జమ్మూలో యుద్ధప్రాతిపదికన సహాయం
శ్రీనగర్: జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్‌లో సహాయకచర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 86 విమానాలు, పలు హెలికాప్టర్లతో ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ వరద బాధితులకు 4లక్షల లీటర్ల మంచినీరు సరఫరా చేయగా, 800 టన్నుల ఆహారాన్ని అందజేశారు. ఇందులో 1.31 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, నీటిని శుభ్రపరిచేందుకు 13 టన్నుల నీటిని శుద్ధిచేసే టాబ్లెట్లను కూడా వరద బాధితులకు అందజేశారు. జమ్మూలో జలదిగ్బంధమైన ప్రాంతాలకు యంత్రాలను, జనరేటర్లను తరలించే మురిగి నీటిని తొలగించేందుకు యత్నాలు చేస్తున్నారు. వరద ముంపుకు గురైన వారిని 224 బోట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చాలామందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా.. ఇంకా భారీగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి.