేస్తారు. మొబైల్ ద్వారా మాట్లాడుకోవడమే కాకుండా, ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ డేటా కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి టవర్ కూడా 24 గంటలూ పనిచేసేలా ఉంటుంది. ఏపీలో 1,218 గ్రామాల్లో ఒక్క విశాఖలోనే 1,054 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండగా, విజయనగరం జిల్లాలో 154, వైఎస్సార్ జిల్లాలో 10 ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఏపీలో కోటి మందికి స్మార్ట్ ఫోన్‌లున్నట్టు ట్రాయ్ తేల్చింది. కొత్తగా 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకొస్తే.. స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
జమ్మూలో యుద్ధప్రాతిపదికన సహాయం
శ్రీనగర్: జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో సహాయకచర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 86 విమానాలు, పలు హెలికాప్టర్లతో ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ వరద బాధితులకు 4లక్షల లీటర్ల మంచినీరు సరఫరా చేయగా, 800 టన్నుల ఆహారాన్ని అందజేశారు. ఇందులో 1.31 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, నీటిని శుభ్రపరిచేందుకు 13 టన్నుల నీటిని శుద్ధిచేసే టాబ్లెట్లను కూడా వరద బాధితులకు అందజేశారు. జమ్మూలో జలదిగ్బంధమైన ప్రాంతాలకు యంత్రాలను, జనరేటర్లను తరలించే మురిగి నీటిని తొలగించేందుకు యత్నాలు చేస్తున్నారు. వరద ముంపుకు గురైన వారిని 224 బోట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చాలామందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా.. ఇంకా భారీగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. -
యుద్ధప్రాతిపదికన సహాయం
కాశ్మీర్ జలవిలయం మృతుల సంఖ్య 200 25,000 మంది సుర క్షిత ప్రాంతాలకు తరలింపు శ్రీనగర్/జమ్మూ: గత అరవైఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంభవించిన వరద బీభత్సంతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్లో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో వైపు కాశ్మీర్ లోయలో లక్షలాది మంది ఇంకా వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. రాజధాని శ్రీనగర్‌కు దేశంతో టెలి కమ్యూనికేషన్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. వరదల్లో మృతుల సంఖ్య 200కు చేరుతోంది. సహాయ కార్యక్రమాలకోసం మరిన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆరెఫ్) బృందాలను కేంద్రం హుటాహుటిన పంపించింది. సహాయ కార్యక్రమాల్లో తొలిసారిగా నావికాదళం కూడా ప్రవేశించింది. ఇప్పటివరకూ సైన్యం, వైమానికదళం, ఎన్డీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ సంస్థలు కలసి 25వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గత మంగళవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల అనంతరం సోమవారం శ్రీనగర్‌సహా కాశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాల్లో జల్లులు మాత్రమే కురవడం కొంత ఉపశమనం కలిగించింది. చాలావరకూ వరద ప్రాంతాల్లో నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. అయితే, కాశ్మీర్‌లోయ ముప్పు ఇంకా తొలగిపోలేదని సైన్యం అధికారులు తెలిపారు. వరదనీటినుంచి తప్పించుకునేందుకు శ్రీనగర్‌లో పలువురు ఇంకా తమ ఇళ్లపైకప్పులపైన, పై అంతస్తులపైన గడుపుతున్నారు. కాశ్మీర్‌లోయకు, దేశంలోని ఇతర ప్రాంతాలతో టెలికమ్యూనికేషన్లు తె గిపోవడంతో శాటిలైట్ వ్యవస్థ ద్వారా మొబైల్ సర్వీసులను పునరుద్ధరించేందుకు బీఎస్ఎన్ఎల్, సైన్యం, వైమానికదళం యుద్ధప్రాతిపదికన కృషిచేస్తున్నాయి. వరదలతో ఇంట ర్నెట్ అనుసంధానం కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. సైన్యం, ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి శాటిలైట్ ఫోన్లతోనే పనులు నిర్వర్తిస్తున్నారు. తిరిగి పనిచేస్తున్న 90 టవర్లు కాశ్మీర్‌లోయలోని త్రీ-జీ టెలికం సర్వీసుకు సంబంధించిన 90 టవర్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. కీలకమైన కమ్యూనికేషన్ టవర్ల పునరుద్ధరణకోసం 10 వీశాట్ వ్యవస్థలను విమానాలద్వారా తరలిస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. లోయ రోడ్లను పునరుద్ధరించేందుకు ఏడురోజుల వ్యవధి పడుతుందన్నారు. కాగా, కాశ్మీర్ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ సత్వరం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలపట్ల కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్, ఆజాద్ హర్షం వ్యక్తం చేశారు.