పాత వాసనల కొత్త చట్టం? | Sakshi Editorial On New Telecommunication Bill 2022 | Sakshi
Sakshi News home page

పాత వాసనల కొత్త చట్టం?

Published Tue, Sep 27 2022 12:20 AM | Last Updated on Tue, Sep 27 2022 12:20 AM

Sakshi Editorial On New Telecommunication Bill 2022

కాలంతో పాటు మార్పు సహజం. చట్టాలూ మారాల్సిందే. కానీ, టెలికామ్‌ శాఖ బుధవారం జారీ చేసిన ‘భారతీయ టెలికమ్యూనికేషన్‌ బిల్లు –2022’లో ప్రతిపాదించిన మార్పుల్లో ఉన్న మంచీచెడూ పెద్ద చర్చే రేపుతున్నాయి. ఆధునిక కాలపు ‘ఓవర్‌ ది టాప్‌’ (ఓటీటీ) కమ్యూనికేషన్‌ సేవలైన వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్‌ లాంటి యాప్‌లను కూడా ఇకపై టెలికామ్‌ సేవల పరిధిలోకే తేవాలనేది ఈ కొత్త బిల్లు కీలక ప్రతిపాదనల్లో ఒకటి.

అలాగే, ‘టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ట్రాయ్‌) చట్టానికీ మార్పులను ప్రతిపాదించింది. వాటికి ఆమోదముద్ర పడితే, ఇన్నాళ్ళూ సిఫార్సు సంఘంగా టెలికామ్‌ రంగానికి కావలి కాస్తున్న ‘ట్రాయ్‌’ నిర్వీర్యమవుతుంది. కేంద్రానికి ఇలా మరిన్ని అధికారాలు కట్టబెడుతూ, పాత లైసెన్స్‌ రాజ్యానికి బాట వేస్తున్నారనేది ప్రధాన విమర్శ. 

స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం అందించే టెలికామ్‌ పరిశ్రమకు 3 ప్రత్యేక చట్టాలున్నాయి... ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం – 1885, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ చట్టం – 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (అన్‌లాఫుల్‌ ప్రొటెక్షన్‌) చట్టం – 1950. ఇంటర్నెట్‌ సహా ఆధునిక సాంకేతికతలెన్నో వచ్చిన వేళ ఈ మూడింటినీ ఏకీకృతం చేసి, వాటి స్థానంలో సమకాలీనమైన కొత్త చట్టం తీసుకురావాలని ప్రయత్నం. అందులో భాగంగా వేలంలో స్పెక్ట్రమ్‌ కేటాయింపు లాంటి వాటికి చట్టపరమైన అండనివ్వాలని చూశారు.

వినియోగదారుల రక్షణపై అధికంగా దృష్టి పెట్టడమూ ప్రస్తుత పరిస్థితుల్లో అభినందనీయమే. అందులో భాగంగానే ఆన్‌లైన్‌ ఛాట్, ఓటీటీ సేవలను సైతం మిగిలిన చాలావాటితో కలిపి, టెలికామ్‌ సేవలనే విస్తృత విభాగంలోకి తేనున్నారు. ఒకప్పుడు బ్రాడ్‌క్యాస్ట్‌ టీవీని బ్రిటీష్‌ హయాంలో వైర్‌ టెలిగ్రఫీ ఒక్కటే ఉన్నప్పటి 1885 నాటి టెలిగ్రాఫ్‌ చట్టపరిధిలోకి తెచ్చారు. అలాగే, ఇప్పుడీ వర్గీకరణతో యూజర్లు భావ వినిమయానికి టెలికామ్‌ నెట్‌వర్క్‌లను వాడే ఈ యాప్‌లన్నీ కొత్త లైసెన్స్‌రాజ్‌ కిందకొస్తాయి. దీనివల్ల అతి నియంత్రణ తప్పదు. 

ఇప్పటి వరకు ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌కు కొత్త లైసెన్స్‌ ఇవ్వాలంటే, టెలికామ్‌ శాఖ కచ్చితంగా ‘ట్రాయ్‌’ అభిప్రాయం తీసుకోవాలి. అది ‘ట్రాయ్‌’ చట్టంలోని నిబంధన. కానీ, కొత్త బిల్లుతో ఆ అవసరం ఉండదు. అలాగే, టెలికామ్‌ శాఖకు తగిన సిఫార్సు చేయడానికి అవసరమైన సమాచా రాన్నీ, పత్రాలనూ ప్రభుత్వాన్ని అడిగి తీసుకొనే అధికారం ఇప్పటి దాకా ‘ట్రాయ్‌’కి ఉంది. కొత్త బిల్లుతో అదీ కొండెక్కనుంది. ‘ట్రాయ్‌’ సిఫార్సులను అంగీకరించకున్నా, మార్పు కోరుకున్నా ఆ సిఫార్సులను టెలికామ్‌ శాఖ పునఃపరిశీలనకు పంపాలనేది ఇప్పుడున్న నిబంధన. కొత్త బిల్లు దానికీ చెల్లుచీటీ ఇవ్వనుంది. ఒక్కముక్కలో ‘ట్రాయ్‌’ని ఉత్సవ విగ్రహంలా కూర్చోబెడతారన్న మాట! 

అయితే, పరిశ్రమకు సంబంధించిన కొన్ని అంశాలకు ఈ కొత్త టెలికామ్‌ బిల్లు స్పష్టతనిచ్చింది. ఏదైనా టెలికామ్‌ సంస్థ దివాళా తీస్తే, దాని అధీనంలోని స్పెక్ట్రమ్‌ కేంద్రానికి చెందుతుందా, బ్యాంకులకు చెందుతుందా అనేది ప్రస్తుతం స్పష్టత లేదు. దివాళా తీస్తే, ఆ స్పెక్ట్రమ్‌ తిరిగి కేంద్రం చేతిలోకి రావాలని కొత్త బిల్లులో టెలికామ్‌ శాఖ ప్రతిపాదించింది. అసాధారణ పరిస్థితుల్లో లైసెన్స్‌ దార్ల అప్పుల్ని మాఫీ చేసేందుకూ, ఉపశమనం కల్పించేందుకూ కేంద్రానికి అధికారం కట్టబెట్టింది.

మరోపక్క ఇప్పటి దాకా టెలికామ్‌ ఫండ్‌ ఆపరేటర్ల సవరించిన స్థూల ఆదాయంపై 5 శాతం యూనివర్సల్‌ సర్వీస్‌ లెవీ విధిస్తున్నారు. ఆ ‘యూనివర్సల్‌ సర్వీస్‌ నిర్బంధ నిధి’ని ఇకపై ‘టెలికమ్యూనికేషన్‌ అభివృద్ధి నిధి’ (టీడీఎఫ్‌)గా మార్చాలని ఆలోచన. టీడీఎఫ్‌తో అంతగా సేవలు లేని పట్టణ ప్రాంతాలను మెరుగుపరచాలనీ, పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేయాలనీ ప్రతిపాదన. 

నిజానికి, జాతీయ వనరులైన ఎయిర్‌వేవ్స్‌ను అపరిమితంగా పంచుకోవడం కుదరదు గనక భద్రతా కారణాల రీత్యా 1991 అనంతర కాలంలోనూ టెలికామ్‌ రంగం నియంత్రిత మార్కెట్టే. ఇప్పుడు కొత్తగా పుంజుకున్న ఆన్‌లైన్‌ మార్కెట్లను స్వేచ్ఛగా వదిలేద్దామంటే, జూమ్‌ సహా వివిధ యాప్‌లు పాటిస్తున్న కస్టమర్ల సమాచార సేకరణ దేశానికి చిక్కులు తేవచ్చు. ఈ అనివార్యతలతో కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, చాలాభాగం డిజిటల్‌ యాప్స్‌ ఐటీ నిబంధనల్ని పాటిస్తున్నాయి.

నిరుడు కొత్త డిజిటల్‌ ఇండియా బిల్లు రూపొందిస్తూ, కొన్ని మార్గదర్శకాలనూ ఇచ్చారు. ఒకవేళ సమగ్ర చట్టపరిధి అవసరమనుకుంటే పరస్పర సంబంధమున్న ఐటీ, వ్యక్తిగత గోప్యత, టెలికామ్, డిజిటల్‌ సేవల ప్రతిపాదనలన్నీ సర్కారు ఒకేసారి జనం ముందుకు తేవాలి. అన్నిటినీ కలిపి పరిశీలించి, విశ్లేషించుకొనే వీలుంటుంది. 

ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్‌ ఫోనే ఇంటర్నెట్‌కు సింహద్వారం. టెలికామ్‌ లింకులే డిజిటల్‌ ఇండియా స్వప్నానికి రాచమార్గం. అందుకే, నిబంధనలు అస్పష్టంగా ఉంటే వర్తమాన పరిస్థితుల్లాగ గందరగోళం రేగుతుంది. అలాగని అతి కఠిన చట్టం చేస్తే, ఆర్థిక వ్యవస్థలోని సైబర్‌ విజృంభణ చిక్కుల్లో పడుతుంది. శాంతి భద్రతల పేరిట వివిధ యాప్‌లలోని ఛాట్‌లను అడ్డగించడానికీ, అవసరాన్ని బట్టి ఇంటర్నెట్‌ను నిలిపివేయడానికీ తాజా బిల్లు వీలు కల్పిస్తోంది.

గోప్యత భద్రత, భావప్రకటన స్వేచ్ఛలపై తాజా రాజ్యాంగ పరిణామాల్ని కూడా విస్మరించి, 2022 నాటి చట్టాన్నీ 1885 చట్టం స్ఫూర్తితోనే రూపొందిస్తే కష్టం. ఏ చట్టమైనా అటు పరిశ్రమకూ, ఇటు యూజర్లకూ స్నేహశీలంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలు ప్రజలకు సాధికారత నివ్వాలి. ప్రతిపాదిత టెలికామ్‌ బిల్లులో మార్పుచేర్పులకు అదే దిక్సూచి కావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement