Bharat Sanchar Nigam Limited
-
బీఎస్ఎన్ఎల్ ఐదు నెలల ప్లాన్: ప్రయోజనాలెన్నో..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కొత్తది కాదు, కానీ ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల (150 రోజులు) వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ప్లాన్ 180 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది. రోజుకి 2జీబీ డేటా.. 60 రోజులపాటు అపరిమిత ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభించేవి. అయితే ఇవన్నీ ఇప్పుడు 30 రోజులకు పరిమితం చేశారు. కానీ వినియోగదారుడు 150 రోజుల పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందవచ్చు.ఇన్కమింగ్ కాల్స్ కోసం చూసేవారికి ఇది ఉత్తమ ఆప్షన్. అయితే 30 రోజుల తరువాత డేటా, ఎస్ఎమ్ఎస్ ఆప్షన్స్ వంటివి లభించవు. కేవలం ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.జియో, ఎయిర్టెల్ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన తరువాత.. బీఎస్ఎన్ఎల్ పుంజుకుంటోంది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. కంపెనీ 4జీ సర్వీసును కూడా 2025 మార్చి నాటికి దేశ్య వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. -
బీఎస్ఎన్ఎల్ తగ్గిన నష్టాలు.. పెరిగిన ఆదాయాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ బకాయిల ముందు ఆదాయాలు లేదా ఎబిటా (స్థూల ఆదాయం) 2023–24 ఆర్థిక సంవత్సరానికి 38.8 శాతం పురోగతితో రూ. 2,164 కోట్లకు చేరిందని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. నష్టాలు రూ. 5,371 కోట్లకు తగ్గాయని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.8,161 కోట్లు కావడం గమనార్హం. ఆయా అంశాలపై పెమ్మసాని లిఖిత పూర్వకంగా ఇచి్చన సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు.. డేటా ఉల్లంఘనలు జరగలేదు... బీఎస్ఎన్ఎల్ డేటా ఉల్లంఘన విషయానికి వస్తే, బీఎస్ఎన్లో చొరబాటు డేటా ఉల్లంఘన జరగవచ్చని ఈ ఏడాది మే 20న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నివేదించింది. దీనిని విశ్లేíÙంచడం జరిగింది. ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (ఎఫ్టీపీ) సర్వర్‌లో సీఈఆర్టీ–ఇన్ షేర్ చేసిన నమూనా డేటాకు సమానమైన డేటా ఉందని కనగొనడం జరిగింది. టెలికం నెట్వర్క్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ (హెచ్ఎల్ఆర్)లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టమైంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో సేవలో అంతరాయం కలుగలేదు. అయినప్పటికీ, ఎటువంటి డేటా ఉల్లంఘనలూ జరక్కుడా బీఎస్ఎన్ఎల్ చర్యలు నిరంతరం తీసుకుంటోంది. అన్ని ఎఫ్టీపీ సర్వర్లకు యాక్సెస్ పాస్‌వర్డ్‌ల మార్పులు జరిగాయి. టెలికం నెట్‌వర్క్‌ల ఆడిట్ నిర్వహించడానికి అలాగే టెలికం నెట్‌వర్క్‌లలో డేటా ఉల్లంఘనల నివారణకు పరిష్కార చర్యలను సూచించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ)ని ఏర్పాటు చేయడం జరిగింది.→ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు, చర్యల ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. → ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ దేశీయ 4జీ సాంకేతికత విస్తరణ కోసం లక్ష 4జీ సైట్ల కోసం కొనుగోలు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ పరికరాలను 5జీకి అప్‌గ్రేడ్ కూడా చేయవచ్చు. → బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2019లో దాదాపు రూ. 69,000 కోట్ల మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ... బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నిర్వహణ ఖర్చులను తగ్గించింది. → 2022లో దాదాపు రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ మంజూరు జరిగింది. తాజా మూలధనాన్ని చొప్పించడం, రుణాన్ని పునరి్నరి్మంచడం, గ్రామీణ టెలి ఫోనీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దీని ఈ ప్యాకేజీ లక్ష్యం. → 2023లో మొత్తం రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ అలాగే 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది. -
ఏపీ, తెలంగాణలోని బీఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ఐదు రాష్ట్రాల పరిధిలో తనకున్న ఖరీదైన 13 ప్రాపర్టీలను ఎంఎస్టీసీ సహకారంతో డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ ఆస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ మొత్తం 14 ప్రాపర్టీలను వేలానికి గుర్తించగా, వీటి విలువ రూ.20,160 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లి, తెలంగాణలోని పటాన్చెరులో ఉన్న ఆస్తులు కూడా వేలానికి రానున్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే!
