భుజం భుజం కలిపి...
సందర్భం
చరిత్ర పుటల్ని చూస్తే, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింలు ఎలా ముందుండి పోరాడారో, ఆంగ్ల మూకల ఫిరంగులకు ఎలా తమ గుండెల్ని అడ్డుపెట్టి ప్రాణత్యాగం చేశారో, ఉరికంబాలను పూలదండలుగా ఎలా స్వీకరించారో మనకు అర్థమవుతుంది.
స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ముస్లిం త్యాగధనుల పాత్రను నామమాత్రం చేసే ప్రయత్నాలు నాడూ జరిగాయి, నేడూ జరుగుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ ఉనికికూడా లేని సమయంలో ముస్లింలు దేశస్వాతంత్య్రం కోసం పోరాడారు.
మొట్టమొదటి స్వాతంత్య్రోద్యమం 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైందని చెబుతారు. కానీ అంతకంటే వందేళ్ళముందే ముస్లింలు స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు. 1757లో బెంగాల్ పాలకుడైన నవాబ్ సిరాజుద్దౌలా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమానికి బీజం వేశాడు. కాని మీర్ జాఫర్ అనే ద్రోహి కారణంగా నవాబ్ అమరగతి పొందాడు. 1780లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సుబేదార్ షేఖ్ అహ్మద్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. విశాఖపట్నంలోని ఈస్టిండియా కంపెనీలో సుబేదారుగా పనిచేస్తున్న షేఖ్ అహ్మద్‌ను మైసూరుపై దాడి చేయవలసిందిగా ఆంగ్ల సైనికాధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాన్ని ధిక్కరించిన షేఖ్ అహ్మద్ తన మద్దతుదారులతో కలసి ఈస్టిండియా కంపెనీ సైన్యంపైనే మెరుపుదాడి చేశాడు. ఆంగ్లమూక ఖంగుతిని పలాయనం చిత్తగించింది. ఆపై షేఖ్ అహ్మద్‌ను ఆయన అనుచరులను క్రూరంగా హింసించి హతమార్చారు.
తరువాత ఆంగ్లమూక మైసూరును వశం చేసుకోవాలని మాయోపాయాలు పన్నింది. అప్పటి మైసూరు పాలకుడు సయ్యద్ హైదర్ అలీ అత్యంత సాహసంతో ఆంగ్ల బలగాలను అడ్డుకున్నాడు. ఈయన మరణం తరువాత, అతని కుమారుడు టిప్పుసుల్తాన్ ఆంగ్లమూకలకు సింహ స్వప్నమై నిలిచాడు. కాని మీర్ జాఫర్ ఆత్మ మీర్ సాదిఖ్లో ప్రవేశించిన ఫలితంగా ‘టిప్పు’ కూడా అమరుడయ్యాడు. బ్రిటిష్ బలగాలతో వీరోచితంగా పోరాడుతూ, 1799లో రణరంగంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి దేశభక్తుడిగా టిప్పూచరిత్ర అజరామరంగా నిలిచింది.
తరువాత 1820లో వహాబీ ఉద్యమం మొదలైంది. షా ఇస్మాయిల్ షహీద్, షా అహ్మద్ బరేల్వీ దీనికి ఆద్యులు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఈ ఉద్యమంలో కూడా వందలాది ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. 1857లో తిరుగుబాటు ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతూ స్వేచ్ఛాపతాకను చేబూని అగ్రభాగంలో నిలిచినవారిలో మౌలానా ఇనాయతుల్లాహ్ సాదిక్ పురి, మౌలానా ఖాసిం నానోత్ వీలు అగ్రగణ్యులు.
1884లో ప్రథమ కాంగ్రెస్ సమావేశం కొంతమంది మేధావులు ఆధ్వర్యంలో జరిగింది. తరువాత నాల్గవ సమావేశం 1887లో సయ్యద్ బద్రుద్దీన్ తయ్యబ్ జీ అధ్యక్షతన మద్రాసులో జరిగింది. ఈ సభకు కూడా అందరి కంటే అధిక సంఖ్యలో ముస్లిములు హాజరయ్యారు. ఆనాటి కాంగ్రెస్ ప్రముఖుల్లో జౌహర్ అలీ, షౌకత్ అలీ (అలీ బ్రదర్స్ ) హస్రత్ మొహానీ, డా. రఫీ అహ్మద్ కిద్వాయ్, మౌలానా సయ్యద్ హుసైన్ అహ్మద్ మదనీ, మౌలానా అబుల్ ఖాసిం సైఫ్ బనారసీ తదితరులు ముఖ్యులు.
