బీఎస్‌ఎన్‌ఎల్‌ గట్టెక్కుతుందా? | Sakshi Editorial on BSNL Gets Rs 1.64 Lakh Crore Revival Package | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ గట్టెక్కుతుందా?

Published Sat, Jul 30 2022 12:34 AM | Last Updated on Sat, Jul 30 2022 12:34 AM

Sakshi Editorial on BSNL Gets Rs 1.64 Lakh Crore Revival Package

కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)కు లక్షా 64 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో నగదు వాటా రూ. 43,964 కోట్లు కాగా, ఇతరేతర రూపాల్లో లక్షా 20 వేల కోట్లు సమకూరుస్తారు. ఇదంతా నాలుగేళ్ల కాలవ్యవధిలో అందిస్తారు. 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు కూడా ఇందులో భాగం. అందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పూర్తయిన కొన్ని గంటలకే ఈ నిర్ణయం వెలువడింది. ఎయిరిండియా సంస్థను పూర్తిగా టాటాలకు అమ్మిన తరహాలోనే బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలను కేంద్రం వదుల్చుకుంటుందని భావిస్తున్న తరుణంలో ప్యాకేజీ ప్రకటన చాలామందిని సంతోషపరిచిందనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్యాకేజీ తులసి తీర్థంగా మిగులుతుందా, సంస్థకు జవసత్వాలిస్తుందా అన్నది మున్ముందు తెలుస్తుంది. 

కేంద్ర ప్రభుత్వ ఛత్రఛాయలో ఉండే టెలిఫోన్‌ విభాగం నుంచి మహానగరాల్లో కార్యకలాపాల కోసం 1986లో ఎంటీఎన్‌ఎల్‌ పేరిట ఒక లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటుచేసిన చాన్నాళ్లకు... అంటే 2000 సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పడింది. ఎంటీఎన్‌ఎల్‌ ఎటూ మొదటినుంచీ నష్టాలతోనే సాగుతోంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రాభవం అడుగంటడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణా లున్నాయి. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్న రోజుల్లో ఓ వెలుగు వెలిగిన టెలిఫోన్‌ విభాగం బీఎస్‌ఎన్‌ఎల్‌గా మారి, ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడవలసి వచ్చాక క్షీణించడం మొదలుపెట్టిం దని తీర్మానించడం తొందరపాటవుతుంది. దాన్నొక సంస్థగా మార్చాక వృత్తి రంగ నిపుణులకు అప్పజెప్పి, సమర్థవంతంగా పోటీని ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాల్సిందిపోయి కేంద్రం యధావిధిగా పెత్తనం చలాయించడం బీఎస్‌ఎన్‌ఎల్‌కు శాపంగా మారింది. ఇప్పుడు టెలికాం రంగంలో మెరుస్తున్న సంస్థలతో పోలిస్తే అనుభవంలోనూ, వనరుల్లోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏమాత్రం తీసిపోదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయివుండి కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక, వాటిని సక్రమంగా అమలు చేయలేక అది బోర్లాపడింది. అంతక్రితంతో పోలిస్తే లాభాలొస్తున్న మాట నిజమే అయినా గత మూడేళ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు దాదాపు రూ. 30,000 కోట్లు.

ఇప్పుడు టెలికాం రంగంలో 5జీ మోత మోగిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 60 దేశాలు ఆ సర్వీసులు ప్రారంభించాయి. మన దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌ వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్లు పడుతుంది. ఇలాంటి తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు అందిస్తున్న 4జీ వల్ల ఏమంత ప్రయోజనం ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 2016లోనే ప్రైవేటు సంస్థలు 4జీ స్పెక్ట్రమ్‌ దక్కించుకుని వినియోగదారుల్లో 98 శాతంమందిని చేజిక్కించుకున్నాయి. దేశంలో వైర్‌లెస్, వైర్‌లైన్‌ సేవలు రెండింటినీ కలుపుకొంటే మొత్తంగా 110 కోట్లమంది వినియోగదారులుంటే అందులో బీఎస్‌ఎన్‌ఎల్‌ వాటా ప్రస్తుతం 12 కోట్లు. అంతక్రితం గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ హవా ఉండేది. కానీ రాను రాను అది కూడా క్షీణించింది. ఇప్పుడు గ్రామీణ వినియోగదారుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ వాటా ఏడు శాతం. ఇది ఉద్దేశపూర్వకంగా సంస్థను నీరుగార్చడంవల్ల వచ్చిన ఫలితం. వీఆర్‌ఎస్‌ అమలు చేయడం మొదలెట్టాక సిబ్బంది కొరత ఏర్పడి చురుగ్గా సేవలందించే స్థితి మందగించింది. ఒకప్పుడు 1.65 లక్షలమంది ఉద్యోగులతో కళకళ లాడిన సంస్థలో వారి సంఖ్య 64,536కి పడిపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ విలీనం గురించిన చర్చోపచర్చలే దశాబ్దంపాటు సాగాయి. ఇప్పటికీ అవి వేర్వేరుగానే ఉంటున్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే 4జీ స్పెక్ట్రమ్‌ గురించి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆత్రుత పడింది. దాన్ని వేలం వేసే సమయానికి ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చినా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ దక్కలేదు. 4జీకి అవసరమైన పరికరాల కొనుగోలుకు కావాల్సిన రూ. 25,000 కోట్లు సమకూర్చడం ఎలా అన్న ఆలోచనలోనే ఏళ్లు గడిచిపోయాయి. ఈ జాప్యం ప్రైవేటు సంస్థల లబ్ధి కోసమేనని సిబ్బంది సంఘాలు ఆరోపించినా జవాబిచ్చినవారు లేరు. 2019 అక్టోబర్‌లో సంస్థను గట్టెక్కించడానికి కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఆ తర్వాత అక్కడక్కడ 4జీ సేవలు ప్రారంభించగలిగింది. కానీ పూర్తి స్థాయి 4జీ సేవలకు గ్రీన్‌సిగ్నల్‌ రావడానికి మరో మూడేళ్లు పట్టింది. పూర్తి స్థాయి సేవలు వినియోగదారులకు అందడానికి మరెంత సమయం పడుతుందో? 2019లో ప్యాకేజీ ప్రకటించాక సంస్థ నష్టాలు క్రమేపీ తగ్గడం మొదలయ్యాయి. 2019–20లో రూ. 15,500 కోట్లుగా ఉన్న నష్టం నిరుడు రూ. 7,441 కోట్లకు పరిమితమైంది. 

చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఇప్పటికైనా బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వ వైభవం వస్తుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు సంస్థలు ఈనాటికీ గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటి టారిఫ్‌లు గ్రామీణులు అందుకోలేని స్థితిలో ఉంటున్నాయి. దేశంలో విస్తృతంగా టవర్లు, ఇతర వనరులు ఉన్న సంస్థల్లో ఇప్పటికీ అగ్రగామి బీఎస్‌ఎన్‌ఎల్‌ అనడంలో సందేహంలేదు. వేగవం తంగా నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలను చురుగ్గా అమలు చేయడం, లక్ష్య సాధనపై సర్వశక్తులూ కేంద్రీకరించడం వంటివి చేస్తే ఆ సంస్థ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఉద్దేశపూర్వకంగా దానికి బ్రేకులు వేయాలని చూస్తే ఎప్పటిలానే నిస్తేజంగా మిగిలిపోతుంది. సంస్థను ప్రాణప్రదంగా చూసుకుంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటే దాన్ని లాభాల బాటకు మళ్లించడం కష్టమేమీ కాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement