గ్రామీణ ప్రాంతాలపై బీఎంబీ దృష్టి
ఏడాదిలోగా గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖల ఏర్పాటు
ఎన్‌జీవోలు, ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందం
జూన్ నాటికి అందుబాటులోకి
ఇంటర్నెట్ బ్యాంకింగ్భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ వెల్లడి
హదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు రుణ సౌకర్యం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ప్రకటించింది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, స్వయం సేవక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)తో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది.
ప్రస్తుతం పట్టణాల్లోనే శాఖలను ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాం తాల వారికి రుణాలు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ విధమైన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు బీఎంబీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. దేశంలో 19వ, రాష్ట్రంలో మొదటి బీఎంబీ శాఖను హైదరాబాద్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉప్పాడ చేనేత వస్త్రాలు తయారు చేసే వారికి, అలాగే గుంటూరు జిల్లాలో పసుపు పొడి తయారు చేసే మహిళలకు రుణాలు ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా మొత్తం శాఖల సంఖ్యను 80కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 20 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంకా మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని, ఈ జూన్ నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను తీసుకొచ్చేప్రయత్నంలో ఉన్నట్లు ఉషా తెలిపారు. అలాగే ఖాతాదారుల సౌకర్యం కోసం మొబైల్ ఏటీఎం సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
కేవలం మహిళలకే కాదు: పేరుకు మహిళా బ్యాంకే అయినా ఇతరులూ ఖాతాలు తెరవచ్చని ఉషా తెలి పారు. బ్యాంకు సిబ్బంది కూడా కేవలం మహిళలే ఉం డరని, కానీ ప్రస్తుతం హైదరాబాద్ శాఖలో మాత్రం అందరూ మహిళలే ఉంటే సిమ్లా శాఖలో అందరూ పురుషులు ఉన్నట్లు చెప్పారు. మహిళాభివృద్ధిపై బ్యాంకు దృష్టి పెడుతుందని అన్నారు. మొత్తం రుణాల్లో 70% మహిళలకు కేటాయించినట్లు వివరించారు. మిగిలిన 30% రుణాలపై ఎటువంటి పరిమితులు ఉండవని, ఎవరికైనా కేటాయిస్తామన్నారు.