న్యూఢిల్లీ: 5జీ వంటి ఆధునిక టెక్నాలజీల రాక నేపథ్యంలో టెలికం చట్టాలను సరళతరం చేసేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనువుగా కొత్త విధానాలను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలికం శాఖ (డాట్) చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై సంబంధిత వర్గాలు ఆగస్టు 25 వరకూ తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి డాట్ అత్యధికంగా రూ. 50 కోట్ల మేర పెనాల్టీ విధించవచ్చు. అయితే, తాజా చర్చాపత్రం ప్రకారం శిక్షా నిబంధనలను ఉల్లంఘన పరిమాణాన్ని బట్టి మార్చేలా ప్రభుత్వం ప్రతిపాదించింది.
యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) పరిధిని కేవలం గ్రామీణ టెలికం ప్రాజెక్టులకే కాకుండా పట్టణ ప్రాంతాలు, అలాగే పరిశోధన..అభివృద్ధి ప్రాజెక్టులు, శిక్షణా కర్యకలాపాలకు కూడా పెంచనుంది. మూతబడిన కంపెనీలు, దివాలా ప్రక్రియలో ఉన్న సంస్థలు తమ వద్ద ఉన్న స్పెక్ట్రంను వాపసు చేసేందుకు వెసులుబాటు కల్పించేలా తగు నిబంధనలు ఉండనున్నాయి. అలాగే కొత్త చట్టాలు సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలా సరళంగా, సులభతరంగా ఉండాలని చర్చాపత్రంలో ప్రతిపాదించారు. సంబంధిత వర్గాలపై ప్రతికూల ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను .. పాత తేదీల నుండి వర్తింపచేయరాదని చర్చాపత్రం పేర్కొంది.\
చదవండి: ఎయిర్‌టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే
Comments
Please login to add a commentAdd a comment