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కస్టమర్ల బంపరాఫర్ ప్రకటించింది. తమ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ ప్లాన్ 2022’ లో భాగంగా రూ.2022తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, అయితే ఈ ఆఫర్ ఆగస్టు 31 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఏముంది ఈ ప్లాన్‌లో.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌లో.. రూ.2022తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. దీంతో పాటు నెలకు 75GB డేటా కూడా లభిస్తుంది. ఒకవేళ నెలలోపు మీ డేటా పరిమితి నెలలోపు పూర్తయితే స్పీడ్ 40kbps పడిపోతుంది. అలాగే రూ 2399, రూ 2,999 ప్లాన్‌పై అదనంగా మరో 75 జీబీ డేటా ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కాగా బీఎస్ఎన్ఎల్కు ఊపరి పోసేందుకు ఇటీవలే కేంద్రం కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ప్యాకేజీతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్రం ఆదేశిస్తూ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. చదవండి: అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్.. ఈరోజే లాస్ట్! -
బీఎస్ఎన్ఎల్ గట్టెక్కుతుందా?
కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు లక్షా 64 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో నగదు వాటా రూ. 43,964 కోట్లు కాగా, ఇతరేతర రూపాల్లో లక్షా 20 వేల కోట్లు సమకూరుస్తారు. ఇదంతా నాలుగేళ్ల కాలవ్యవధిలో అందిస్తారు. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ఇందులో భాగం. అందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తయిన కొన్ని గంటలకే ఈ నిర్ణయం వెలువడింది. ఎయిరిండియా సంస్థను పూర్తిగా టాటాలకు అమ్మిన తరహాలోనే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను కేంద్రం వదుల్చుకుంటుందని భావిస్తున్న తరుణంలో ప్యాకేజీ ప్రకటన చాలామందిని సంతోషపరిచిందనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్యాకేజీ తులసి తీర్థంగా మిగులుతుందా, సంస్థకు జవసత్వాలిస్తుందా అన్నది మున్ముందు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఛత్రఛాయలో ఉండే టెలిఫోన్ విభాగం నుంచి మహానగరాల్లో కార్యకలాపాల కోసం 1986లో ఎంటీఎన్ఎల్ పేరిట ఒక లిమిటెడ్ కంపెనీని ఏర్పాటుచేసిన చాన్నాళ్లకు... అంటే 2000 సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ ఏర్పడింది. ఎంటీఎన్ఎల్ ఎటూ మొదటినుంచీ నష్టాలతోనే సాగుతోంది. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రాభవం అడుగంటడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణా లున్నాయి. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్న రోజుల్లో ఓ వెలుగు వెలిగిన టెలిఫోన్ విభాగం బీఎస్ఎన్ఎల్గా మారి, ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడవలసి వచ్చాక క్షీణించడం మొదలుపెట్టిం దని తీర్మానించడం తొందరపాటవుతుంది. దాన్నొక సంస్థగా మార్చాక వృత్తి రంగ నిపుణులకు అప్పజెప్పి, సమర్థవంతంగా పోటీని ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాల్సిందిపోయి కేంద్రం యధావిధిగా పెత్తనం చలాయించడం బీఎస్ఎన్ఎల్కు శాపంగా మారింది. ఇప్పుడు టెలికాం రంగంలో మెరుస్తున్న సంస్థలతో పోలిస్తే అనుభవంలోనూ, వనరుల్లోనూ బీఎస్ఎన్ఎల్ ఏమాత్రం తీసిపోదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయివుండి కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక, వాటిని సక్రమంగా అమలు చేయలేక అది బోర్లాపడింది. అంతక్రితంతో పోలిస్తే లాభాలొస్తున్న మాట నిజమే అయినా గత మూడేళ్లుగా బీఎస్ఎన్ఎల్ నష్టాలు దాదాపు రూ. 30,000 కోట్లు. ఇప్పుడు టెలికాం రంగంలో 5జీ మోత మోగిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 60 దేశాలు ఆ సర్వీసులు ప్రారంభించాయి. మన దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్లు పడుతుంది. ఇలాంటి తరుణంలో బీఎస్ఎన్ఎల్కు అందిస్తున్న 4జీ వల్ల ఏమంత ప్రయోజనం ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 2016లోనే ప్రైవేటు సంస్థలు 4జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని వినియోగదారుల్లో 98 శాతంమందిని చేజిక్కించుకున్నాయి. దేశంలో వైర్లెస్, వైర్‌లైన్ సేవలు రెండింటినీ కలుపుకొంటే మొత్తంగా 110 కోట్లమంది వినియోగదారులుంటే అందులో బీఎస్ఎన్ఎల్ వాటా ప్రస్తుతం 12 కోట్లు. అంతక్రితం గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ హవా ఉండేది. కానీ రాను రాను అది కూడా క్షీణించింది. ఇప్పుడు గ్రామీణ వినియోగదారుల్లో బీఎస్ఎన్ఎల్ వాటా ఏడు శాతం. ఇది ఉద్దేశపూర్వకంగా సంస్థను నీరుగార్చడంవల్ల వచ్చిన ఫలితం. వీఆర్ఎస్ అమలు చేయడం మొదలెట్టాక సిబ్బంది కొరత ఏర్పడి చురుగ్గా సేవలందించే స్థితి మందగించింది. ఒకప్పుడు 1.65 లక్షలమంది ఉద్యోగులతో కళకళ లాడిన సంస్థలో వారి సంఖ్య 64,536కి పడిపోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం గురించిన చర్చోపచర్చలే దశాబ్దంపాటు సాగాయి. ఇప్పటికీ అవి వేర్వేరుగానే ఉంటున్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే 4జీ స్పెక్ట్రమ్ గురించి బీఎస్ఎన్ఎల్ ఆత్రుత పడింది. దాన్ని వేలం వేసే సమయానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా బీఎస్ఎన్ఎల్కు 4జీ దక్కలేదు. 4జీకి అవసరమైన పరికరాల కొనుగోలుకు కావాల్సిన రూ. 25,000 కోట్లు సమకూర్చడం ఎలా అన్న ఆలోచనలోనే ఏళ్లు గడిచిపోయాయి. ఈ జాప్యం ప్రైవేటు సంస్థల లబ్ధి కోసమేనని సిబ్బంది సంఘాలు ఆరోపించినా జవాబిచ్చినవారు లేరు. 2019 అక్టోబర్‌లో సంస్థను గట్టెక్కించడానికి కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఆ తర్వాత అక్కడక్కడ 4జీ సేవలు ప్రారంభించగలిగింది. కానీ పూర్తి స్థాయి 4జీ సేవలకు గ్రీన్‌సిగ్నల్ రావడానికి మరో మూడేళ్లు పట్టింది. పూర్తి స్థాయి సేవలు వినియోగదారులకు అందడానికి మరెంత సమయం పడుతుందో? 2019లో ప్యాకేజీ ప్రకటించాక సంస్థ నష్టాలు క్రమేపీ తగ్గడం మొదలయ్యాయి. 2019–20లో రూ. 15,500 కోట్లుగా ఉన్న నష్టం నిరుడు రూ. 7,441 కోట్లకు పరిమితమైంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం వస్తుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు సంస్థలు ఈనాటికీ గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటి టారిఫ్‌లు గ్రామీణులు అందుకోలేని స్థితిలో ఉంటున్నాయి. దేశంలో విస్తృతంగా టవర్లు, ఇతర వనరులు ఉన్న సంస్థల్లో ఇప్పటికీ అగ్రగామి బీఎస్ఎన్ఎల్ అనడంలో సందేహంలేదు. వేగవం తంగా నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలను చురుగ్గా అమలు చేయడం, లక్ష్య సాధనపై సర్వశక్తులూ కేంద్రీకరించడం వంటివి చేస్తే ఆ సంస్థ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఉద్దేశపూర్వకంగా దానికి బ్రేకులు వేయాలని చూస్తే ఎప్పటిలానే నిస్తేజంగా మిగిలిపోతుంది. సంస్థను ప్రాణప్రదంగా చూసుకుంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటే దాన్ని లాభాల బాటకు మళ్లించడం కష్టమేమీ కాదు. -
4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే...
నాలుగు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు అవును.. మీరు చూసింది నిజమే...! ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్, భారత్ ఫైబర్, డీఎస్ఎల్, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, బ్రాడ్ బ్యాండ్ ఓవర్ వైఫై కస్టమర్లకు మాత్రమే...! ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు నాలుగు నెలల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! భారత్ ఫైబర్, డిజిటల్ సబ్స్రైబర్లైన్ కస్టమర్లకు, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ ఓవర్ వైఫై సబ్స్క్రైబర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్‌ను పొందాలంటే బీఎస్ఎన్ఎల్ ఓ చిన్న మెలిక పెట్టింది..! అదేంటంటే.. ఈ ఆఫర్‌ను పొందాలంటే 36 నెలల ఇంటర్నెట్ ప్లాన్ సేవల కోసం ఒకేసారి పేమెంట్ చేస్తే అదనంగా మరో నాలుగు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఇంటర్నెట్ సేవల కోసం 24 నెలల ప్యాకేజ్‌కు ముందుగానే చెల్లిస్తే మరో మూడు నెలల ఉచిత ఇంటర్నెట్ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 1800003451500 నెంబర్‌కు కాల్ చేసి ఈ ఆఫర్‌ను పొందవచ్చును. లేదా దగ్గర్లో ఉన్న బీఎస్ఎన్ఎన్ కస్టమర్ సేవా కేంద్రాన్ని సంప్రదించి కూడా ఆఫర్‌ను పొందవచ్చును. చదవండి: డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...! -
బీఎస్ఎన్ఎల్ పతనం వెనక కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వాసి అమిష్ గుప్తా 2005లో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ పెట్టించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అది పని చేయడం మానేసింది. ఆయన దాన్ని పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. హఠాత్తుగా గత మే నెలలో మళ్లీ ఆయన ఇంట్లోని ల్యాండ్‌లైన్ పని చేయడం ప్రారంభించింది. ఈ విషయమై ల్యాండ్‌లైన్ టెలికాం సర్వీసు ప్రొఫైడర్ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు ఫిర్యాదు చేయాలని అమిష్ గుప్తా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థ. ఇది ఢిల్లీ, ముంబై నగరాల్లో టెలికమ్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఎలాగు ఫోన్ పని చేస్తోందిగదా! అని గుప్తా ఎంటీఎన్ఎల్ అధికారులకు పది, పదిహేనుసార్లు ఫోన్లు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయనే ఓ రోజు వడాలాలోని ఎంటీఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రెండు, మూడు కుర్చీలు, టేబుళ్లు తప్పా అన్ని కుర్చీలు, టేబుళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు, మూడు టేబుళ్ల చుట్టే ఐదారు సార్లు తిరగాల్సి వచ్చింది. అప్పటికి సరైన సమాధానం లేకపోవడంతో జూలై నెలలో ఆయన తన ల్యాండ్‌లైన్ సర్వీసును రద్దు చేసుకోవాలనుకున్నారు. ‘ల్యాండ్‌లైన్‌ను సరండర్ చేయడానికి నాకు మరో రెండు నెలలు పట్టింది. నేను సహజంగా ఎంటీఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను అభిమానిస్తాను. ఎందుకంటే నేను అంభాని అభిమానిని కాదు. ఇంటి నుంచి పనిచేయాల్సిన కరోనా గడ్డుకాలంలో పటిష్టమైన ఇంటర్నెట్ అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంటీఎన్ఎల్ సర్వీసును రద్దు చేసుకొని ఆ స్థానంలో జియో ల్యాండ్‌లైన్, బ్రాండ్ బ్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ గుప్తా వాపోయారు. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ముకేష్ అంబానీదని తెల్సిందే. ఆ కంపెనీ 2016లో 4జీ సర్వీసులను అత్యంత చౌకగా అందిస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘టెలికం రంగంలో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం కోసమే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నీరుగారుస్తూ వచ్చాయి’ ఎంటీఎన్ఎల్ మాజీ డిప్యూటి మేనేజర్ సూర్యకాంత్ ముద్రాస్ వ్యాఖ్యానించారు. 2010లో ముంబై, ఢిల్లీ నగరాల్లో 60 లక్షల ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం 27 లక్షలకు పడి పోయింది. ఇక దేశవ్యాప్తంగా 2016 నాటికి 2.4 కోట్ల మంది ల్యాండ్‌లైన్ వినియోగదారులుండగా, వారి సంఖ్య 2020, జూలై నాటికి 1.9 కోట్లకు పడిపోయింది. ఒక్క మొబైల్ ఫోన్ల వాడకం పెరగడమే దీనికి కారణం కాదని, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సర్వీసులు మరీ అధ్వాన్నంగా ఉండడమే కారణమని పలువురు వాటి మాజీ వినియోగదారులు తెలియజేశారు. ఫోన్ పనిచేయడం లేదంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చే సినా వచ్చి చూసేందుకు సిబ్బంది లేరంటూ నెలల తరబడి రాకపోవడంతో 2009లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్‌ను సరెండ్ చేయక తప్పలేదని హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన టీచర్ మంజులా గోస్వామి తెలిపారు. 2000 సంవత్సరం నుంచే బీఎస్ఎన్ఎల్లో సిబ్బంది తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ప్రతి 500 ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఒక టెక్నీషియన్ అవసరమని, అయితే ప్రస్తుతం రెండువేల ఫోన్లకు ఒక టెక్నీషియన్ చొప్పున ఉన్నారని ‘ఫెడరేషన్ ఆఫ్ టెలికామ్ ఆపరేటర్స్ యూనియన్’ అధ్యక్షుడు థామస్ జాన్ తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం ‘స్వచ్ఛంద పదవీ విరమణ పథకం’ ప్రవేశపెట్టినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో సిబ్బంది బాగా తగ్గిపోయారు. ఈ వాస్తవానికి ఈ రెండు సంస్థల పునరుద్ధరకు కేంద్ర ప్రభుత్వం 70 వేల రూపాయల నిధులను ప్రకటించగా, అందులో 30 వేల కోట్ల రూపాయలను పదవీ విరమణ పథకానికే కేటాయించడం గమనార్హం. పథకాన్ని అమలు చేసిన తొలి రోజే ఈ రెండు ప్రభుత్వ టెలికమ్ సంస్థల నుంచి 92,300 మంది పదవీ విరమణ పొందారు. ఆ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెలికం సిబ్బంది ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2019 నాటికి బీఎస్ఎన్ఎల్ నష్టాలు 13,804 కోట్ల రూపాయలుకాగా ఎంటీఎన్ఎల్ నష్టాలు 3,693 కోట్ల రూపాయలు. సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వ టెలికమ్ సంస్థలు దెబ్బతినలేదని, ల్యాండ్లైన్లకు ఉపయోగించిన కాపర్లైన్లను మార్చి కొత్తగా ఫైబర్ కేబుళ్లు వేయాల్సి ఉండగా, అందుకు బడ్జెట్‌ను కేటాయించలేదని ఎంటీఎన్ఎల్ సెక్షన్ సూపర్వైజర్ షర్కీ తెలిపారు. ప్రైవేటు టెలికమ్ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు జరపలేదని పేర్లు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఎంటీఎన్ఎల్ అధికారులు మీడియాకు తెలిపారు. 2016లో రిలయెన్స్ జియో సహా అన్ని ప్రైవేటు టెలికమ్ కంపెనీలు 4 జీ సర్వీసులను ప్రవేశపెట్టగా, ప్రభుత్వ సంస్థలు 3 జీ టెక్నాలజీకే పరిమితం అవడం కూడా వాటి పతనానికి దారితీసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వాటి ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే. వాటిని చంపేయాలనే ఉద్దేశంతోనే వారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’ అని ఎంటీఎన్ఎల్ కామ్‌గర్ సంఘ్ అధినేత, శివసేన పార్లమెంట్ సభ్యులు అర్వింద్ సామంత్ ఆరోపించారు. -
2020 జూన్‌కి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
సాక్షి, హైదరాబాద్: బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను 2020 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నేషనల్ సెంటర్ ఫర్ నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్సీఎన్జీఎన్) కేంద్ర సర్కిల్ సీజీఎం అనిల్ జైన్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ టెలికం సర్కిల్ దూర సంచార్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటగా 5జీ సేవలను ప్రవేశపెట్టే సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ అని అన్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జర్మనీ, చైనా, అమెరికాతోపాటు దేశంలో కూడా 5జీ టెస్టింగ్ నిర్వహించామన్నారు. ఇప్పటికే 5జీ కోసం ఒప్పందాలు, స్పెక్టమ్ కేటాయింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ల్యాండ్‌లైన్‌కు ప్రీపెయిడ్ ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్‌కు ప్రీపెయిడ్ ప్లాన్ సౌకర్యం వర్తింపజేస్తున్నట్లు అనిల్ జైన్ ప్రకటించారు. రూ.200 ప్లాన్ కింద ఎలాంటి డిపాజిట్ లేకుండా కొత్త కనెక్షన్‌కు ఇన్స్టలేషన్ ఉచితమని, దీనికి 30 రోజుల కాలపరిమితితోపాటు రూ.200 విలువగల టాక్ టైమ్ వర్తిస్తోందన్నారు. ఈ నెల 25 నుంచి ల్యాండ్‌లైన్ ప్రీపెయిడ్ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. బ్రాడ్‌బాండ్ సేవలకు కొత్తగా నాలుగు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. 24 గంటలు అన్లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ప్లాన్‌ను బట్టి రోజుకు 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 20 జీబీ డాటా వరకు వర్తిస్తోందని తెలిపారు. అదేవిధంగా ఫైబర్ కాంబో ప్లాన్ కింద 50 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ స్పీడ్ వరకు, 500 జీబీ నుంచి 750 జీబీ వరకు డాటా వర్తిస్తోందన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్యామిలీ బీబీ కాంబో ప్లాన్ 1199 కింద బ్రాండ్‌బాండ్, ల్యాండ్‌లైన్, మూడు మొబైల్ కనెక్షన్ల సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం వి.సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి పెండింగ్ కేసుల్లో ‘రైల్వే’ టాప్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) శుక్రవారం తెలిపింది. రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. 193 కేసులు ఢిల్లీ ప్రభుత్వాధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో వరుసగా 128, 82 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఉద్యోగ సమాచారం
బీఎస్ఎన్ఎల్లో టెక్నికల్ అసిస్టెంట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వ చేసిన టెలికం టెక్నికల్ అసిస్టెంట్ (టీటీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 147 (ఎస్సీ-25, ఎస్టీ-77, ఓబీసీ-45). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 10. పూర్తి వివరాలకు http://bsnl.co.in చూడొచ్చు. హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్లో అప్రెంటీస్‌లు హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది కాలం శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 61 (ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు-24, డిప్లొమా అప్రెంటీస్‌లు-28, వొకేషనల్ అప్రెంటీస్‌లు-9). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.hindpaper.in చూడొచ్చు. రైట్స్‌లో వివిధ పోస్టులు రైట్స్ లిమిటెడ్.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రిజర్వ చేసిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22 (ఫైనాన్స జూనియర్ మేనేజర్-6, పర్సనల్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్-5, హెచ్ఆర్ జూనియర్ అసిస్టెంట్-11). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 27. పూర్తి వివరాలకు http://rites.com చూడొచ్చు. ఎడ్సిల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు ఎడ్సిల్ (ఇండియా) లిమిటెడ్.. మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి ‘గేట్-2015’ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20 (సివిల్ ఇంజనీరింగ్-10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 11. పూర్తి వివరాలకు http://edcilindia.co.in చూడొచ్చు. హిందుస్థాన్ కాపర్‌లో అసిస్టెంట్ మేనేజర్లు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్).. వికలాంగులకు రిజర్వ చేసిన గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16 (అసిస్టెంట్ మేనేజర్-13, సీనియర్ మెడికల్ ఆఫీసర్-3). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 5. పూర్తి వివరాలకు www.hindustancopper.com చూడొచ్చు. సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థలో పోస్టులు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (ప్రాజెక్ట్ ఫెలో-3, రీసెర్చ అసోసియేట్-1, యానిమల్ అటెండెంట్-1, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో-1). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 11. ఇంటర్వ్యూ తేది నవంబర్ 24. పూర్తి వివరాలకు www.igib.res.in చూడొచ్చు. వెజిటబుల్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో వేకెన్సీ ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ (ఐఐవీఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు-6 (రీసెర్చ అసోసియేట్-1, సీనియర్ రీసెర్చ ఫెలో-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్-2, యంగ్ ప్రొఫెషనల్-1). ఇంటర్వ్యూ తేది నవంబర్ 21. పూర్తి వివరాలకు www.iivr.org.in చూడొచ్చు.