అలాగే ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్‌కు చెందిన ఆబాదీ బానో దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసిన ధన్యురాలు. 25 ఏళ్ళ పిన్న వయసులోనే భర్తను కోల్పోయినా పునర్వివాహం చేసుకోకుండా దేశసేవకు అంకితమైంది. తన ఇద్దరు కుమారులకు ఉగ్గుపాలతోనే స్వాతంత్య్ర బీజాలను నూరిపోసింది. ఆ స్ఫూర్తితో స్వాతంత్య్ర సమర రంగంలో దూకిన భరతమాత ముద్దుబిడ్డలే మౌలానా ముహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీలు. ఆబాదీ బానోను మహాత్మాగాంధీ అమ్మా అని పిలిచేవారట. ఆకారణంగానే ఆమె బీబీ అమ్మాన్ గా ప్రసిధ్ధి చెందింది. అంతేకాదు ఆమె గాంధీజీకి ఆర్ధికంగా కూడా సహాయపడ్డారు.
దేశస్వాతంత్య్రం కోసం ఉరితాడును ముద్దాడుతూ, భారతదేశ ముద్దుబిడ్డ, అమరజీవి అష్ఫాఖుల్లాహ్ ఖాన్ పలికిన మాటలు ఈ సందర్భంగా గమనార్హమైనవి. ‘ఒకే ఒక్క కోరిక. అదితప్ప నాకు మరే కోరికా లేదు. నా కఫన్లో నాజన్మభూమి మట్టిని కాస్త ఉంచండి, అంతేచాలు.’ అన్నాడా దేశభక్తుడు.
నిజానికి ముస్లింలు దేశస్వాతంత్య్రం కోసం అనుపమానమైన, అసాధారణ పాత్రను పోషించారు. శతాబ్దాలుగా దేశం కోసం పోరాడారు. ఇళ్ళూ, వాకిళ్ళు వదిలి పెట్టారు. దేశ బహిష్కారానికి గురయ్యారు. చెరసాలల పాలయ్యారు. ఉరికంబాలను కౌగిలించుకున్నారు. చీకటి గుయ్యారాల్లో నిర్బంధాలకు గురయ్యారు. రకరకాలుగా హింసల పాలయ్యారు. కుటుంబాలను, అసంఖ్యాక మంది బంధుమిత్రుల్ని త్యాగం చేశారు.
కాని ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, దేశస్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్నీ ధారపోసి, ఇన్నిత్యాగాలు చేసిన ముస్లింలను ఈనాడు అనుమానపు దృక్కులతో చూస్తున్నారు. సొంతగడ్డపైనే పరాయి వారుగా పరిగణిస్తున్నారు. దేశద్రోహ ముద్ర వారి తలపై కత్తిలా వేలాడుతోంది. స్వతంత్ర భారతావనిలో వారి హక్కులను అతి దారుణంగా హరిస్తున్నారు. వారిని విదేశీయులని, విదేశీ ఏజెంట్లనీ నిందిస్తున్నారు. వారిని దేశం విడిచి వెళ్ళమని కూడా బెదిరిస్తున్నారు.
ప్రాణాలను ధారపోసి సాధించుకున్న స్వతంత్ర స్వేచ్ఛా భారతంలో, స్వాతంత్రోద్యమంతో నామమాత్రపు సంబంధం కూడా లేని పరివార్ శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడం అతి పెద్ద విషాదం. ఇలాంటి దుష్ప్రచారాలకు సమాధానంగా ముస్లింలు, న్యాయదృష్టి కలిగిన, భావసారూప్యత కలిగిన ఇతర మేధావి వర్గంతో కలసి చరిత్రను ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉంది. కనీసం ముందు తరాలకైనా వాస్తవ చరిత్రను పరిచయం చేయడం ఇప్పుడు మనముందున్న కర్తవ్యం.
యండి. ఉస్మాన్ ఖాన్
వ్యాసకర్త అక్షర సాహితి అధ్యక్షులు ‘ 99125 80645