ఇది ‘ఆత్మగౌరవ’ జంగ్‌ సైరన్‌ | Sravan Dasoju Guest Column On Congress Jung Siren | Sakshi
Sakshi News home page

ఇది ‘ఆత్మగౌరవ’ జంగ్‌ సైరన్‌

Published Mon, Oct 4 2021 12:42 AM | Last Updated on Mon, Oct 4 2021 12:42 AM

Sravan Dasoju Guest Column On Congress Jung Siren - Sakshi

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో లక్షలాది విద్యా ర్థులు లాఠీలకు, తూటాలకు, భాష్ప వాయువులకు ఎదురొడ్డి, ఆఖరికి తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నారు. కానీ జీవితాలు బాగు పడతాయని కలలుగన్న విద్యార్థి నిరుద్యోగులకు, వారిని కన్న తల్లి దండ్రులకు ఈనాడు నిరాశే మిగిలింది. ఉద్యమకాలంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని నమ్మబలికిన కేసీఆర్,  తెలం గాణ వచ్చినంక ఉద్యమ లక్ష్యాలను మరచి, విద్య,  ఉద్యోగ, ఉపాధిరంగాలపై నిర్దిష్టమైన పాలసీలు లేకుండా పాలిస్తు న్నారు. ‘అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏడున్నాయి? జనా భాలో రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమం’టూ నాలుగు కోట్ల సబ్బండవర్గాల సమున్నత పోరాటాన్ని,  ఆశలను,  ఆకాంక్షల్ని అపహాస్యం చేస్తున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ లక్ష్యం దారితప్పింది. లక్షలమంది విద్యార్థ్ధి, నిరుద్యోగుల బతు కులు నాశనం అయినాయి. అటు తల్లిదండ్రులకు మొఖం చూపించుకోలేక, ఉద్యోగ వయోపరిమితి పెరుగుతూ పెళ్లిళ్లు చేసు కోలేక, నిరాశానిస్పృహలకు లోనై తెలంగాణ నిరుద్యోగ యువత ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మబలిదానం చేసుకొన్న కాక తీయ యూని వర్సిటీకి చెందిన సునీల్‌ నాయక్‌ మరణ వాంగ్మూలం వింటే కన్నీళ్లు ఆగవు... ‘నా చావుతోనైనా మన ఉద్యోగాలు మనకు రావాలి’ అంటూ నినదించిన ఆ గొంతు ఇంకా సజీవంగా మన గుండెల్లో మోగుతూనే ఉంది..

ఉద్యోగుల పీఆర్సీ కోసం వేసిన కమిటీ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగ ఖాళీలు లక్షా 91 వేలు అని తేల్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 56 వేల ఖాళీలే అని చెప్పి నిరుద్యోగు లను దగాచేస్తోంది. ఏడేళ్ళలో మొత్తం 85 వేల ఉద్యోగాలే భర్తీ చేసి లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీచేసినామని పచ్చి అబద్ధాలాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తా యని నమ్మి 2009 నుండి 2014  వరకు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయోపరిమితి దాటిపోయి అన్నిరకాలుగా నష్టపోయారు.

గత ఏడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 12 విశ్వ విద్యాలయాల్లో 2,500 పైచిలుకు బోధనా సిబ్బందిని, 12 వేల పైచిలుకు బోధనేతర సిబ్బందిని భర్తీ చేయకుండా  విద్యార్థి ఉద్యమాలపై అనేక ఆంక్షలు పెట్టి పోలీసు అడ్డాలుగా మార్చారు. అంతేగాక రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ విశ్వవిద్యా లయాలను నీరుగార్చేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే 4,500 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసి, వేలకొద్దీ టీచర్ల ఖాళీలను భర్తీచేయకుండా ప్రభుత్వ విద్యని సర్వనాశనం చేశారు.

పదిజిల్లాలు ఉన్న పాత తెలంగాణ రాష్ట్రంలో 2014 నాటికే విభజన చట్టం ప్రకారం బడ్జెట్‌ శాంక్షన్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల 70 వేల ఉద్యోగాలు ఉంటే, 33 జిల్లాల ప్రస్తుత కొత్త తెలంగాణలో ఎన్ని కొత్త ఉద్యో గాలు కల్పించాలి? 23 కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివి జన్లు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త కార్పొరేషన్లు ఏర్పర్చిన ప్రభుత్వం, కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా,  ప్రభుత్వ ఉద్యోగులపై మరింత పనిభారం మోపుతోంది. స్కూల్‌ అసిస్టెంట్స్, ఎస్జీటీ టీచర్‌ ఉద్యోగాలు సుమారు 25 వేలపైన ఖాళీలు భర్తీ చేయకుండా, ఈ ఏడేళ్ళలో కేవలం 2 సార్లు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ నిర్వహించి 5 లక్షలమంది పైచిలుకు నిరుద్యోగుల జీవితాలను సర్వనాశనం చేసింది.

వైద్య ఆరోగ్యశాఖలో వివిధ అత్యవసర సర్వీసుకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది ఉద్యోగాలు సుమారు 35 వేల ఖాళీలున్నాయి. కోవిడ్‌–19 తీవ్రంగా ఉన్న సందర్భంలో ఏకంగా  50 వేల ఉద్యోగాలు వైద్యశాఖలో వెంటనే భర్తీ చేస్తానని కేసీఆర్‌ చేసిన వాగ్దానం ఇంకా అమలుకాలేదు. న్యాయశాఖలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జూనియర్‌ సివిల్‌ ఇతర న్యాయసిబ్బంది ఖాళీలు వేలల్లో ఉన్నాయి. పోలీసుశాఖలోనూ వేలాది పోస్టులు ఖాళీలు న్నాయి. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తజిల్లాల నేపథ్యంలో మరో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించి, మొత్తం 5 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులను ఆదుకోవచ్చు.

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయకుండా, మరోవైపు చాలా ఏళ్లుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని 21,200 మంది సర్వశిక్షా అభియాన్‌; 16,400 విద్యా వలంటీర్లు; 7,651 మహాత్మాగాంధీ ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్స్, 2,000 పంచాయతీ కార్యదర్శులు; 709 మిషన్‌ భగీరథ; 315 హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్, 2,640 సోషల్‌ వెల్ఫేర్, ఆర్టీసీ, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్, 1,640 నర్సులు మొత్తంమీద దాదాపు  55 వేల మందిని ఉద్యోగా ల్లోంచి తీసివేసి, వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసి, భవిష్యత్తును నాశనం చేశారు.

ప్రైవేట్‌ రంగంలో లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు కేటీఆర్‌. కానీ పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన, ప్రైవేట్‌ ఉద్యోగాలలో, ముఖ్యంగా ఐటీ రంగంలో తెలంగాణ స్థానిక విద్యార్థి నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిరుద్యోగులు దాదాపు 26 లక్షలమంది ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దాదాపు మరో 4 లక్షలమంది ఈ జాబితాలో చేరి ఉంటారని అంచనా. అయినా సరే కేసీఆర్‌కు నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలనే సోయి లేకపోవడం బాధాకరం.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి నిరుద్యోగు లను నిండా ముంచకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలం గాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాల క్యాలెండర్‌ను రూపొందించి క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ప్రతి సంవ త్సరం ఖాళీలు భర్తీచేయాలి. విద్యార్థి నిరుద్యోగుల హక్కుల సాధన కోసం, రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులను కూడగట్టుకొని మన విద్య కోసం, మన ఉద్యోగాల కోసం, మన స్వయం ఉపాధి కోసం, అన్నింటికీ మించి మన ఆత్మగౌరవం కోసం జంగ్‌ సైరన్‌ మోగిద్దాం.


డా.శ్రవణ్‌ దాసోజు
వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ పార్టీ మొబైల్‌: 98850 39384

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement