మంచి అడుగే... మార్పులు అవసరం | Sakshi Guest Column On Indian Telecommunication Sector | Sakshi
Sakshi News home page

మంచి అడుగే... మార్పులు అవసరం

Published Sat, Oct 8 2022 12:35 AM | Last Updated on Sat, Oct 8 2022 12:35 AM

Sakshi Guest Column On Indian Telecommunication Sector

టెలికాం నియంత్రణ వ్యవస్థల్లో సంస్కరణలు, లోపాల సవరణలు లక్ష్యంగా టెలికాం డిపార్ట్‌మెంట్‌ ‘ఇండియన్‌ టెలికమ్యూనికేషన్‌ బిల్, 2022’ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. టెలికమ్యూనికేషన్‌ రంగానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఆధునికీకరించే దిశగా వేసిన మేలి అడుగుగా దీన్ని అభివర్ణించవచ్చు. అయితే ఈ రంగం మిగిలిన ఏ రంగంతోనూ సంబంధం లేనట్టుగా ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు అనిపిస్తోంది.

ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం, ప్రాచుర్యం పొందుతున్న కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్‌ వంటి టెక్నాలజీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం టెలికమ్యూనికేషన్స్‌ రంగంపైనా పడే ప్రమాదం ఉంది. ముసాయిదా బిల్లులో ఈ అంశాల ప్రస్తావనే లేకపోవడం మనం గమనించాలి!

టెలికమ్యూనికేషన్‌ రంగంలో ఆధునికమైన, భవిష్యత్తు అవసరాలు తీర్చే సామర్థ్యం ఉన్న చట్టపరమైన నిర్మాణాత్మక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ గత నెలలో  ‘ఇండియన్‌ టెలికమ్యూనికేషన్‌ ముసాయిదా బిల్లు–2022’ ను రూపొందించి ఇప్పటికే ప్రజా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.

అందుకోసం ప్రతిపాదిత బిల్లు సారాంశాన్ని దేశ పౌరులకు అందుబాటులో ఉంచింది. దీనివల్ల బిల్లులోని లోతుపాతులను పరిశీలించడానికీ, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికీ నిపుణులకు, సాధారణ వినియోగదారులకు సైతం అవకాశం లభించినట్లయింది. 

భారతదేశంలో సైబర్‌ భద్రతపై పూర్తిస్థాయి ప్రత్యేక చట్టం లేదు. అందువల్ల, టెలికాం రంగంలో సైబర్‌ భద్రత తాలూకు సమస్యలను పరిష్కరించడం మరింత అవసరం. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలోనూ ఈ సైబర్‌ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది.

ఇంటర్నెట్, సైబర్‌ స్పేస్‌కు టెలికమ్యూనికేషన్‌ రంగం కీలకమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ‘ఇండియన్‌ టెలికమ్యూనికేషన్‌ బిల్, 2022’ ముసాయిదా బిల్లులో ఈ అంశాల ప్రస్తావనే లేకపోవడాన్ని మొదటగా మనం గమనించాలి! టెలికమ్యూనికేషన్‌ రంగం మిగిలిన ఏ రంగంతోనూ సంబంధం లేనట్టుగా ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు అనిపిస్తోంది.

ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం, ప్రాచుర్యం రెండూ పొందుతున్న కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆధారితాలు, బ్లాక్‌చెయిన్‌ వంటి టెక్నాలజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం టెలికమ్యూనికేషన్స్‌ రంగంపైనా పడే ప్రమాదం ఉంది. 

భారతదేశం ఒక అనుసంధానిత టెలికాం పర్యావరణ వ్యవస్థ వైపు కదులుతున్నప్పుడు, కృత్రిమ మేధపై ఆధారపడటం అన్నది పెరుగుతున్నప్పుడు ప్రతిపాదిత చట్టం కొత్త సాంకేతికతల ఆగమనానికి సంబంధించినదిగా ఉండేలా విస్తృతమైన భవిష్యత్‌ ప్రణాళికలు ఉండాలి కదా. 

కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి టెక్నాలజీలు టెలికమ్యూనికేషన్స్‌ రంగంపై చూపే ప్రభావాలు, కొత్త టెక్నాలజీల అవసరాన్ని గుర్తించేందుకు తగిన అంశాలు ఈ ముసాయిదా బిల్లులో లేవన్నది స్పష్టం. దేశంలో టెలికాం రంగం ఏకీకృతమయ్యే దిశగా వెళుతున్న, కృత్రిమ మేధపై ఆధారపడటమూ పెరిగిపోయిన ఈ దశలో టెలికామ్‌ ముసాయిదా బిల్లు దార్శినికంగానూ, విశాల దృక్పథంతోనూ ఉండి ఉంటే ఈ కొత్త టెక్నాలజీల వ్యాప్తికి మరింత ఉపయోగకరంగా ఉండేది. 

సమాచార వ్యవస్థకు కీలకమైన అంశమైన టెలికమ్యూనికేషన్స్‌ భారతీయ సైబర్‌ సార్వభౌమత్వంలోనూ ఎంతో ముఖ్యమైంది. అయితే ఈ రంగానికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌లపై తరచూ దాడులు జరుగుతున్నాయి. అయినా మన సైబర్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తగిన న్యాయపరమైన సౌకర్యాలు లేవు. భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ముందుకు వెళ్లాలంటే ఈ ముసాయిదా బిల్లులో నిర్దిష్ట ప్రమాణాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. 

ముసాయిదా బిల్లులో టెలికమ్యూనికేషన్స్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాల సైబర్‌ సెక్యూరిటీకి ఎలాంటి ఏర్పాట్లూ లేవు. వీటిని కాపాడుకునేందుకు ఏ రకమైన చర్యలనూ ఈ ముసాయిదా చట్టంలో నిర్దేశించలేదు. సైబర్‌ సెక్యూరిటీ చట్టం లేనే లేని నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. సైబర్‌ సెక్యూరిటీకి భంగం కలిగితే, లేదా నెట్‌వర్క్‌లోకి చొరబాట్లు జరిగితే ఆయా సేవలందించే వారి బాధ్యత ఏమిటన్నది కూడా ఈ చట్టంలో స్పష్టం చేయలేదు.

జాతీయ భద్రత, అందులో టెలికమ్యూనికేషన్స్‌ పాత్రలను పరిగణలోకి తీసుకున్నా ఈ అంశాలకు ప్రాధాన్యం లభించి ఉండాల్సింది. దీనినే ఇంకోలా చెప్పాలంటే... టెలికమ్యూనికేషన్, టెలీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్, సేవల భద్రత, సంరక్షణల కోసం ఎటువంటి పరిమితులనూ నిర్దేశించలేదు.

సైబర్‌ భద్రత ఉల్లంఘనల సందర్భంలో సర్వీస్‌ ప్రొవైడర్ల బాధ్యత ఏ మేరకు ఉంటుందో కూడా స్పష్టం చేయలేదు. జాతీయ భద్రతతో టెలికమ్యూనికేషన్‌ల సంబంధం అత్యంత కీలకమైనది. అయితే ఈ ముసాయిదా జాతీయ భద్రతను ఎలా రక్షించవచ్చనే దానిపై అరకొరగా మాత్రమే వివరణలు కనిపిస్తున్నాయి! 

ప్రతిపాదిత టెలికమ్యూనికేషన్స్‌ ముసాయిదాకు ప్రత్యేక హోదా ఇవ్వడం మరిన్ని చిక్కులకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ హోదా కారణంగా ఇతర చట్టాలన్నింటి కంటే ఇది ఉన్నతమైందిగా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ బిల్లు 2000లో తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌తోనూ వైరుద్ధ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ముసాయిదా బిల్లు కాస్తా చట్టంగా మారే లోపు ఈ రకమైన వైరుద్ధ్యాన్ని నివారించాల్సిన అవసరముంది.

అంతేకాదు... ఈ ముసాయిదా చట్టంలో డ్యూ డిలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను సక్రమంగా నిర్వచించనూ లేదు. డూ నాట్‌ డిస్టర్బ్‌ రిజిస్టర్‌ నిర్వహణనే ఉదాహరణగా తీసుకుంటే ఇందులో వినియోదారుల రక్షణకు తగిన ఏర్పాట్లు లేవు. రిజిస్టర్‌ను సమర్థంగా అమలు చేసే విషయంలోనూ ప్రమాణాలు స్పష్టంగా లేవు.

గతంలో ఉన్న ‘డూ నాట్‌ కాల్‌’ రిజిస్ట్రీ విఫలమైన నేపథ్యంలో తాజా చట్టంలోని లోటుపాట్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడుతోంది. టెలికాం ఎకోసిస్టమ్‌లోనూ వినియోగదారుల రక్షణకు సంబంధించిన అంశాలపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించదు.

టెలికాం సేవలు పొందే క్రమంలో తమ గుర్తింపును రుజువు చేసుకునేందుకు తప్పుడు సమాచారం ఇవ్వకపోవడం వినియోగదారుల బాధ్యతేనని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగైతే ఐటీ చట్టం, ఐపీసీల కింద దీనిని నేరంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. అలాగే బిల్లును రూపొందించేటప్పుడు టెలికమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ భారీ లక్ష్యాలను ఎలా చేరుకోవడం అనేదానిపై  మరికొంత స్పష్టంగా ఉండాల్సింది.

ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్న నేరాలలో ఎక్కువ భాగం బెయిలు ఇవ్వదగినవే కనుక... కేసును వెనక్కు తీసుకునే నిర్ణయానుకూలతకు కాకుండా, నేర నిరోధానికి ప్రాధాన్యం ఇవ్వవలసింది. 

ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలూ టెలికమ్యూనికేషన్‌ రంగం మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకుండా చూసేందుకు ఏం చేయాలన్నది కూడా ఈ ముసాయిదా బిల్లులో కనిపించడం లేదు.  బిల్లులోని పలు నేరాలకు బెయిల్‌ లభిస్తుంది. అయితే ప్రతి నేరానికీ జరిమానాలు విధించడం ద్వారా ఈ చట్టం నేరాలు జరక్కుండా చూసే దిశగా కాకుండా జరిమానాలు వసూలు చేసే దిశగా ఉందని అనిపిస్తుంది.

సెక్షన్‌ 38లో సివిల్‌ లయబిలిటీ ప్రస్తావన ఉన్నా... కేంద్రం ఈ విషయంలో ఏం చేయాలన్న విషయంలో స్పష్టత కరవైంది. ముసాయిదా బిల్లులో ఈ అంశాలకూ చోటు దక్కాలి. అంతేకాకుండా... పబ్లిక్, ప్రైవేట్‌ రంగాల్లోని భాగస్వాములందరి ఆందోళనలను గుర్తిస్తూ తగిన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే ఈ కొత్త చట్టం సమర్థంగా మారగలదు.

అప్పీళ్లకు సంబంధించి సెక్షన్‌ –10లో వివరాలు ఉన్నాయి. అయితే అప్పీలేట్‌ అథారిటీకి సంబంధించిన వివరాలు మాత్రం స్పష్టం చేయలేదు. అంతేకాకుండా... తమకు జరిగిన నష్టాలకు తగిన పరిహారాన్ని కోరే ప్రాథమిక హక్కును కూడా వినియోగదారులకు లేకుండా చేశారు. అంటే టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థకు సంబంధించి వినియోగదారుల రక్షణ అన్న విషయానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్నమాట.

ఇప్పుడున్న వినియోగదారుల చట్టాలతోనూ పెద్దగా ప్రయోజనం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. మొత్తమ్మీద చూస్తే... ఈ చట్టం సరైన దిశగా వేసిన ముందడుగనే చెప్పాలి. కానీ కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతాయి. తద్వారా మాత్రమే మనం సమర్థమైన చట్టాన్ని చేసే అవకాశం ఏర్పడుతుంది. 


పవన్‌ దుగ్గల్‌  
వ్యాసకర్త సైబర్‌ న్యాయ నిపుణులు 
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement