సీతాకోక చిలుక
33 ఏళ్ల క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగిన అలీకి అవార్డు తీసుకుంటున్నానన్న ఆనందం కంటే హైదరాబాద్‌లో అడుగుపెట్టానన్న సంతోషంతోనే మనసు నిండిపోయింది. రద్దీలేని చార్మినార్ వీధులు, పంజగుట్ట షాన్‌బాగ్ హోటల్‌లోని ఇడ్లీసాంబార్, రాత్రిపూట స్నేహితులతో బిర్యానీ... ఇలా హైదరాబాద్‌తో తనకున్న ముప్పై ఏళ్ల అనుబంధం... భవిష్యత్తులో భాగ్యనగరం కోసం తను కనే కల...అన్నింటినీ గుర్తుచేసుకుంటున్నప్పుడు అలీలోని ఓ హైదరాబాదీ బయటకొచ్చాడు.
‘‘సీతాకోకచిలుక సినిమాకి నాకు ‘స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవార్డు’ వచ్చింది. ఆ చిన్నవయసులో ప్రభుత్వ అవార్డు వచ్చిందని తెలియగానే చాలా సంతోషపడ్డాను. ఆ అవార్డు ప్రదానం హైదరాబాద్‌లో అని తెలియగానే ఎగిరి గంతేయాలనిపించింది. హైదరాబాద్‌ని అప్పటివరకూ సినిమాల్లో చూడ్డమే గాని ఎప్పుడూ రాలేదు. ప్రభుత్వం అవార్డుతో పాటు మద్రాసు నుంచి హైదరాబాద్‌కి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చారు. దాంతో మొదటిసారి హైదరాబాద్‌కి విమానంలో వచ్చి ఇంకొంత గొప్పగా ఫీలయ్యాను.
బేగంపేటలో విమానం దిగి నేను, నాన్న నేరుగా సికింద్రాబాద్ దగ్గరున్న డెక్కన్ కాంటినెంటల్ హోటల్‌కి వెళ్లాం. ఇప్పుడు ఆ హాటల్ స్థానంలో కిమ్స్ ఆసుపత్రి ఉంది. తర్వాత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుని సాయంత్రం వేళలో చార్మినార్ చూడ్డానికి వెళ్లాం. అవార్డుతోపాటు మొదటిసారి హైదరాబాద్‌లో చూసిన అద్భుతమైన విశేషాలనూ వెంటబెట్టుకుని మా స్వస్థలం రాజమండ్రి వెళ్లాను. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 33 ఏళ్లవుతుంది. ఇప్పటికీ ఆ రోజు నేను చూసిన దృశ్యాలు నా కళ్లముందుంటాయి.
ఇల్లుకొని 20 ఏళ్లు...
1994లో మద్రాసు నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చాను. శ్రీనగర్‌కాలనీలో ఫ్లాట్ కొన్నాను. అప్పటివరకూ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు మద్రాసులో రెలైక్కడం, పనైయ్యాక వెళ్లిపోవడం. హైదరాబాద్‌లో షూటింగ్‌ని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో పరిసరాలను కూడా అంతే ఇష్టపడేవాడ్ని. ముఖ్యంగా పంజగుట్ట సెంటర్‌లోని షాన్‌బాగ్ హోటల్. మద్రాసులో సాంబార్‌ఇడ్లీ అలవాటు కదా మాకు...అలాంటి టిఫిన్ ఒక్క షాన్‌బాగ్‌లోనే ఉండేది. షూటింగ్ అయ్యాక సాయంత్రం వస్తూ వస్తూ నాంపల్లి దగ్గర ఒక ఇరానీ చాయ్ కొట్టి రూమ్‌కి చేరుకునేవాళ్లం.
చాయ్... చాయ్
మామూలుగా ఏ ప్రాంతంవారైనా పొద్దున, సాయంత్రం వేళలో టీలు తాగుతారు. మన హైదరాబాద్‌లో అర్ధరాత్రి కూడా చాయ్ తాగే అలవాటు ఉంటుంది. అప్పట్లో ఇక్కడ మా స్నేహితులు రాత్రి పదిగంటలకు బిర్యానీ తిని వెంటనే చాయ్ తాగేవారు. ‘ఇదెక్కడి అలవాటురా బాబు...’ అంటే ‘తిన్నది మంచిగ అరుగుతదిరా బై..’ అనేవారు. ముందు పేర్లు పెట్టినా...తర్వాత మెల్లగా నాకూ అలవాటైపోయింది. హైదరాబాద్‌లో చాయ్ తాగడానికి ఫలానా టైం ఉండదని అర్థమైంది.
నిజాం గోడతో ఎండ్...
అప్పట్లో అన్నపూర్ణ స్డూడియో తర్వాత హైటెక్‌సిటీ వెళ్లే దారిలో పెద్ద గోడ ఉండేది. నిజాం కాలం నాటి గోడ. ఆ గోడపై నా ‘పిట్టలదొర’ సినిమా వాల్‌పోస్టర్‌ని అతికించారు కూడా. తర్వాత రోడ్లు వెడల్పు చేసేపనిలో భాగంగా ఆ గోడను పడగొట్టేశారు. ఆ గోడ దాటాక ఏమీ ఉండేవి కావు. బంజారాహిల్స్‌లో కొందరు డబ్బున్న లంబాడాలు ఉండేవారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాలయితే మొత్తం కొండలూ గుట్టలే. విశేషమేమిటంటే... పాతికేళ్లక్రితమే మన హైదరాబాద్‌లో అద్భుతమైన ఇళ్లు ఉండేవి.
ఆ రోజుల్లోనే అమితాబ్‌బచ్చన్ లాంటివారు హైదరాబాద్ వచ్చినపుడు ఇంత ఖరీదైన ఇళ్లు మా ముంబైలోనే లేవని చెప్పారట. నిజమే... మన సిటీలో ఉన్నన్ని ఖరీదైన ఇళ్లు, నిజాంనాటి అద్భుతమైన కట్టడాలు దేశంలో ఇంకెక్కడా లేవు. ఫలక్‌నుమప్యాలెస్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో వచ్చి ఇక్కడున్న తలుపులకు బంగారు గొళ్లాలు ఉండేవని చెప్పారు. పదేళ్లకిందట కూడా అక్కడి పరిసరాల్లో బంగారు నాణాలు దొరికాయని వార్తలొచ్చాయి. నిజాం పాలన సంగతి పక్కన పెడితే ఈ భాగ్యనగరాన్ని సొంత ఇంటిలా నిర్మించాడనడంలో సందేహం లేదు.
చెత్తను మాయం చేస్తేగాని...
హైదరాబాద్ గురించి నేనేదైనా కలగనాలంటే... ఒక్కటే కల. చెత్త కనిపించని నగరాన్ని చూడాలని. కేరళలో ఎవరింటి చుట్టుపక్కల చెత్తను వారే వారానికొకసారి కాల్చేస్తుంటారు. ప్రభుత్వ అధికారులు చీపుళ్లు పట్టుకొచ్చి మనింటి ముందు ఊడ్చాలనే ఆలోచన అక్కడి ప్రజలకుండదు. దాంతో ఏ వీధి చూసినా శుభ్రంగా కనిపిస్తుంది. మన నగరవాసులకు కూడా అలాంటి ఆలోచన రావాలి. గోడపై నుంచి చెత్త విసిరేయడంతో మన పని ముగిసిపోయిందను కుంటున్నాం. ఫలితం...వర్షాకాలం వచ్చిందంటే...ప్లాస్టిక్ బాటిల్స్, కాగితాలు, పనికి రాని వస్తువులతో నాలాలన్నీ మూసుకుపోయి మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తుంది. ఈ విషయంలో మన ప్రవర్తనలో మార్పు రావాలి. హైదరాబాద్‌ని అందమైన నగరంగా మాత్రమే కాదు.. శుభ్రమైన నగరమని కూడా చెప్పుకోవాలి.
- భువనేశ్వరి