మహిళల కోసం...మహిళల చేత... | By women for women ... ... | Sakshi
Sakshi News home page

మహిళల కోసం...మహిళల చేత...

Published Tue, May 20 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

మహిళల కోసం...మహిళల చేత...

మహిళల కోసం...మహిళల చేత...

లావణ్య సొంతంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలనే ఆలోచనతో పని మొదలుపెట్టింది. కంపెనీ స్థాపించడానికి సహజంగానే బ్యాంకు రుణం కావాల్సివచ్చింది.  ఓ ఐదారు బ్యాంకులు తిరిగింది.  అన్ని బ్యాంకులు ఆమెకు రుణం ఇవ్వడం కుదరదన్నాయి. కావాల్సిన అర్హతలు లేవన్నాయి. కారణం అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందించారు.

ఒకరు మహిళకు రుణం ఏమిటన్నారు, మరొకరు ఎవరైనా మగవారు పూచీకత్తు ఉండాలన్నారు, ఇంకొకరు వివరంగా కారణాలు చెప్పడానికే సమయం కేటాయించకుండానే పంపేశారు. ఈ ఏడాది మార్చి 31న హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో భారతీయ మహిళా బ్యాంకు(బి.ఎం.బి)ని ఏర్పాటు చేశారని తెలిసి లావణ్య అక్కడకు వెళ్ళింది. మేనేజర్ సుచరితను కలిసింది. వీళ్లు కూడా బ్యాంకు రుణం ఇవ్వడం కుదరదన్నారు. కానీ ఓ అరగంట లావణ్య అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం చెప్పి...బ్యాంకు రుణం పొందే మార్గాలను ఆమెకు వివరించారు.

‘‘మొదట నేనెళ్లిన బ్యాంకులు నాకు రుణం ఇవ్వడం కుదరదన్నందుకు నాకు కోపం రాలేదు, కానీ కారణాలు సరిగ్గా చెప్పకుండా విసుక్కున్నందుకు మాత్రం చాలా బాధేసింది. ఈ మహిళా బ్యాంకు పుణ్యాన...రుణాలకు సంబంధించి బోలెడన్ని విషయాలు తెలుసుకోగలిగాను’’ అని చెప్పింది లావణ్య. హైదరాబాద్‌లో భారతీయ మహిళా బ్యాంకు స్థాపించి రెండునెలలు కూడా కాలేదు. రెండు వందలమంది ఖాతాలు తెరిచారు. దేశంలో 23వ మహిళా బ్యాంకుగా విజయవంతంగా కొనసాగుతోంది.
 
భారతీయ మహిళా బ్యాంకు...మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు. గత ఏడాది నవంబర్ 19న ముంబయిలో బ్యాంకు మొదటి శాఖను స్థాపించారు. గడచిన ఆరునెలల్లో దేశవ్యాప్తంగా 23 బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ బ్యాంకులన్నింటిలో 70శాతం మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. మహిళల కోసం మహిళలే నడిపే ఈ బ్యాంకులకున్న మరో ప్రత్యేకత...వారానికోసారి బ్యాంకు సిబ్బందే నేరుగా మహిళల దగ్గరికి వచ్చి ఖాతాలు తెరవడం.
 
మెట్లపై కూర్చుని...

హైదరాబాద్‌లో బి.ఎం.బి శాఖ ఏర్పాటు చేసిన  సందులో మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ప్రత్యేకంగా మహిళల కోసం బ్యాంకు స్థాపిస్తున్నారని తెలిసినపుడు ఆ బ్యాంకుల్లోని సిబ్బంది ‘ఇన్ని బ్యాంకులుండగా...మళ్లీ ప్రత్యేకంగా మహిళల కోసం బ్యాంకు ఎందుకు’ అన్నారట.

ఈ బ్రాంచ్‌లో మొత్తం ఐదుగురు మహిళా సిబ్బంది - ఒక మేనేజర్,  ముగ్గురు ఆఫీసర్లు, ఒక డీఆర్‌ఒ. వీరితో పాటు ఒక సెక్యురిటీ గార్డ్, ఒక బాయ్ ఉన్నారు. శనివారం వచ్చిందంటే...ఓ ఇద్దరు ఆఫీసర్లు చుట్టుపక్కల డ్వాక్రా గ్రూపులున్న ప్రాంతాలకు వెళతారు. అక్కడ డ్వాక్రా గ్రూపుల మహిళలతో పాటు ఇతర మహిళలను కూడా కలిసి  వందున్నా...వెయ్యి ఉన్నా..బ్యాంకులో భద్రపరుచుకోవడం గురించి వివరంగా చెప్పి ఒప్పించి వారితో ఎకౌంట్లు తెరిపిస్తున్నారు.

ఈ పనితో పాటు మధ్యతరగతి మహిళలతో వ్యాపారం చేయించడానికి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు, అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ‘‘మొన్నీమధ్యనే ఒక మహిళతో బ్యూటీపార్లర్ పెట్టించాం. డే కేర్ సెంటర్లు, క్యాంటీన్లు, కర్రీపాయింట్లు...ఎలాంటి వ్యాపారాలకైనా మహిళలకు మా బ్యాంకులు పూటీకత్తు పేరెత్తకుండా రుణాలిచ్చి వ్యాపారాలు చేయించడానికి సిద్ధంగా ఉంది. రుణమిచ్చి ఊరుకోకుండా...వ్యాపారానికి కావాల్సిన మిగతా సౌకర్యాల విషయంలో కూడా మా బ్యాంకు సిబ్బంది సాయపడతారు.

ప్రత్యేకంగా మహిళల కోసం బిఎమ్‌బీలు స్థాపించడంలో ఉన్న ఉద్దేశమిదే’’ అని చెప్పారు సుచరిత. ఇక్కడ బిఎమ్‌బీలో మహిళా సిబ్బంది పనితీరుని చూసి చాలామంది తమ ఎకౌంట్లను ఈ బ్యాంకుకి షిప్ట్ చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. బ్యాంకు లక్ష్యాలను తెలుసుకున్న మహిళలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి తాము చేయదలుచుకున్న వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. మహిళల ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి ముందుకొచ్చిన  భారతీయ మహిళా బ్యాంకుని అందరూ అభినందించాల్సిందే!
 
-భువనేశ్వరి; ఫొటోలు: ఎ. సతీష్
 
మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘అందరూ మహిళలే ఉంటారంట..ఏదైనా సమస్య వస్తే వారు సమర్థంగా ఎదుర్కోలేరు’ అంటూ చాలామంది ప్రచారం చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాంకులోపలికి వచ్చేవారు కాదు. మగవాళ్ల సంగతి పక్కన పెట్టండి. మహిళలైనా లోపలికి వచ్చి చూడొచ్చు కదా! బోర్డు వంక చూసుకుంటూ పోయేవారు. ఇక చేసేది లేక..మేమే బయటికి వెళ్లి మెట్లమీద కూర్చుని వచ్చేపోయేవాళ్లని పలకరిస్తూ మా ప్రత్యేకతల్ని చెప్పుకొన్నాం. ఓ పదిరోజుల తర్వాత ఒక్కొక్కరూ రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మా పనితీరు, సహకారం చూసి ఈ నోటా ఆ నోటా ప్రచారం జరిగింది. మెల్లగా సంఖ్య పెరగడం మొదలైంది. ఇప్పటివరకూ ఓ ఇద్దరు మహిళా వ్యాపారస్థులకు వ్యాపారరుణాలు ఇచ్చాం’’.
 - సుచరిత,  హైదరాబాద్ బిఎమ్‌బి బ్రాంచ్ మేనేజర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement